లోకాభిరామం

బయట తిండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను అంటుంది మా యజమానురాలు. అక్కడికి ఆవిడ అదే పనిగా బయట తిండి తిన్నట్టు మాట్లాడిన భావం మీకు కలిగితే ఆ బాధ్యత నాది కాదు. అవుడ్ సైడ్‌లో ఏం దొరుకుతుందో కూడా తెలియదు. సాంబశివయ్య గారు బడిలో పిల్లలకు బజారు తిండి తినకూడదు అని భారీ ఎత్తున ఉపన్యాసం చెప్పి అదే సాయంత్రం బండి పక్కన నిలబడి రెణ్ణాల బజ్జీలు ఇయ్యవయ్యా, అన్నాడని మా విజయ చెప్పి తెగ నవ్వేది. రెణ్ణాల అంటే రెండు అణాల అని అర్థం. బండి మనిషికి ఆ సంగతి అర్థం అయిందో లేదో అప్రస్తుతం. మనం ఇప్పుడు తిండి గురించి మాట్లాడుకుంటాం.
పల్లెకే పరిమితం అయినప్పుడు ఐస్క్రోట్ అనే ఐస్‌ప్రూట్ తినడం వరకు అనుమతి ఉంది. అప్పుడో ఇప్పుడో బొంబాయి మిఠాయి అనే పీచు మిఠాయి షుగర్ క్యాండీ అరుదుగా అమ్మడానికి వస్తే దాన్ని కొని తిన్నాము. అదే మరి జిగురుగా వుండే మరో చక్కెర మిఠాయి తినడానికి అనుమతి లేదు. దాన్ని నాకవలసి ఉంటుంది. చెరువులో దొరికే దుంపలను ఉడకబెట్టి అమ్మేవారు. పచ్చి దుంపలను తెచ్చి ఇక పెట్టాలి అంతేగాని ఉడకబెట్టిన దుంపలు తినడానికి లేదు.
పాలమూరు చేరిన తరువాత పరిస్థితి కొంచెం మారింది. అక్కడ మిరపకాయ బజ్జీ రుచి తెలిసింది. పాలమూరులో ఈ విషయంలో ఒక ప్రత్యేకత కూడా తెలిసింది. కట్ మిర్చి అని ఒక విశేషమైన పదార్థం దొరికేది. మామూలు మిరపకాయ బజ్జీలను ముక్కలుగా కోసి మళ్లీ నూనెలో వేపి వాటి మీద మసాలా వేసి మరీ అమ్మేవారు. రుచిగా ఉండడమే కాక అవి బహుశా కడుపునకు కూడా అంత హాని కలుగజేసేవి కావు. నాకు వాటి మీద ఇష్టం కలిగింది. జేబులో చిల్లుగానీ ఉండేది కాదు గాని ఇటువంటి కోరికలు ఎలాగో తీరేవి. కొంతకాలానికి గంజి అంటే గంజు అంటే ధాన్యం బజారు అనే ప్రాంతంలో ఒక ఉత్తర భారత బ్రాహ్మణుడు నడిపించే చాట్ బండి గురించి తెలిసింది. గప్‌చుప్ లేదా పానీ పూరి అనే ఒక కొత్త విశేషం అర్థం అయింది. దానికి మా వాళ్లందరూ అభిమానులుగా మారారు. అంటే మిత్రబృందం అన్నమాట. ఆ కాలంలో నాలుగు గంటలకు కట్లెట్, మరో నాలుగు గంటలకు చెప్పులు వచ్చేవి. నలుగురం కలిసి వెళ్లి తిన్నా రెండు రూపాయలు మాత్రమే. ఆ రెండు రూపాయలు