ఈ వారం స్పెషల్

‘చదివింపుల’ కాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లకు వెళ్తే 4డీ ఎఫెక్ట్, 6డీ ఎఫెక్ట్.. అదే సింగపూర్ లాంటి విదేశాలకు వెళ్తే 12డీ ఎఫెక్ట్ సినిమాలు చూసి ఎంతో థ్రిల్ ఫీలవుతాం.. అదో మాయాప్రపంచం..! సినిమా చూస్తున్నంత సేపూ మనం కూడా అందులో కొట్టుమిట్టాడుతూ అది పూర్తి కాగానే ‘అంతా మిథ్య’ అంటూ బయటపడతాం. అలాంటి 4డీ ఎఫెక్ట్, 6డీ ఎఫెక్ట్‌లు ఇచ్చేందుకు స్కూళ్లు, కాలేజీలు మరోసారి సిద్ధం అవుతున్నాయి.
ఎల్‌కేజీ, యూకేజీ మొదలు యూజీ, పీజీ వరకూ అడ్మిషన్లు పెద్ద ప్రహసనంలా మారుతున్నాయి. అందుకోసం విద్యార్థుల తల్లిదండ్రులు తమ శక్తియుక్తులను ప్రయోగించాల్సి వస్తోంది. సీట్లు పొందే వరకూ ఒక రకమైన ఎత్తుగడలతోనూ, సీట్లు పొందిన తర్వాత చదువులు పూర్తి చేసేందుకు మరో ఎత్తుగడతో వ్యవహరించాల్సి వస్తోంది.
ఎలాంటి అవగాహన లేకుండానే గతంలో పిల్లలకు ఐదేళ్ల ప్రాయం వస్తే చాలు బడిలో వేసేవారు. కాని నేడు అప్పటి ఆనవాయితీలు మారిపోయాయి. రెండో ఏడాది నుండే పిల్లలను స్కూళ్లకు పరిచయం చేస్తున్నారు. ప్లే స్కూళ్లు, కిండర్ గార్టెన్, ప్రీ ప్రైమరీ పేర్లతో స్కూళ్లు పనిచేస్తున్నాయి.
సామాజికంగా వచ్చిన మార్పు అయితేనేమి, పిల్లలను అనుక్షణం కనిపెట్టుకునే సమయం లేకపోవడం వల్లనైతేనేమి.. వారిని ఏదో రకంగా ఇంటి నుండి బయటకు పంపించే కార్యక్రమంపైనే తల్లిదండ్రులు దృష్టిసారిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో దంపతులిద్దరూ ఉద్యోగులు కావడంతో పిల్లలను ఎక్కువ సేపు నియంత్రించే స్కూళ్ల వైపు వారు మొగ్గు చూపుతున్నారు. భద్రత, నిరంతర పర్యవేక్షణ ఉండే ఇంటర్నేషనల్ స్కూళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇక హైస్కూల్ విద్య పూర్తి చేసిన వారు కాలేజీల్లోనూ, కాలేజీ విద్య పూర్తి చేసిన వారు యూనివర్శిటీల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష దరఖాస్తులు, ఎంట్రన్స్‌లు, వాటి ఫలితాలు, ర్యాంకులు, అడ్మిషన్లతో కొట్టుమిట్టాడుతున్నారు.
బాగా చదివిస్తామనుకొంటే సరిపోదు- మంచి స్కూళ్లు, కాలేజీలను ఎంపిక చేసుకోవడం, ఏ కోర్సు చదవాలి? రానున్న కాలానికి ఎలాంటి చదువులు అక్కరకొస్తాయో అర్థం చేసుకోవడం, పిల్లల ఆసక్తి, అనురక్తి ఆధారంగా మంచి చదువులను ఎంపిక చేసుకోవడం, అందుకు తగ్గట్టు విద్యా సంస్థలను ఎంచుకోవడం, ఆయా షెడ్యూళ్లలో అడ్మిషన్లు పొందడం, ఫీజులు సకాలంలో చెల్లించడం వంటి వాటిపైనా తల్లిదండ్రులకు అవగాహన చాలా ముఖ్యం. దరఖాస్తు దశ నుండి అన్నింటికీ డబ్బే. అందుకు సిద్ధపడి చదువుల బరిలోకి దిగాలి.
