అంతర్జాతీయం

పీఓకేను కుదిపేసిన భారీ భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/ న్యూఢిల్లీ/ జమ్మూ, సెప్టెంబర్ 24: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) సహా పాకిస్తాన్‌లోని అనేక ఈశాన్య రాష్ట్రాలను మంగళవారం సాయంత్రం భారీ భూకంపం అతలాకుతలం చేసింది. శక్తివంతమయిన ఈ భూకంపం కారణంగా 20 మంది మృతి చెందగా, 300కు పైగా మంది గాయపడ్డారు. ఈ భూకంప కేంద్రం భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండటం వల్ల ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్ సహా భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలలోనూ భూప్రకంపనలు సంభవించాయని జాతీయ భూకంప కేంద్రం (ఎన్‌సీఎస్) తెలిపింది. అయితే, భారత్‌లో ప్రాణనష్టం కాని, ఆస్తినష్టం కాని సంభవించినట్టు సమాచారం అందలేదు. జమ్మూకాశ్మీర్ రీజియన్‌లో మంగళవారం సాయంత్రం 4.33 గంటలకు భూమి కంపించినప్పటికీ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని న్యూ మీర్పూర్ సమీపంలో భూకంప కేంద్రం ఉంది. దీంతో ఈ భూకంపం వల్ల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తీవ్రంగా దెబ్బతిన్నది. స్థానిక కాలమానం ప్రకారం, సాయంత్రం 4.02 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి పది కిలో మీటర్ల లోతున ఉంది. శక్తివంతమయిన భూకంపం కారణంగా మీర్పూర్, దాని పరిసర ప్రాంతాలలో 20 మంది మృతి చెందారని, 300కు పైగా మంది గాయపడ్డారని పీఓకే సమాచార శాఖ మంత్రి ముస్తాక్ మినహాస్ తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంత నగరమయిన జెహ్లూం సమీపంలో భూకంప కేంద్రం ఉందని, దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదయిందని పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1 అని శాస్తవ్రిజ్ఞాన శాఖ మంత్రి ఫావద్ చౌదరి తెలిపారు. కాగా, భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదయిందని భారత జాతీయ భూకంప కేంద్రం (ఎన్‌సీఎస్) పేర్కొంది.
భారీ భూకంపం వల్ల మీర్పూర్‌లో కొన్ని ఇళ్లు కూలిపోయాయని డిప్యూటి కమిషనర్ రాజా ఖైసర్ తెలిపారు. ఈ ప్రాంతంలోని ఒక మసీదు పాక్షికంగా కూలిపోయింది. పీఓకే వ్యాప్తంగా ఆసుపత్రుల్లో
ఎమర్జెన్సీని ప్రకటించారు. మీర్పూర్‌లో రోడ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు బోల్తాపడ్డాయి. అనేక కార్లు లోతయిన పగుళ్లలోకి జారిపోయాయి. మీర్పూర్‌లోని ప్రభుత్వ ప్రసార సంస్థ కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నది. భూకంపం వల్ల ప్రజలు భయకంపితులయి ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పాకిస్తాన్‌లోని పెషావర్, రావల్పిండి, లాహోర్, స్కర్దు, కోహట్, చర్సద్ద, కసూర్, ఫైసలాబాద్, గుజరాత్, సియాల్‌కోట్, అబొట్టాబాద్, మన్‌సెహ్ర, చిత్రాల్, మలకంద్, ముల్తాన్, షాంగ్లా, ఒకారా, నౌషెర, అటోక్, జాంగ్ సహా అనేక నగరాలలో భూప్రకంపనలు సంభవించాయి. న్యూయార్క్‌లో ఉన్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భూకంపంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. భూకంప బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఆయన సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
కంపించిన ఉత్తరాది
భారీ భూకంపం కారణంగా భారత్‌లోని జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో అనేక ప్రాంతాలు కంపించాయి. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. సిమ్లా, మండి, కంగ్రా, ఉనా సహా హిమాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.
*చిత్రం... పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో మంగళవారం సంభవించిన భూకంపం తీవ్రతకు బీటలువారిన రోడ్లు