ఈ వారం స్పెషల్

అలనాటి స్ఫూర్తి..సుజల దీప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళకళలాడే పచ్చని చెట్లు..
జలజలపారే నదులు..
కిలకిలమనే పక్షులు..
- ఇలాంటి దృశ్యం కంటబడితే చాలు- ఎలాంటి మనసైనా ఆహ్లాదంతో పులకించిపోతుంది.. సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ప్రకృతి శోభకు పులకరించని మనసంటూ ఉండదు. అయితే ప్రకృతి.. కేవలం అందానికే పరిమితమైంది కాదు, ఆరోగ్యంతోనూ ముడివడిన అంశం. పరిసరాలు, వాతావరణం మన ఆరోగ్యంపై చూపే ప్రభావం అంతా ఇంతా కాదు. నిజానికి మన కథ ఆరంభమైంది ప్రకృతిలోనే. పచ్చని చెట్లతో దోబూచులాడుతూ.. హరిత హారాలతో చెట్టాపట్టాలేసుకుంటూనే పెరిగాం. కానీ ఎక్కడో దారితప్పిపోయాం. క్రమక్రమంగా పచ్చటి పరిసరాలకు దూరమవుతున్నాం. కాంక్రీటు అరణ్యాలను శరణుజొచ్చుతున్నాం. కాలుష్య కాసారాల్లో మునిగిపోతున్నాం. దీంతో ఎనె్నన్నో సమస్యలు, జబ్బులను చేజేతులా ‘కొని’ తెచ్చుకుంటున్నాం. మనం దూరం చేసుకుంటున్నా- ప్రకృతి మనల్ని కనికరించడం మానలేదు. తన ఒడిలోకి రమ్మనే ఆహ్వానిస్తోంది. ఆధునిక జీవనంలో ఒత్తిళ్లు, సాంకేతిక పరిజ్ఞాన సందోహం మోసుకొస్తున్న ఎనె్నన్నో ఆరోగ్య సమస్యలకు- ప్రకృతి తగిన పరిష్కారం చూపిస్తానంటోంది. మానవుడు కూడా ప్రకృతిలోనే సేదతీరాలనుకుంటున్నాడు. భవబంధాలను తెంచుకోనట్లుగానే.. మానవుడు ఈ ఆధునిక బంధాలకు బందీ అయిపోయాడు. అసలెందుకిలా అని ఆలోచిస్తే..
జీవపరిణామ పూర్వరంగం ప్రకృతి పరిణామం. జీవం ఏర్పడక పూర్వం నుంచీ మనిషి ఏర్పడక పూర్వం నుంచీ ప్రకృతి ఉంది. మన అంచనాకు అందిన వేల కోట్ల సంవత్సరాలుగా దాని పరిణామం సాగుతూనే ఉంది. చతుర్థా విస్తృతమైన విశ్వం గురించి మనం ఇక్కడ వివరించుకోవాల్సిన అవసరం లేదు. కానీ విశ్వ పదార్థంతోనే, విశ్వ పరిణామంలో భాగంగా, ఈ విశ్వం సంఘటనగా మనిషి ఏర్పడ్డాడు అని అంటాడు జూలియన్ హక్సలే. పదార్థమంతా అణువర్తనమే.. అణువు కాకుంటే మరో సూక్ష్మ భౌతిక రూపం యొక్క పరివర్తనం. పదార్థాన్ని ఏ దశలో ఉన్నట్లు ఊహించినా, మనిషి పదార్థానికి భిన్నం కాదు. మనిషి నిర్మాణాన్ని బట్టి అతనిలో అణువర్తనం ఉంటుంది. పదార్థం నుంచి దాని ప్రవృత్తినీ, ధర్మాలనూ విడదీసి చూడడం ఆత్మవాదుల ధోరణి. ఆ ధోరణిని 2500 ఏళ్ళకు పూర్వమే చార్వాకులు ప్రశ్నించి ఖండించారు. దేహ ప్రవృత్తులుగా కాక, జీవము - ఆత్మ అనేవి దేహానికి విడిగా ఎక్కడ ఉన్నాయి? అని. అందువల్ల మనిషిని ప్రకృతి నుంచి, ప్రకృతిలోని పదార్థం నుంచి, ఏ జీవ జాతుల నుండి పరిణామం చెందాడో ఆ జీవ జాతుల నుంచి వేరుచేసి చూసేటపుడు ఎంతవరకు వేరుచేయాలో, ఏ ప్రత్యేకతల కోసం వేరుచేయాలో తెలుసుకోకపోతే.. ఆ మనిషి నుంచి రాబట్టగలిగేది, ఆ మనిషి గురించి చెప్పగలిగేది మానవవాదం కాదు. మనిషిని అతని స్థానం నుంచి తొలగించి స్వాప్నిక జగత్తులో తేలియాడేది మార్మిక