ఈ వారం కథ

దిజడ్జిమెంట్ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ వీధి వీధంతా ఎంతో కోలాహలంగా, చాలా సందడిగా వుంది. పండగో, ప్రళయమో తెలియని పరిస్థితి. జనమంతా బయటకు వచ్చి ప్రేక్షకుల్లా చూస్తున్నారు. అతి త్వరలో విడుదలయ్యే స్పీడున్నోడో, దమ్మున్నుడో తరహా సినిమా ప్రమోషన్‌కై కుర్ర హీరో హీరోయిన్లు రోడ్లనుండి వీధుల్లోకి కూడా వచ్చేస్తున్నారా! వారిని చూడ్డానికి పిల్లా పాపలతో సహా ఇంటిల్లిపాది ఎదురుచూస్తున్నారా! అన్నట్లుగా ఉందా దృశ్యం. కానీ గుమిగూడిన వారి చూపులను జాగ్రత్తగా గమనిస్తే అది సినిమా చోద్యం కాదు, జీవిత యథార్థ వ్యథార్థ దృశ్యమని తెలుస్తుంది. వారి వారి సోషల్, ఎమోషనల్ స్టేటస్‌ను బట్టి కొద్దిమంది తమ ఇళ్ల బాల్కనీలోంచి, మరికొద్దిమంది కాంపౌండ్ గోడ గేటుపై తలలు పెట్టి తొంగిచూస్తున్నారు. బయటకు వస్తే ఏమవుతుందోనని భయం వారి ముఖాల్లో... అయితే అలగాజనం అని ‘బుద్ధిమంతులు’ తిట్టుకొనే ఆమాద్మీ మాత్రం ఇరుకు పెట్టెల్లాంటి ఇళ్ళ కనుగుల్లోంచి వచ్చి వీధి రోడ్డుమీదున్నారు. ఏమైతేనేం.. పోయేది ఏమీ లేదుగా అనే ధీమా వీరి కళ్ళల్లో...
ఇంతలో గట్టిగా సైరన్ మ్రోగుతూ ఒక పోలీసు జీపు రయ్యిమంటూ వచ్చి ఆ వీధి చివరలోనున్న మెయిన్ రోడ్డుపై ఆగింది. జీపులోంచి స్మార్ట్ అండ్ యంగ్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ గబుక్కున దిగి వేగంగా నడుస్తూ ఆ వీధిలోకి వచ్చాడు. అంతా అతన్ని తేరిపార చూస్తూ దారి పక్కకు తప్పుకుంటున్నారు. ఆ ఇన్స్‌పెక్టర్ వీధి మధ్యలో ఆగిపోయి రోడ్డుపై గుమిగూడిన వారినుద్దేశించి-
‘‘మీలో ఎవరు కోళ్ళ రామూని కొట్టి గాయపర్చింది.. చెప్పండి’’ అని గద్దిస్తూ అడిగాడు.
ఏ ఒక్కరూ ఏమీ చెప్పలేదు. చీమ చిటుక్కుమన్నా వినిపించే నిశ్శబ్దం.
‘‘మీలో ఎవరూ నేరం ఒప్పుకోకపోతే అనుమానితులందర్నీ జైల్లో పడేస్తాం.. మర్యాదగా చెబితే సరి.. లేదంటే..’’ అంటూ అర్థోక్తిలో ఆపి దబాయించాడు.
జనం ముఖాల్లో ఆందోళన వ్యక్తమైంది. ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకున్నారు. బాల్కనీ, కాంపౌండ్ గోడ వారికి కూడా ఏం జరుగుతుందో త్రీడీలో చూడాలనే కుతూహలం పెరిగి తలతోపాటు శరీరాన్ని కూడా గొంగళి పురుగుల్లా సాగదీసి తొంగిచూడసాగారు. ఈలోగా పది పదిహేనుమంది పోలీసులు పొడవైన ఫైబర్ ప్లాస్టిక్ కర్రలతో వచ్చి ఇన్స్‌పెక్టర్ సమీపానికి వచ్చి చేరారు. లేళ్లపై లంఘించే సివంగుల్లా నిలబడ్డారు. వారిలో కొంత వయస్సు మీరి బానపొట్ట, గుబురు మీసాలున్న హెడ్ కానిస్టేబుల్-
‘‘ఏంటీ! మీకు పోలీసులంటే భయం, భక్తి లేకుండా పోతోంది.. మా ఇన్స్‌పెక్టర్ దొర గౌరవంగా అడుగుతుంటే మీరంతా గుళ్ళో గుండ్రాయిల్లా నోరు మెదపకుండా వున్నారు’’ అంటూ ఇన్స్‌పెక్టర్‌కు దగ్గరగా వచ్చి-
‘‘దొరా! ఈ లేబర్ జాతికి మన లెవెల్లో ట్రీట్‌మెంట్ ఇస్తే తప్పించి వారంతట వారే ఒప్పుకోవడం జన్మలో జరగని పని’’ అంటూ తన 32 ఏళ్ళ సర్వీసు అనుభవాన్ని రంగరించి సలహా ఇచ్చాడు.
