ఈ వారం స్పెషల్

అవస్థలు.. ‘అన్ లిమిటెడ్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ పని చేసినా సెల్‌ఫోన్‌పైనే తదేక దృష్టి.. చివరికి స్నానాల గదిలోకి సైతం ‘చరవాణి’ని వెంట తీసుకెళ్లడం.. కొద్దిసేపు ఫోన్ కనిపించకపోయినా ప్రాణం పోయినట్టుగా విలవిల్లాడిపోవడం.. ఎలాంటి శబ్దం విన్నా ‘సెల్’ మోగుతున్నట్టే భావించి పదే పదే దాన్ని చూసుకోవడం.. క్షణక్షణానికీ వాట్సాప్ స్టేటస్, మిస్డ్‌కాల్ డేటా, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎస్‌ఎంఎస్‌లను ఆతృతగా చూసుకోవడం.. ఏకాంతంగా గడిపేందుకు ఇష్టపడడం.. ఫోన్ మోగితే చాలు అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి సమాచారం వస్తుందోనని హైరానా పడడం.. చుట్టుపక్కల వారితో మాట్లాడేందుకు ఇబ్బంది పడడం.. ఇవన్నీ ‘నోమో ఫోబియా’ లక్షణాలే..! నేటి యువతలో ఎక్కువ మంది ఈ రోగం బారిన పడుతున్నారని వైద్యులు చేస్తున్న హెచ్చరికలు..
***
ఒకప్పుడు నలుగురు కలిస్తే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గంటల కొద్దీ సమయం గడిపేవారు. నేటి నవ నాగరిక యుగంలో కబుర్ల సంగతి దేవుడెరుగు! ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడమే గగనమైపోయింది. ఆధునిక జీవనంలో సరికొత్త ఒరవడికి చిరునామాగా మారిన సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నాయకుల మాటల యుద్ధాలు, సెలబ్రిటీల ఛాలెంజ్‌లే కాదు, లేటెస్ట్ ఫ్యాషన్లకైనా, ఎవరి ఆవేదనలకైనా వేదిక- సామాజిక మాధ్యమాలే. ఈ కోలాహలంలో ‘ఖాకీ ట్విట్టర్’, ‘శారీ ట్విట్టర్’, ‘ఫేస్‌యాప్ ఛాలెంజ్‌లు’ వంటి కొత్త పోకడలు నిత్యం వస్తూనే ఉంటాయి. ఇవాళ కొత్తగా అనిపించే ‘ట్రెండ్’ రేపటికి పాతదై రోత పుట్టిస్తుంది. అయితే- ఇలాంటి ‘ఆన్‌లైన్’ సందడిలో పడిపోయి చాలామంది విలువైన కాలానే్న కాదు, తమ వ్యక్తిత్వాన్ని, కర్తవ్యాన్ని మరచిపోతూ లేనిపోని అవస్థలను ఎదుర్కొంటున్నారు.
***
సోషల్ మీడియాకు బానిసలవుతున్న వారిలో ముఖ్యంగా నగరవాసుల్లో చాలామందికి ఇపుడు ‘లైక్’ల వ్యామోహం ముదిరిపోతోంది. తెల్లారింది మొదలు అర్ధరాత్రి వరకూ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇంటిల్లిపాదీ ప్రత్యేకించి- యువత అతిగా కాలక్షేపం చేస్తూ లైక్‌లు, కామెంట్ల కోసం వెంపర్లాడుతోంది. అనుకున్న రీతిలో ‘లైక్’లు రాకపోతే ఇక జీవితం వృథా అన్నట్టు చాలామంది నీరసపడిపోతున్నారు. ఇలా డీలాపడిన వారిలో కొందరు శారీరక, మానసిక రుగ్మతల బారిన పడుతున్నారని వైద్యులు తేల్చి చెబుతున్నారు. ప్రతిరోజూ అయిదారు గంటలు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు ఇస్తూ ‘లైక్’ల కోసం ఎదురుతెన్నులు చూస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఓ నిర్దిష్ట సమయం గానీ, స్వీయ నియంత్రణ గానీ లేకుండా ఎంతోమంది ‘లైక్‌ల మాయాలోకం’లో విహరిస్తున్నారు. ఇలా కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సామాజిక మాధ్యమానికి అలవాటు పడుతున్నందున వారి మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నా ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది.