నా దగ్గర ఉన్నాయ్ అని మాత్రం కాదు. ఆ బండి బ్రాహ్మణుడు సాయంత్రంపూట మాత్రమే వ్యాపారం కోసం బయటకు వచ్చేవాడు. మిగతా సమయంలో ఇంట్లోనే ఉండేవాడు. మా వాళ్లు ఆ ఇంటిని కనుగొన్నారు. మనసుకు వచ్చినప్పుడు అతని ఇంటికి వెళ్లడం మొదలైంది. అతను వంట చేస్తున్న ఛాయలకు కూడా రానిచ్చేవాడు కాదు. ఒక బెంచి మీద దూరంగా కూర్చోమనేవాడు. మడి అన్న పద్ధతితో అడిగిన పదార్థాలను దొనె్నలలో తెచ్చి పై నుంచి చేతిలో పడేసేవాడు. మిగతా వాళ్ల సంగతి తెలియదుగాని ఆ పద్ధతులు నాకు అలవాటు కనుక ఇంట్లోలాగే అనిపించేది. ఇంటికి దగ్గరలోనే ఉండే డీఈఓ ఆఫీస్ ముందు చెట్టు కింద తడికలతో ఏర్పాటు చేసిన ఖాన్ సాహెబ్ చాయ్ హోటల్ ఉండేది. అతని దగ్గర టీ చాలా బాగుంటుంది అని అందరూ అనేవారు. ఆఫీసులోని పెద్ద వాళ్లతో మొదలు అలగా జనం దాకా అందరూ అక్కడే టీ తాగేవారు. నాకు నిజానికి టీ అలవాటు లేదు. కానీ బంధువులైన ఒకరిద్దరు అన్నలతో ఒకసారి నేను అంగడిలోకి వెళ్లాను. మిరపకాయ బజ్జీలు కూడా తిన్నాము. టీ తాగడం సరేసరి. అయితే సంగతి ఇంట్లో వాళ్లకు ఎవరికో తెలిసింది. ఇక ఆ సాయంత్రం మా మీద కోర్టు మార్షల్ లాంటి పెద్ద తతంగం నడిచింది. మేము కట్ మిర్చి, కట్‌లెట్ కూడా తింటున్నామని తెలిస్తే బహుశా ఇంట్లో నుంచి వెళ్లగొట్టేవాళ్లేమో!
నాకు పాలమూరులోనే ఉల్లిపాయ పకోడీల రుచి తెలిసింది. మొట్టమొదటిసారి ఎక్కడ తిన్నాను గుర్తులేదు కానీ కమల్ హోటేల్ అని ఒక చిన్న అంగడి దొరికింది. ఉత్తర భారతానికి చెందిన ఇద్దరు దంపతులు దాన్ని నడిపిస్తూ ఉండేవారు. వాళ్లు చాలా శుభ్రంగా చూడడానికి కూడా చక్కగా ఉండేవారు. అంగడి మొదట్లో కొంతకాలం అన్నయ్య వాళ్ల ఇంటికి దగ్గరలోనే ఉండేది. అప్పుడు అక్కడికి వెళ్లడం పెద్ద సమస్య కాదు. బడి కూడా పక్కనే ఉంటుంది. కనుక మిత్రులము అంతా చేరి అక్కడికి వెళ్లేవాళ్లం. పాలమూరులో మామూలుగా దొరకని కూల్‌డ్రింక్స్ కూడా వాళ్లు ఎవరో అమ్మేవారు. రాస్స్ బెర్రీ అనే రుచి అక్కడే పరిచయం అయింది. వాళ్లు అంగడి న్యూటౌన్‌కు మార్చారు. అయినా సరే మేము వెళ్లడం ఆగలేదు. నిజానికి మా సాయంత్రాలు అక్కడే అంటే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా గడిచేవి మరి.