‘‘ఒకే.. ఒకే.. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం!’’ అంటూ తల పైకీ కిందకు ఊపుతూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నంతలోనే...
గుంపులోంచి ఇరవైయేళ్ళకు మించని ఒక బక్కపల్చటి యువతి ధైర్యంగా ముందుకు వచ్చి
‘‘నేనేనండీ! వాణ్ని మొదట చెప్పుతో కొట్టింది’’ అంటూ ఇన్స్‌పెక్టర్ ముఖంలోకి సూటిగా చూసింది.
ఒక్కసారిగా గుమిగూడిన జనంలోనూ, దూరంనుంచి చూస్తున్న ‘గొంగళిపురుగుల్లోనూ’ కలకలం రేగింది.
‘‘నీవొక్కదానివే కాదులే! మీలో కొద్దిమంది గుంపుగా కలిసి దాడిచేశారు. గాయాలతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. కంప్లైంట్‌లో కూడా చాలామంది అటాక్ చేసినట్లు రాశాడు. మిగతా వారెవరో చెప్పు?’’ అని ఇన్స్‌పెక్టర్ ప్రశ్నించాడు ఆ యువతిని, నఖశిఖ పర్యంతం పరిశీలిస్తూ...
ఆ ప్రశ్నకు సమాధానం ఈసారి గుంపులోంచి వచ్చింది. ఒక్కరు కాక ఐదారు మంది మహిళలు ఒకేసారి-
‘‘అవును సారూ! మేమంతా కలిసే ఆ ఎదవ సన్నాసిని రోడ్డుమీదికి లాక్కొచ్చి చితకబాదాము’’ అని చెబుతూ వచ్చి ఆ యువతి పక్కన నిల్చున్నారు.
ఈ పరిణామానికి ఇన్స్‌పెక్టర్‌తోపాటుగా పోలీసులు కూడా ఆశ్చర్యానికి లోనవుతూ ఆ మహిళల వంక చూడసాగారు.
కాసేపటి తరువాత ఇన్స్‌పెక్టర్-
‘‘కానిస్టేబుల్స్! వీరినందరిని అరెస్టు చేసి స్టేషన్‌కు పంపండి’’ అని ఆదేశం జారీ చేసి వచ్చినంత వేగంగా ఆ వీధిలోనుంచి నిష్క్రమించాడు.
రోడ్డుపైన, బాల్కనీమీద, కాంపౌండ్ వద్ద ఎవరికి తోచినట్లు వారుగా ‘అయ్యో పాపం ఆడాళ్ళు!’ అనే కొందరి విచారాలు, ‘వీరితో వచ్చిన న్యూసెన్స్ ఇది’ అనే మరికొందరి కామెంట్లు వ్యక్తమయ్యాయి.
***
‘‘అతన్ని ఎందుకలా కొట్టారు? చట్టాన్ని అలా మీ చేతుల్లోకి తీసుకోవడం నేరమని మీకు తెలియదా ఏం?’’ అని పోలీసు ఇన్స్‌పెక్టర్ తన ఛాంబర్ రివాల్వింగ్ ఛైర్లో అటూ ఇటూ ఊగుతూ ఎదురుగా వరసలో నిల్చున్న మహిళలనుద్దేశించి అన్నాడు.
‘‘ఆ సట్టం ఎవరి సేతుల్లో వుందో, దాన్ని ఎప్పుడు మా సేతుల్లోకి తీసుకున్నామో మాకు తెలవదు ఇన్స్‌పెక్టర్ బాబూ! సదువు, గ్యానం లేనోల్లం’’ ఆ మహిళల్లోని ఓ పెద్దావిడ బదులు పలికింది.
‘‘ఆహా! చట్టం తెలియదు గానీ మనుష్యులపై దాడి చేయడం మాత్రం బాగా తెలుసన్నమాట’’
‘‘వాడు మనిసి కాదు బాబూ! పసువుకన్నా ఈనం. నరికి పోగులు పెట్టాలనే కోపం వచ్చేసింది మాకు’’
‘‘చూడు, మళ్లీ అలానే భయం లేకుండా సమాధానం చెబుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసా!’’
