ఈ వారం స్పెషల్

ప్రతి బొట్టూ.. ఒడిసి పట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇడ్లీ పిండి కొంటే బకెట్ నీరు ఉచితం..’- ఇదీ చెన్నై మహానగరంలో ఓ దుకాణం యజమాని తాజాగా స్థానికులకు ఇచ్చిన ‘బంపర్ ఆఫర్..’! మన దేశంలోనే ఆరో పెద్ద నగరంగా ప్రఖ్యాతి గాంచిన చోట తాగునీటి ఎద్దడికి ఈ ఉదంతం తిరుగులేని ఉదాహరణ. వాననీరు వృథా కావడం, భూగర్భ జలాలు శుష్కించిపోవడంతో ఏర్పడిన దీనస్థితి ఇది. మంచినీటిని సరఫరా చేసే జలాశయాలు ఎడారుల్లా మారడంతో నగరాల్లో నీటి కటకట నానాటికీ తీవ్రరూపం దాల్చడం మనం కళ్లారా చూస్తున్న కఠోర వాస్తవం.
***
హైదరాబాద్ మహానగర పాలకసంస్థ పరిధిలోని కూకట్‌పల్లి వద్ద ఓ కాలనీలో నీటిజాడ లేదు.. దీంతో ఇళ్ల వద్ద ఎలాంటి ఫంక్షన్లు జరపరాదంటూ చాలా అపార్ట్‌మెంట్ల వారు ఏకగ్రీవంగా తీర్మానించుకొన్నారు. అదే కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నీటి కొరత కారణంగా పిల్లలకు సెలవు ప్రకటించారు. మరికొన్ని స్కూళ్లలో నీటి ట్యాంకర్లను తెప్పించడానికి అయ్యే ఖర్చును విద్యార్థుల తల్లిదండ్రులే భరించాలనడం వివాదాన్ని రాజేసింది. ఇంకో ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల నుంచి రుసుము వసూలు చేసి వాటర్ బాటిళ్లు కొనుగోలు చేశారు. కొన్ని కాలనీల్లో అయితే నీటి వాడకంపై పరిమితులు విధించడం, ఎక్కువగా నీటిని వాడే అద్దెదార్లు ‘కొంపలు ఖాళీ చేయాల’ని ఇంటి యజమానులు హుకుం జారీ చేయడం చూస్తుంటే నీటి కష్టాలు ఎంతటి తీవ్ర స్థాయికి చేరాయో ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది.
***
నీరు భగవంతుని ప్రసాదం.. జలం గురుపీఠం లాంటిది.. ప్రతి నీటిచుక్కనూ కాపాడుకొనేందుకు జనమే ఉద్యమించాలి.. ‘స్వచ్ఛ్భారత్’ మాదిరి ‘జల సంరక్షణ’ ఓ ప్రజా ఉద్యమంలా మారాలి.. వర్షపునీటిలో కేవలం ఎనిమిది శాతం జలానే్న సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం.. నీటి ఎద్దడి సమస్య పరిష్కారానికి సమయం ఆసన్నమైంది.. ‘జల దేవాలయాల’ నిర్మాణంలో పల్లెలు పోటీ పడాలి.. నీటి సంరక్షణకు ఒకే విధమైన పద్ధతంటూ లేదు.. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా జల సంరక్షణలో ప్రజలే భాగస్వాములు కావాలి.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాయిపల్లిలో నిర్మించిన చెరువు కారణంగా ఆ గ్రామవాసుల జీవన విధానంలో వచ్చిన మార్పులు యావత్ దేశానికీ స్ఫూర్తిదాయకం..
- ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో ప్రధాని
నరేంద్ర మోదీ
***
ఒకవైపు దక్షిణాదిలో చెన్నై నగరం గొంతెండిపోయి దాహార్తితో అలమటిస్తోంది.. సరిగ్గా ఇదే సమయంలో పడమటి దిక్కున దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం పీకల్లోతు వరద నీటిలో బిక్కుబిక్కుమంటోంది.. ఈ రెండు సమస్యలకూ కారణం పాలకులు అనుసరిస్తున్న విధానాల్లోనే ఉంది. మహా నగరాల్లో అంబరాన్ని చుంబించే బహుళ అంతస్థుల భవనాలుంటాయి.. లక్షలాది మందికి జీవనోపాధినిచ్చే వాణిజ్య, పారిశ్రామిక వాడలుంటాయి.. సువిశాలమైన రహదారులు- వాటిపై దూసుకుపోయే విలాసవంతమైన వాహనాలుంటాయి.. ఇవి మాత్రమే సుఖ జీవనానికి ఆనవాళ్లు కావు.. ఈ సౌకర్యాలన్నీ పదికాలాల పాటు సురక్షితంగా ఉండాలంటే వాటికి సమీపంలో చెరువులు, సరస్సులు ఉండాలి.. అవి కురిసే వర్షపునీటినంతా ఇముడ్చుకోగలగాలి.. వాననీరు వరదలై ప్రవహిస్తే మహానగరాలు నీటిపై తేలియాడుతూ- వెడల్పాటి రోడ్లు, భారీ భవంతులు ఎందుకూ కొరగాకుండా పోతాయి.. చెట్లు, వనాలు, పచ్చికలు వంటివి నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించడమే కాదు.. వాతావరణ సమతుల్యతను రక్షిస్తాయి. భూగర్భ జలవనరులను పెంచుతాయి. వేసవి తాపాన్ని తీరుస్తాయి. అందుకే వర్షపునీరు నేలలోకి ఇంకేందుకు వీలుండాలి. కానీ నగరాలన్నీ ‘కాంక్రీటు వనాలు’గా మారుతుంటే- వాననీరు ఇంకేందుకు, భూగర్భ జలాలు పెరిగేందుకు అవకాశం ఎక్కడిది? ముంబయి నగరాన్ని ముంచెత్తిన వరద నీరు సముద్రంలోనో, సమీపంలోని నదుల్లోనో కలుస్తూ వృథా అవుతోంది. సమర్థవంతమైన ప్రణాళికలు లేనందున మహానగరాలు ఏటా వరద బీభత్సాన్ని, నీటి ఎద్దడిని ఎదుర్కోవడం సమాంతర వైపరీత్యం..