వాదమవుతుంది కానీ, మానవవాదం కాదు. ఉనికి లేనిదే పరిణతి లేదు. ఉనికి, పరిణతి అవిభాజ్యాలు. అలాగే మనిషి లేకుండా మనిషితనం లేదు. ఇలా మనిషి పరిణామక్రమంలో ఎన్నో ప్రయోగాలు.. మనోవిశే్లషణలో మరెన్నో పరిశోధనలు. సిగ్మండ్ ఫ్రాయిడ్‌తో మనోవిశే్లషణకు శాస్త్ర ప్రతిపత్తి చేకూరింది. ఆయన తరువాత సంవత్సరాల్లో అది మరికొంత అభివృద్ధి సాధించింది. అయినా ఇంకా శైశవ దశలోనే ఉంది. మనో విశే్లషణ శాస్త్రం మన భ్రమలకు, మత భావాలకు సరైన భాష్యాలు చెప్పుకునే మార్గం చూపింది. నేటికీ వివిధ శాస్త్రాల ద్వారా మనిషి గురించి చాలా తెలుసుకుంటున్నాం. తెలిసినది జ్ఞానం, తెలియనది అజ్ఞానం. అలాగని అజ్ఞానమంతా అజ్ఞేయం కాదు.
మనిషికి కుతూహలం ఉంటే.. అతని మదిలో ఉదయించిన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగలడు. మనిషికి కొన్ని విశిష్ట లక్షణాలున్నమాట వాస్తవమే కదా! ఎందుకంటే మనిషి మాత్రమే నవ్వగలడు, ఏడ్వగలడు, మాట్లాడగలడు. ఆకాశానికి నిచ్చెనలు వేయగలడు, గృహనిర్మాణాలు చేపట్టగలడు.. ఇలా మరెన్నో చేయగలడు. జీవజాతుల్లో మానవుడికి తప్ప వేటికీ ఈ పనులు సాధ్యం కాని మాట నిజమే. తన అవయవ నిర్మాణంలోని విశిష్టత వల్లనే మనిషి ఈ పనులన్నీ చేయగలుగుడున్నాడు. ఆలోచనా సాధనమైన అతని మెదడు కూడా ఓ అద్భుత అవయవమే.. ఇలా అర్థం చేసుకున్నప్పుడు మనిషి కూడా జీవే.. అతడొక తరహా వైజ్ఞానిక జంతువు. ఇలా మానవజాతి ఆవిర్భావం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదో చిక్కుప్రశ్న. ఎప్పటికీ ఛేదించలేని ప్రహేళిక. ఎంతోమంది- ‘మానవజాతి ఈ భూమి పైకి ఎలా వచ్చింది..?’ అని తెలుసుకునేందుకు గ్రీకుల కాలం నుంచి నేటివరకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీని గురించి పక్కన పెడితే.. మానవుడి చిత్తం చంచలమైనది. అది ఎప్పుడూ పలు పలు విధాల సంచరిస్తూ.. రకరకాల ఆలోచనలను రేకెత్తిస్తుంది. నిరంతరం కొత్తదనాన్ని కోరుకుంటుంది. ఈ జిజ్ఞాసే పురామానవుణ్ణి కాస్తా.. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న 21 శతాబ్దపు ఆధునిక మానవునిగా తీర్చిదిద్దింది. ఈ మార్పులో అతని అనే్వషణలు, ప్రయాణాలు, కోరికలు ప్రముఖ పాత్ర పోషించాయి. సంచరించడం మానవుని సహజాతం. ఈ సహజాతమే లేకపోతే ఎక్కడో ఆఫ్రికాలో పుట్టిన మనిషి భూమండలమంతా విస్తరించేవాడేనా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వస్తుంది. మానవుడు భూమండలమంతా విస్తరించడంతో పాటు వైజ్ఞానికంగా కూడా ఎంతో అభివృద్ధి సాధించాడు. ఒకప్పుడు ముడిపదార్థంలా ఏమీ తెలీకుండా ఉన్న మనిషి.. నేడు.. వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి సాధించి.. తనచుట్టూ ఆధునిక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ప్రపంచంలో తొలి నాగరికతలో ఒకటైన సింధు నాగరికత గురించిన ఆనవాళ్లలోనే ఈ విషయం తేటతెల్లమైంది.
