క్రైమ్/లీగల్

నకిలీ బంగారంతో బురిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విలేఖరుల సమావేశంలో పులివెందుల డీఎస్పీ నాగరాజ
రాయచోటి, అక్టోబర్ 28: నకిలీ బంగారంతో బురిడీ కొట్టించి రూ.6 లక్షలు కాజేసిన నిందితులను అరెస్టుచేసినట్లు పులివెందుల డీఎస్పీ నాగరాజ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా కోటపల్లె గ్రామం రామనపల్లెకు చెందిన అట్టేల అంకుల్‌కు వీరబల్లి మండలం మట్లి గ్రామ పంచాయతీ షికారుపాలెంకు చెందిన గంగరాజు, నాగరాజు, మనోహర్, అంజనప్పలు ప్లాస్టిక్ పూల వ్యాపారంతో పరిచయం ఏర్పడిందన్నారు. ఈ క్రమంలో నిందితులు తాము కంజుపిట్టల కొరకు అడవిలోకిపోగా రాజుల కాలంనాటి పురాతన బంగారు పూలు 2 కేజీలు దొరికాయని తక్కువ ధరకు ఇస్తామని రూ.6 లక్షలు తీసుకుని రాయచోటికి రమ్మని చెప్పారన్నారు. వారి మాయమాటలు నమ్మిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అంకుల్ హుటాహుటిన ఈనెల 21న రాయచోటికి చేరుకున్నారని తెలిపారు. పట్టణంలోని గాలివీడు రింగురోడ్డు సమీపంలోని పెట్రోల్‌బంకు దగ్గర పై నలుగురు వ్యక్తులతోపాటు మరో నలుగురు క్రిష్ణనాయక్, చంద్రప్ప, సూర్య, చెన్నకేశవులు కలిసి మొత్తం 8 మంది కలిసి రెండు కేజీల నకిలీ బంగారాన్ని ఇచ్చి రూ.6 లక్షల నగదు తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం అంకుల్ అవి నకిలీవి అని తెలుసుకుని ఈనెల 26న అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. కేసు విచారణలో భాగంగా అర్బన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ గోవిందరెడ్డి, సిబ్బంది కలిసి దర్యాప్తు చేస్తుండగా ఆదివారం సుండుపల్లె రోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద 8 మంది నిందితులను అరెస్టు చేసి వారివద్ద నుండి రూ.5,76,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను పెద్దమనుష్యుల సమక్షంలో స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. అయితే రెండు రోజులలోపే కేసు ఛేదించడంతో సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ గోవిందరెడ్డిలను డీఎస్పీ అభినందించారు. మాయమాటలు చెప్పి గృహాలవద్దకు వచ్చి బంగారం కొంటాం, బంగారు అమ్ముతాం అని అంటూ వచ్చే వ్యక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. అయితే కేసును త్వరగా ఛేదించేందుకు కృషిచేసిన అర్బన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ గోవిందరెడ్డి, సిబ్బందికి రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. నిందితులను సోమవారం రిమాండుకు పంపనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

స్వైన్‌ఫ్లూతో వివాహిత మృతి!
* రాయచోటి, కడప, తిరుపతి ఆసుపత్రులలో వైద్య చికిత్సలు
* జిల్లాలో మొట్టమొదటి స్వైన్‌ఫ్లూ లక్షణాలు
* స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కోసం రక్తనమూనాల సేకరణ
రాయచోటి/చిన్నమండెం, అక్టోబర్ 28: రాయచోటి నియోజకవర్గ పరిధిలోని చిన్నమండెం మండలం వండాడి గ్రామ పంచాయతీ ఉప్పరపల్లెకు చెందిన దుగ్గనపల్లె అంజలి(20) ఆదివారం స్వైన్‌ఫ్లూతో మృతిచెందినట్లు ఆమె భర్త వెంకటేశ్వరరెడ్డి, బంధువులు తెలిపారు. బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... అంజలికి గత మూడు రోజులుగా జ్వరం రావడంతో రాయచోటిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అనుమానంతో కడపకు తీసుకెళ్లాలని సూచించారన్నారు. అనంతరం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా వైద్యులు స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్నాయని అనుమానంతో తిరుపతికి తీసుకెళ్లాలని సూచించారు. తిరుపతి సిమ్స్ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమించడంతో రక్తనమూనాలు సేకరించి స్వైన్‌ఫ్లూ నిర్ధారణకోసం రక్తనమూనాలను హైదరాబాద్‌కు తరలించారని తెలిపారు. అత్యవసరంగా వేలూరుకు తీసుకెళ్లాలని సూచించినట్లు భర్త వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. వేలూరుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోని పూతలపట్టు సమీపంలో అంజలి మృతిచెందినట్లు నిర్ధారించుకుని అనంతరం స్వగ్రామమైన వండాడి గ్రామం ఉప్పరపల్లెకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
సోషియల్ మీడియా మాధ్యమాలలో స్వైన్‌ఫ్లూతో అంజలి మృతిచెందినట్లు రావడంతో జిల్లాలో మొట్టమొదటిసారిగా స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయని జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. తిరుపతి వైద్యులు మాత్రం రక్తనమూనాలను హైదరాబాద్‌కు పంపించామని రెండు, మూడు రోజుల్లో నిర్ధారిస్తామని చెబుతున్నారు. అంజలికి గత యేడాది వెంకటేశ్వరరెడ్డితో వివాహం అయింది. వెంకటేశ్వరరెడ్డి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండేవాడు. ఈ క్రమంలో గత రెండురోజుల నుండి అంజలికి తీవ్ర జ్వరం రావడంతో పలు ఆసుపత్రులకు చూపించినా ఫలితం లేకపోయి మృతిచెందినట్లు బంధువులు భోరున రోధిస్తున్నారు. మృతిచెందిన అంజలిని చూసేందుకు ఆ గ్రామంలో ఎవ్వరూ ముందుకు రాలేదు. ప్రతి ఒక్కనోట స్వైన్‌ఫ్లూతో మృతిచెందిందని దగ్గరికి వెళ్లితే ఆ వ్యాధి తమకు అంటుకుంటుందని దూరం నుంచే మృతదేహాన్ని చూసి వెనుతిరిగి వెళ్లిపోయారు. మొత్తంమీద జిల్లాలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం వండాడి గ్రామం ఉప్పరపల్లెకు చెందిన అంజలికి కనిపించడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరికి గురై ఆందోళన చెందుతున్నారు.