పట్నం చేరిన తరువాత పరిస్థితి చాలా మారిపోయింది. హాస్టల్లో చేరాము అంటే మొత్తం తిండి మనవాళ్లు వండింది కానే కాదు. ఇక ఎక్కడ పడితే అక్కడ తినడానికి సందేహం లేనేలేదు. పెద్దవాళ్లు మా ఊరిలో లేరు. ఎక్కడో దూరంగా ఉన్నారు. చాట్ రుచి పిలుస్తూనే ఉన్నది. కోఠీలో గోకుల్ చాట్ ఇప్పుడు అందరికీ మిరపకాయ బజ్జీలు కన్నా బాంబుల కారణంగా ఎక్కువగా తెలుసు. మాకు మాత్రం ఇది కేవలం ఒకే ఒక్క మల్గీగా ఉన్ననాటి నుంచి తెలుసు. ప్రస్తుతం ఆ వ్యాపారాన్ని నడిపిస్తున్న అన్నదమ్ముల తండ్రి అద్భుతమైన మిరపకాయ బజ్జీలు వేసేవాడు. లోపల రెండు బెంచీలు ఉండేవి. వెళ్లి కూర్చుంటే వేడివేడిగా రకకరాల పదార్థాలు దొరికేవి. బాంబులు పేలిన తరువాత కూడా ఆ అంగడిలో మనుషులు నిలబడి తిండి తింటున్నారు అంటే నాకు గుండె కరిగి కాలువై ప్రవహిస్తుంది. ఘాతుకం తరువాత నాకు ఆ ప్రాంతంలో నడవాలంటేనే చిత్రమైన భావాలు కలుగుతుంటాయి. మరే దేశంలో అయినా అక్కడ ఒక స్మారక మందిరం కట్టి ప్రతి నిత్యం పువ్వులు పెట్టేవారేమో. మనవాళ్లు చీమ కూడా కుట్టినట్టు ఇంకా మిరపకాయ బజ్జీలు అమ్ముకుంటున్నారు.
గోకుల్ గురించి ఆలోచిస్తుంటే ఒక విషయం జ్ఞాపకం వస్తున్నది. ఆ అంగడికి ఎదురుగా అంటే అమ్మాయిల కాలేజీ గోడ పక్కన చాలా ప్రసిద్ధి చెందిన చాట్ బండి ఒకటి ఉండేది. అది కూడా అసలు సిసలైన బాపన వ్యవహారం. ఆ పెద్దాయనకు బహుశా చొక్కా ఉండేది కాదేమో అని అనుమానం. బండిని తాకనిచ్చేవాడు కాదు. దూరంగా నిల్చోవాలి. తిండి వస్తువులను ఎత్తి చేతిలో పడేసేవాడు. అక్కడ రోకలికి మువ్వలు కట్టి మసాలా దంచుతూ ఉంటే వచ్చే లయబద్ధమైన చప్పుడు ఆ బండికి ప్రచారంగా పనికివచ్చేది. చాలా రుచికరమైన చాట్ పదార్థాలు అతని దగ్గర తిన్నట్టు గుర్తు ఉన్నది. చిత్రంగా ఒక అప్రస్తుతమైన అంశం చెప్పాలా లేదా తెలియడం లేదు. ఆ బండి పెద్ద మనిషికి ఒక అందమైన కొడుకు ఉండేవాడు. బొద్దుగా ఉన్న ఆ కుర్రవాడు తండ్రికి పనిలో సహాయపడుతూ ఉండేవాడు. యుక్తవయసు వచ్చేసరికి అతను అబ్బాయి కాదు అమ్మాయి అని బయటపడింది. ఈ వ్యవహారం ప్రపంచానికి తెలియదు. అప్పటికి నేను పరిశోధనలోకి వచ్చాను కనుక తోటి పరిశోధకుని వలన ఈ విషయం తెలిసింది. అది పక్కన పెడితే, ఆ తరువాత తండ్రి గాని కొడుకు గాని మళ్లీ కనిపించలేదు.