మొబైల్ డేటా వినియోగం నానాటికీ పెరుగుతున్నట్టుగానే సోషల్ మీడియా విస్తృతి అంతకంతకూ అధికమవుతోంది. వినోదం కోసం, కాలక్షేపం కోసం సోషల్ మీడియాను వాడుతున్నవారు కొందరైతే, వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ఇతరులతో ‘షేర్’ చేసుకొనేందుకు ఎక్కువగా యువత మోజుపడుతోంది. సోషల్ మీడియాలో తాము చేసే ‘పోస్ట్’లకు ఆశించిన స్థాయిలో ‘లైక్’లు రాకపోతే కుంగుబాటుకు లోనవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. రోజులో నాలుగైదు గంటలు సోషల్ మీడియాలో విహరిస్తూ కొన్ని విషయాల పట్ల ‘డిస్ట్రబ్’ అవుతున్నట్టు, చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నట్టు విద్యార్థులు మానసిక వైద్యుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారని తాజా సర్వేలో తేలింది. ‘రాయల్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్’ సంస్థ ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో 16 నుంచి 24 ఏళ్ల వయసులోపు వారిలో 91 శాతం మంది, 25-34 ఏళ్ల వయసు వారిలో 80 శాతం మంది, 35-44 ఏళ్ల వయస్కుల్లో 70 శాతం మంది మితిమీరి సోషల్ మీడియాను వాడుతున్నట్లు తేలింది. ఇలా సామాజిక మాధ్యమాలపై వ్యామోహం పెంచుకుంటున్న వారిలో ఊబకాయం, మెడ, వెన్నుపూస నొప్పులు, నేత్ర సంబంధ సమస్యలు ఎక్కువవుతున్నాయని సర్వేలో వెల్లడైంది. గంటల తరబడి స్మార్ట్ఫోన్ల వినియోగం వల్ల ముఖ్యంగా కంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, అర్ధరాత్రి వరకూ ఫోన్లు చూస్తున్నందున నిద్రలేమి ఫలితంగా కళ్లమంటలతో చాలామంది బాధపడుతున్నట్టు నేత్రవైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ఫోన్ల వల్ల కళ్లను ఎలర్జీలు, ఇన్‌ఫెక్షన్లు వేధిస్తున్నాయని అంటున్నారు.
చీప్‌గా ‘డేటా’.. చిత్తవుతున్న యువత
సెల్‌ఫోన్ నెట్ వర్కింగ్ కంపెనీల మధ్య వాణిజ్యపరమైన పోటీ పెరగడంతో నేడు ఇంటర్నెట్ డేటా అత్యంత చౌకగా, ‘అన్ లిమిటెడ్’ పేరిట రాయితీలు సైతం లభ్యం కావడంతో నేడు ప్రతి ఒక్కరి చేతిలోకి స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. దీంతో అవసరం ఉన్నా లేకున్నా చాలామంది నెట్ డేటాను తెగ వాడేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ కాంప్లెక్సులు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో, ఇతర పబ్లిక్ స్థలాల్లో ‘వైఫై’ సేవలు ఉచితంగా లభిస్తున్నందున సోషల్ మీడియాతో కాలక్షేపం పెరిగింది. గత మూడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా నెట్ డేటా వినియోగం అనూహ్యంగా పెరిగిందని గణాంకాలు ఘోషిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కుటుంబాల్లో అన్ని వయసుల వారూ ‘నెట్టింట’ స్వేచ్ఛగా విహరిస్తున్నారు. ఇంట్లో చిన్నారులు ఏడుపు
మొదలెడితే స్మార్ట్ఫోన్‌లో వీడియోలు పెట్టి బుజ్జగిస్తున్నారు. పాఠశాల స్థాయి విద్యార్థులు సాయంత్రం బడి నుంచి ఇంటికి రాగానే ఫోన్లు పట్టుకొని తమదైన లోకంలో ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ‘హోం వర్క్’ కన్నా, ఆటపాటల కన్నా ఫోన్‌తో సందడే వారికి ముఖ్యమైన వ్యాపకమైపోయింది. కామిక్స్, గేమ్స్, పాఠాలు బోధించే యాప్‌ల కోసం విద్యార్థుల్లో ఫోన్ల వాడకం పెరిగింది.