నూతన విద్యా సంవత్సరంలో స్కూళ్లకు వెళ్లడం పిల్లలకు పండగ అయితే, తల్లిదండ్రులకు మాత్రం శాపంగా మారిపోతోంది. పిల్లలను స్కూళ్లలో చేర్పించడం అంటే అది వారికి ఒక పెళ్లిచేసినట్టో, ఒక ఇల్లు కట్టినట్టో పెనుభారంగా మారుతోంది. సామాన్య స్కూళ్లలో సైతం ఫీజులు ఆకాశాన్నంటడం ఇందుకు కారణం. ఇక ఇంటర్నేషనల్ స్కూళ్లు, అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఏర్పాటైన స్కూళ్ల గురించి చెప్పనక్కర్లేదు.
వేసవి సెలవులు ముగిశాయి. స్కూళ్లు తెరచుకుంటున్నాయి. అడ్మిషన్ల పర్వం మొదలైంది. రకరకాల పాఠ్యప్రణాళికలతో స్కూళ్లు సిద్ధం అవుతున్నాయి. కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్ కరిక్యులమ్, ఐబీ కరిక్యులమ్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, స్టేట్ బోర్డు కరిక్యులమ్ అంటూ కొన్ని స్కూళ్లు, వీటన్నింటినీ కలిపి బ్లెండెడ్ కరిక్యులమ్ పేరుతో మరికొన్ని స్కూళ్లు వెలుస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు విద్యారంగంలో ప్రవేశించి మొత్తం తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. మొత్తంగా చూస్తే డజనుకు పైగా లేని ఈ కార్పొరేట్ సంస్థలు మొత్తం విద్యా వ్యవస్థనే శాసిస్తున్నాయి. చాలా యాజమాన్యాలు అన్ని నిబంధనలను కాలరాసి గురుకులాలను నిర్వహిస్తున్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు నడిపేందుకు తెలుగు రాష్ట్రాల్లో స్పష్టమైన చట్టాలు లేకున్నా బహిరంగంగా ఈ తంతు జరుగుతోంది. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తోంది. ప్రభుత్వం సొంతంగా సరిపడా విద్యా సంస్థలను నిర్వహించలేక, కేజీ నుండి పీజీ స్థాయి వరకూ ఉచిత విద్యను ఇవ్వలేక, ప్రైవేటు రంగంపై ఆధారపడటం వల్లనే ఈ అనర్థం ఎదురైంది. ప్రభుత్వం సైతం రెగ్యులర్ స్కూళ్లతో పాటు గురుకులాలను ఏర్పాటు చేసింది. ఇంగ్లీషు మీడియం గురుకులాలను కూడా ప్రారంభించింది. వీటికి తోడు ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు, జనరల్ గురుకులాలు పనిచేస్తున్నాయి.
ఒకప్పుడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేసి బడికి పంపితే చాలు.. ఒకటి, రెండు పుస్తకాలతో చదువు మొదలయ్యేది. అయితే, నేటి పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారింది. అడ్మిషన్ అనేదే పెద్ద ప్రహసనంగా తయారైంది. తెలుగు రాష్ట్రాల్లోనే గాక, మిగిలిన ప్రాంతాల్లో సైతం జూన్‌లో మొదలయ్యే స్కూళ్లకు ముందు ఏడాది డిసెంబర్‌లోనే అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, అపాయింట్‌మెంట్‌లు, డాక్యుమెంట్లు, రికార్డులతో హాజరైతే అందులో- ‘ఎంపిక చేసిన విద్యార్థుల’కు మాత్రమే సీట్లు దక్కుతున్నాయి. సీటు ఎక్కడ కోల్పోవలసి వస్తుందేమోనని