సింధు నాగరికత
సింధులోయ నాగరికత ప్రపంచంలోని తొలి నాగరికతల్లో ఒకటి. సింధు నది పరీవాహక ప్రాంతం, దాని ఉపనదులు వాయువ్య భారతదేశం, నేటి పాకిస్తాన్ చుట్టూ ఉన్నాయి. హర్యానాలోని రాఖీగర్హిలో, గుజరాత్‌లోని ధోలావిరాలో ఈ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. ఇటుకలను ఉపయోగించి, చక్కటి ప్రణాళికతో నగరాల నిర్మాణం, సరైన నీటి పారుదల వ్యవస్థ ఈ నాగరికత ప్రధాన లక్షణాలు. సింధులోయ నాగరికత భౌగోళికంగా ఈజిప్ట్, మెసపొటేమియా వరకు విస్తరించింది. పురావస్తు పరిశోధన, రేడియో కార్బన్ డేటింగ్ ఆధారంగా సింధులోయ నాగరికతకు మూలం క్రీ.పూ. 3300-1300 మధ్య ఉందని తేలింది. ఈ కాలానికి ముందు ప్రజలు సింధునది ఒడ్డున నివసించేవారు. కానీ వారు కాంస్య యుగంలో మాత్రమే నాగరిక, పట్టణ సమాజాలుగా జీవించడం మొదలుపెట్టారు. సింధులోయ నాగరికతలో రెండు ప్రముఖ నగరాలు ఉన్నాయి. అవి హరప్ప, మొహెంజదారో. సింధులోయ నాగరికతలో అతి పెద్ద ప్రదేశం మొహెంజదారో.. అతి చిన్న ప్రదేశం అల్లాహ్దీనో.
సింధులోయ నాగరికత పరిఢవిల్లిన సమయంలో మొత్తం జనాభా ఐదు మిలియన్లకు పైగా ఉంది. ఇక్కడి ప్రజల్లో ఎక్కువమంది చేతివృత్తులవారు, వ్యాపారులు. ఇక్కడ పట్టణాలు దీర్ఘచతురస్రాకార నమూనాలో నిర్మించారు. చాలా ఇళ్ళు రెండు అంతస్తుల్లో సువిశాలంగా ఉండేవి. ఈ నాగరికత ప్రత్యేక లక్షణం పట్టణ ప్రణాళిక. ధాన్యాగారాలు, కోటలు, శ్మశాన వాటికలు, స్నాన వేదికలు ముఖ్యమైన నిర్మాణాలు. ఇక్కడ చెప్పుకోదగ్గ మరొక ప్రముఖ అంశం ఏంటంటే.. ఇటుకలతో కప్పిన మురుగుకాలువలు. మురుగునీటి వ్యవస్థకు సంబంధించి ఆ నాగరికతలోని అన్ని నగరాల్లో మొహెంజదారో ప్రముఖమైనది. నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు పదకొండు అడుగుల పొడవు, 5.5 అంగుళాల వెడల్పు, 2.75 అంగుళాల లోతు కలిగి 4:2:1 నిష్పత్తిలో ఉంటాయి. ఇక్కడి ప్రజలు పొడవు, ద్రవ్యరాశి, సమయాన్ని కచ్చితంగా కొలుస్తారు. ఏకరీతి బరువులు, కొలతల వ్యవస్థను కూడా వీరు అభివృద్ధి చేశారు. ఈ నాగరికతలో కళలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. అందుకే తవ్వకాల్లో టెర్రాకోట బొమ్మలతో పాటు అనేక కాంస్య, రాగి, కుండలు, జంతువుల బొమ్మలతో చెక్కిన స్టీటైట్ సీల్స్ వంటివి బయటపడ్డాయి.