ప్రభుత్వాలకు పెను సవాల్...
జనాభా పెరుగుతున్నకొద్దీ, నగరీకరణ నానాటికీ విస్తృతం అవుతున్నకొద్దీ నీటి ఎద్దడిని నివారించడం మన ప్రభుత్వాలకు అతి పెద్ద సవాల్‌గా మారింది. రక్షిత మంచినీటి సరఫరా, పైప్‌లైన్ల ద్వారా పల్లెలకు తాగునీరు వంటి పథకాలెన్ని అమలు చేస్తున్నా అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. దేశవ్యాప్తంగా 255 జిల్లాలను నీటి ఎద్దడి నుంచి రక్షించేందుకు కేంద్రం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. ‘జల్‌శక్తి అభియాన్’ కింద జల సంరక్షణ చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగానే వ్యూహరచన చేసింది. భూగర్భజల నిపుణులు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో బృందాలను ఏర్పాటు చేసి నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు ప్రారంభించింది. 2024 సంవత్సరం అంతానికి ప్రతి ఇంటికీ పైప్‌లైన్ ద్వారా సురక్షిత మంచినీటిని అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. అయితే, నిధులు దండిగా ఖర్చవుతున్నా జల సంరక్షణ పట్ల జన చైతన్యం కొరవడడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు.
వర్షాలు సమృద్ధిగా కురవకపోవడం, జల సంరక్షణ చర్యలు లేకపోవడంతో నీటి వనరులు రానురానూ ‘జలకళ’ కోల్పోతున్నాయి. చెరువులు, కుంటలు, సరస్సులు, చిన్న నదులే కాదు.. పెద్ద పెద్ద నదుల్లో సైతం నీరు ‘ప్రవహించడం’ లేదు. వాననీటిని ఒడిసిపట్టకపోవడం, వర్షాలు గగనమై పోవడంతో 2020 నాటికి మన దేశంలో 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు ‘శూన్య’ స్థాయికి చేరుకోవడం ఖాయమని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మరో పదేళ్లలో ప్రజల అవసరాలకు సగం నీళ్లు మాత్రమే లభ్యమయ్యే దుస్థితి దాపురిస్తుందంటున్నారు.
ఎండలతో ఠారెత్తించిన వేసవి వెళ్లిపోయింది.. రోళ్లు పగిలే ఉష్ణోగ్రతలు తటాకాలను, సరస్సులను, నదులను, ఇతర జలవనరులను ‘జీవకళ’ లేకుండా చేశాయి. ఇపుడు వర్షాకాలం మొదలైనా చినుకు జాడ కానరావడం లేదు. మొక్కుబడిగా ఒకటో, రెండో జల్లులు తప్ప భారీ వర్షాలు కురుస్తాయన్న నమ్మకం లేదు. కారుమబ్బులు ఆశలు రేపుతున్నా వానలు సమృద్ధిగా కురుస్తాయా? అన్న సందేహాలు షరామామూలుగా మారాయి. వానాకాలం మొదలై వారాలు గడుస్తున్నా చెరువులు, నదులు నిండే పరిస్థితి కానరావడం లేదు. గత రెండు, మూడు సంవత్సరాలుగా ఇదే వాతావరణం జనాలను బెంబేలెత్తిస్తోంది. పుష్కలంగా వర్షాలు పడే సూచనలు లేకపోవడంతో దేశమంతటా ఇదే ఆందోళన. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మనం ఎంతటి పురోగతి సాధించినా- పొలాలకు సాగునీటిని, ప్రజలకు తాగునీటిని తగినంతగా అందించలేని పరిస్థితి నెలకొంది. నీటి సమస్య తీవ్రతరం కావడంతో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికపై కొన్ని చర్యలను ప్రారంభించాయి. తమిళనాడులో నీటికొరత ఎంతటి తీవ్రస్థాయికి చేరిందంటే- అక్కడి కొన్ని ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు- ‘ఆఫీసులో నీళ్లు లేవు, ఇంటి నుంచే పనిచేయండి మహాశయా..!’ అంటూ సూచిస్తున్నాయి. నీటి ఎద్దడి కారణంగా బహుళ అంతస్థుల భవన నిర్మాణాలకు అనుమతులు నిలిపి వేయాలని కర్నాటక ప్రభుత్వం యోచిస్తోంది. నీటి సమస్య తమిళనాడు, కర్నాటకలకే కాదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లోనూ తీవ్రరూపం దాల్చింది. సాగునీటి సంగతేమో కానీ, జనం గొంతు తడిపేందుకు గుక్కెడు నీళ్లు అందించలేని దుస్థితి అనేక రాష్ట్రాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో మంచినీటి కోసం పరితపిస్తున్న 255 జిల్లాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.
