ఈ వారం స్పెషల్

బో‘నమోస్తుతే’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోనాలు, బతుకమ్మ, పీర్ల పండుగ, తీజ్ పండుగ తెలంగాణ బతుకు చిత్రానికి ప్రతీకలు.. తెలంగాణ మట్టి వాసనలకు నిలువెత్తు సంతకాలు.. మరే ప్రాంతంలోనూ ఇలాంటి పండుగలు లేవు. బతుకుతెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన శ్రామిక జీవులు సొంతూళ్లకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న చోటనే వీటిని జరుపుకోవడం వల్ల రాయలసీమలో కొన్ని చోట్లకు బోనాల పండుగ విస్తరించింది. అంతే తప్ప మరెక్కడా బోనాల వేడుకలు జరగవు. తెలంగాణ సంస్కృతిక వారసత్వానికి, ఇక్కడి ప్రజల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటే చెప్పే పండుగల్లో బోనాలు ఒకటి. ఏటా ఆషాఢ మాసంలో ప్రారంభమై శ్రావణ మాసం (జూలై-ఆగస్టు) వరకూ తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా బోనాల వేడుకలను నిర్వహించుకుంటారు. ఆషాఢ మాసంలో మహంకాళీ అమ్మవారు పుట్టింటికి వస్తుందని ఈ ప్రాంతావాసుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని పెద్దమ్మగా, ఎల్లమ్మగా, పోచమ్మగా, పోలేరమ్మగా, మైసమ్మగా, అంకాలమ్మగా, మారెమ్మగా, నూకలమ్మగా వివిధ నామాలతో కొలుస్తారు. అమ్మవారికి సారె, చీర, గాజులు, పసుపు, కుంకమలతో పాటు బోనాన్ని సమర్పించుకుంటారు. బోనం అంటే మరేదో కాదు.. భోజనమే. భోజనం ప్రకృతి అయితే బోనం వికృతి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలలో అత్యంత వైభవంగా జరుపుకునే బోనాల పండుగకున్న చారిత్రక నేపథ్యం ఏమిటి? ఈ సాంస్కృతిక వారసత్వం ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందనడానికి రకరకాల కథనాలు వ్యాప్తిలో ఉన్నాయి.
దాదాపు రెండు శతాబ్దాల క్రితం- 1813 ప్రాంతంలో హైదరాబాద్-సికింద్రాబాద్ ప్రాంతంలో ప్లేగు వ్యాధితో వేలాది మంది ప్రజలు మృత్యవాత పడ్డారు. అదే సమయంలో లష్కర్‌గా పిలుచుకొనే సికింద్రాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌కు వెళ్లిన మిలట్రీ బెటాలియన్ సైనికులు అక్కడి ఉజ్జయినిలో అమ్మవారి వద్దకు వెళ్లి తమ పిల్లాపాపలను ప్లేగు వ్యాధి నుంచి కాపాడమని వేడుకున్నారు. ఆ మిలట్రీ బెటాలియన్ సైనికులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేసరికి వ్యాధి మటుమాయం అయింది. తమ మొక్కులు ఫలించాయన్న ఆనందంతో సికింద్రాబాద్‌లో ఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ప్రతిష్ఠించి, ఆనాటి నుంచి బోనాలతో మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం ప్రారంభమైందని చరిత్రకారులు, జానపదుల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇది సికింద్రాబాద్ బోనాల పండుగకు నేపథ్యం అయితే హైదరాబాద్ పాతబస్తీలో జరిగే బోనాలకు మరో చారిత్రక నేపథ్యం ఉందన్న ఇంకో కథనం ప్రచారంలో ఉంది. 1908లో హైదరాబాద్ నగరాన్ని మూసీ నది వరదలతో ముంచెత్తింది. వరద నీళ్లు చార్మినార్ మైసమ్మగుడి వరకు చుట్టుముట్టాయి. వరద నీటితో నగర ప్రజల జీవనం అతులాకుతలమైంది. అప్పటి నిజాం రాజ్యంలో హైదరాబాద్ స్టేట్‌కు ప్రధాన మంత్రిగా (వజీర్ ఆజమ్) ఉన్న కిషన్ ప్రసాద్ నిజాం నవాబు వద్దకు వెళ్లి చార్మినార్‌కు సమీపంలోని లాల్ దర్వాజాలో సింహవాహిని మహంకాళీ అమ్మవారు ఉందని, ఎంతో మహత్తుగల ఆ అమ్మవారికి పూజలు నిర్వహిస్తే మూసీ నది శాంతిస్తుందని సూచించారు. హైందవ మత విశ్వాసాన్ని నిజాం నవాబు గౌరవించి మహంకాళీ అమ్మవారికి మేలిమి ముత్యాలను, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి పూజలు నిర్వహించారు. అలాగే చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తమ రాజ్యంలోని మహిళల సౌభాగ్యాన్ని కాపాడమని ప్రార్థించారు. బంగారుచాటలో పసుపు, కుంకమ, గాజులు, ముత్యాలను మూసీనది ప్రవాహానికి సమర్పించారు. దీంతో మూసీ వరద అప్పటికప్పుడు తగ్గుముఖం పట్టడంతో ఆనాటి నుంచి ఏటా లాల్‌దర్వాజా మహంకాళీ అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం వచ్చిందని పెద్దలు చెబుతారు. దీంతో చార్మినార్ లాల్‌బజార్‌లో చుడీబజార్ వెలిసిందని చెబుతారు. ఆనాటి నుంచే ఇక్కడ గాజులు, పూజ సామాగ్రి, దుకాణాలు, పత్తర్‌గట్టి గుల్జార్ హౌజ్ వద్ద మంచి ముత్యాల దుకాణాలు వెలిసినట్టు చెబుతారు.
‘ఘటం’..
బోనాల పండుగలో ‘ఘటం’ ప్రత్యేక ఆకర్షణ. అత్యంత భక్తిప్రపక్తులతో ఘటాన్ని కొలుస్తారు. ‘ఘటం’ అంటే రాగికుండలో కొలువైన అమ్మవారే. రాగికుండను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరిస్తారు. ఘటాన్ని మోసే పూజారి ఒంటినిండా పసుపు రుద్దుకుని, పసుపు దుస్తులు ధరించి, కాళ్లకు, నడుంకు గజ్జెలు ధరిస్తాడు. అమ్మవారి ఘటాన్ని తలపై ఎత్తుకుని బోనాల పండుగ మొదటి రోజు, చివరి రోజు భక్తులు ఊరేగుతారు. పురవీధుల గుండా ఘటాలు వెళ్తున్పుడు అమ్మవారికి బిందెలతో ఎదురెళ్లి ఘటాలను మోసేవారి పాదాలను కడిగి తలపై చల్లుకుని తల్లి దీవెనలను భక్తులు అందుకుంటారు. ఇతర దేవాలయాల్లో పూజారి ఘటాన్ని తలపై మోస్తే, పాతబస్తీ హరిబౌలిలో అక్కన్న మాదన్న దేవాలయం వద్ద మాత్రం ఏనుగుపై ఊరేగిస్తారు. హరిబౌలి నుంచి ప్రారంభమయ్యే ఘటం ఊరేగింపు లాల్ దర్వాజా మీదుగా నయాపూల్‌కు చేరుకుంటుంది. ఘటం ఊరేగుతున్నప్పుడు భక్తజన కోటి అమ్మవారిని దర్శించుకుని దీవెనలు పొందుతారు. ఘటాల ఊరేగింపు బోనాల ఉత్సవంలో నేత్రపర్వంగా కనిపిస్తుంది. పోతురాజుల విన్యాసాలు, డప్పులు, కొమ్ములు, డోలు వాయిద్యాలతో భక్తులు, యువకులు, పూనకంతో ఊగిపోయే మహిళలు లయబద్ధ నృత్యాలతో ఆటపాటలతో ముందుకు సాగే వేడుక భక్తులను ఆనందడోలికల్లో ముంచెతుతాయి.
పోతురాజు...
బోనాల పండుగలో మరో విశిష్టత ‘పోతురాజు’. అమ్మవారికి పోతురాజును సోదరుడిగా భావిస్తారు. బోనాల పండుగ నిర్వహించే ప్రతి అమ్మవారి గుడికి తప్పనిసరిగా అధికారికంగా ఒక పోతురాజు ఉంటాడు. పోతురాజు వేషధారణను కొందరు తమ కుటుంబ వారసత్వంగా స్వీకరిస్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించే సమయంలో ఫలహారం బండికి ముందుండి పోతురాజు భక్తులను అమ్మవారి వద్దకు తీసుకెళ్లడం అనవాయితీ. పోతురాజు వేషధారణ చేసే వ్యక్తి బలశాలిగా ఉంటాడు. ఎర్రని ధోవతిని ధరించి, ఒంటిపై, ముఖంపై పసుపు, కుంకుమలు రుద్దుకుంటాడు. కాలికి, నడుంకు గజ్జెలు కట్టుకుని, వేపాకులు నడుంకు చుట్టుకుంటాడు. చేతిలో పెద్ద కొరడా పట్టుకుని తనను తాను కొట్టుకుంటూ బోనాలకు, ఫలహారం బండికి, ఘటాల ఊరేగింపునకు భక్తజన సమూహంతో కలిసి పోతురాజు ముందుకు సాగుతాడు. బోనం ఎత్తుకొని, పూనకంతో ఊగిపోయే భక్తురాళ్లను అమ్మవారి వద్దకు తీసుకొని వెళ్లేది కూడా పోతురాజే. భక్తులు కోళ్లు, మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పించడానికి ముందు పోతురాజు వేషధారి వాటిని తన దంతాలతో కొరికి చూస్తాడు. అమ్మవారే స్వయంగా పోతురాజు రూపంలోని తన సోదరుడితో మొక్కులు స్వీకరిస్తారని భక్తుల విశ్వాసం.