ఆలోచించండి.. ఓ అమ్మానాన్నా..
‘నాకు రోజంతా బడిలోనే గడపాలనిపిస్తుంది.. ఎందుకంటే నేను సాయంత్రం ఇంటికొస్తే నన్ను పలకరించేవారే లేరు.. అమ్నానాన్నా ఎవరికివారు ఫోన్‌లోనే మునిగిపోతారు.. ఫోన్ శబ్దం విన్న వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొనే పేరెంట్స్ నేనేంతగా పిలిచినా పట్టించుకోరు.. నేను స్మార్ట్ఫోన్‌గా మారినా బాగుణ్ణు.. కనీసం అప్పుడైనా అమ్మానాన్నా నన్ను వారి చైతుల్లోకి తీసుకుంటారేమో..!- ఇదీ ఓ నగరంలో ఏడో తరగతి కుర్రాడి మనోవేదన. ‘అమ్మానాన్నలూ.. మీ ఫోన్లు దూరం పెట్టండి.. మేం పిలిస్తే పలకండి.. మాకు ప్రేమను పంచండి..’-అంటూ ఇటీవల ఓ మెట్రో నగరంలో ఏడేళ్ల బాలుడు వీధుల్లోకి వచ్చి ‘ప్లకార్డు’ ప్రదర్శించాడంటే కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల ఆత్మీయతకు పిల్లలెంత దూరమవుతున్నారో అవగతమవుతుంది. తల్లిదండ్రులు సోషల్ మీడియాకు అతిగా అలవాటు పడితే, పిల్లలు సైతం అదే బాట పట్టడం విడ్డూరమేమీ కాదు. తల్లిదండ్రుల్లానే పిల్లలు కూడా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా విహరిస్తుంటారు. పేరెంట్స్ పర్యవేక్షణ లేని సందర్భాల్లో అశ్లీల వెబ్‌సైట్లు, క్రైమ్ స్టోరీల వీడియోలకు కొందరు పిల్లలు ఆకర్షితులవుతున్నారు. ఇలా పెడమార్గం పట్టినవారు ఆలోచనా శక్తిని కోల్పోతున్నారు, చదువుకు దూరమవుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమానురాగాలను కోల్పోతున్న పిల్లల్లో ఆలోచనా విధానం తీవ్రంగా ఉంటోంది. విలాసాల కోసం నేరాలు చేసే ప్రవృత్తికి చేరువవుతున్నారు. కోపం, అసహనం పెరిగి మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసం వంటి మంచి లక్షణాలకు దూరమవుతున్నారు. దీంతో పేరెంట్స్, పిల్లలకు మధ్య సంబంధాలు బలహీన పడుతున్నాయి. కుటుంబమంతా కలిసే ఉంటున్నా అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు ఉండడంతో ఎవరికివారు తమదైన ప్రపంచంలో ఊరేగుతున్నారు. ఫలితంగా ఒంటరిగా ఫీలవుతున్నారు. దీనివల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ కేసులు అధికమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. తోటివారి కంటే తాము తక్కువనే ఆత్మన్యూనతా భావం చాలామందిలో పెరుగుతోంది. ఈ సమస్య ముఖ్యంగా యువత కెరీర్‌ను దెబ్బతీస్తోంది. ఇలాంటి విపరిణామాలను నివారించాలంటే పేరెంట్స్ కాసేపైనా ఫోన్లను పక్కనపెట్టి పిల్లలతో ఆత్మీయంగా గడపాలి. వారిలో చురుకుదనం, ఆలోచనలను పెరిగేలా దోహదపడాలి.