‘జల్ శక్తి’ ఆవిర్భావం..
నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘జల్ శక్తి’ మంత్రిత్వశాఖను కొత్తగా ప్రారంభించింది. ఇంతకుముందు ఉన్న జల వనరులు, మంచినీటి సరఫరా, పారిశుధ్యం మంత్రిత్వ శాఖలను విలీనం చేసి, ‘జల్ శక్తి’ శాఖను మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో నీటికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇకపై ‘జల్ శక్తి’ పర్యవేక్షిస్తుందని ఆ మంత్రిత్వశాఖను చేపట్టిన గజేంద్ర సింగ్ షెఖావత్ తెలిపారు. పరిశుభ్రమైన తాగునీటిని అందించడం, అంతర్ రాష్ట్ర వివాదాలను పరిష్కరించడం, గంగానది ప్రక్షాళన వంటి పనులకు తమ మంత్రిత్వశాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు దేశ ప్రజలకు మంచినీటిని అందించేందుకు వివిధ ప్రణాళికలను తాము అమలు చేస్తామని మంత్రి భరోసా ఇస్తున్నారు. నీటి ఎద్దడిని నివారించడానికే తాము దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు గజేంద్ర సింగ్ చెబుతున్నారు.
నీటిని ఆదా చేద్దాం..
నీళ్లున్న ప్రాంతాల్లో ప్రజలు అనుక్షణం జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లున్నాయన్న ధీమాతో ఏ కొందరు వృథా చేసినా భవిష్యత్‌లో నీటి కొరత అందరి సమస్యగా మారుతుందని, ప్రతి నీటి బొట్టునూ పదిలంగా వాడుకుంటే ఎంతోమంది దాహార్తిని తీర్చినట్టవుతుందని వారు చెబుతున్నారు. జల సంరక్షణ అందరి బాధ్యత అని సామాజిక వేత్తలు హితవు పలుకుతున్నారు. భూగర్భ జలాలను అనునిత్యం యథేచ్ఛగా తోడుకోవడం తప్పితే, వాటిని మళ్లీ అదే స్థాయిలో నింపే మార్గం లేకపోతోంది. భూగర్భ జలాలు నానాటికీ అడుగంటిపోతూ బోర్లు ఎండిపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వందలాది అడుగుల మేరకు భూమిని తవ్వినా జలం జాడ కానరావడం లేదు. హైదరాబాద్ నగరంలో నేలను రెండువేల అడుగులకు తవ్వినా నీటి చుక్క కనిపించడం లేదు. రాబోయే ముప్పుకు ఇది భీతిగొలిపే సంకేతం! గొట్టపుబావులే కాదు, దేశవ్యాప్తంగా అత్యధిక స్థాయిలో జల వనరులు పనికిరాకుండా పోతున్నాయి. కాలుష్యం కారణంగా తమిళనాడులో 30 శాతం, రాజస్థాన్‌లో 40 శాతం, కర్నాటకలో 51 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 32 శాతం జలవనరులు పనికిరాకుండా పోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి దేశ వ్యాప్తంగానూ నెలకొంటోంది.
జాడలేని వాన..