హరప్పా నాగరికతలో మూడు దశలు ఉన్నాయి. అవి ప్రీ హరప్పన్, హరప్పన్, పోస్ట్ హరప్పన్. ఈ నాగరికతలో ఓడరేవులు బాగా అభివృద్ధి చెందాయి. అలాగే ఇంజినీరింగ్ నైపుణ్యాలు కూడా అద్భుతం. మొహెంజదారోలో 10.5 మీటర్ల రోడ్లు, హరప్పాలో 30 అడుగుల వెడల్పైన రోడ్లు ఉండేవి. సింధులోయ నాగరికత, ఈజిప్టు రివర్ వ్యాలీ నాగరికత మధ్య సారూపత్యను పండితులు గుర్తించారు. మొదట రెండు నాగరికతలు నదీ వ్యవస్థపై ఆధారపడి ఉన్నాయి. వారు ప్రత్యేకమైన పద్ధతుల్లో నీటిని నిలువ చేసుకునేవారు. పంటలను పండించేవారు. ఇలా అప్పట్లోనే మానవుడు రహదారులు, నీటిపారుదల, మురుగునీటి వ్యవస్థ వంటి ఎన్నో మార్పులను చేశాడు.
ఛత్రపతి శివాజీ కూడా..
గొప్ప మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీ కూడా తన సైనికుల నీటి అవసరాలను, స్థానిక జనాభాను దృష్టిలో ఉంచుకుని అనేక ట్యాంకులు, సరస్సులను నిర్మించాడు. నేడు.. అంటే 2019 మే, జూన్ నెలల్లో మహారాష్ట్ర అంతటా తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడి చాలా సరస్సులు, బావులు, జలాశయాలు ఎండిపోయాయి. పూణె చుట్టుపక్కల కొండలపై ఉన్న శివాజీ కోటల్లోని వందలాది సరస్సులు, ట్యాంకులు మాత్రం ఏ మాత్రం ఎండిపోలేదు. పుష్కలంగా నీటిని కలిగి ఉన్నాయి. అప్పట్లో శివాజీ సహాద్రి శ్రేణిలోని చాలా కోటలకు నాయకత్వం వహించేవాడు. ఆ సమయంలో సైనికుల నీటి అవసరాలను, స్థానికుల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరస్సులు, జలాశయాలను ప్రకృతి సహజమైన పద్ధతులను ఉపయోగించి నిర్మించాడు. అందుకేనేమో.. వాటిల్లో ఒకటి కూడా ఇప్పటిదాకా ఎండిపోలేదు. అందుకే నీటి నిర్వహణా పద్ధతుల ప్రస్తావన వచ్చినప్పుడు, నీటి కొరత గురించి మాట్లాడుకునేటప్పుడు స్థానికులు శివాజీ నిర్మించిన సరస్సులు, ట్యాంకులనే ఉదాహరణలుగా గుర్తుచేస్తుంటారు.
పుణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జియో ఆర్కియాలజీ ప్రొఫెసర్ పి.డి. సబలే మాట్లాడుతూ.. ‘కోటల్లో సరస్సులతో పాటు నీటి ట్యాంకులు కూడా ఉన్నాయి. ఈ కాంక్రీట్ నీటి ట్యాంకులు నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఉద్దేశించి కట్టినవి. వారు వర్షం నుండి సేకరించిన నీటిని నిల్వ చేసేవారు. నీటిని నిల్వ చేసి ఉపయోగించారు. సరస్సులు, ట్యాంకులు ఉపయోగించడానికి శివాజీ ప్రత్యేక టెక్నిక్స్ ఏమీ ఉపయోగించలేదు. అతను ప్రకృతి సహాయం మాత్రమే తీసుకున్నాడు. ఈ రోజు మనం చేస్తున్నట్లుగా ఆయన ఎప్పుడూ ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్లలేదు. వర్షాకాలంలో పుణె ప్రాంతంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. కోటల్లో వర్షపు నీటిని నిల్వ చేయడానికి, తిరిగి ఉపయోగించుకోవడానికి అప్పట్లోనే అధునాతన ఏర్పాటు చేశారు శివాజీ. కోట ప్రాంగణంలోని దిగువ మైదానాలలో వర్షాల నుండి సృష్టించిన నీటి ప్రవాహాలు కలిసే ప్రదేశాల్లో కృత్రిమ సరస్సులను నిర్మించారు. కొండలు, పర్వతాల దిగువన ప్లాట్ బేస్ దగ్గర భూమిని తవ్వడం వల్ల, వర్షం పడినప్పుడు నీటి ప్రవాహాలు సహజ మార్గాల ద్వారా పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేయగల పీఠభూమిలోకి వెళ్లి సరస్సు ఏర్పడుతుంది. అలాగే కోటల్లో వాటర్ ట్యాంకులకు ప్రత్యేకమైన బసాల్ట్ రాళ్లను ఉపయోగించారు. 