దానికోసం పైరవీలతో ఆరాటం మొదలవుతుంది. తీరా సీటు వచ్చిన తర్వాత ట్యూషన్ ఫీజుతో పాటు డొనేషన్ చెల్లించాల్సి ఉంటుంది. ‘డొనేషన్’ అంటే చట్టాలు ఒప్పుకోవు కనుక దానికి అందంగా ‘డెవలప్‌మెంట్ ఫీజు’ అని పేరు మార్చి ప్రైవేటు విద్యాసంస్థలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తాయి. ఫీజు చెల్లించిన తర్వాత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్కుబుక్‌లు, యూనిఫాం ఫీజు, రవాణా చార్జీలు వంటివి చెల్లించాలి. ఏసీ బస్సులో అయితే ఒక ఫీజు, ఏసీ లేని బస్సుల్లో మరో రకమైన ఫీజు నిర్ణయిస్తున్నారు. దూరం ప్రాతిపదికగా ఆ ఫీజు 45 వేల నుండి లక్ష రూపాయిల వరకూ ఉంటోంది. మార్కెట్‌లో వెయ్యికి, రెండు వేలకు దొరికే పుస్తకాలను 15 వేల నుండి 20 వేలు, మరికొన్ని స్కూళ్లలో 25వేల రూపాయిల వరకూ అమ్మకానికి పెడుతున్నారు. ఇక్కడితో కథ ముగియదు. ప్రతి విద్యార్థికీ ఖరీదైన ట్యాబ్‌లను అందిస్తారు. ట్యాబ్‌లో కరిక్యులమ్, నోట్స్‌లు, ఆన్‌లైన్ టెస్టులకు ప్రత్యేకించి సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ-లెర్నింగ్, ఆన్‌లైన్ టెస్టులు, ఆన్‌లైన్ మానిటరింగ్ వంటి పడికట్టు పదాలను ఉపయోగించి కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను మోసగిస్తున్నాయి.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అనునిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది. స్కూలులో ఎన్ని పాఠాలు చెప్పినా కంప్యూటర్ ముందు కూర్చుంటే ఎన్నో విషయాలు తెలుస్తాయనే జిజ్ఞాస అందరిలో పెరిగింది. పాఠం ఏదైనా, అంశం ఏదైనా దాని లోతుల్లోకి వెళ్లాలంటే దానికి సంబంధించిన అంశాలను శోధించాల్సిందే. పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే మనకు తెలిసిన జ్ఞానం సరిపోదు, అనంతమైన విజ్ఞాన భాండాగారాన్ని సొంతం చేసుకోవల్సిందే. అందుకే పిల్లలకు ట్యాబ్‌లను అందిస్తున్నారు. అందులో లోడ్ చేసే సాఫ్ట్‌వేర్ ‘కాపీ’ చేసుకొనే వెసులుబాటు కూడా ఉండదు. ప్రతి విద్యార్థి పేరిట యూనిక్ కోడ్, పాస్‌వర్టుతో దానిని నిర్వహిస్తారు. క్లాసు రూమ్‌లు సైతం ఏసీ కావడంతో ఫీజులు కూడా ఆ స్థాయిలోనే వసూలు చేస్తారు. అడ్మిషన్ తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల కదలికలపైనా, విద్యార్థుల కదలికలపైనా ఆంక్షలు విధిస్తారు. గొప్ప స్కూలులో చదువుకుంటున్నాడనే సంతోషంలో ఈ వేధింపులు అన్నింటినీ తల్లిదండ్రులు సంతోషంగానే స్వీకరిస్తారు. కొన్ని స్కూళ్లు డే స్కాలర్లతో, రెసిడెన్షియల్ క్యాంపస్‌లుగాను నడుస్తున్నాయి. తల్లిదండ్రుల సమస్యలే తమ వినూత్న ప్రక్రియలకు పెట్టుబడిగా యోచిస్తున్న యాజమాన్యాలు విద్యార్థుల అవసరాలు, డిమాండ్లకు అనుగుణంగా ఫీజులను దండుకుంటున్నాయి.