‘‘చమించండి బాబూ!... వాడొక పచ్చి తాగుబోతు. మా వీధిలోనే వుంటాడు. పెతి రోజు తాగొచ్చి మా ఆడాల్లందరిని బండ బూతులు తిడుతుంటాడు. మొన్న రాత్రి తాగిన మైకంలో ఒక పాపపై అగాయిత్తెం చేయబోయాడు. ఆ సమయానికి మేముండబట్డి ఆ ఆడబిడ్డను రచ్చించాము.. మాకు సహనం చచ్చింది’’.
‘‘అలా జరిగుంటే కంప్లైంట్ ఇవ్వాలి. అంతేకాని మీరంతటమీరే తీర్పు చెప్పి శిక్ష వేస్తారా! ఏంటి!.. అలా అయితే మేమెందుకు? ఇక కోర్టులెందుకు?’’
దీనికి సమాధానం ఆ బక్క పల్చటి యువతి చెప్పింది.
‘‘కంప్లైంట్ ఇచ్చామండీ! కావాలంటే అక్కడున్న లాయరుగార్ని అడగండి. ఆయన మా వీధి చివర్లో వుంటాడు. ఆయనే పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేశాడు’’ అంటూ ఆ గ్లాస్ పార్టిషన్ ఛాంబర్ బయటకు చూపించింది.
బయట కొద్ది దూరంలో అరెస్టైన మహిళలకు సాయం చేయడానికి వచ్చిన ఆరేడుమంది పురుషులు నిల్చొని వున్నారు. ఇన్స్‌పెక్టర్ ఊగుతున్న ఛైర్ను హఠాత్తుగా ఆపి ఆ లాయర్ను పిలవమని ఆ అమ్మాయికి చెప్పాడు. ఛేంబర్ డోర్ తెరుచుకొని లోపలికి వచ్చిన లాయరువైపు ఇన్స్‌పెక్టర్ ‘ఓహో! నీవన్నమాట అసలు సూత్రధారివి’ అనే అర్థంలో చూస్తూ...
‘‘ఏంటయ్యా! లాయరైయుండి మీరు వీరికి వత్తాసు పలుకుతున్నావట.. మంచిదేనా! చెప్పండి’’
‘‘ఒక మనిషిగా నాకు చేతనైన సహాయం చేశానండీ! అందులో చెడ్డేమీ నాకు కనిపించలేదు. ఆ తాగిన వ్యక్తి అమ్మాయిని బలాత్కరించిన ముందురోజే మీ త్రీ టౌన్ స్టేషన్‌కు ఫోన్ చేసి ఓ తాగుబోతు గొడవ చేస్తున్నాడని ఇన్ఫాం చేశా. మీ పోలీసులే...’’ అంటూ లాయరు మాట ముగించకముందే ఇన్స్‌పెక్టర్ కల్పించుకొని-
‘‘ప్రతిదానికి పోలీసులను తిట్టడం, భూమీద ప్రతిదానికీ మమ్మల్నే బాధ్యులుగా చేయడం మీలాంటివారికి ఒక ఫ్యాషనైపోయింది. మీ అండ చూసుకొనే వీరిలా ప్రవర్తిస్తున్నారు’’ అంటూ ఆవేశపడ్డాడు.
‘‘సారీ సర్! నేను ఫోన్ చేసిన రోజున సిటీలో ఏదో కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్య సమావేశం వుందనీ.. వీఐపీలు చాలామంది సందర్శిస్తున్నారని.. పోలీసు స్ట్ఫా అంతా బందోబస్తులో వున్నట్లు.. ఎవరూ కుదరదని రెస్పాన్స్ వచ్చింది’’.
‘‘అవునండీ! మాకు ఆ బందోబస్త్ ముఖ్యమా! మీ చిల్లర...’’ అంటూ ఇన్స్‌పెక్టర్ నాలుక్కర్చుకొని, ‘‘మీ వీధి గొడవలు ముఖ్యమా!..వారికేమైనా జరిగితే బాధ్యులు మీరా! మేమా! చెప్పండి’’ అంటూ కోపంతో ఛైర్‌లోంచి కొంచెం పైకిలేస్తూ కేకలేశాడు.
దాంతో ఆ లేడీస్ అంతా ఒక్కసారిగా ‘‘ఏంటి సారూ! లాయరు బాబుపై అరుస్తున్నారు. ఆయన మాకు సహాయంగా వచ్చినందుకా...’’ అని అడిగారు.
వారలా గట్టిగా అడిగేసరికి ఇన్స్‌పెక్టర్ మిన్నకుండిపోయాడు. అంతట టాపిక్ డైవర్ట్ కాకుండా చూడ్డానికి లాయరు కల్పించుకొని -
‘‘లేదండీ! ఇన్స్‌పెక్టర్ గారూ! అప్పటికీ నేను చాలా రిక్వెస్ట్ చేశాను. కనీసం ఎవరో ఒక కానిస్టేబులైనా వచ్చి ఆ వ్యక్తిని సెల్‌లో పెట్టమని అడిగాను. తాగుబోతులను రాత్రిపూట స్టేషన్లో వుంచడానికి వీల్లేదని మీ వాళ్ళు చెప్పారండి’’ అని స్పష్టంచేశాడు.