65 మిలియన్ సంవత్సరాల క్రితం అగ్ని పర్వత విస్ఫోటనం తరువాత ఈ రాళ్లు ఏర్పడ్డాయని చెప్పుకుంటారు. ఇవి పెర్కోలేషన్‌ను అనుమతిస్తాయి. పైగా ఉపరితలం వద్ద నీరు లీకేజీ కాకుండా చూసుకుంటాయి’ అని వివరించాడు. ‘హీ పానీ అమ్చాచ్ (ఈ నీరు మాది)’ అనే పుస్తకాన్ని రాసిన ప్రఫుల్ కదమ్ ఇప్పుడు స్థిరమైన నీటి పద్ధతుల కోసం ప్రచారం చేస్తున్నాడు. 400 సంవత్సరాల క్రితం ప్రణాళికదారులు ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి నీటి వాడకంలో న్యాయంగా ఉండేవారని, శివాజీ సమయంలో ప్రణాళికాదారులు గొప్ప మనస్సును చూపారని, అందుకే ప్రకృతి కూడా వారిని ఆశీర్వదించిందని చెబుతాడు ప్రఫుల్ కదమ్. ఇలా శివాజీ కాలంలో నీటి వినియోగంపై ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించేవారని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. వీరు నీటి విషయంలో నీతిని పాటించేవారని చెబుతోంది చరిత్ర. స్నానం చేయడానికి, చెట్లకి నీరు పెట్టడానికి, ఇతర అవసరాలకు నీటిని తక్కువగా ఉపయోగించేవారు. ఇలాంటి సమయంలో నీటి వృథా తక్కువ స్థాయిలో ఉండేది.
పూర్వీకుల అద్భుత టెక్నిక్స్..
ఇప్పుడంటే మనకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి పెద్దపెద్ద, దృఢమైన ఆనకట్టలు, రిజర్వాయర్లను నిర్మించుకుని నీటి కొరత లేకుండా చూసుకుంటున్నామని అనుకుంటున్నాం. కానీ ఇలా జరగడం లేదు. ఈ విషయం ప్రస్తుతానికి పక్కన బెడితే.. పూర్వీకులు నీటి నిల్వ కోసం ఎలాంటి పద్ధతులు ఉపయోగించారో తెలుసుకొంటే- మనకు నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి నిర్మాణాలను ఒకసారి చూద్దాం..
ఝలారా
గుంతలను తవ్వి వాటి చుట్టూ లోపల నాలుగు వైపులా వరుస వెంట వరుస మెట్లు వచ్చేలా ఝలారాలను నిర్మిస్తారు. ఇవి వాటి ఎగువన ఉండే సరస్సులు, కాలువల నుంచి నీటిని గ్రహిస్తాయి. అనంతరం నీటిని నిల్వ ఉంచుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ఆ నీటిని ప్రజలు ఉపయోగించుకునేవారు. ఇవి క్రీస్తు శకం 1660 సంవత్సర కాలానికి చెందిన నిర్మాణాలు.
తాలాబ్ లేదా బందీ
ఉదయ్‌పూర్ వంటి ప్రాంతాల్లో ఈ నిర్మాణాలను ఎక్కువగా చేపట్టేవారు. ఇవి దీర్ఘచతురస్రాకారంలో అత్యంత పొడవుగా ఉంటాయి. వీటిల్లో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేసేవారు. నిల్వ ఉంచిన నీటిని గృహాలు, వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించుకునేవారు.
బవారి
రాజస్థాన్‌లోని బవారి నిర్మాణాలను చేపట్టేవారు. వీటిల్లోకి దిగేందుకు అడుగు భాగం వరకూ మెట్ల వంటి ఏర్పాటు ఉంటుంది. వర్షపునీటిని వీటిల్లో నిల్వ చేసుకుని ఉపయోగించుకునేవారు. ఈ నిర్మాణాలకు కింది భాగం వెడల్పుగా, పై భాగం ఇరుగ్గా ఉంటుంది. అందుకు కారణమేంటంటే.. నీరు తక్కువగా ఆవిరవుతుందట.
