లోకాభిరామం

తెలిస్తే బాగుంటుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి కుటుంబంలోనూ వాళ్లకు మాత్రమే అర్థమయే మాటలు, జోకులు కొన్ని ఉంటయి. మా యింట్లో కూడ అట్లనే కొన్ని మాటలు, జోకులు ఉన్నయి. తెలియని తిండి పదార్థం ఏదో కొత్తది బల్ల మీదికి వచ్చినట్టుంది. మా అమ్మాయి ‘దీన్ని ఏమంటరు?’ అని అడిగింది. మామూలుగనే సరదాగ మాట్లాడే మా అబ్బాయి ‘ఏమి అనరు! తింటరు’ అని టక్కున జవాబు చెప్పినడు. ఆ తరువాత మేము చాల సందర్భాలలో ఏమి అడగకుంటనే ‘తింటరు’ అనుకోని తింటూ ఉంటము.
ఏదో కొత్త వస్తువు ఎదురుగ వస్తుంది. ఒకప్పుడయితే, దీన్ని దేనితో చేసినరు అని అడిగేది అలవాటు. చాలకాలం వరకు యింట్లోని వస్తువులన్ని కర్ర, లోహం లేదంటే రావివి ఉండేవి. రాతి చిప్పలు, కర్రచిప్పలలో వంట పదార్థాలు పెట్టుకోని తిన్నము, అంటే కొంతమందికి ఆశ్చర్యం కలుగుతుండవచ్చు. మధ్యలో పింగాణి వచ్చింది. ఆ తరువాత చూస్తుండగనే ఫైబర్ గ్లాస్ వచ్చింది. బెక్‌లైట్ వంటి రకరకాల కాంపొజిట్లు వచ్చినయి. గాజు వచ్చింది గాని, మా వంటి ఛాదస్తం వారి వంట యింట్లో దానికి ఈనాటికి గౌరవం లేదు. మా యిండ్లలో బయటి వారికి గాజు గ్లాసులో నీళ్లు ఇచ్చేది ఇవాళటికి అలవాటు. ఇంక ప్లాస్టిక్ మాత్రం ప్రభంజనం వోలె వచ్చింది. ఇంక ఇప్పుడు ఎదురయిన వస్తువు దేనితో తయారయినది తెలుసుకునేది పెద్ద సమస్యగ మారింది. చేతికందిన సీసా లేక గ్లాసు ఎటువంటిది తెలుసుకునేందుకు, సూది కాల్చి కుచ్చి చూడమని ఒకాయన చెప్పినడు. ప్లాస్టిక్ అయితే కాలి రంధ్రం అవుతుంది మరి. ఎవరు మాత్రం కొత్త సీసాను పొడిచి తూట్లు వేసుకుంటరు? కనుక పాత్ర సంగతి అనుమానంగనే ఉండిపోతుంది. కొత్తగ కొన్న వస్త్రం, కృత్రిమ పదార్థమా లేక సహజంగ నూలుతో తయారయిందా తెలియాలంటే, ఒక కొనకు నిప్పు పెట్టి చూడాలె. నుసి అయితే నూలు. ముడుచుకుంటే మరొకటి. ఒక పోగ తీసి కాల్చి చూడమని మనవి! ప్రపంచం ఇట్లయింది మరి!