బోనం...
బోనం.. జానపదులు తమ ఇష్టదైవాలైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. కొత్త పాత్రలో బియ్యం, బెల్లం కలిపి వండుతారు. ఆ తర్వాత కొత్త కుండను సున్నం, జాజు, పసుపు, కుంకుమ ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. అలంకరించిన కుండపై చుట్టూ వేపాకులు పేర్చి, దానిపై చిన్న గినె్నలో పానకం పోసి, దానిపై చిన్న ప్రమిదలో దీపం వెలిగించి బోనాన్ని ఎత్తుకుని మహిళలు అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు. పసుపు నీటిని వేపాకులతో చల్లుకుంటూ బోనం ఎత్తుకున్నవారిని అనుసరించి ఇంటిల్లిపాదీ డప్పులు, కొమ్ము, డోలు వాయిద్యాలతో అమ్మవారి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. నైవేద్యాన్ని (బోనం) అమ్మవారికి సమర్పించిన తర్వాత అందులో కొంత ప్రసాదాన్ని భక్తులు తిరిగి ఇంటికి తెచ్చుకుని కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి పంచి పెడుతారు. కొందరు భక్తులు బోనంతో పాటు కోడి పుంజులను, మేకపోతులు, పొట్టేళ్లను కూడా అమ్మవారికి బలి ఇచ్చి మొక్కులు సమర్పిస్తారు. బోనాల పండుగ సందర్భంగా ఆడపిల్లలను పుట్టింటికి పిలుచుకోవడం కూడా ఆనవాయితీగా వస్తోంది. బలి ఇచ్చిన మేకపోతులు, పొట్టేళ్లు, కోడి పుంజుల కాళ్లను మొకాలి వరకు నరికి అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉండే చెట్టుకు ముడుపు కడుతారు. తమ కోర్కెలు నెరవేరితే మళ్లీ వచ్చే బోనాలకు మరిన్ని మొక్కులు చెల్లించుకుంటామని ముడుపు కడతారు.
రంగం (భవిష్యవాణి)
బోనాల పండుగ చివరి రోజున ‘రంగం’ కార్యక్రమం జరుగుతుంది. రంగం అంటే అమ్మవారు వినిపించే భవిష్యవాణి. ఈ తంతు ఒక్కో ఊరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆ ప్రాంతంపై, గ్రామ పరిస్థితులపై , అక్కడి సమస్యలపై అమ్మవారు స్పందించి భవిష్యవాణిని వినిపిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా? పంటలు బాగా పండుతాయా? అనే విషయాలను కూడా భవిష్యవాణిలో వినిపిస్తారు. ఒక్కోసారి తనకు చెల్లించిన మొక్కులు సంతృప్తికరంగా ఉన్నాయో లేదో కూడా భవిష్యవాణిలో అమ్మవారు భక్తులకు చెబుతుంది. బోనాలు జరిపిన తీరును సమ్మతించానని ఆమె చెబితే- అమ్మవారి ఆశీస్సులు తమకు లభించినట్టు భక్తులు సంతోషిస్తారు. తనకు చెల్లించిన మొక్కులు సరిగ్గా లేవని భవిష్యత్‌వాణిలో ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తే ఇక ఆ సంవత్సరం తమ గ్రామానికి ఎదో అరిష్టం వచ్చిపడుతుందని భక్తులు భయపడి పోతారు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి తామేమి చేయాలో చెప్పాలంటూ ‘రంగం’ చెప్పే మహిళను వారు ప్రాధేయపడతారు.
రాష్ట్ర పండుగగా...
తెలంగాణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా, ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకునే బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్న డిమాండ్ తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా వినిపించింది. జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారిగా బోనాలను రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేరడంతో అమ్మవారికి కేసీఆర్ స్వయంగా బంగారు బోనం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో బోనాలు, బతుకమ్మ పండుగలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కూడా 2015 నుంచి ఏటా బోనాల పండుగను నిర్వహిస్తున్నారు. బోనాలు జరిగే ప్రతి ఆలయానికి ప్రభుత్వమే నిధులు కేటాయించి వసతి సౌకర్యాలు, అలంకరణ వంటి ఏర్పాట్లు చేయిస్తోంది. నిజాం నవాబు స్వయంగా బోనాలను నిర్వహించిన ఆనవాయితీని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనసాగిస్తున్నారు. అందుకే అధికారికంగా బోనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. *

-వెల్జాల చంద్రశేఖర్ 98499 98092