తాంకా
రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో తాంకాలను ఎక్కువగా నిర్మించేవారు. వర్షం వల్ల వచ్చిన నీరు వీటిలో నిల్వ ఉంటుంది. అలా నిల్వ ఉండే నీరు ఒక కాలం పాటు ఓ కుటుంబం మొత్తానికి సరిపోతుంది.
ఆహార్ పైన్స్
బీహార్ వంటి రాష్ట్రాల్లో ముందుగా ఆహార్ పైన్స్ నిర్మాణాలను చేపట్టేవారు. ఇవి పిల్ల కాలువలను పోలి ఉంటాయి. సమీపంలో ఉన్న నదులను, సరస్సులను, గ్రామాల్లో ఉన్న పొలాలను ఇవి కలుపుతాయి. వీటిలో పారే నీటిని ప్రజలు వాడుకునేవారు.
జోహాద్స్
కర్నాటక, ఒడిశా రాష్ట్రాల్లో వీటిని ముందుగా నిర్మించారు. మనం ఇప్పుడు పిలుస్తున్న చెక్ డ్యాంల వంటి నిర్మాణాల్లాగానే ఉంటాయి. మూడు వైపులా ఎత్తుగా, ఒకవైపు వంపుగా ఉండే ప్రాంతంలో చాలా లోతుకు తవ్వితే, వర్షం పడినప్పుడు ఆ ప్రాంతంలో నీరు నిలిచేది. ఈ క్రమంలో వంపు ఉన్న ప్రాంతాన్ని గోడతో మూసి అవసరం అనుకున్నప్పుడు దాన్ని తెరుస్తూ నీటిని వాడుకునేవారు.
పనాం కేని
ఒక రకమైన వృక్షానికి చెందిన నాలుగు అడుగుల ఎత్తున్న పెద్ద పెద్ద కాండాలను తీసుకుని వాటి లోపలి భాగాలను తీసేసి డ్రమ్ములుగా తయారుచేసి ఇలాంటి నిర్మాణాలను చేపడతారు. మనదేశంలో పలు ప్రాంతాల్లో, అడవుల్లో నివాసం ఉండే కొన్ని తెగలకు చెందినవారు వీటిని తయారుచేసేవారు. అడవుల్లో వీటిని తయారుచేసి ఏదైనా ఒక ప్రాంతంలో పెట్టగానే వర్షం పడినప్పుడు అందులోని నీరు వచ్చి చేరుతుంది. అలా చేరిన నీటిని ఆ తెగల ప్రజలు తాగి దాహం తీర్చుకునేవారు.
ఖాదిన్
పదిహేనవ శతాబ్దంలో జై సల్మీర్‌కు చెందిన ప్రజలు ఇలాంటి నిర్మాణాలు చేపట్టేవారు. కొండ వాలుకు దిగువన ఉన్న ప్రాంతంలో నీరు నిల్వ ఉండేట్టుగా ఆ ప్రదేశాన్ని తవ్వేవారు. దీంతో వర్షం పడగానే అందులోకి నీరు వచ్చి చేరేది. ఆ నీటిని వ్యవసాయం కోసం ఉపయోగించుకునేవారు.
కుండ్
1607వ సంవత్సరంలో రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో కుండ్‌లను నిర్మించుకునేవారు. వీటిలో వర్షపు నీరు నిలిచి ఉండేది. వ్యవసాయం, తాగునీటి కోసం ఆ నీటిని ఉపయోగించుకునేవారు.
బవోలి
తాగునీటికి, వ్యవసాయానికి నేరుగా నీటిని సరఫరా చేసేందుకు బవోలీలను నిర్మించేవారు ఒకప్పుడు. సమీపంలో ఉన్న చెరువులు, నదులు, కాలువలకు ఇవి అనుసంధానమై ఉండేవి.
నది
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతంలో ఉండే లోతట్టు ప్రదేశాల్లో వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకుగాను ఇలాంటి నిర్మాణాలను చేపట్టేవారు. వీటిని గ్రామ సరస్సులుగా పిల్చేవారు.
భండారా ఫాద్
మహారాష్టల్రోని నాసిక్ తదితర ప్రాంతాల్లో వీటిని కొన్ని వందల ఏళ్ల కిందట నిర్మించడం ప్రారంభించారు. ఇవి కాలువలను పోలి ఉంటాయి. నదులు, సరస్సులు, చెరువుల నుంచి వచ్చే నీరు వీటి ద్వారా గ్రామాలకు వెళ్లేది.