ఇక ఆ తరువాత పరిస్థితులు మారాయి. నేను ఒకరిద్దరు మిత్రులతో కలిసి హైదరాబాద్‌లోని స్ట్రీట్ ఫుడ్ మీద ఇంచుమించు పరిశోధన చేసినంత పని చేశాను. నాకు తెలియని బండి గాని కార్నర్ అంగడి గానీ లేదు అంటే ఒకప్పటికి ఆశ్చర్యం కాదు. కేవలం నూనెలో వేసిన వేరుశెనగ పప్పు మిరపకాయ బజ్జీల మంటకు విరుగుడుగా ఇస్తారు కనుక పారడైస్ బస్టాండ్ పక్కన ఉండే కోమటి సోదరుల మిరపకాయ బజ్జీల బండి వద్దకు ప్రయత్నంగా ఎన్నిసార్లు వెళ్లాము. గుర్తులేదు. ఆలుటోస్ట్, శాండ్విచ్‌ల కోసం రాణిగంజి దాకా వెళ్లేవాళ్లం అంటే ఆశ్చర్యం లేదు.
దేశమంతా తిరిగాను. ఎక్కడా నాకు మిరపకాయ బజ్జీల వెర్రి కనిపించలేదు. 40 ఏళ్ల క్రితం కలకత్తా వెళ్లినప్పుడు అక్కడ చిత్రంగా వంకాయ బజ్జీలు అమ్మడం కనిపించింది. దాన్ని వాళ్లు బేగుని అన్నారు. బైంగన్‌ను మరి వాళ్లు బేగ్ అంటారేమో! మద్రాసు అనే చెన్నపురిలో భేల్‌పూరిలో మామిడికాయ ముక్కలు వేస్తే ఆశ్చర్యపోయాను.
పాండీ బజార్లో ఒకచోట తారు డబ్బాతో పొయ్యి తయారుచేసి వాటి మీద రకరకాల టిఫిన్లు వండిపెట్టిన అంగడిని చూసి ఆశ్చర్యపోయాను. రెండు పొయ్యిల మీద ఒక దాని మీద బాణలి మరొక దాని మీద పెనం ఉన్నాయి. బాణలిలో పూరీలు బజ్జీలు తయారవుతుంటే, పెనం మీద చపాతీలు దోసెలు తయారవుతున్నాయి. ఇద్దరు ముగ్గురుకన్నా పనివాళ్లు ఎక్కువగా లేరు. తిన్నవాళ్లు తినగా చివరకు ఏం తిన్నావు అని అతను అడుగుతున్నాడు. ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అంటే అందరూ అతని అభిమానులు, శ్రేయోభిలాషులు అని అర్థం. నేను రెండవ ఐటమ్ కొరకు అడిగే సందర్భంలో డబ్బుల ప్రసక్తి చేశాను. ముందు మీరు తినండి అన్నాడు అతను.
దశాబ్దాల క్రితం మద్రాసులోని మరొక విచిత్రం చూచాను. ఒక యువకుడు మొత్తం బస్సును హోటేల్‌గా మార్చి ఉదయం సాయంత్రాలలో రద్దీగల ప్రాంతానికి తీసుకువచ్చి వ్యాపారం నడిపిస్తున్నాడు. ఆఫీసులకు వెళ్ళే వాళ్లు కూడా అక్కడ ఉపాహారం ముగించుకుని మధ్యాహ్నానికి కావాల్సింది కూడా డబ్బాలో వేసుకుని వెళ్లడం నేను గమనించాను. అప్పట్లో ఆశ్చర్యం కలిగింది. ఆ పక్కన ఒక చెత్తకుండీ పెట్టాడు. అరటి ఆకులు కాగితాలను అందులో వేయండి అంటున్నాడు. బస్సు బయలుదేరి వెళ్లే సమయానికి చెత్తను కూడా తనతోపాటే తీసుకుపోతున్నాడు. ఇప్పుడు ఇటువంటి మొబైల్ ఫుడ్ యూనిట్లు ప్రపంచంలో అన్ని చోట్లా కనపడుతున్నాయి కానీ నేను 40 ఏళ్ల క్రిందటి సంగతి చెబుతున్నాను.
