లోకాభిరామం

చల్‌తే - చల్‌తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతను నేల మీదకు దిగుతాడు. అంటే ఆకాశంలో నుంచి అన్నమాట. అయిదవ అంతస్తులో ఉండేవాళ్లు నేలకన్నా ఆకాశానికి దగ్గరగా ఉంటారన్నది, అనుభవిస్తే గాని అర్థంగాదు. అయిదవ అంతస్తులో ఉంటే ప్రపంచంతో పనిలేదు. కింద అరటిపండ్ల బండి వచ్చిందని, అరుపు కారణంగా తెలుస్తుంది. పైనుంచి అంత అరుపు అదిని బండిని ఆపాలంటే కిందకు వినిపించదు. పై నుంచి చూస్తే పండ్లు బాగానే ఉంటాయి. దిగి చూస్తే నచ్చవేమో? బేరం కుదరకపోతే, బండి మనిషి విసుక్కుంటాడు కనుక, పిలిచే ప్రయత్నమే ఉండదు. అది అయిదవ అంతస్తు మనస్తత్వం. అతను మరి నేల మీదకు దిగాడు. గేటు దాటే లోపల ‘దర్శనాలే లేవు?’ అంటూ ఎవరో పలుకరిస్తారు. అక్కడికి అతను ఏదో దేవుడు, లేదా చా.ము.మ. అంటే చాలా ముఖ్యమైన మనిషి అయినట్టు! తాను ఆ రెండు రకాలు కాడని అతనికి తెలుసు. అందుకే లేని చిరునవ్వు పులుముకుని అర్థంలేని ఆన్సర్ ఏదో చెపుతాడు. ముందుకు కదులుతాడు.
అతను ఆరడుగుల ఎత్తు, అరవయి అంగుళాల ఛాతీగల అందగాడేమీ కాదు. మరీ మరీ మందలో కలిసిపోయే రకం. నిజంగా మామూలుగా ఉంటాడు. షర్టు కొందామని పోతే అతని సైజు మాత్రం లేదు, అంటాడు అంగడి మనిషి. ఆ సైజు బాగా ఎక్కువగా ‘మువ్ అవుతుంది’ అంటాడు పైనుంచి. ‘నీవు మరీ సగటు, మామూలు మనిషివి!’ అన్న అర్థం వినిపిస్తుంది అతనికి. అందుకేనేమో, సందు మొదట్లో ఇంటి ముందు పడుకున్నా కుక్క తల ఎత్తి అతడిని చూస్తుంది. మనవాడేలే, అన్న పద్ధతిలో, కనీసం, కదలను కూడా కదలక మళ్లీ సర్దుకు పడుకుంటుంది. అతను అంత పిరికివాడు కాదు గానీ, కుక్క మొరిగితే భయపడాల్సిన అవసరం వస్తుందేమో అనుకుంటాడు. ఆ సరదా తీరకుండానే ముందుకు సాగవలసి వస్తుంది.
మలుపు తిరిగితే ఒకటి రెండు చిన్న అంగుళ్లుంటాయి. అక్కడ మనుషులు ఉంటారు. అతను వాళ్లను గానీ, వాళ్లు అతడిని గానీ పట్టించుకోరు. మళ్లీ మలుపు తిరిగేలోగా మామూలుగా ఉండే బురద, తడి ఎదురవుతాయి. అట్లాగని అది వానకాలం కాదు. అక్కడ వరదలేవీ రాలేదు. అక్కడ ఒకవేపు రెండు ఇళ్లుంటాయి. ఇళ్లలో చాలా గదులుంటాయి. కిటికీలుంటాయి. మనుషులే ఎవరూ ఉండరు. ఆ ఇళ్ల వాళ్లకు బాపు+రమణ స్టయిల్లో డబ్బు చేసింది. కనుక అంత పెద్ద ఇళ్లు కట్టుకున్నారు. అయినా సంగతి అర్థం కాలేదేమోనని వాళ్లు సాయంత్రం కాకముందే, తమ ఆవరణనంతా చాలా బోలెడు నీళ్లు పోసి కడుగుతుంటారు. ఆ నీళ్లు వాగులై వరదలై, మిగతా వారి మీదకు ప్రవహిస్తుంది. మరి నీరు పల్లమెరుగును కదా! ఆ పక్క వీధి మొత్తం రుతువులతో సంబంధం లేకుండా బురదయ్యి ఉంటుంది.