జింగ్
జమ్మూ కశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో ఒకప్పుడు వీటిని ఎక్కువగా నిర్మించారు. హిమాలయాల నుంచి కరుగుతూ వచ్చిన నీటిని ఒడిసి పట్టుకునేందుకుగాను చిన్నపాటి సరస్సులను ఏర్పాటు చేసేవారు. అవే జింగ్‌లు. వీటిలోకి వచ్చే నీటిని ప్రజలు తమ అవసరాలకు వాడుకునేవారు.
కుల్స్
హిమాచల్ ప్రదేశ్‌లో వీటిని ఎక్కువగా నిర్మించారు. హిమానీ నదాల నుంచి కరిగివచ్చే నీటిని సరస్సుల్లోకి పంపేందుకు వీటిని నిర్మించుకునేవారు. వీటిద్వారా ప్రవహించే నీటిని వ్యవసాయం, తాగునీటి అవసరాల కోసం ఉపయోగించుకునేవారు.
జాబో
నాగాలాండ్‌లో వీటిని నిర్మించేవారు. కొండ ప్రాంతంపై బల్ల పరుపుగా ఉన్న ప్రదేశంలో భూమిని తవ్వి వీటిని నిర్మించేవారు. అలా తవ్వగా ఏర్పడ్డ పెద్ద గుంతలో నీరు నిల్వ ఉండేది. దాన్ని పాయలుగా చేసి నెమ్మదిగా కిందకు దింపుతూ వ్యవసాయం, పశువుల పెంపకం, మొక్కల పెంపకం కోసం వాడుకునేవారు.
బాంబూ డ్రిప్ ఇరిగేషన్
ఇప్పుడున్న డ్రిప్ ఇరిగేషన్ వంటిదే ఈ పద్ధతి కూడా. కాకపోతే అప్పుడు లోహాలు, ప్లాస్టిక్, మోటార్లు లేవు కదా. అందుకని వారు వెదురు బొంగులను ఉపయోగించి మొక్కలకు నెమ్మదిగా నీరు అందేలా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ఏర్పాటు చేసుకునేవారు.
జాక్‌వెల్స్
అండమాన్ నికోబార్ దీవుల్లో ఇలాంటి నిర్మాణాలను ఎక్కువగా చేపట్టేవారు. పెద్ద పెద్ద బావులను తవ్వి వాటిలోకి వెదురు బొంగులను పెట్టేవారు. ఆ బొంగుల రెండో చివరలను చెట్ల కింద ఉంచేవారు. చెట్లపై పడిన వర్షపు నీరు వెదురు బొంగుల ద్వారా బావుల్లోకి వచ్చి చేరేది. ఒకవేళ ఆ బావి నిండితే దాని నుంచి మరో వెదురు బొంగు ద్వారా ఇంకో బావికి నీటిని పంపే ఏర్పాటు చేసేవారు.
రామ్‌టెక్ మోడల్
మహారాష్టల్రో ఇలాంటి నిర్మాణాలను చేపట్టేవారు. పర్వత ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొలనులను ఏర్పాటు చేసి వాటిలో వర్షపు నీటిని సేకరించేవారు. అలా వచ్చి చేరిన నీరు పర్వత ప్రాంతం కిందకు ప్రవహించేది. దీంతో ప్రజల అవసరాలు తీరేవి.
పాట్ పద్ధతి
కొండ ప్రాంతాల నుంచి కిందకు వచ్చే నీటిని అనేక పద్ధతులు, మార్గాల్లో దారి మళ్లిస్తూ ఆ నీటిని ఎట్టకేలకు గ్రామం సమీపంలోకి తెచ్చేవారు. అలా వచ్చి చేరే నీటిని నిల్వ చేసుకుని వాడుకునేవారు.
ఎరి
మనదేశంలో అత్యంత పురాతనమైన నీటిని నిల్వ చేసే పద్ధతిగా ఇది పేరుగాంచింది. తమిళనాడులో ఇప్పటికీ కొన్ని ‘ఎరి’ నిర్మాణాలు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతుంది. అలా చేరిన నీటిని కాలువల ద్వారా మళ్లించి గ్రామాల్లో వాడుకునేవారు.