దిల్లీలో దారి పక్కన తిండి గురించి నిజంగా చెప్పాలంటే పెద్ద పుస్తకమే రాయాలి. చాందిని చౌక్‌లోని వేడివేడి జిలేబి, గలీ పరాఠే వారిలోని పరాఠాలు, శివాజీ స్టేడియం బస్టాప్‌లోని ఆలు చాట్, మండీ హౌస్ పక్కన ఉండే గుండ్రని మార్కెట్లోని మిఠాయి అంగళ్లు. అన్ని దేనికదే ప్రత్యేక ఆకర్షణగా నిలబడగలవి. ఆ నగరంలో చలి ఎండ రెండు విపరీతంగా ఉంటాయి. కనుక వేసవి కాలంలో చల్లని రసగుల్లాలు, చలికాలంలో వేడివేడి గులాబ్ జామూన్‌లు తినడం అక్కడే బాగా అలవాటు అయింది. చాందిని చౌక్ జిలేబిలను వెతుకుతూ ప్రపంచం నలుమూలల నుండి మధుర ప్రియులు వస్తారు అని అర్థం అయింది. నిజంగానే అక్కడ ఏదో ప్రత్యేకత ఉన్నట్టు తోచింది. ఇక రాజధాని నగరంలో తిండి పరిస్థితి గురించి పరిశీలిస్తే కొన్ని విచిత్రాలు కనిపిస్తాయి. మన దగ్గర ఉన్నట్లు తక్కువ ధరలో ఉపాహారం తీసుకుని కాలం వాడుకోవడానికి తగిన తిండి ఏర్పాట్లు అక్కడ ఉండవు. మంచి వెలగల ఫుడ్ జాయింట్స్ ఉంటాయి. లేదంటే దారి పక్కన తినవచ్చు. నేను ఉద్యోగ పరంగా కూడా అక్కడ ఉండి ఈ విచిత్రాలన్నీ తెలుసుకున్నాను. పెద్దపెద్ద ఆఫీసర్లు కూడా రోడ్డు పక్కన నిలబడి బండి మీద తిండి తినడానికి ఏ మాత్రం అనుమానం లేకుండా వచ్చేస్తారు. ఆ తిండి పరిశుభ్రంగానే ఉంటుంది.
దిల్లీలోని పాలు, లస్సీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాలను అన్ని రకాలుగా తాగవచ్చునని మొదటిసారిగా తెలిసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. పాడిని అనుభవించడం అంటే పంజాబ్ వాళ్ల దగ్గరే నేర్చుకోవాలి. ఇటుకలులాగ పనీర్‌ను అంగళ్ల ముందు పెట్టి అమ్మడం చూచినప్పుడు ఆశ్చర్యం కూడా కాని భావం ఏదో కలిగింది. దిల్లీలో ఎక్కడికక్కడ ప్రత్యేకమైన విధి తిండి దొరుకుతుంది. వెతుకుతూ తిరగడానికి ఓపిక ఉండాలే కానీ, ఆసక్తి గలవారికి అది మంచి కాలక్షేపం.
తిండి గురించి మాత్రమే రాసే బ్లాగర్లు ఉన్నారట. నా బ్లాగులో నేను తిండి గురించి మాత్రం రాసినట్లు లేదు. తలుచుకుంటే దేశం మొత్తంలోనూ వెళ్లిన ప్రతి చోట తిన్న తిండి గురించి బ్లాగు కర్మ ఏమిటి ఏకంగా ఒక టీవీ సీరియల్ తీయవచ్చు. అటువంటి సీరియల్స్ చూచి సంతోషపడుతున్నాను. తిండి తినడం పోయి చూసి సంతోషపడే కాలం వచ్చింది. దాన్ని గురించి రాసి సంతోషపడే కాలం వచ్చింది. ఏదైనా బాగానే ఉంది.

-కె.బి.గోపాలం