ఇలా జరిగిన విషయమంతా తేటతెల్లమయ్యేసరికి ఇన్స్‌పెక్టర్‌కు ఏం మాట్లాడాలో పాలుపోలేదు. కాసేపటి తరువాత లాయరు వైపు ఎగాదిగా ఓసారి చూసి-
‘‘అంటే వీరిలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటుంటే మీరు కూడా సమర్థిస్తున్నారన్నమాట’’
దీనికి సమాధానం చెప్పడానికి ఇష్టం లేనట్లుగా లాయరు ఊరకున్నాడు. అయితే ఇంతకుమునుపు మాట్లాడిన పెద్దావిడ జోక్యం చేసుకొని-
‘‘ఇన్స్‌పెక్టర్ బాబూ! మా సంగతలా వుంచండి. ఏ సిచ్చకైనా మేం సిద్ధమే.. కానీ పెభుత్వం వీధి వీధికి మందు దుకానం పెట్టి మనుసులను రాచ్చసులుగా సేత్తోంది. తాగుబోతులేమో సెలరేగిపోతున్నారు. బూ పెపెంచంమీద ఇలా ఉందో లేదో! ఇక్కడ మాత్రం ఇంటా బయటా మాకు నరకం చూపిత్తున్నారు. బరించలేక ఆళ్లను మేం తంతే మీరు సట్టం, సేతులు అంటున్నారు.. మందు దుకానాలన్నీ ఆ ఎమ్మెల్యే బాబువే.. ఎవరికి సెప్పుకోవాలె మా గోస.. ఇంతకీ మీరు సూసేదీ ఎవరి బందోబత్తు బాబూ?.. మా బందోబత్తు మీకక్కరలేనప్పుడు మేమేమి సేయాలో మీరే సెప్పండి. మేం ఇంటాం’’ అంటూ సూటిగా అడిగింది.
చదువులేని కూలీ నాలీ చేసుకునే ఒక మహిళ అలా అడిగేసరికి ఇన్స్‌పెక్టర్ ముఖం నల్లబడిపోయింది. మరేమీ మాట్లాడలేక హెడ్ కానిస్టేబుల్‌ను లోపలికి పిల్చి లాయరు వైపు చూపిస్తూ-
‘‘ఈయనతో పర్సనల్ జామీను తీసుకొని వీరిని పంపించేయండి’’ అని చెబుతూనే మరోవైపు లాయరునుద్దేశించి-
‘‘ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేస్తాము. కోర్టుముందు చెప్పుకోండి మీ గొడవంతా.. మాకెందుకు ఈ తలనొప్పులన్నీ..’’ అని పలికి కుర్చీలోంచి లేచి సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ విసవిస వెళ్లిపోయాడు. రివాల్వింగ్ ఛైరు కిర్రు కిర్రుమంటూ కాసేపు ఊగి నిలిచిపోయింది.
***
ఇదంతా జరిగిన నెలన్నర తర్వాత ఓ ఉదయాన ఆ వీధిలో ఒక అసాధారణ దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ అట్టడుగు మహిళల పెద్ద గొంపొకటి గడప గడపకు వెళ్లి పలకరించడం కనిపించింది. ప్రతి ఇంట్లోని స్ర్తిలందరిని పేరు పేరున పిలుస్తూ నుదుట కుంకుమబొట్టెడుతూ-
‘‘కోర్టునుండి సమన్లు వచ్చాయండీ! వాయిదాలకు హాజరవ్వాలట.. జడ్జిమెంటు చెబుతారట.. ఆడాళ్లందరం కలిసి వెళ్తున్నాం. మీరు కూడా తప్పక రావాలి’’ పేరంటానికి రమ్మన్నట్లుగా ఆహ్వానిస్తున్నారు. ఆ సమయానికి కోర్టుకు వెళ్లడానికి లాయరు ఇంట్లోనుంచి బయటకు వచ్చి బైకు తీయబోతుంటే ఆ మహిళల గుంపు ఎదురైంది. విషయం తెలుసుకొని సంతోషపడుతూ-
‘‘ఎప్పుడో రాబోయే ఆ జడ్జిమెంట్‌తో పనేముంది. చెప్పాల్సిన తీర్పునేదో మీరే ప్రకటించి శిక్ష కూడా అమలు చేశారుగా’’ అని మనస్సులోనే అనుకున్నాడు.
*

-ఎస్.జి.జిజ్ఞాస
రచయిత సెల్ నెం:9063787259

-ఎస్.జి.జిజ్ఞాస