అంతర్జాతీయం

క్లూ ఇచ్చింది బాగ్దాదీ భార్యే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ఐసిస్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది అబూ బకర్ అల్ బాగ్దాదీని అమెరికా దళాలు అంతం చేయడానికి దారితీసిన పరిణామాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. తన చర్యల ద్వారా అమెరికా సహా అనేక దేశాలను వణికించిన బాగ్దాదీ ఎక్కడ ఉన్నాడన్నది కొన్ని నెలల క్రితం వరకు ఎవరికీ తెలియని విషయమే. కానీ, ఆ ఇంటి గుట్టును ఆయన భార్యల్లో ఒకరు అమెరికా గూఢచారికి సంస్థకు అందించినట్టుగా తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం బాగ్దాదీ భార్య ఆయన ఎక్కడ ఉన్నాడన్న అంశంపై సీఐఏకు క్లూ ఇచ్చారని, ఆ తర్వాత ఓ కొరియర్‌ను కూడా అధికారులు అరెస్టు చేసి విచారించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. బాగ్దాదీ భార్య ఇచ్చిన అతి చిన్న క్లూ అంతిమంగా ఈ అంతర్జాతీయ ఉగ్రవాదిని మట్టుబెట్టేందుకు దారితీసింది. తమకు లభించిన ఆధారం అతి చిన్నదే అయినా కీలకం కావడంతో సీఐఏ అధికారులు దానిపై ఎడతెరపి లేకుండా శ్రమించారు. ఇరాక్, ఖుర్ద్ ఇంటెలిజెన్స్ అధికారులతో, అలాగే సిరియా వర్గాలతోనే దీనిపై విశే్లషణలు జరిపారు. తమకు లభించిన ఆధారాల ఆధారంగా బాగ్దాదీ ఆనుపానులకు సంబంధించి స్పష్టమైన సంకేతాలను కనుగొనగలిగారు. ఆయన వచ్చే అవకాశం ఉన్న అన్ని స్థలాల్లోనూ గూఢచారులను దింపారు. బాగ్దాదీ ఆనుపానులను తెలియజేయడంలో ఖుర్దులు కీలక పాత్ర వహించారు. తమకు స్పష్టమైన ఆధారం లభించడంతో అమెరికా డెల్టా ఫోర్స్ కమాండోలు దానికి అనుగుణంగానే పావులు కదిపారు. బాగ్దాదీని సజీవంగా పట్టుకోవడమా లేదా హతమార్చడమా అన్న లక్ష్యంతో ఈ దళాలు ముందుకు సాగాయి. అతడున్న ప్రాంతం కూడా అల్‌ఖైదా ఆధీనంలోని అత్యంత మారుమూల ప్రాంతం. గతంలో రెండుసార్లు బాగ్దానీ ఆచూకీ తెలిసినప్పటికీ ఆ ప్రయత్నాలు చివరిక్షణంలో విరమించాయి. రెండు మూడు రోజుల క్రితమే తాజా ప్రణాళికను ఖరారు చేశాయి. తానున్న స్థలం నుంచి బాగ్దాదీ కదలబోతున్నాడన్న సమాచారం రావడమే ఇందుకు కారణం. ‘బాగ్దాదీని అమెరికా దళాలు ఓ సొరంగంలో చుట్టుముట్టాయి. అక్కడే ఓ భారీ పేలుడును సృష్టించాయి. దాంతో అతని శరీరం చిన్నాభిన్నం అయిపోయింది’ అని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. బయోమెట్రిక్ మెట్రిక్ పరీక్షలు, డీఎన్‌ఏ ద్వారా బాగ్దాదీ మరణాన్ని అమెరికా వర్గాలు తేల్చిచెప్పాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన డీఎన్‌ఏ యంత్రాల ద్వారా కేవలం 90 నిమిషాల్లో ఒక వ్యక్తికి సంబంధించిన వివరాలను నిర్ధారించవచ్చు.
