అంతర్జాతీయం

మా చట్టాల ప్రకారమే నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, నవంబర్ 14: భారత నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ మరణశిక్ష విషయంలో భారత్‌తో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకునే ప్రసక్తి లేదని పాకిస్తాన్ తెగేసి చెప్పింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అమలు తమ రాజ్యాంగం ప్రకారమే ఉంటుందని గురువారం నాడిక్కడ పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మొహమ్మద్ ఫైజల్ స్పష్టం చేశారు. జాదవ్ కేసును సమీక్షించేందుకు అనేక న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని పాక్ ఆర్మీ ప్రకటించిన నేపథ్యంలో విదేశాంగ విభాగం ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. భారత నౌకాదళానికి చెందిన మాజీ అధికారి అయిన 49 సంవత్సరాల కుల్‌భూషణ్ జాదవ్‌కు గూఢచర్యం, ఉగ్రవాదం వంటి అభియోగాలపై పాక్ సైనిక కోర్టు మరణశిక్ష విధించింది. అయితే జాదవ్‌ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశారని వాదించిన భారత్.. ఆయనకు విధించిన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయ స్థానంలో సవాల్ చేసింది. ఈ మరణశిక్షను సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థానం పాక్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే జాదవ్ వ్యవహారంలో భారత్‌తో ఎలాంటి ఒప్పందం ఉండదని.. స్థానిక చట్టాల ప్రకారమే అన్ని నిర్ణయాలు ఉంటాయని పాక్ విదేశాంగ విభాగం స్పష్టం చేయడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్టు అయింది. మొదటినుంచీ కూడా అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పును అమలు చేసే విషయంలో పాకిస్తాన్ డొంక తిరుగుడుగానే వ్యవహరిస్తూ వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే జాదవ్‌ను కలుసుకునేందుకు భారత దౌత్యాధికారులను అనుమతించింది. కాగా బాబరీ మసీదు స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ఫైజల్ తప్పుబట్టారు. అక్కడి మసీదు 450 సంవత్సరాలుగా ముస్లింల అధీనంలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ తీర్పుతో భారత్‌లో లౌకిక వాదానికే తూట్లు పడ్డాయని పేర్కొన్న ఆయన.. ఈ కేసులో ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని ఎండగడతామన్నారు.