ఈ వారం స్పెషల్
‘కల్తీ’ కల్లోలం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వారాంతపు సెలవుల్ని ఎంజాయ్ చేద్దామని భార్యాపిల్లలతో సిటీకి వెళ్లిన ఆనంద్- అక్కడ వారిని ఓ ఖరీదైన హోటల్‌కు తీసుకెళ్లాడు.. హోటల్‌లో నోరూరించే వంటకాలు, కళ్లుచెదిరే రంగుల్లో రకరకాల మిఠాయిలు.. హోటల్‌లో నచ్చినవన్నీ ఆరగించి రోడ్డుపై అలా తిరుగుదామని వెళితే- ఎటు చూసినా నిగనిగలాడే పండ్లు, తాజాదనం ఉట్టిపడేలా కూరగాయలు.. షాపింగ్ మాల్‌కు వెళితే- ఆకట్టుకునే ప్యాకెట్లలో రెడీమేడ్ ఫుడ్, కొనితీరాలనిపించేలా ఐస్‌క్రీములు, శీతల పానీయాలు.. పిల్లలు మారాం చేస్తున్నారనో, ఇంటికి అవసరమనో నచ్చినవన్నీ కొని ఇంటికి తీసుకెళ్లి తిన్న తర్వాత- ఇక అందరికీ అనారోగ్య సమస్యలే.. ఇది ఒక్క ఆనంద్ కుటుంబం ఎదుర్కొన్న చేదు అనుభవమే కాదు. కల్తీ ఆహార పదార్థాలను గుర్తించలేక అనునిత్యం ఎంతోమంది అనారోగ్యాన్ని ‘కొని’తెచ్చుకుంటున్నారు. జేబులు గుల్ల చేసుకుని ఇబ్బందుల పాలవుతున్నారు.
***
ఉదయానే్న లేచి చక్కగా స్నానం చేసి ముఖానికి ఫేస్‌క్రీమ్ రాసుకుంటున్నారా? అయితే, ఒక్క క్షణం నిదానంగా ఆలోచించండి. మీరు వాడే క్రీమ్ అసలైనదో, నకిలీదో నిర్ధారించుకోండి. ఎందుకంటే- సౌందర్య పోషణకు వాడే ప్రముఖ ఫేస్‌క్రీమ్‌లకు సంబంధించి నకిలీల దందా మార్కెట్లో నిరాటంకంగా సాగుతోంది. ముంబైలో తయారై దేశవ్యాప్తంగా దుకాణాల్లో అమ్ముడవుతున్న నకిలీ ఫేస్‌క్రీమ్‌లను గుర్తించడం కష్టసాధ్యమే.
***
నిగనిగలాడుతూ, చూడగానే కొనాలనిపించే ‘కేసరి పప్పు’ను ఎక్కడబడితే అక్కడ విక్రయిస్తున్నారు. కందిపప్పులా కనిపించే ‘కేసరి పప్పు’ విక్రయాలను 1961లోనే కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆరోగ్యానికి చేటు తెచ్చే కేసరి పప్పును నిషేధించి దశాబ్దాలు గడుస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. పల్లెలు, నగరాలనే తేడా లేకుండా దీన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఒకప్పుడు పశువులకు దాణాగా ఉపయోగించే కేసరి పప్పులో హానికారక రసాయనాలెన్నో ఉన్నాయి.
***
ఇప్పుడు పప్పులు ఖరీదైనవే కాదు.. ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా పరిణమించాయి. ఎంత డబ్బు పోసినా నాణ్యమైన పప్పులు లభించని పరిస్థితి నెలకొంది. పప్పులు, పండ్లు, కూరలే కాదు. ఇప్పుడు మార్కెట్‌లో కల్తీకాని సరకులే కనిపించడం లేదు. నెయ్యి, నూనెలు, సౌందర్య ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, మిఠాయిలు, శీతల పానీయాలు, పచ్చళ్లు, పాలు, నీళ్లు.. ఇలా ఏది చూసినా కల్తీమయమే. కల్తీలు, నకిలీల నివారణకు పలు ప్రభుత్వ శాఖలున్నా నామమాత్రంగా కేసులు పెట్టడం తప్ప అక్రమ వ్యాపారాలకు తెరపడడం లేదు. తూనికలు-కొలతలు, పౌరసరఫరాలు, కల్తీ నిరోధక శాఖ, విజిలెన్స్ , పోలీసు, వాణిజ్యపన్నుల శాఖ.. ఇలా ఎనె్నన్నో ప్రభుత్వ విభాగాలు ఉన్నా కల్తీలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవు. హైదరాబాద్‌లోని ఒక్క బేగం బజార్‌లోనే ప్రతి రోజూ సుమారు వంద కోట్ల రూపాయల మేరకు వ్యాపార లావాదేవీలు జరుగుతుంటాయి. ఇక్కడ హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు 700 మంది వరకూ ఉన్నారు. ‘జీరో బిజినెస్’ చేస్తూ కొందరు వ్యాపారులు కోట్లలో టర్నోవర్ చేస్తున్నారు. కల్తీ సరుకులు విక్రయించే కొంతమంది వల్ల మొత్తం బేగం బజార్‌కే చెడ్డపేరు వస్తోందని మిగతా వ్యాపారులు ఆందోళన చెందుతున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. కల్తీలు, నకిలీలను తాము వ్యతిరేకిస్తామని వ్యాపారుల సంఘాలు ప్రకటిస్తున్నా అక్రమార్కులను నియంత్రించే వారే కనపడరు.
వారికి లాభం.. వీరికి రోగం..
ఎంత సంపాదించినా ఖర్చు విషయంలో ఆహార పదార్థాలకే మనం అధిక ప్రాధాన్యం ఇస్తాం. తిండి విషయంలో రాజీ పడితే బతుకుబండి సాగదు గనుక నాణ్యమైన పండ్లు, కూరలు, పప్పులు, నూనెలు, బియ్యం, ఇతర పదార్థాలు కొనాలని అందరూ భావిస్తారు. ఈ భావనే కల్తీ వ్యాపారులకు బలంగా మారుతోంది. అధిక లాభాలకు ఆశపడి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, నాసిరకం వస్తువులు కలిపి కొందరు వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. సాధారణ ప్రజలే కాదు, చదువుకున్నవారు సైతం ఆహార పదార్థాల్లో కల్తీ జరిగిన విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఒకప్పుడు మా మిడి పండ్లను మగ్గించేందుకు మాత్రమే కార్బయిడ్ వంటి విషపూరిత రసాయనాలు వినియోగించేవారు. ఇప్పుడు అన్ని రకాల పండ్లను రసాయనాలతో కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. దీంతో ఏ పండ్లను కొనాలన్నా జనం భయపడే పరిస్థితి నెలకొంది. దీర్ఘకాలంగా కల్తీ ఆహార పదార్థాలను తినడం, పానీయాలను సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం. కల్తీ ఆహార పదార్థాలు, పండ్లను తినడం వల్ల క్యాన్సర్లు, ఉదరకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మహిళల్లో గర్భస్రావాలు, పిల్లల్లో ఎదుగుదల లోపించడం, వృద్ధుల్లో నిద్రలేమి, అలసట వంటి అనారోగ్యాలు అనివార్యమవుతాయి. జీవన ప్రమాణాలపై కూడా కల్తీ ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. జంతు కళేబరాలతో వంటనూనెలు, యూరియా వంటి రసాయనాలతో పాలు, హానికారక పదార్థాలతో నెయ్యి, కృత్రిమంగా మగ్గబెట్టిన పండ్లు.. ఇలా కల్తీ సర్వాంతర్యామి అయిపోయింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో ఓ వ్యాపారిని అరెస్టు చేసి 20,700 కిలోల నాసిరకం పప్పులను స్వాధీనం చేసుకోవడం, విజయవాడ పరిసరాల్లో 14 డెయిరీలపై అధికారులు ఆకస్మిక దాడులు జరిపి భారీ స్థాయిలో కల్తీ నెయ్యిని కనుగొని సంబంధిత యజమానులకు 27 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ లైసెన్స్‌లను రద్దు చేయడాన్ని చూస్తుంటే- ఆహార పదార్థాల్లో కల్తీ ఎంత జోరుగా సాగుతోందో అవగతమవుతుంది. మరోవైపు న్యాయస్థానాలు ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కాల్షియం కార్బైడ్‌ను వినియోగించి పండ్లను కృత్రిమంగా మగ్గబెడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రెండు నెలల క్రితం ఆదేశించినా సంబంధిత అధికారుల స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ‘కల్తీ వ్యాపారులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరం’ అని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినా, కల్తీ నిరోధానికి ప్రభుత్వ శాఖలు చిత్తశుద్ధితో కృషి చేస్తున్న దాఖలాలు లేవు.
నషాళానికి అంటే మసాలా..
వంటల్లో ఘాటైన వాసన కోసం, మంచి రుచి కోసం మిరియాలు, గసగసాలు, జీలకర్ర, పసుపు, లవంగాలు, యాలకులు, ఇతర సుగంధ ద్రవ్యాలను వాడుతుంటాం. వీటిలో కల్తీ జరుగుతున్నా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఎండబెట్టిన బొప్పాయి విత్తనాలను మిరియాల్లోను, జీలకర్రలో ‘సోంపు’ను కలుపుతున్నారు. బొప్పాయి గింజలు మిరియాల్లా కనిపించేందుకు బ్లాక్ ఆక్సైడ్‌ను కలిపి ఎండలో ఆరబెడతారు. పసుపులో తవుడు, టీ పొడిలో రంపపు పొట్టు, కారంలో చౌకరకం పౌడర్లు కలుపుతున్నారు. కల్తీ మసాలా దినుసులను విక్రయించేందుకు నగరాల్లో అయితే కొందరు అక్రమార్కులు భారీ గౌడౌన్లను నడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో కూలీలను పెట్టుకుని కల్తీ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటున్నారు. ఢిల్లీ వంటి ప్రాంతాల నుంచి తక్కువ ధరకు యాలకులు, జీలకర్ర, సోంపు, గసగసాలను దిగుమతి చేసుకుంటారు. వీటిలో కలిపేందుకు గోధుమ రవ్వ, మైదాపిండి, జిగురు, రెడ్ బ్లాక్ యాక్సైడ్, పెయింట్స్, ఇతర రసాయనాలను స్థానికంగా కొనుగోలు చేస్తారు. కర్నాటక, ఉత్తర ప్రదేశ్ నుంచి బొప్పాయి విత్తనాలు, రంగులు తెప్పిస్తుంటారు. కల్తీ మసాలాల తయారీకి పిండిమరలు, కంకర మిషన్ తరహాలో పలు యంత్రాలను ఉపయోగిస్తారు. గసగసాల్లో గోధుమ రవ్వ, మిరియాల్లో బొప్పాయి గింజలు బాగా కలిసిపోయేలా యంత్రాలను వాడతారు. మంచి గిరాకీ ఉంటుంది గనుక యాలకులు, మిరియాలు, గసగసాలు, జీలకర్రకు సంబంధించి భారీగా కల్తీ జరుగుతోంది. వీటి విక్రయాల్లో లాభాలు కూడా కళ్లు చెదిరేలా ఉంటాయి. ఢిల్లీ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి తెప్పించే యాలకులను నీళ్లలో నానబెట్టి, అవి బాగా ఉబ్బాక ఎండలో ఆరబెడతారు. కంటికి ఇంపుగా కనబడేలా వాటికి జిగురు పూస్తారు. అలాగే, తక్కువ ధరకు తెచ్చిన జీలకర్రలో ‘సోంపు’, మైదాపిండి కలుపుతుంటారు. మైదా వల్ల మరీ తెల్లదనం ఎక్కువైందని అనిపిస్తే నల్లగా కనిపించేందుకు పెయింట్ కలుపుతారు. ఎండలో ఆరబెట్టాక ఈ జీలకర్రలో పెయింట్ కలిసిందని గుర్తించడం చాలా కష్టం.
గసగసాల్లో గోధుమరవ్వ కలిపాక, తెలుపుదనం కోసం పెయింట్ కలిపి ఆరబెడతారు. సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ధరలను చూసి అవి కల్తీవో, నికార్సయినవో గుర్తుపట్టే వీలుంది. మార్కెట్‌లో మసాలా దినుసుల ధరలు, కల్తీ దినుసుల ధరలకు చాలా వ్యత్యాసం ఉంటోంది. నాణ్యమైన మిరియాల ధర కిలోకు 800 రూపాయలుంటే, కల్తీ మిరియాల ధర 450 రూపాయలుంటుంది. అసలైన యాలకుల ధర కిలోకు 800 నుంచి 1200 వరకూ ఉంటే, నాసిరకం యాలకులు 450 రూపాయలకే దొరుకుతాయి. గసగసాలు మంచివి కిలో 600 రూపాయలకు, నకిలీవైతే 300 రూపాయలకు లభిస్తాయి. మంచి జీలకర్ర కిలో ధర 250 ఉంటే నకిలీ సరకు ధర 100 రూపాయలుగా ఉంటోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతయ్యే నాసిరకం సరకులపై తగినంత నిఘా ఉంచితే కల్తీ దందా కొంతవరకూ తగ్గే అవకాశం ఉన్నా, సంబంధిత అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదన్నది కాదనలేని కఠోర వాస్తవం. ఢిల్లీతో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన వ్యాపార కేంద్రాలకు నాసిరకం సుగంధ ద్రవ్యాలు భారీగా దిగుమతి అవుతున్నట్లు తెలిసినా, అడపా దడపా కేసులు పెట్టడం తప్ప అక్రమ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించడం లేదు.
ఇక, మిరియాలు ఆకర్షణీయంగా కనపడేలా వాటిపై హానికారక నూనెలను ‘స్ప్రే’ చేస్తుంటారు. ఈ నూనెల వల్ల క్యాన్సర్లకు లోనయ్యే అవకాశాలు ఎక్కువని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. కల్తీ సుగంధ ద్రవ్యాలు హోల్‌సేల్ మార్కెట్లలో ప్రతిరోజూ వందలు, వేల కిలోల్లో అమ్ముడవుతాయి. మార్కెట్ నుంచి కిరాణా దుకాణాలకు, అటు నుంచి ఇళ్లకు, హోటళ్లకు ఇవి చేరుకుంటాయి.
కార్బైడ్ + కలర్+ జిగురు= ప్లేటులో విషం!
‘మెరిసేదంతా బంగారం కానట్లే’ నిగనిగలాడుతూ నోరూరించే పండ్లన్నీ తినడానికి పనికిరావని ప్రజలు గమనించాల్సిన రోజులివి. రసాయనాలతో మామిడి పండ్లను రాత్రికి రాత్రి కృత్రిమంగా మగ్గపెడుతున్నారని తెలిసి కొనే్నళ్లుగా జనం వాటికి జోలికి వెళ్లడం తగ్గించుకున్నారు. అయితే, ఇపుడు అన్ని రకాల పండ్లను, కూరగాయలను కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో తెల్లారేసరికి మగ్గబెడుతూ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఆపిల్, పుచ్చకాయలు, అరటి, సపోటా, ఆరంజ్.. ఇలా అన్ని రకాల పండ్లు ఆకర్షణీయంగా కనిపించేందుకు కార్బైడ్‌తో పాటు పలురకాల రంగులు, జిగురు యథేచ్ఛగా వాడుతున్నారు. ఈ పండ్లు పైకి నిగనిగలాడుతున్నా- లోపల అంతా పచ్చిపచ్చిగా ఉంటుంది. రుచి సంగతి దేవుడెరుగు..! విషపూరిత రసాయనాల ప్రభావంతో మన ఆరోగ్య వ్యవస్థ దెబ్బతినడం ఖాయం. ముంబై వంటి మహా నగరాల్లో డజను మామిడి పండ్ల ధర 400 రూపాయలుంటే.. కిలో మామిడి జ్యూస్ కే వలం అరవై రూపాయలకు విక్రయిస్తున్నారంటే నమ్మడం కష్టమే. అంటే మామిడి జ్యూస్‌లో ఎంత మేరకు కల్తీ జరుగుతోందో ఇట్టే ఊహించవచ్చు. ఇలాంటి నాసికరం జ్యూస్ తాగడం వల్ల కడుపునొప్పి, కాలేయ సమస్యలు, జీర్ణవ్యవస్థకు ఆటంకం వంటివి తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లపై వాడే రసాయనాల ఫలితంగా తలనొప్పి, నిద్రలేమి, బద్ధకం, కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. పలురకాల పండ్లే కాదు, టమాటా, క్యారట్ వంటి కూరగాయాలూ రసాయనాల బారిన పడుతున్నాయి. నిత్యావసర సరకులే కాదు.. ‘ఆరోగ్యానికి హానికరం’ అని ప్రభుత్వం ప్రకటించిన పాన్ మసాలాలు, గుట్కాల్లో అయితే కల్తీకి అంతూపొంతూ లేదు.
ఇదో అంటువ్యాధి..
పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరకులు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య ఉత్పత్తులు.. ఇలా ‘కల్తీ భూతం’ అడుగుపెట్టని రంగం లేదు. నేడు ఇది దేశవ్యాప్తంగా భయంకరమైన అంటువ్యాధిలా విస్తరించింది. ప్రజలు అనునిత్యం తప్పనిసరిగా వాడే బియ్యం, గోధుమలు, నూనెలు, పాలు, మిర్చి, పసుపు, ప్యాకేజీ ఫుడ్, శీతల పానీయాలు, మినరల్ వాటర్.. ఇలా అన్నీ కల్తీమయం కావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏది ఎలా కల్తీ అవుతుందో ప్రజలు తెలుసుకోలేని అయోమయ పరిస్థితి రాజ్యమేలుతోంది. పండ్లు, ఆహార పదార్థాలు, తినుబండారాల్లో నాణ్యతను పరీక్షించేందుకు దేశవ్యాప్తంగా లేబొరెటరీలు ఉన్నా, నామమాత్రంగా ‘శాంపిల్స్’ సేకరించి మొక్కుబడిగా కేసులు పెట్టడం తప్ప కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. అధికారుల అవినీతి, రాజకీయ నాయకుల అండదండలు, కేసుల విచారణలో జాప్యం వంటి కారణాలతో ‘కల్తీ దందా’ నిరాటంకంగానే కొనసాగుతోంది.
ఏటా 2.2 మిలియన్ల మంది మృతి..
కల్తీ ఆహార పదార్థాల వల్ల రోగాల బారిన పడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2.2 మిలియన్ల మంది మరణిస్తున్నారని, వీరిలో చిన్నపిల్లల సంఖ్య అధికంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఇదివరకే తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. క్షేమకరం కాని ఆహార పదార్థాలతో పలురకాల బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు, విషపూరిత రసాయనాలు మన శరీరాల్లోకి చేరుతున్నాయి. కల్తీ ఆహారం ఫలితంగా డయేరియా, క్యానర్లు వంటి 200 రకాల వ్యాధులు విజృంచడంతో ప్రజారోగ్య వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోంది. వైరస్‌లు, రసాయనాల ప్రభావం లేని విధంగా నాణ్యమైన ఆహార పదార్థాలు అందేలా ఈ ఏడాది ‘ఆహార భద్రత’ నినాదాన్ని పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ఈ లక్ష్యం నెరవేరేలా ప్రభుత్వాలు, పౌర సమాజాలు, స్వచ్ఛంద సంస్థలు చొరవ చూపాలని డబ్ల్యుహెచ్‌ఓ సూచించింది. ఆహార పదార్థాల ఉత్పత్తి, నిల్వ, సరఫరా, విక్రయం అనే విషయాలు అత్యంత కీలకమైనవని, ఏ స్థాయిలోనూ కల్తీకి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటే ప్రజారోగ్య వ్యవస్థకు విఘాతం కలగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు కొన్ని సూచనలు చేశారు. రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల ప్రభావం లేకుండా వ్యవసాయోత్పత్తులను విక్రయించాలి. ప్యాకేజీ ఫుడ్ తయారీ, నిల్వలో ప్రమాణాలు పాటించాలి. వినియోగదారులు కూడా వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. శుభ్రత, నాణ్యత ప్రాతిపదికగా ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి.
ఒకప్పుడు పాలల్లో నీళ్లు కలిపితే అయ్యో...కల్తీ జరిగిందని వాపోయేవారు. ఇప్పుడు పాలల్లో నీళ్లకు బదులు ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నారు. సింథటిక్ పాలు అలాంటివే. కనుక వినియోగదారులు జాగ్రత్తగా లేకపోతే మోసపోవడం, రోగాలపాలవడం ఖాయం. మోసగించేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మోసపోకుండా ఉండటం వినియోగదారుడి తెలివిపై ఆధారపడి ఉంటుంది. అప్పుడే మీ ఇంట కల్తీకల్లోలం రేపదు.
*
కల్తీ ఇలా.. కనిపెట్టేది ఎలా..?
కలియుగంలో కల్తీలేని పదార్థాలు దొరకడం కష్టం. వినియోగదారుడే తెలివిగా వ్యవహరించి కల్తీలేని సరుకులు కొనుక్కోవాలి. మనం తినే ఆహారం కల్తీ వస్తువులతో తయారైనదైతే చేజేతులా మన ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నవాళ్లమవుతాం. అందుకే మనం నిత్యం వాడే పదార్థాల్లో సాధారణంగా కల్తీ ఎలా జరుగుతోందో, వాటివల్ల కలిగే నష్టాలేమిటో, వాటిని కనిపెట్టడం ఎలాగో తెలుసుకోవాలి.
ఇదిగో.. ఇక్కడ చూడండి కొన్ని విశేషాలు...
పాలు
* డిటర్జెండ్ పౌడర్, యూరియా, సింథటిక్ మిల్క్‌తో కల్తీ చేస్తారు.
* కొద్దిపాలలో అంతే మొత్తం నీళ్లు కలిపితే డిటర్జంట్ కలిపిన విషయం తెలిసిపోతుంది. పాలను వెచ్చపెడితే పసుపు వర్ణంలోకి మారినా, తాగినప్పుడు చేదుగా ఉన్నా అవి సింథటిక్ పాల కల్తీ జరిగినవని తెలుసుకోవచ్చు.
* కల్తీపాలు తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. కేన్సరుకు దారితీయొచ్చు.
తేనె
* పంచదార, బెల్లం పాకం కలిపి కల్తీ చేస్తారు.
* పట్టుపీలికపై తేనె వేస్తే అంటుకోకుండా జారిపోతే అది అసలు తేనె. అంటుకుంటే అది కల్తీ జరిగినట్టే. తేనెలో ముంచిన అగ్గిపుల్లను వెలిగిస్తే వెంటనే మండితే అది అసలు తేనె. కల్తీది అయితే ఆ పుల్ల వెలగదు లేదా చిన్నచిన్న శబ్దాలతో ఆరి వెలుగుతుంది.
* అజీర్తి సమస్య రావొచ్చు. గ్లూకోజ్ పరిమాణం అమాంతం పెరిగి మధుమేహ బాధితులకు సమస్యగా మారుతుంది.
ఐస్‌క్రీమ్
* పిల్లలు, కుర్రకారు ఎక్కువగా ఇష్టపడే ఐస్‌క్రీమ్‌లోనూ కల్తీ జరుగుతోంది. వాషింగ్ పౌడర్‌ను ఇందులో కల్తీచేస్తూంటారు.
* అనుమానం వస్తే కొద్దిగా ఐస్‌క్రీమ్‌పై నిమ్మరసం పిండండి. నురగ, బుడగలు వస్తే అది కల్తీ జరిగినట్టే
* కల్తీ ఐస్‌క్రీమ్‌లు తింటే ఉదర, కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయి.
టీ పొడి
* చక్కటి రంగుకోసం బొగ్గు, తారుతో కూడిన రంగులు వాడతారు.
* తెల్లటి బ్లాటింగ్ పేపర్‌పై టీపొడి జల్లి ఐదు నిమిషాల తరువాత చూస్తే వాటిపై రంగు మచ్చలు ఏర్పడితే అది కల్తీ జరిగినట్లే.
* నిషేధిత రంగులు వాడిన పొడిని ఉపయోగిస్తే కేన్సర్ రావొచ్చు.
ఉప్పులోనూ...
* సాధారణ ఉప్పులో సుద్దపొడి, అయొడైజ్డ్ ఉప్పులో సాధారణ ఉప్పు కల్తీ చేస్తారు.
* ఉప్పు కలిపిన నీళ్లను వేడిచేస్తే సుద్దపొడి పైకి తేలిపోతుంది. బంగాళదుంప ముక్కపై అయొడైజ్డ్ ఉప్పు జల్లి, కొద్దిగా నిమ్మరసం కలిపి వేచిచూడాలి. ఆ దుంపపై నీలిమచ్చలు ఏర్పడితే అది కల్తీ జరగనట్లు లెక్క.
* అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.
యాపిల్స్
* తళతళ మెరుస్తూ కన్పిస్తే- ఆ యాపిల్ పళ్లకు మైనం పూశారని అర్థం. సహజ సిద్ధంగా పండిన యాపిల్స్ దోరగా ఉంటాయి తప్ప ఎలాంటి మెరుపు ఉండదు.
* పండును నిశితంగా పరిశీలిస్తే మైనం పూత తెలిసిపోతుంది. తొక్కతీసే ప్రయత్నం చేస్తే మరీ స్పష్టంగా రూఢీ అవుతుంది.
* వాక్స్ పూసిన యాపిల్స్ తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతిని అల్సర్లు ఏర్పడతాయి. ఎసిడిటీ సమస్య వస్తుంది.
నల్ల మిరియాలు
* ఎండబెట్టిన బొప్పాయి గింజలు కలుపుతారు.
* డిస్టిల్డ్‌వాటర్‌లో గింజలు వేస్తే కొద్దిసేపటికి బొప్పాయి గింజలు పైకి తేలుతాయి. మిరియాలు అడుగుకు చేరతాయి.
* కాలేయ, ఉదర సంబంధ వ్యాధులు వస్తాయి.
అరటి, మామిడి
* వీటిని మగ్గబెట్టి పండేలా చేయడానికి కాల్షియం కార్బైడ్ వాడతారు.
* అరటిపండు పచ్చగా ఉన్నా మొదట్లో ఉండే తొడిమె పసిమి ఛాయతోకాకుండా ఆకుపచ్చగా ఉంటే అది సహజ సిద్ధంగా పండినది కాదని అర్థం. మామిడి అయితే పండు అంతా ఒకేరంగులా ఉన్నా, ఉపరితలంపై ఆకుపచ్చటి మచ్చలు మిగిలినా అవి కృత్రిమంగా పండించినవని తెలుసుకోవచ్చు.
* ఇలాంటి పళ్లు తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతిని, కేన్సరు రావచ్చు.
మిర్చిపొడి
* మరీ ఎర్రగా, పొడిపొడిగా ఉంటే కల్తీ జరిగిందని అనుమానించవచ్చు. సాధారణంగా కర్రపొట్టు, నిషేధిత రంగు, ఇటుకల పొడి కలిపి మోసం చేస్తూంటారు.
* మిర్చిపొడిని కొంత తీసి నీళ్లలోవేస్తే ఇటుకల పొడి నీటి అడుగుల చేరుతుంది. రంగు వదిలిపోతుంది. అసలు కారం నీళ్లపై తేలుతుంది.
* కల్తీ కారప్పొడి తింటే దృష్టిదోషాలు, జీర్ణవ్యవస్థ దెబ్బతినడటం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి.
కూరగాయలు
* కాకర, బెండ, పచ్చిమిర్చి వంటి ఆకుపచ్చటి కూరగాయలు నిగనిగలాడుతూ కన్పించేందుకు కొన్ని నిషేధిత రంగులు వాడతారు.
* అనుమానం వస్తే వాటి ముక్కలను తెల్లటి బ్లాటింగ్ పేపర్‌పై వేసి చూస్తే రంగుల మచ్చలు ఏర్పడితే మోసం జరిగినట్లే.
ప్రాసెస్‌డ్ ఫుడ్
* టిన్‌లు, ప్యాకింగ్‌లలో నిల్వ ఉంచి అమ్మే పదార్థాలలో వాడే కొన్ని రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
* బ్రెడ్, పాస్ట్రా, చేపలు, కేకులు, కుకీలు, మాంసాహార ఉత్పత్తులు నిల్వ చేయడానికి అధికమొత్తంలో సోడియం బెంజోట్, ఫాస్పరిక్ యాసిడ్, బోరిక్ యాసిడ్, కాల్షియం, పొటాషియం, సోడియం సాల్ట్స్ వాడతారు.
* కిడ్నీలు, ఊపిరితిత్తులు, వెనె్నముక, వృషణాలు, హృదయ సంబంధ వ్యాధులు రావొచ్చు. కిడ్నీ, బిపి, మధుమేహ రోగులు వీటికి దూరంగా ఉండాలి.