వ్యాపకం వ్యసనమై..
స్మార్ట్ఫోన్ల వినియోగం ప్రస్తుతం జీవితంలో ఓ భాగమైపోవడంతో రహదారులు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, ఆఫీసులు, వంటగదిలో, భోజనాల సమయంలో చివరికి స్నానాల గదుల్లో.. ఇలా ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ఫోన్లు వాడేవారి సంఖ్యకు అంతేలేదు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, ఇయర్ ఫోన్‌లో పాటలు వింటూ రోడ్లు దాటడం, వాహనాలు నడపడం, రైల్వే ట్రాక్ దాటడం.. లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకోవడం నిత్యకృత్యమై పోయింది. ప్రయాణాల్లో, పబ్లిక్ స్థలాల్లో పక్కనున్న వారికి అసౌకర్యం కలుగుతుందనే స్పృహ లేకుండా ఫోన్‌లో గట్టిగా మాట్లాడడం చాలామందికి అలవాటై పోయింది. బయటి ప్రపంచాన్ని, పరిసరాలను సైతం పట్టించుకోకుండా సెల్‌ఫోన్‌లో లీనమైపోతూ ప్రాణాలు కొల్పోతున్న వారెందరో.. ‘సెల్ డ్రైవింగ్’తో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఇతరులను కూడా ఆస్పత్రుల పాలుచేస్తున్న వారు మరికొందరు.. జరిమానాలన్నా, జైలుశిక్షలన్నా భయం లేని తనంతో ఇంకొందరు..
ఒకప్పుడు సమాజంలో జరిగే విషయాలపై చాలామందికి ఆసక్తి, అవగాహన ఉండేవి. ఇపుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. చుట్టుపక్కల వారితో మాట్లాడడం సంగతి పక్కన పెడితే, కుటుంబ సభ్యుల మధ్యే మాటలు కరువై పోతున్న రోజులివి. దీంతో మానవ సంబంధాలు మృగ్యమవతున్నాయి. ఇక గంటలకొద్దీ సెల్‌ఫోన్‌లో మాట్లాడడం వల్ల రేడియేషన్ ప్రభావంతో నాడీ మండల వ్యవస్థ, మెదడుపై దుష్ప్రభావం పడుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకొనే వారే లేరు. ఇయర్ ఫోన్లు పెట్టుకున్నపడు శబ్దం 90 డెసిబుల్స్ మించితే ప్రమాదకరం. దీనివల్ల మెదడులో ట్యూ మర్లు, చెవినొప్పి, తలపోటు, వినికిడి శక్తి తగ్గడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మెదడుపై, కళ్లపై తీవ్ర ఒత్తిడి ఖాయం. శరీరంలో నిద్రకు ఉపకరించే ‘మోల్టోన్ హార్మోన్’ తగ్గడం వల్ల నిద్రలేమి సమస్య అనివార్యం. ఆలుమగల మధ్య దాంపత్య సమస్యలకు, ఫెర్టిలిటీ సమస్యలకూ సెల్‌ఫోన్ అతి వినియోగం కారణం అవుతోందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మొత్తం రోడ్డు ప్రమాదాల సంఖ్యలో ‘సెల్ డ్రైవింగ్’ ప్రమాదాలు రెండో స్థానంలో ఉన్నాయి. ఫోన్‌లో లీనమైపోతూ రోడ్లు, రైల్వే ట్రాక్‌లు దాటడం, బస్సులు, రైళ్లు ఎక్కడం, ఫుట్‌బోర్టు ప్రయాణం ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న హెచ్చరికలు అంతగా పనిచేయడం లేదు.