తొలకరి చిన్నబోతోంది. ఖరీఫ్ ఆరంభంలోనే ప్రతికూల వాతావరణం కొనసాగుతోంది. పంటకాలం మొదలై నెల రోజులు దాటినా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వానల జాడ లేదు. ఒకటీ అరా చెదురుమదురు జల్లులే తప్ప భారీ వర్షం పడే సూచనలే లేవు. గత నెలలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. మొత్తంగా చూస్తే సాధారణ విస్తీర్ణంలో నాలుగు శాతం కూడా పంటలు సాగు కాలేదు. తొలకరి వర్షాలే ఖరీఫ్ పంటలకు దిశానిర్దేశం చేస్తాయి. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు అడుగుపెట్టే సరికే జూన్ నెలాఖరైంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గత 30 సంవత్సరాల్లో పదకొండుసార్లు మాత్రమే వర్షాలు అనుకూలించాయి. 2015 నుంచి 2018 వరకూ కాస్త మంచి వర్షాలే కురిసినా, మిగిలిన 19 ఏళ్లలో చాలీచాలని వర్షాలతో ఖరీఫ్ కాలం సాగింది. ఏపీలో కురవాల్సిన సాధారణ సగటు వర్షపాతం 93.7 మి.మీ కాగా, ఈ స్థాయిలో వర్షం కురియడం అసాధరణమై పోతోంది. 43.6 శాతం లోటు వర్షపాతం పంటల విస్తీర్ణాన్ని తగ్గిస్తూ, రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. సకాలంలో సమృద్ధిగా వానలు లేనందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సాగునీటికి, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.
వర్షం చుక్క కోసం జనం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. జూన్‌లో జోరుగా పడాల్సిన వానలు జూలై మొదటి వారంలోనూ కరుణించడం లేదు. రుతుపవనాలు విస్తరించినా, ఆషాఢ మాసం ప్రారంభమైనా మేఘాలు ముఖం చాటేయడంతో సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజలు ఎదురుతెన్నులు చూస్తున్నారు. దక్షిణాదిలో రుతుపవనాలు ఇప్పటికే విస్తరించాయని వాతావరణ శాస్తవ్రేత్తలు చెబుతున్నా, చినుకు కురిసిన దాఖలాలు లేవు. జూన్ నెలాఖరు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే 31 శాతం, తెలంగాణలో 37 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాలో 35 శాతం, రాయలసీమలో 22 శాతం తక్కువగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో సాగునీటి సంగతి దేవుడెరుగు.. తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారు. రుతుపవనాలు ప్రవేశించినా ఎండ, ఉక్కపోతతో వేసవి వాతావరణం కొనసాగడంతో ఈ ఏడాది వర్షాలు కనీస స్థాయిలో ఉంటాయో? లేదో?? అని కర్షకులు కలవరపడుతున్నారు.
గత ఏభయి ఏళ్లతో పోల్చితే దేశవ్యాప్తంగా ఇపుడు 24 శాతం తక్కువగా వానలు కురుస్తున్నట్లు వాతావరణ విభాగం చెబుతోంది. కొనే్నళ్లుగా వానల రాక అలస్యం కావడంతో సీజన్ అంతా కలిపినా సాధారణ వర్షపాతం నమోదు కావడం లేదు. విత్తనాలు వేసే సమయంలోనే కాదు, పంటలు ఎదిగే సమయంలోనూ వానలు కురవడం లేదు. దీంతో అన్ని రకాల పంటల దిగుబడులు తగ్గుతున్నాయి. పంట దిగుబడులు గణనీయంగా తగ్గడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, దేశ స్థూల జాతీయోత్పత్తి తగ్గడం, కొనుగోలు శక్తి క్షీణించడంతో పోషకాహారం లోపించడం, వ్యాధులు విజృంభించడం అనివార్యమవుతోంది.
అల్పపీడనం తోడైతేనే..
రుతుపవనాల ఆగమనం వల్లనే మేఘాలు ఏర్పడి వానలు కురుస్తాయి. కానీ భూ ఉపరితలానికి బాగా ఎత్తులో ఏర్పడే మేఘాల వల్ల ఉపయోగం లేదని, ఇవి అంతగా వర్షాన్ని ఇవ్వలేవని నిపుణులు అంటున్నారు. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉన్నా, మన దేశంలో భూ ఉపరితలంపై వాతావరణం సహకరించక వర్షాలు పడడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఉన్నపుడే వానలు కురుస్తున్నాయి. ఏటా జూన్‌లో రెండు, మూడు అల్పపీడనాలు, కనీసం రెండు వాయుగుండాలు ఏర్పడాల్సి ఉంది. అయితే, రానురానూ ఇటువంటి పరిస్థితులు మృగ్యమవుతున్నాయి. వాయుగుండాలు, అల్పపీడనాలు వస్తే రుతుపవనాలు ఊపందుకుంటాయి. ఇలాంటి పరిస్థితిలోనే జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. వాయుగుండాలు, అల్పపీడనాలు లేకుంటే వానలు కురిసే అవకాశాలు తక్కువే.
‘ఎల్‌నినో’ ప్రభావం..!
గత సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు హిందూ మహాసముద్రం నుంచి భూమధ్య రేఖ దాటి- అరేబియా సముద్రం, బంగాళాఖాతం వైపు రాకుండా దక్షిణ చైనా సముద్రం వైపు పయనిస్తున్నాయి. దీంతో మయన్మార్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఎల్‌నినో ప్రభావం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది.. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నందున అల్పపీడనాల జోరు మందగించింది. వాయుగుండం ప్రభావంతో తప్ప కోస్తా ప్రాంతంలో మినహా మిగతా చోట్ల వానలు కురిసే అవకాశం లేదు. రుతపవనాలు విస్తరిస్తున్న సమయంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో వానలు కురవాల్సి ఉంది. అయితే, ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి కానరావడం లేదు.
