అంతర్జాతీయం

సవాళ్లకు దీటుగా అలీనోద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బకు (అజర్‌బైజాన్), అక్టోబర్ 25: అంతర్జాతీయంగా తలెత్తుతున్న సంక్లిష్ట సవాళ్ళ నేపథ్యంలో అలీనోద్యమాన్ని మరింత పటిష్టంగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని భారత ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. ఇప్పటి వరకు అలీనోద్యమాన్ని సాధించిన విజయాలను పురస్కరించుకుని ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా ఈ ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. 18వ అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రతినిధుల బృందంతో హాజరైన వెంకయ్య నాయుడు ‘ప్రపంచ శాంతి భద్రతలను పెంపొదించడంలో ‘నామ్’ ఎంతో కీలక భూమిక పోషించిందని అలాగే ఇందులోని భాగస్వామ్య దేశాలు మూడింట రెండొంతల మంది ఆశలకు అద్దం పడుతున్నదని తెలిపారు. ఈ 18వ శిఖరాగ్ర సదస్సును ఆలంభనగా చేసుకుని అలీనోద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని అదేవిధంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దీనిని ముందుకు తీసుకెళ్ళడంపై దృష్టి పెట్టాలని వెంకయ్య నాయుడు తెలిపారు. వలస పాలనను అంతం చేయడంలోనూ వర్ణ వివక్షను తుదముట్టించడంలోనూ అలీనోద్యమం నిరూపమాన రీతిలో తోడ్పడిందని ఎన్నో రాజకీయ ఉద్యమాలకు ఊపిరిలు అందించిందని వెంకయ్య నాయుడు తెలిపారు. నేటి పరిస్థితుల్లోనూ అలీనోద్యమ అవశ్యకతను చాటి చెప్పాలంటే స్వాతంత్య్ర కాంక్షను బలోపేతం చేయాలన్నారు. అలీనోద్యమ చరిత్రతో భారత్‌కు సుదీర్ఘమైన అనుబంధం ఉందని, దీని ఆవిర్భావం నుంచి కూడా కీలక భూమిక పోషిస్తూనే వచ్చిందని తెలిపారు. ప్రపంచ ప్రజలకు న్యాయబద్ధమైన, సమానమైన అవకాశాలు కల్పించే అంతర్జాతీయ వ్యవస్థ స్థాపనకు అలీనోద్యమ దేశాలు కలిసి కట్టుగా పని చేశాయని తెలిపారు. అలాగే పాలస్తీనా ప్రజల ఉద్యమానికి సంఘీభావంతో ఉన్నామని వారికి పూర్తి స్థాయి మద్దతునిస్తున్నామని అన్నారు. గత ఆరు దశాబ్దాల కాలంలో ప్రపంచ వ్యవస్థ అనూహ్యంగా మారిందని పేర్కొన్న ఆయన ‘పరస్పర ఆధారిత ప్రపంచం, ప్రపంచీకరణ అనూహ్యంగా విస్తరిస్తున్న సాంకేతికత నేపథ్యంలో ఎన్నో కొత్త సవాళ్ళు తలెత్తుతున్నాయి’ అని తెలిపారు. సమీకృత సుస్థిర వృద్ధి కోసమే అలీన దేశాలు పని చేస్తున్నాయని పేర్కొన్న వెంకయ్య నాయుడు ఈ సభ్య దేశాలు మరింత సంఘటితంగా కృషి చేయాలని అన్నారు. 130 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ అలీన శిఖరాగ్రానికి ఈ మేరకు బలమైన సందేశాన్ని అందిస్తున్నానని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్యారీస్ ఒప్పందం 2030 నాటికి సాధించదలచుకున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారానికి, అనుసంథానతకు నిదర్శనాలని అన్నారు. ప్రపంచ దేశాలు తీసుకునే చర్యల ప్రభావం భూగోళంపైనా చాలా తీవ్రంగానే ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించకూడదన్నారు. ఉగ్రవాదం అయినా పర్యావరణ మార్పులైనా, అంటు వ్యాధులైనా, ఆర్థిక సంక్షోభాలైనా వీటి ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని అలీన దేశాలు సంఘటితం కావాలన్నారు. 1961లో 120 వర్తమాన దేశాలు అలీన దేశాల కూటమి ఏర్పడింది, ఈ దేశాలన్నీ కూడా తటస్థంగా ఉన్నవే, ఐక్యరాజ్య సమితి తర్వాత అత్యంత పెద్ద కూటమి అలీనోద్యమం.