చేతికి ఏదో అంటుకుంటుంది. మరొక వేలితో ముట్టి చూస్తే అది జిగురుగ ఉంటుంది. ‘శాణకు మూడు చోట్లు’ అని మాకు ఒక మాట ఉంది. శాణ అంటే శాణమంతుడు. అంటే కుశాలగలవాడు. అంటే తెల్విగలవాడు. అంటే తెలివిగలవాడు. అంటే బుద్ధిశాలి. అంటింది మొదటి చోటు. కంటి ముందు పెట్టుకుంటే రెండవ చోటు. ఇగ దాని వాసనగూడ చూస్తే మూడవ చోటు. ఇంక కొనకు ఆ అంటిన వస్తువు అసహ్యమయినదని తెలిస్తే, అప్పుడు అసలు బాధ మొదలవుతుంది. దాన్ని వదిలించుకోవాలె. అందుకొరకు సబ్బు రుద్దాలె. అన్నట్టు సబ్బు ఏ పద్ధతిలో ఒంటికి అంటిన మురికి, చమురు, జిడ్డు, మకిలి వంటి వాటిని తీసేస్తుంది? ఈ ప్రశ్న అడగకుండ, జవాబు తెలవకుండనే, అందరు సబ్బు రాసుకుంటరు. కొంతమంది, సబ్బెందుకు దండుగ అనుకోని, ఉత్త నీళ్లతోనే మొఖం, చేతులు గచపిచ రుద్దుతుంటరు. ఈడనే సైన్సు అనే రంగుటద్దాలు పెట్టుకుని, సైన్సు చీమతోటి కుట్టించుకున్న గోపాలం అడ్డము వస్తడు. అయ్యా, అమ్మా! ఏ సంగతయినా తెలుసుకోని అనుభవించితే మరింత బాగుంటుంది గదా అంటడు. నిజానికి సబ్బు అణువుకు రెండు కొండ్లు ఉంటయి. కొండి అంటే తేలుతోక కొనన ఉంటుంది చూడండి. అట్ల వంకరగ ఉండేటి భాగము. ఆ రెండు కొండ్లలో ఒకటి నీటి అణువును పట్టుకుంటుంది. ఇంకొకటి జిడ్డు అనే చమురు అణువును పట్టుకుంటుంది. అంటే అది చమురున ఒక దిక్కు పట్టి పెట్టి నీటి సాయంతోటి, మన ఒంటి నుంచి, లేదంటే బట్టల నుంచి దూరంగ పోతుందని అర్థము. నీళ్లు లేక నీటి సాయంతోటి, మన ఒంటి నుంచి, లేదంటే బట్టల నుంచి దూరంగ పోతుందని అర్థము. నీళ్లు లేక సబ్బు పని చేయదు. నురుగు లేక సబ్బు పని చేయదు. అంటినది చమురుగాక, మరే తారు, డాంబరు అనుకోండి. అది సబ్బుతోని వదలదు. ఇంత లోతుగ ఎవరు ఆలోచిస్తరు? సబ్బు రుద్దితిమా? కడిగితిమా?
ఈ ప్రపంచంలో ప్రాణి, మనిషి భూమి మీద పడిన క్షణం నుంచి కొనఊపిరి దానుక ఊపిరి తీయక తప్పదు. ఒంటిలో ఊపిరి ఉన్నంత కాలమే బతుకు. కదా! మరి ఆ గాలి గురించి ఎన్నడన్న ఒక క్షణము ఆలోచించితిమా? దోస్తు ఒగాయన వచ్చినడు. మళ్ల ఒకసారి పల్లెలో వ్యవసాయం పెట్టినడు. మామిడి చెట్ల కింద మంచం ఏసి పండుకుంటే ఏసీ లేకుండనే చల్లగ ఉన్నదట. గాలి చాల తేలికగ తోచిందట. అంటే ఊపిరి అనే శ్వాసలో తేడా తెలిసిందని అర్థముగదా! ఎందుకట్ల తెలుసునా పటేలా? అంటే పొల్యూషన్ లేదు గద! అంటడు. ఆ మాటయితే తెలిసింది గాని అందులోని కిటుకు తెలిసిందా? అయిదవ అంతస్తులో బతికేది నేను, కారిడార్‌లో, బాల్కనీలలో నిండ తొట్లలో మొక్కలు పెంచుతున్న. చాలదు అన్నట్లు హాలులో, బెడ్‌రూంలో గూడ పెద్దపెద్ద చెట్లు పెట్టుకున్న. నాకు యింట్లో గూడ గాలి తేలికగ ఉంటుంది మరి! అదే చెప్పిన! నిజం గద! అన్నడు.
ఈ భూమి అనే గ్రహం చుట్టు గాలి ‘వాతావరణం’ అనే పద్ధతిలో అంటుకోని ఉన్నది. అది లేకపోతే, ఈ భూమి మీద మొక్కలు, చెట్లు లేవు. జంతువులు లేవు. మనం లేము. ఆ తరువాతనే నీళ్ల సంగతి. నీళ్లు గాలి కలిస్తేనే వాతావరణం, జీవం అన్నీ వీలయినయి. మరి గాలి అంటే ఏమి? అని ఎవరన్న ఆలోచించినరా? అదేమి, అంటే ఎవరేమి చెప్పగలుగుతరు? గాలి అంటే గాలిగాదా? అనండి. అందులో ఏమున్నది, అది దేనితోని తయారయింది? అంటే కొంచెం ముందుకు నడుస్తుంది ఆలోచన.
ఈ ప్రపంచం మీద కోట్ల మంది పుట్టి, గాలి పీల్చి, వదిలి వెళ్లిపోయినరు. మనం ఇప్పుడు ఒక్కసారి గాలి పీలిస్తే, అప్పటివరకు బతికిన ప్రతి మనిషి, పీల్చి వదిలిన గాలి, ఒక్క అణువయినా, అందులో ఉంటుంది అని లెక్క తేల్చినరు. మన చుట్టు ఉన్న గాలి అంత పాతది. పుట్టి గిట్టిన వారు పీల్చి వదిలిన గాలి మనం పీలుస్తున్నమంటే బాగనే ఉంది. ప్రపంచంలో ప్రస్తుతం బతికి ఉన్న వారిలో, ఆరు సంవత్సరాల వయసుగల వాండ్లందరు పీల్చి వదిలిన గాలి కూడ, మన ప్రతి శ్వాసలో ఉంటుందట. అంటే మీరు వదిలిన శ్వాస, మొత్తం ప్రపంచంలో వ్యాపించేందుకు ఆరు సంవత్సరాలు పడుతుందని లెక్క తేలిందన్న మాట. మనకు ఆరేళ్లు నిండిన నాటి నుంచి మనం పీల్చి వదిలిన గాలిని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు పీల్చి బతుకుతున్నరు. అంటే లెక్క మరొక రకంగ ఉంటుంది. వినేందుకు సొంపుగ ఉంటుంది గూడ. దీన్ని మరి బతుకు అందమా? సైన్స్ అందమా? అయ్య, అమ్మా అందుకే నేను అంగలార్చేది ఎందుకంటే, సైన్స్ అంటే వేరుగ ఏదో లేదు. బతుకు గురించిన ఇటువంటి సంగతులే, సైన్స్ అనే పేరుతోని కొంతమంది పట్టి పరిశీలిస్తరు. అవి మన గురించి, మన ప్రపంచం గురించిన సంగతులు.
నాకు కవితలు, కథలు, కాకరకాయలు రాయడం చాతనవుతుంని రుజువు చేసి చూపిన. కానీ, ఈ సైన్స్ అనే బతుకు సంగతులు అందరికి అందించేది, అందరికి అంత సులభంగ చేతనయినట్లు కనిపించదు. ఇటువంటి సంగతులు రాసే వాండ్లు నానాటికి తక్కువవుతున్నట్లు కనబడుతున్నది. అందుకే నేను సైన్స్ రాస్తనని, మిగతవి చదువుతనని 40 ఏండ్ల కిందనే శపథం చేసిన. సైన్స్ రాయడంలో మంచి గుర్తింపు పొందినట్లే అనుకుంటున్న. రేడియోలో ఉద్యోగం చేస్తే, సైన్స్ గురించి చెప్పే అధికారిగ చేసిన. పత్రికలలో సైన్స్ రాసిన. టీవీలో, ఇంటర్‌నెట్‌లో సైన్స్ గురించి కార్యక్రమాలు, రాతలు సాగించిన. అన్నిచోట్ల, నా పనికి మెప్పులు అందినయి. మనుషులను సైన్స్ దృష్టితో ఆలోచింపజేయాలన్నది నా బాధ. అందుకే లోకాభిరామములో గూడా, అప్పుడప్పుడు నా పద్ధతిలో సైన్స్ స్రక్తి తెస్తుంట. ఇవాళ మీరు చదివిన ఈ నాలుగు మాటలు సైన్స్ వ్యాసంలాగ ఉంటే నన్ను క్షమించాలె. నేను బతుకు గురించి, మన గురించి చెప్పాలని ప్రయత్నించిన. ‘మన గురించి మనం’ అన్నది నా రాతల వెనుక కలకాలంగా నిలిచిన థీమ్!
ఇక్కడ నేను చెప్పింది కొంత జీవశాస్త్రం, ఇంత భౌతిక శాస్త్రం, మరింత రసాయన శాస్త్రం, అన్ని కలిసిన ఈకాలజీ, ఎన్నో కలిసిన ఆంత్రొపాలజీ. ఎన్విరాన్‌మెంట్ సైన్స్. ఎనె్నన్నో. మరెన్నో. గ్రహం చుట్టు గాలులు ఉన్నయి. అవి పారదర్శకం ఉన్నయి. అంటే అవతలి నుంచి భూమిని చూచేవారికి ఈ గాలి అడ్డం రాదు. నీటి ఆవిరి మబ్బులుగ మారుతుంది. ఈ మబ్బులు మాత్రం అడ్డం వస్తయి. అంటే మబ్బులంటే వాయువులు కాదు. ఈ రకంగ చెప్పుకుంటు పోతే, ఆశ్చర్యకరమయిన, ఆసక్తికరమయిన సంగతులు ఎన్ని ఉన్నయి. సైన్స్ అనకుండ వాటిని అర్థం చేసుకోండి. ఆనందించండి!

కె. బి. గోపాలం