ఇవేకాదు.. ఇంకా చాలారకాల నీటి నిల్వ పద్ధతులు మన దేశంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చెరువులు తవ్వి నీటిని నిల్వ చేయడం ఇలాంటి నిర్మాణాల్లో భాగమే. కర్నాటకలో వీటినే కిరిస్ అని పిలుస్తారు. అస్సాంలో వీటిని డోంగ్స్ అని అంటారు. ఇవన్నీ మన దేశంలో ఉన్న అత్యంత పురాతనమైన నీటి నిల్వ పద్ధతులు. ఇప్పటికీ అనేక చోట్ల ఇలాంటి పద్ధతులే అమల్లో ఉన్నాయి. ప్రపంచం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా.. రోజురోజుకూ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి పరిస్థితుల్లో వర్షపు నీటిని సరైన పద్ధతుల్లో నిల్వ చేసుకోలేకపోతున్నాం. భూగర్భ జలాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. భూగర్భ జలాల్లో 72 శాతం ఓవర్ డ్రాఫ్ట్‌లో ఉన్నాం. మనదేశంలో 54 శాతం ప్రాంతం తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటోంది. భూగర్భం కూడా నీటిట్యాంకు లాంటిదే. అందులోకి నీటిని పంపకుండా.. ఎంతసేపూ నీటిని తీసుకుంటూ ఉంటే.. నీటి నిల్వలు ఎంతకాలం ఉంటాయి? నీటికోసం ఇంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మనలో కనువిప్పు కలగడం లేదు.
రుతుపవనాలు వచ్చినా వర్షాలు పడటం లేదు. ఈ పరిస్థితులను అందరూ కచ్చితంగా గుర్తించాలి. మనం నీటికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా దాని విలువను మాత్రం గుర్తించడం లేదు. మార్పు మనతోనే మొదలుకావాలి. నీటి సమస్య పరిష్కారం మన చేతుల్లోనే ఉంది. వాననీటి సంరక్షణతో పాటు నదులు, జలవనరులను కాపాడుకుంటేనే మనిషికి మనుగడ ఉంటుంది. నిన్న లేని సమస్య నేడు తీవ్రమైంది. భవిష్యత్తులో ఇది మరింత జటిలం కానుంది. నేడు వాననీటి సంరక్షణ అత్యంత అవసరమైన అంశం. కనుమరుగవుతున్న జలవనరుల పునరుజ్జీవం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ పని ప్రభుత్వం మాత్రమే చేయాలంటే సరిపోదు. ప్రభుత్వం, సమాజం కలసి చేస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. వర్షాభావ పరిస్థితులకు పచ్చదనం తగ్గిపోవడమే ప్రధాన కారణం. పచ్చదనం లేనిచోట మేఘాలు ఉన్నా, వేడిగాలుల కారణంగా అవి తేలికై తరలిపోతాయి.
జల సరంక్షణ
మేఘాలు అక్కడ కురవాలంటే పచ్చదనం పెంచడమే అసలు పరిష్కారం. ఏ ప్రాంతానికి అనుగుణంగా ఆ ప్రాంతానికి ప్రకృతి సహజ సిద్ధమైన విధానాల ద్వారా, చిన్న చిన్న పరిష్కారాల ద్వారా జల సరంక్షణను చేపట్టాలి. ప్రకృతి సహజ విధానాలు సత్ఫలితాలను తప్పకుండా ఇస్తాయని మన పూర్వీకులు ఆచరణలో నిరూపించారు. నీటి ఇక్కట్లు లేకుండా చూసుకున్నారు. ఇప్పుడు, ఇక్కడ మిగిలింది వారిని అనుసరిస్తూ మన ప్రయత్నం చేయడం మాత్రమే.. ప్రపంచ పోకడలు చూస్తుంటే అనేక అంశాలు మన కళ్లకు కడుతున్నాయి. జలవనరుల సమస్యతో సిరియా, సూడాన్ సహా అనేక దేశాల్లో ప్రజలు వలసబాట పడుతున్నారు. మనం ఇంకా ఆ పరిస్థితికి రాలేదు.. అందుకని ఇకనైనా కళ్లు తెరిచి.. ఈ వర్షాకాలంలో పడిన వాన నీటిని ఒక్క చుక్క కూడా వృథా కాకుండా ప్రకృతి సహజ సిద్ధమైన విధానాల ద్వారా వాననీటిని ఒడిసి పట్టేద్దామా.. *

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి