అంతర్జాతీయం
యావత్ ప్రపంచం ఆంక్షలమయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బార్సిలోనా, మార్చి 15: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేక ప్రపంచ దేశాలు కకావికలవుతున్నాయి. దాదాపు అన్ని దేశాలను కమ్ముకుని ఈ వైరస్ ఇప్పటివరకు దాదాపు 6వేల మందిని బలిగొంది. ప్రపంచవ్యాప్తంగా 1.50 లక్షలకు పైగా ఈ ప్రాణాంతక వ్యాధి సోకి అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ధనిక, పేద అన్న తేడా లేకుండా అన్ని దేశాలు ఈ వైరస్‌పై అహరహం పోరాడుతున్నాయి. బిలియన్లకొద్దీ డాలర్లు గుమ్మరించి నివారణ, నిరోధక చికిత్సా విధానాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతున్నాయి. ఇన్ని చర్యలు చేపడుతున్నా ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతూనే ఉంది. ఈ వ్యాధి అంకురించిన చైనాతోపాటు అన్ని దేశాల్లోనూ తాజాగా అనేక మరణాలు సంభవించాయి. పరిస్థితి ఎప్పటికప్పుడు తీవ్రమవుతూ ఉండడంతో అనూహ్య రీతిలో అన్ని దేశాలూ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఎలాగైనాసరే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టి తదుపరి మరణాలు సంభవించకుండా శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. స్పెయిన్ ప్రభుత్వం తమ ప్రజలందర్నీ ఇళ్లకే పరిమితం చేసిన నేపథ్యంలో అనేక దేశాలు ఇదే బాట పడుతున్నాయి. నిన్నమొన్నటివరకు ఈ వైరస్‌ను తేలిగ్గా పరిగణించిన అమెరికా ఇది ముదిరిపోవడంతో దేశమంతా వైద్యపరంగాను, ఇతరత్రాను విస్తృత చర్యలు చేపట్టింది. ఐరోపా నుంచి ప్రయాణికులెవరూ తమ దేశంలోకి రాకూడదని నిషేధం విధించిన అగ్రరాజ్యం దీనిని బ్రిటన్, ఐర్లాండ్‌లకు కూడా విస్తరించింది. ప్రజలు ఎక్కడా పెద్ద సంఖ్యలో గుమికూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. న్యూజెర్సీలోని ఓ పట్టణంలోనైతే రాత్రి పూట కూడా కర్ఫ్యూ విధించారు. ఇతర దేశాల నుంచి ఏ విమానం వచ్చినా కూడా అందులోని ప్రయాణికులను చైనా ప్రభుత్వం ఆమూలాగ్రం పరీక్షిస్తోంది. అనంతరమే వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తోంది. మొదటల్లో చైనాకే పరిమితమైనప్పటికీ ఈ వైరస్ పశ్చిమ ముఖం పట్టి, ఇటు ఐరోపా, అటు ఉత్తర అమెరికాలను గంగవెర్రులెత్తిస్తోంది. తాజాగా స్పెయిన్ ప్రధానమంత్రి ఫెడ్రో శాంచెజ్ భార్యకు కూడా ఈ వైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. అయితే ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే స్పెయిన్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు ఈ వైరస్‌కు లోనైన విషయం తెలిసిందే. పరిస్థితి తీవ్రం కావడంతో ఆహారం, మందులను కొనేందుకు తప్ప స్పెయిన్‌లో
ప్రజలెవర్నీ బయటకు రానివ్వడంలేదు. ఆసుపత్రులు, బ్యాంకులు, విధులకు వెళ్లేందుకు మాత్రమే పరిమితంగా అనుమతిస్తున్నారు. ఇప్పటికే స్కూళ్లు, వర్సిటీలు, రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు అన్నింటినీ స్పెయిన్ ప్రభుత్వం మూసేసింది. చైనా తర్వాత అత్యధిక స్థాయిలో ఈ వైరస్ మరణాలు సంభవించింది స్పెయిన్‌లోనే. అయితే ఈ వైరస్ లక్షణాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి చూశాయి. వృద్ధులు, ఇప్పటికే అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో ఇది న్యుమోనియా సహా అనేక తీవ్ర వ్యాధులకు దారితీయవచ్చునని చెబుతున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఆదివారంనాడు ఆంక్షలను మరింత తీవ్రం చేశారు. అన్నిరకాల ప్రదర్శనలను రద్దు చేశారు. దాదాపు స్పెయిన్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రజలను ప్రభుత్వం ఇళ్లకే పరిమితం చేసింది. కాగా, ఇప్పటికే వైరస్ కేసులు తీవ్రం కావడంతో అనేక దేశాల ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలే పరిస్థితి తలెత్తింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలకు చికిత్స చేయాల్సిన అవసరం ఈ దేశాలకు ఎప్పుడూ రాకపోవడంతో అవి దాదాపుగా చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. అందుకే కొత్తగా ఈ వైరస్ వ్యాపించకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా అన్ని దేశాలూ ప్రయత్నిస్తున్నాయి. ప్యారిస్ సహా అనేక ప్రధాన నగరాలు పర్యాటకుల రాకపై నిషేధం విధించాయి. ఆదివారం నుంచి దేశంలో రెస్టారెంట్లు, కేఫ్‌లు, థియేటర్లు తదుపరి ఆదేశాల వరకు పనిచేయవని ఫ్రాన్స్ ప్రకటించింది. ఐరోపా దేశాల్లో అత్యంత తీవ్రంగా ఈ వైరస్‌కు గురైన ఇటలీలో మరణాల సంఖ్య 1,400కు పెరిగింది. ఈ వ్యాధి సోకినవారి సంఖ్య రాత్రికిరాత్రే 20 శాతం పెరిగి 21 వేలకు చేరుకుంది. బయటకు రావద్దని, పెద్ద సంఖ్యలో గుమికూడవద్దన్న ఆదేశాలను ప్రజలు విస్మరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బ్రిటన్‌లో మరణాల సంఖ్య 21కి పెరిగితే, వైరస్ సోకినవారి సంఖ్య 1,100 దాటింది. ఐర్లాండ్‌లో 90 మందికి ఈ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు. ఇరాన్‌లో తాజాగా మరో 113 మంది మరణించారు. దీంతో వైరస్ మృతుల సంఖ్య 724కు చేరుకుంది. ప్రజలెవరూ బయటకు రావద్దని ఇరాన్ ప్రభుత్వం కూడా ఆంక్షలు విధించింది. డెన్మార్క్ సహా అనేక దేశాలు సరిహద్దులు మూసేశాయి. సహేతుకమైన కారణం లేకపోతే ఎవర్నీ దేశంలోకి అనుమతించడంలేదు. పోలాండ్ కూడా ఇదేతరహా చర్యలను చేపట్టింది. నార్వే-పోలాండ్‌లతో తమ సరిహద్దులను మూసేస్తున్నామని రష్యా ప్రకటించింది. తమ దేశాల్లోకి ఎవరు వచ్చినా 14 రోజులపాటు క్వారంటైన్ కేంద్రాల్లో గడపాల్సిందేనని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రకటించాయి.
*చిత్రం... కౌలాలంపూర్‌లో షాపింగ్ మాల్