‘నోమో ఫోబియా’ వ్యాధికి గురికాకుండా ఉండాలంటే స్మార్ట్ఫోన్లను పరిమితంగా వాడాల్సిందే. సెల్ డేటాను అవసరమైన మేరకు వినియోగించాలి. విజ్ఞానం, వినోదం కోసం కాకుండా కాలక్షేపం కోసం నెట్ డేటాను వాడితే ప్రయోజనం శూన్యం. సెల్‌ఫోన్‌పై మోజు తగ్గించుకునేందుకు ఖాళీ సమయాల్లో యోగ, ధ్యానం, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బడి నుంచి పిల్లలు ఇంటికి రాగానే వారికి ఫోన్లు ఇవ్వడం కన్నా- కరాటే, సైక్లింగ్, ఇండోర్ గేమ్స్, హస్తకళలు వంటివి నేర్పించాలి.
నిద్ర లేవగానే..
తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్లు, నెట్ డేటా అందుబాటులోకి రావడంతో సెల్ఫీలు, వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్, యూ ట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలకు అలవాటుపడే వారి సంఖ్య అంచనాలకు మించి విస్తరిస్తోంది. స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న వారిలో 87 శాతం మంది యూ ట్యూబ్ వీడియోలు, 85 శాతం మంది వాట్సాప్ సందేశాలు చూస్తూ యమబిజీగా గడిపేస్తున్నారు. చేతిలో స్మార్ట్ఫోన్ లేనిదే ఊపిరి ఆడనంత పరిస్థితి నేడు కనిపిస్తోందంటే అతిశయం కాదు. అర్ధరాత్రి నిద్రపోయే వరకూ చేతిలో ‘సెల్’ కదలాడాల్సిందే. చాలామంది ఉదయం నిద్ర లేవగానే- ఏదో కొంపలు మునుగుతున్నట్టు- చేతిలోకి ఫోన్ తీసుకూని మెసేజ్‌లు, ‘లైక్’లు ఆతృతగా చూసుకోవడం షరామామూలైంది. దాదాపు 60 శాతం మంది నిద్రపోతున్నపుడు సెల్‌ఫోన్‌ను పక్కనే పెట్టుకుంటున్నారట! ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని రీతిలో భోజన సమయంలోనూ స్మార్ట్ఫోన్‌తో చాలామంది మమేకం అవుతున్నారు. స్మార్ట్ఫోన్ మితిమీరి వాడుతున్న వారిలో 80 శాతం మందికి ‘నోమో ఫోబియా’ వ్యాధి లక్షణాలుంటున్నాయి.
సహజంగా 13 ఏళ్ల వయసు వచ్చాక పిల్లల్లో ఏర్పడే హార్మోన్ల మార్పు వల్ల- వారికే తెలియని ఆందోళనలు చోటుచేసుకుంటాయి. ఓటమిని జీర్ణించుకోలేక పోవడం, తమ మాట నెగ్గనపుడు కోపానికి, అసహనానికి లోనవడం చూస్తుంటాము. ఇంట్లో ఎవరైనా సడెన్‌గా టీవీ ఆపేసినా, సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ లాగేసుకొన్నా పిల్లలు కోపంతో చిరాకు పడతారు. వారి మానసిక ప్రవర్తనలో వస్తున్న మార్పులను తల్లిదండ్రులు పసిగట్టి, వారికి సరైన రీతిలో దిశానిర్దేశం చేయాల్సి ఉంది. సెల్‌ఫోన్‌ను దేనికి వాడాలన్న విషయమై పిల్లలకు పేరెంట్స్ అవగాహన కల్పించాలి. ఇక, సోషల్ మీడియాకు బానిసలయ్యే వారిలో ముఖ్యంగా టీనేజీ యువతలో సర్దుకుపోయే మనస్తత్వం కొరవడుతోంది. ఒంటరితనం, ఆత్మన్యూనతా భావంతో కుంగుబాటుకు గురికావడం, ఒక్కోసారి ఆత్మహత్యకు ప్రయత్నించడం వంటి విపరిణామాలకు యువత గురవుతోంది. దీనికి విరుగుడుగా యువతను సోషల్ యాక్టివిటీల్లో, క్రీడల్లో, సాంస్కృతిక రంగంలో నిమగ్నమయ్యేలా తల్లిదండ్రులు, గురువులు మార్గదర్శకత్వం వహించాలి. *

-పి.ఎస్.ఆర్.