ఇంకా ఐసిస్ ముప్పు తీరలేదు
వాషింగ్టన్: ఐసిస్ అగ్రనేత బకార్ అల్ బాగ్దాదీని అమెరికా దళాలు హతమార్చిన నేపథ్యంలో ప్రపంచానికి దీని ముప్పు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశే్లషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సిరియా నుంచి వైదొలగడానికి ఈ అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత బలమైన కారణంగా చూపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులను అంతం చేయాలన్న అమెరికా లక్ష్యం పూర్తిగా నెరవేరకముందే సిరియా నుంచి ఆ దేశ దళాలు వైదొలగడానికి ఇదొక కారణం కావచ్చునని అంటున్నారు. అల్‌ఖైదా నుంచి పుట్టిన ఐసిస్ మళ్లీ తన లక్ష్యాల సాధనకు బలాన్ని పుంజుకునే అవకాశం ఉంటుందని, నాయకుడు లేకపోయినా కూడా అన్నిచోట్లా ఇది మళ్లీ తలెత్తే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. ఇరాక్, అఫ్గానిస్తాన్‌తోపాటు అనేక దేశాలకు ఐసిస్ ముప్పు తీరనట్టు కాదని, బాగ్దాదీ హతమైనా ఈ సంస్థ నేలమట్టమైనట్టు కాదని అమెరికా కౌంటర్ టెర్రరిజం విభాగం మాజీ సీనియర్ డైరెక్టర్ క్రిస్ హీల్స్ తెలిపారు.
ఆనాడు ఉత్కంఠ.. నేడు దర్పం
వాషింగ్టన్: అది వైట్‌హౌస్‌లోని ‘సిట్యుయేషన్ రూమ్’ ప్రపంచంలో అత్యంత కీలకమైన పరిణామాలను అమెరికా ఆధిపత్యాన్ని చాటిచెప్పే సంఘటనలు ఎక్కడ చోటుచేసుకున్నా అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి వాటిని ఓ వీడియో చూస్తున్నట్టుగా తిలకిస్తారు. 2011లో నేవీ సీల్స్ దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను హతమారుస్తున్న దృశ్యాలను అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా, విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో కలసి వీక్షించారు. తాజాగా, ఐసిస్ అధినేత అబూ బకర్ ఆల్ బాగ్దానీని అమెరికా దళాలు హతమార్చిన దృశ్యాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మరికొందరు అధికారులతో కలసి ఇదే ‘సిట్యుయేషన్ రూమ్’లో తిలకించారు. లాడెన్‌ను హతమార్చినపుడు, తాజాగా అల్ బగ్దాదీని అమెరికా దళాలు వధించినపుడు ఈ ఇద్దరు అధ్యక్షుల తీరులో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పట్లో ఒబామా అల్‌ఖైదా అధినేత లాడెన్‌ను హతమారుస్తున్న దృశ్యాలను ఎంతో గంభీవరవదనంతో తిలకించారు. పక్కనే ఉన్న హిల్లరీ క్లింటన్ ముఖంపై చేయి అడ్డం పెట్టుకుని ఆ దృశ్యాన్ని చూశారు. అలాగే అప్పటి రక్షణ మంత్రి రాబర్ట్ గేట్స్ రెండు చేతులూ బిగబట్టుకున్నారు. అయితే, తాజాగా విడుదలైన ట్రంప్ ఫొటోలో ఆ రకమైన ఉద్వేగం ఏమీ లేదు. అమెరికా అధ్యక్ష పదవి దర్పాన్ని ప్రపంచానికి చాటుతున్నట్టుగా ఈ ఫొటోలో ఆయన కనిపించారు. ఈ ఫొటోలో జాతీయ భద్రతా సలహాదారు రాబర్డ్ ఓబ్రియాన్, ఉపాధ్యక్షుడు మైక్ స్పెన్స్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ ఉన్నారు. పాకిస్తాన్‌లోని అబోతాబాద్‌లో దాక్కున్న లాడెన్‌ను 2011లో అమెరికా దళాలు హతమార్చాయి. అప్పట్లో ఆ సంఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. బాగ్దాదీని తాము హతమార్చామని ప్రకటించిన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ నాటి లాడెన్ ఉదంతాన్ని కూడా గుర్తు చేశారు. ‘లాడెన్‌ను చంపడం కంటే కూడా ఐసిస్ అధినేతను హతమార్చడమే మేము సాధించిన అతి గొప్ప విజయం’ అని పేర్కొన్నారు.
*చిత్రాలు.. 2011లో లాడెన్‌ను హతమారుస్తున్న సమయంలో ఆ దృశ్యాలను వీక్షిస్తున్న నాటి అమెరికా అధ్యక్షుడు ఒబామా, విదేశాంగ మంత్రి హిల్లరీ..
*తాజాగా ఐసిస్ అగ్రనేత బాగ్దాదీని అంతం చేసిన దృశ్యాలను అధికారులతో కలసి చూస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
*ఇన్‌సెట్‌లో ఐసిస్ అగ్రనేత బాగ్దాదీ