నీటిని తోడేస్తున్నారు...
నైరుతి రుతుపవనాలు ఆలస్యమై దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తుండగా మరోవైపు- భూగర్భ జలాలు పాతాళానికి చేరుకోవడం ఆందోళన కలిగించే విపరిణామం. వర్షాలు లేక భూగర్భ జలాలు నానాటికీ అడుగంటుతున్నాయి. ఏపీలో భూగర్భ జలమట్టం 15.96 మీటర్లుగా నమోదైంది. గత ఏడాది కంటే ఇది 2.36 మీటర్లు ఎక్కువ. ఈ నేపథ్యంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ భారీగా నిధులు విడుదల చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. నీటి అవసరాలు పెరగడం, సరిపడా వర్షాలు లేకపోవడంతో తెలంగాణలోనూ భూగర్భం వట్టిపోతోంది. గత నెలలో తెలంగాణలో నీటిమట్టం 2.13 మీటర్ల లోతుకు పడిపోయింది. వర్షాభావం వల్ల భూగర్భంలో చేరే నీటి శాతం తగ్గిపోతోంది. సాధారణ వర్షపాతం కంటే తక్కువగా వానలు కురవడంతో ఆ ప్రభావం భూగర్భ జలాలపై పడుతోంది. తెలంగాణలో హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో ఎక్కువ శాతం మేరకు నీటి మట్టం పడిపోయింది.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ వంటి మహా నగరాల్లో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్థుల భవనాలను నిర్మించడంతో భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో లోతుకు వెళ్లడం గమనార్హం. అనుమతులు లేని నిర్మాణాలతో ట్రాఫిక్ సమస్యే కాదు, నీటి కొరత తీవ్రరూపం దాలుస్తోంది.
శుద్ధి చేసిన జలాలతో..
మురుగునీటిని శుద్ధి చేసి- గార్డెనింగ్, పరిశ్రమల అవసరాల కోసం వాడితే తాగు జలాలను ఆదా చేసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో పబ్లిక్ పార్కులకు, ఇళ్లలో గార్డెనింగ్‌కు, పారిశ్రామిక అవసరాలకు తాగునీటినే వాడుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరి మురుగునీటిని శుద్ధి చేసి ఇలాంటి అవసరాలకు వినియోగించడం ఉత్తమం.
జోరుగా నీటి వృథా..
పట్టణాలు, నగరాల్లో చాలా ఇళ్లలో ‘సంపులు’ వంటివి ఉండవు. అవసరాలకు నీటిని పట్టుకున్నాక మిగతా జలాలను రహదారులపైకో, మురుగు కాల్వల్లోకో వదిలేస్తుంటారు. చాలామంది తమ ఇళ్లలో వాహనాలను కడిగేందుకు సైతం నల్లా నీటిని ఇష్టారాజ్యంగా వాడుతుంటారు. నల్లా నుంచి నీరు ధారగా కారుతుండగా బట్టలు ఉతకడం, పాత్రలు తోమడం, స్నానం చేయడం, పండ్లు తోమడం వంటివి చూస్తుంటాం. బకెట్లలో నీటిని నింపుకొని వాడడం అరుదుగా కనిపిస్తుంది. ఇళ్లలోనే నీటి వృథాగా ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తాయి. తక్కువ నీటితో ఎక్కువ ఉపయోగం పొందడంపై చాలామందిలో అవగాహన ఉండదు. అవగాహన ఉన్నా- చాలామందిలో అలక్ష్యం కనిపిస్తుంది. నీటి విలువ తెలిసినపుడే దాన్ని పొదుపుగా వాడే వీలుంటుంది. పట్టణాల్లో, నగరాల్లో పైపులైన్ల లీకేజీల వల్ల కూడా ఎంతో నీరు వృథా అవుతున్నా అధికారులు, పాలకులు పట్టించుకోని దుస్థితి నెలకొంది.
ఇంకుడు గుంతలు తప్పనిసరి..
వర్షం కురిసినపుడు రోడ్లు మునిగిపోవడం, వరద నీరంతా వృథాగా మురుగుకాల్వల్లో కలసిపోవడం నిత్యం మనం చూస్తున్న దృశ్యాలే. వాన నీటిని నిల్వ చేసేందుకు స్థానిక సంస్థలే కాదు, ప్రజలూ ఉద్యమించాలి. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు తవ్వి వాన నీటిని నిల్వచేస్తే భూగర్భ జలాలు కాస్తయినా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకుడు గుంతలు లేనిదే ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇచ్చేది లేదని అధికారులు నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. ఇంకుడు గుంతల ద్వారా జల సంరక్షణకు జనం స్వచ్ఛందంగా ముందుకు రావాలి.