రాజు - పేద, రాజా ఔర్ రంక్, ప్రిన్స్ అండ్ ద పాపర్ లాంటి జంట మాటలకు అక్కడ మనకు ఉదాహరణ దొరుకుతుంది. డబ్బు చేసిన ఇంటి వాళ్లకు ఎదురుగా సందు అటుపక్క ఒక ఖాలీ ప్లాట్ ఉంటుంది. దానికి చుట్టు గోడ ఉంటుంది. గేట్ కూడా ఉండే ఉంటుంది. దాన్ని ఎన్నడూ మూసిన పాపాన పోయింది లేదు గనుక, లేదేమోనన్న అనుమానం వస్తుంది. ఆ ప్లాట్‌లో మరీమరీ తాత్కాలికం అన్న తీరులో గుడిసె ఉంటుంది. అక్కడ ఉండే వాళ్లను కొన్ని కథల్లో అలగా జనం అంటూ వర్ణిస్తారు. అతనికి మాత్రం వాళ్లు అలగ్ (వేరు)గా కనపడతారు. అతను బయలుదేరిన వేళా విశేషం అనాలేమో, అక్కడ ఇవాళ ఒక ఆసక్తికరమయిన సీన్ సాగుతున్నది. ముగ్గురు కుర్రవాళ్లు, స్టంట్ మాస్టర్ సాయం లేకుండానే చావగొట్టుకుంటున్నారు. ఇద్దరు నిజంగా సీరియస్‌గా కొట్టుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు కూడా. కానీ, ఆ సంగతి అతనికి అర్థం కాలేదు. వాళ్లు ఏమయిపోతారో అన్న షాక్‌లో ఉన్నాడతను. అందులో మూడవ మనిషి, మరొకనితో కలిసి, ఇంకొకని మీద దాడి చేస్తున్నాడా? లేక వాళ్లను వదిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడా అర్థంగావడం లేదు. మొత్తం మీద మూడవ యువకుడు తన్నులు తింటున్నాడు. పెద్దగా కొట్టలేక పోతున్నాడు. ఇంకా మొత్తం మీద వాళ్ల పోరాటం, చూస్తున్న అతను మాత్రం అవాక్కయ్యాడు. కాళ్లు చేతులు ఆడడం లేదు. అంటే నిలబడిపోయాడు. ‘ఎవరయినా పూనుకుని వాళ్లని వదిలించండిరా’ అనాలని అతనికి తోచి చాలా సేపయింది. ఆ ఎవరయినా తానొక్కడే అని తెలిసి, కదలకుండా ఉండిపోయాడు. ఒకప్పుడయితే, అంత ధయిర్యం చేసి ఉండేవాడేమో! ఈలోగా ఎవరో భుజం తట్టారు. తిరిగి చూస్తే ఒక ‘ఎవరయినా’ కనిపించాడు. ఆ మనిషి ఏ రకంగానూ పోరాటం గురించి పట్టించుకునే పద్ధతిలో లేడు. పైగా, మీ దారిన మీరు వెళ్లండి, అని సైగ చేశాడు కూడా. వాళ్లు తాగి, కొట్టుకోవడం మామూలే అని కూడా సైగ చేసినట్టున్నాడు. ఇక అతనికి కదలక తప్పింది కాదు.
డబ్బు ఖర్చు పెట్టి తాగడం, ఇట్లా కొట్టుకోవడానికా? అతనికి అనుమానం వచ్చింది. డబ్బు ఖర్చు పెట్టి, ఇల్లు కట్టి, దాన్ని కడగడం, అసలే, అందరికీ అందుబాటులో లేవంటున్న నీటిని, వ్యర్థంగా చల్లి, వీధులన్నీ ఏనాటికానాడు బురద చేయడానికా, అని అతనికి మరో అనుమానం వచ్చింది. ఇలాంటి అనుమానాలు, ఎవరినయినా అడిగితే జవాబు చెపుతారా లేక అదోలా చూస్తారా అని కూడా మరొక అనుమానం వచ్చింది. ఇంతకు ముందు అడిగినప్పుడు అట్లా జరిగిందేమో? ఇంతకూ అతనికి ఒక విషయం అర్థమయింది. తాను డబ్బు ఖర్చు పెట్టాలి. కొంతయినా పెట్టాలి. కానీ, ఇలాంటి పనులు మాత్రం చేయగూడదు. మరేదో మంచి పని చేయాలి. జేబులో చెయ్యి పెట్టనవసరం లేకుండా బతుకుతూ పోవటం అతనికి అంతగా ఇష్టం లేదు. దారిలో, కూరలు, పళ్లు కొనవచ్చు. వాటిని మోసుకుని తిరగడం చేతవుతుందా? ఇంట్లో వాళ్లు తెచ్చే ఉంటారు. లాంటివన్నీ ‘వద్దులే’ అనిపిస్తాయి. మరేం కొనాలి? అవును! మొన్ననొకసారి ఏదో కొనాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు గుర్తు. హేవిఁటబ్బా? మేకులా? సూదులా? అవన్నీ తనకెందుకు? కొనదలుచుకున్న వస్తువు వైనం గుర్తుకు రాదు. అదే పనిగా ఆలోచిస్తే అసలే గుర్తురాదు.
ఈలోగా అతను, తెలియకుండానే, కొంత దూరం నడిచి వచ్చినట్లు గమనిస్తాడు. పూలు, పండ్లు, కూరలు కొనే అవకాశంలో కొంత వెనుకబడి పోయింది. వ్యాపారం బాగానే ఉంది. అవకాశం మాత్రమే అతనికి వెనుక దిక్కున మిగిలిపోయింది.
ఈలోగా, అంటే, మరొక ఈలోగా, పక్కన పార్కులో ‘వయోవృద్ధ మాజీ అధికారుల సమావేశం’ మామూలుగానే కంటబడింది. అక్కడ రెండే బెంచీలుంటాయి. అందరూ వాటి మీద కూచోవలసిందే. ఎవరు మాత్రం కింద కూచుంటారు? అందరూ పెద్ద ఉద్యోగాలు వెలగబెట్టినవారే. అందుకే ఇరుక్కుని, అత్యంత మిత్రులలాగ, ఉన్న బెంచీల మీదనే సర్దుకుని, చేతులు తిప్పుతూ ఉపన్యాసాలు ఇచ్చేస్తుంటారు. భారతదేశంపై ట్రంప్ ఎన్నిక ప్రభావం, అణుబాంబులు అవసరమా? అటు విద్యుత్తు అంటే ఏమిటి లాంటివన్నీ వాళ్లు చర్చిస్తారు. గుడిస్తారు కూడానా? ఇంట్లో వంట, కూరల గురించిన నిర్ణయ బాధ్యత ఎలాగూ తలమీద లేదు. దర్జాగా ఇన్-షర్ట్ వేసుకుని వచ్చి, అందరి ముందూ తెలివి చూపించాలిగాని.. ఇదేవిఁటి, పేజీ అయిపోయిందా? అతను మరి ఏమయి పోతాడు? (తర్వాత చూద్దాం!)

కె. బి. గోపాలం