జల సంక్షోభం తీవ్రం...
2050 నాటికి భారత్‌లో నీటి కొరత మరింత తీవ్రరూపం దాలుస్తుందని, 40 శాతం మేరకు భూగర్భ జలాలు అంతరించి పోతాయని ఐక్యరాజ్య సమితిలోని ‘వరల్డ్ వాటర్ డిపార్ట్‌మెంట్’ తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోనే ‘పరిశుభ్రమైన నీరు దొరకని దేశాల్లో’ భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి భూగర్భ జలాలను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నందున- ఇక భూ ఉపరితలంపై జల వనరులను ఏర్పాటు చేసేందుకు భారత్ దృష్టి సారించాల్సి ఉంటుంది. చైనా తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశంగా భారత్ కీర్తిని ఆర్జించినప్పటికీ పరిశుభ్రమైన నీటిని అందించడంలో మాత్రం బాగా వెనుకబడే ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమల రంగానికి భారీగా నీటి వినియోగం, జల కాలుష్యం, నీటి వనరుల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు లేకపోవడం వంటివి భారత్‌కు శాపంగా మారాయి. ఇప్పటికీ గ్రామసీమల్లో మహిళలు, బాలికలు బిందెడు మంచినీళ్ల కోసం కాలినడకన సుదూర ప్రాంతాలకు వెళ్లడమే గాక లింగ వివక్షను సైతం ఎదుర్కొంటున్నారు. పరిశుభ్రమైన జలాలను ప్రజలకు అందించడమే తమ లక్ష్యమని పాలకులు చెబుతున్నా, దుర్భిక్ష పరిస్థితులు, జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన లోపించడంతో ఆశించిన లక్ష్యాలు నెరవేరడం లేదు. నీటి సమస్య విషయంలో భారత్‌కు మున్ముందు పెను సవాళ్లు ఎదురవుతాయని ‘వాటర్ ఎయిడ్’ సంస్థ తన నివేదకలో వెల్లడించింది.
నీటికష్టాలు వద్దంటున్న వధువులు..
అత్తవారింట్లో మరుగుదొడ్డి లేకుంటే పెళ్లి చేసుకొనేది లేదని తెగేసి చెబుతున్న వధువులు ఇపుడు నీటి కష్టాలను తాము భరించలేమని కుండబద్దలు కొడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో, మహారాష్టల్రోని కొన్ని జిల్లాల్లో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అత్తవారింటికి వెళ్లి బిందెడు మంచినీళ్ల కోసం ప్రతిరోజూ తాను దూరాభారం నడవలేనని ఓ వధువు పెళ్లికి నిరాకరించింది. మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేక అవి ఉపయోగ పడడం లేదని కొందరు కొత్త కోడళ్లు అత్తారింటికి వెళ్లడం లేదు. అలాగే, నీటి ట్యాంకర్ వచ్చినపుడు బంధువుల మధ్యే కొట్లాటలు, కుమ్ములాటలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. నీటిని పొదుపుగా వాడని వారిని ఇల్లు ఖాళీ చేయించే క్రమంలో ఇంటి యజమానులు భౌతిక దాడులకు దిగుతున్న ఉదంతాలూ ఉత్తరాది రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్నాయి.
చైనా స్ఫూర్తిదాయకం..
మన దేశంలో ముంబయి, చెన్నై, ఢిల్లీ నగరాల మాదిరి చైనాలోనూ అనేక నగరాలు ఏటా వరద తాకిడికి గురవుతుంటాయి. ఈ పరిస్థితిని గమనించి 2013లో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ భారీ ప్రణాళికను ప్రకటించారు. వర్షపునీటినంతా ఒడిసి పట్టాలని, ఆ నీటిని ఇముడ్చుకొనేలా నగరాలకు వెలుపల చెరువులు, సరస్సులు, కుంటలు ఉండాలని, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకోవాలని ఆయన పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ విధానాలు అమలు చేసిన అయిదారేళ్ల తర్వాత నగరాల స్వరూపమే మారిపోయింది. వరదలు ముంచెత్తినా చైనాలోని నగరాల్లో నీరు నిలిచే అవకాశమే ఉండదు. వాననీరు యావత్తూ భూమిలోకి ఇంకిపోయేలా ఏర్పాట్లు చేయడమే ఇందుకు కారణం. ఇలాంటి బృహత్తర ప్రణాళికలను మన దేశంలోనూ అమలు చేస్తే నగరాలు వరద తాకిడి నుంచి బయటపడే వీలుంటుంది.
సమాచారం పంపండి..
జల సంరక్షణ జన ఉద్యమంలా సాగాలని ఇటీవల ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల నుంచి సలహాలు, సమాచారాన్ని కూడా ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు. నీటి సంరక్షణ ప్రాధానంపై నిపుణులే కాదు, సాధారణ పౌరులు సైతం ఇతరుల్లో అవగాహన కలిగించాలని ఆయన కోరారు. జల సంరక్షణ విషయంలో సంప్రదాయ విధానాలపై విస్తృత ప్రచారం అవసరమన్నారు. నీటి సంరక్షణ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. ఈ విషయాలపై తనకు సమాచారాన్ని ఇచ్చేవారు- # janshakti4jalshakti కి పంపాలని ప్రధాని సూచించారు. పరిశుభ్రతపై ప్రజా ఉద్యమం నడుస్తున్నట్టుగానే జల సంరక్షణపైనా అన్ని వర్గాల ప్రజలూ కదలి రావాలని ఆయన కోరారు.
‘నీరున్న చోట నాగరికత వెలుస్తుంది..’ ఇది పాత సామెత. ‘నీరులేని ప్రాంతం నగరమైనా నరకాన్ని తలపిస్తుంది..’ ఇది నేడు చెప్పుకోవాల్సిన మాట. దేశంలో నానాటికీ జనాభా పెరగడం, నగరాలకు వలసలు ఉద్ధృతం కావడతో నీటి సమస్య ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రజలకు తాగునీటిని సరఫరా చేయడం ప్రభుత్వాలకు సవాల్‌గా పరిణమిస్తోంది. నీటి వినియోగంలో పొదుపు పాటించకపోవడం, ప్రతి వర్షపు బొట్టునూ ఒడిసి పట్టాలన్న ధ్యాస లేకపోవడంతో దేశం గొంతెండుతోంది. మేఘాలు ముఖం చాటేయడంతో వర్షరుతువులోనూ నీటి ఎద్దడి అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో జల సంరక్షణపై జన చైతన్యమే ఏకైక పరిష్కారం.
*
దారి చూపిన దయానంద్..
వచ్చే ఏడాది నాటికి మన దేశంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి 21 నగరాలు నీటి ఎద్దడిని తీవ్ర స్థాయిలో ఎదుర్కొంటాయని ‘నీతి ఆయోగ్’ ఇటీవల తన నివేదికలో హెచ్చరించగా- ఆ పరిస్థితులు ఇప్పటికే చాలా చోట్ల ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. నీటి ఎద్దడితో విలవిలలాడుతూ వార్తల్లోకెక్కిన చెన్నై నగరంలో నీటి పొదుపుపై కొందరు వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. చెన్నైలోని చిట్లపాక్కం ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల దయానంద్ కృష్ణన్ కేవలం 250 రూపాయల ఖర్చుతో వాననీటిని సద్వినియోగం చేసే పరికరాన్ని సృష్టించారు. రెండు పీవీసీ పైపు ముక్కలు, మూడడుగుల పీవీసీ గొట్టం, ఇరవై రూపాయలు ఖరీదు చేసే పల్చటి వస్త్రం, ఒక డ్రమ్ము ఉపయోగించి వాననీటిని నిల్వ చేసే సరికొత్త విధానాన్ని ఆయన కనుగొన్నారు. ఈ పైపుల ద్వారా కేవలం పది నిముషాల వ్యవధిలో డ్రమ్ములోకి 225 లీటర్ల నీరు చేరుతుంది. ఇంటి పైకప్పు నుంచి పడే వర్షపునీటిని పైపుద్వారా డ్రమ్ములోకి చేర్చడం, వాననీటిని వడగట్టేందుకు పరిశుభ్రమైన వస్త్రాన్ని వాడడం తప్ప ఇందులో పెద్దగా ఖర్చేమీ లేదని దయానంద్ చెబుతున్నారు. దయానంద్ బాటలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు సైతం వాననీటిని నిల్వ చేసేందుకు పలు పద్ధతులను ప్రజలకు సూచిస్తున్నాయి. చెన్నైలో ఐటీ కారిడార్ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యులు కేవలం గంట వ్యవధిలో 30వేల లీటర్ల వాననీటిని నిల్వ చేసే విధానాన్ని స్థానికులకు వివరిస్తున్నారు. ‘శబరి టెర్రస్ అపార్ట్‌మెంట్’ సభ్యులు ఇలా వాననీటిని భారీగా నిల్వ చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌పై ఉన్న 25వేల చదరపు అడుగుల టెర్రస్‌పై నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌లో 56 కుటుంబాలు నివసిస్తున్నాయి. భూగర్భ జలాలను పెంచేందుకు సైతం వీరు కృషి చేస్తున్నారు. ఎప్పుడు వర్షం కురిసినా వాననీరు కొంత ట్యాంకులోకి, మరికొంత భూగర్భంలోకి పోయేలా ఏర్పాట్లు చేశారు. 30 వేల లీటర్ల నీటిని నిల్వ చేయడమంటే అయిదు వేల రూపాయలను ఆదా చేసినట్టేనని ‘శబరి టెర్రస్ అపార్ట్‌మెంట్’ వాసులు ఆనందంతో చెబుతున్నారు. వాననీటిని నిల్వ చేయడంతో నీటి కష్టాలన్నీ తీరకపోయినా, వంటకు తప్ప ఇతర అవసరాలకు మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చే నీటి కోసం ఆధారపడనవసరం లేదంటున్నారు.
వాననీటిని భద్రపరచాలి
చెన్నై నగరంలో తాగునీటి కష్టాలు తీరాలంటే వర్షపునీటిని భద్రపరచేలా విస్తృత ఏర్పాట్లు చేయాలని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సూచించారు. వాననీటిని భద్రపరచేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. చెరువులు, సరస్సులు, జలాశయాలను వాననీటితో నింపాలన్నారు. ఈ సమయంలో తగిన చర్యలు తీసుకోకుంటే మున్ముందు పరిస్థితి ఇంకా విషమిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రుతుపవనాలు ప్రవేశించినందున వాననీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను అమలు చేయాలన్నారు. కాగా, నగర ప్రజలను ఆదుకొనేందుకు ఇప్పటికే రజనీకాంత్ వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేసి తన వంతు సాయం చేస్తున్నారు. కాగా, ‘టైటానిక్’ హీరోగా ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ నటుడు లియోనార్డో డీ కాప్రియో సైతం చెన్నైలో నీటి ఎద్దడి విషమించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు పడి చెన్నై తేరుకొంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పొదుపు మంత్రమే శరణ్యం..
‘జల సంరక్షణ.. జన ఉద్యమం..’ వంటి భారీ పదాలతో పని లేదు.. ప్రతి కుటుంబంలోని సభ్యులంతా నీటిని పొదుపుగా వాడితే జల సంరక్షణలో భాగస్వాములైనట్టే. పండ్లు తోముకోవడం, స్నానం, బట్టలు ఉతకడం, వంట సామాగ్రిని శుభ్రం చేయడం, వాహనాలను కడగడం.. ఇలా ప్రతి సందర్భంలోనూ నీటిని పొదుపుగా వాడడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. నీటి విలువ తెలిస్తే నీటి వృథాను సులభంగా అరికట్టవచ్చు. ఇళ్లలోని కుళాయి నుంచి ధార వస్తుండగా నీటిని వృథా చేయడం సర్వసాధారణం. పొదుపు మంత్రం అనేది ధనానికే కాదు, నీటికీ ఎక్కువగా వర్తిస్తుందని అన్ని వయసుల వారూ అవగాహన పెంచుకోవాలి. నీటిని పొదుపుగా వాడడం వల్ల భావి తరాల వారికి మనం ఎంతో మేలు చేసినట్టని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నీటి పొదుపు పాటిస్తేనే- జల సంక్షోభం నుంచి సులువుగా బయటపడే వీలుంటుంది. వంటగది నుంచి వాష్‌రూమ్ వరకూ నీటిని పొదుపుగా వాడితే రోజూ కొన్ని వందల లీటర్ల నీటిని మనం దాచుకున్నట్టే. పట్టణ, నగర ప్రాంతాలు నీటి కటకట నుంచి బయటపడాలంటే నీటిని అవసరం మేరకే వాడాలి.
వర్షం కురిసే సమయంలో ఆ నీటిని ఇళ్లపై ఉండే ట్యాంకుల్లో, ఇంటి ఆవరణలోని డ్రమ్ముల్లో నింపుకోవాలి. ఇళ్లలో గార్డెనింగ్‌కు, వాహనాలను శుభ్రం చేసేందుకు ఈ నీటిని వాడుకోవచ్చు. ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉంచి, వాననీరు భూమిలోకి ఇంకేలా చూసుకోవాలి.
బంగారం కన్నా
నీరే ప్రియం..!
తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంలో ఇపుడు బంగారం కంటే నీటికే ఎక్కువ ధర పలుకుతోందని జనం వ్యాఖ్యానిస్తున్నారు. గత కొనే్నళ్లుగా సకాలంలో వానలు కురవక పోవడంతో చెన్నై నగరానికి తాగునీటిని అందించే జలాశయాలన్నీ వట్టిపోయాయి. వానలు కురిస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి తాము గట్టెక్కే పరిస్థితి లేదని చెన్నై వాసులు వాపోతున్నారు. బిందెడు నీటిని దక్కించుకొనేందుకు వాటర్ ట్యాంకర్ల వద్ద జనం యుద్ధం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. భూగర్భ జలమట్టం పెరిగితే తప్ప పుష్కలంగా నీరందించలేమని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వేలాది వాటర్ ట్యాంకర్లను తెచ్చినా ప్రజలకు ‘నీటి బాధలు’ తప్పడం లేదు. ఈ ఏడాది కూడా వానలు కురవకపోతే పరిస్థితి మరింతగా విషమిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్యాలయాల్లో నీటి కొరత కారణంగా కొన్ని ఐటీ సంస్థలు తమ ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేసేందుకు అనుమతి ఇస్తున్నాయి.

-పి.ఎస్.ఆర్.