స్కూల్‌కు ‘ఇంటర్నేషనల్’ అనే తోక పెట్టుకుంటే లక్షల్లో ఫీజులు వసూలు చేయవచ్చా? అవును చేయవచ్చు అని రుజువు చేస్తున్నాయి చాలా సంస్థలు. ‘దర్జాగా దోచుకోవచ్చు..’ అని అంటున్నాయి ఊరూరా వెలుస్తున్న ఈ ఇంటర్నేషనల్ స్కూళ్లు. క్యాంపస్ ఏర్పాటు చేసి, యాక్టివిటీస్ పేరుతో నాలుగు మాటలు చెబితే చాలు తల్లిదండ్రులే కోట్లు కుమ్మరిస్తారనేది వీరి నమ్మకం. ఎవరికీ భయపడని, వెరవని ఈ విద్యాసంస్థలు నిబంధనల పేరిట నిలదీసే అధికార గణాన్ని రకరకాలుగా ప్రలోభాలకు గురిచేస్తుంటాయి. అంతే.. అంతా ఆశ్చర్యపడే రీతిలో రాత్రికి రాత్రి ఈ సంస్థలకు అనుమతులు లభిస్తాయి. బిజీ రోడ్లలో సైతం ఈ విద్యాసంస్థల వద్ద ట్రాఫిక్ జామ్‌లు పోలీసులకు కనిపించవు, మున్సిపల్ సిబ్బందికి ఎలాంటి అసౌకర్యమూ ఉండనే ఉండదు. ఇంటర్నేషనల్ స్కూళ్లు అంటేనే లక్షలతో కూడిన వ్యవహారం. ఈ స్కూళ్లలోకి సామాన్యులు ఎవరూ అడుగు పెట్టలేరు. హంగూ ఆర్భాటం చాలా ఎక్కువ. అడ్మిషన్ దశ నుండే ఈ ఇంటర్నేషనల్ స్కూళ్లు పేరెంట్స్‌కు ‘గుండు’ కొడతాయి. రకరకాల నిబంధనలు అమలుచేస్తాయి. చాలా ‘స్ట్రిక్ట్’ అనే మాట అందరిలో నానేలా తల్లిదండ్రులను సైతం ఆమడ దూరంలో ఉంచుతాయి. పిల్లలు క్లాసులకు డుమ్మా కొడితే తల్లిదండ్రులకు వార్నింగ్‌లు వెళ్తాయి. సెలవులకు అనుమతులు అస్సలు అస్సలు కుదరనే కుదరదని చాలా కఠినంగా చెప్పేస్తాయి. ఆ మాయలో పడి అలాంటి స్కూలే తమ పిల్లలకు కావాలనుకుంటూ ఎంత ఫీజు చెప్పినా చెల్లించి సంతోషంగా అడ్మిషన్లు తీసుకుంటారు. హైక్లాస్ స్కూళ్లలో పిల్లల్ని చదివించడం ఒక ‘స్టాటస్ సింబల్’గాను మారింది. అందులోనూ ఎక్కువ ఫీజు చెల్లించాల్సిన స్కూళ్లను తల్లిదండ్రులు వెతుక్కుంటున్నారు. పరిపూర్ణ మానవుడిగా తయారుచేసే మంచి విద్యాసంస్థలు ఎన్ని ఉన్నా, అక్కడ తక్కువ ఫీజు కావడంతో వాటిని తల్లిదండ్రులు ఆకర్షించడం లేదు. ఎల్‌కేజీకి సైతం రెండున్నర లక్షలు ఫీజు వసూలు చేసే స్కూళ్లంటేనే వీరికి ఆసక్తి. హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాదు, ‘బి’ గ్రేడ్ పట్టణాల్లో కూడా ఇంటర్నేషనల్ స్కూళ్లు వెలుస్తున్నాయి. ఇవన్నీ ఎల్‌కేజీకి సైతం రెండున్నర లక్షలు వసూలు చేస్తున్నాయి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం తామే ఏర్పాటు చేస్తామని చెప్పి మరో లక్ష వరకూ దండుకుంటున్నాయి. తల్లిదండ్రులు ఇబ్బందులు పడకుండా ‘వాయిదాల’ సదుపాయాన్ని కూడా కల్పిస్తాయి. మొత్తం అన్ని రకాల ఫీజులు కలిపి మూడు విడతల్లో చెల్లించే సౌకర్యం ఇస్తాయి. అదే పెద్ద వరంగా తల్లిదండ్రులు భావించేలా ఈ సంస్థలు మాయమాటలు చెబుతాయి. ఇవన్నీ నెరవేరాలంటే ఇంట్లో బంగారం గుడ్లు పెట్టే బాతులు ఉండాల్సిందే. ఆస్పత్రిలో పేషెంట్లను బతికించుకోవడానికి లక్షలు కుమ్మరించే రీతిలో కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుల కోసం నోట్లకట్టలు సిద్ధం చేసుకోవాల్సిందే. విద్యార్థుల తల్లిదండ్రులతో ‘మైండ్ గేమ్’ ఆడడమే ఈ స్కూళ్ల వ్యూహం. సీట్లు అమ్ముకునేందుకు ఈ సంస్థలు వేసే ఎత్తుగడల ముందు ఎలాంటి వారైనా చిత్తుకావల్సిందే.
ఒకపుడు పరిమితంగా ఉన్న ఖరీదైన విద్యాసంస్థలు రోజురోజుకూ అన్ని ప్రాంతాల్లోనూ పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. నిరంతరం విద్యార్థులను చదువుల యంత్రాల్లా మార్చేస్తున్నాయి. పిడుగుకూ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్టు సాధారణ విద్యార్థుల నెత్తిపైనా కత్తిపెట్టి ర్యాంకులు సాధించమనడంతో విపరిణామాలు సంభవిస్తున్నాయి.
విలువల పతనం..
ఎంతోమంది సత్పురుషులు, సంఘ సంస్కర్తలు, సామాజిక వేత్తలు, మానవతావాదులకు నిలయంగా ఉన్న భారతదేశం అనతి కాలంలో పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదగబోతోందన్న విషయం సంతోషం కలిగిస్తున్నా రోజురోజుకూ విద్యారంగంలో దిగజారిపోతున్న విలువలను చూస్తుంటే ఎవరికైనా విచారం కలుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న భారత్ విలువలతో కూడిన చదువుల విషయంలో మాత్రం తిరోగమిస్తోందని ఇటీవల వచ్చిన అనేక సర్వేల ఫలితాలు చెబుతున్నాయి. ‘ఏం చదువుతావు..?’ అని ఏ ఒక్క విద్యార్థిని ప్రశ్నించినా వారిచ్చిన సమాధానం- ‘బాగా డబ్బు సంపాదించిపేట్టే ఇంజనీర్లు లేదా డాక్టర్లు’ అనే. అదే వారి జీవిత లక్ష్యంగా మారిపోతోంది. ఒకపుడు ఉన్నత చదువుల్లో కనిపించే విపరిణామాలు నేడు చిన్న పాఠశాలల్లోనూ కనిపిస్తున్నాయి. కొంతమంది దంపతులు తమకు పుట్టబోయే బిడ్డలకు సైతం ముందస్తుగా సీట్ల రిజర్వేషన్లు చేసుకుంటున్నారు! ఇలాంటి కృత్రిమ డిమాండ్‌ను సృష్టించడంలో ఇంటర్నేషనల్ స్కూళ్లు విజయం సాధించాయి.
ప్రపంచంలో అతి పెద్ద విద్యా వ్యవస్థ భారతదేశంలోనే ఉంది. మన దేశంలో ఉన్నన్ని అత్యంత పురాతన విద్యాసంస్థలు ప్రపంచంలో మరెక్కడా లేవంటే ఆశ్చర్యం కలగకమానదు. ఒకపుడు ఆశ్రమాల్లో, గురుకులాల్లో గురుభక్తితో సాగిన విద్యావ్యవస్థ కాలగతిలో కార్పొరేట్ శక్తుల చేతుల్లో నలిగిపోతోంది. నలంద, తక్షశిల, ఉజ్జయిని , విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు- విశిష్ట సంప్రదాయాలు, సంస్కృతికి ఆలవాలంగా వెలుగొందాయి. కాని ఇపుడు అదంతా గత వ భవం. ప్లేటో, అరిస్టాటిల్, జాన్ డ్యూయి, జాన్ పియోజ్, వెమ్‌టోస్కీ, అమోస్ కోమినియస్, కార్ల్ రోజర్స్, జిడ్డు కృష్ణమూర్తి వంటి ఎందరో మహానుభావులతో విద్య విశాలతత్వాన్ని సంతరించుకుంది. అలనాడు ప్రపంచం నలుమూలల నుండి వచ్చి భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే వారు. కానీ భారతదేశ వర్తమాన చరిత్ర చూస్తే ఎవరికైనా విచారం కలుగుతుంది.
చదువు అంటే చదవడం, రాయడం మాత్రమే కాదని, సమగ్ర జ్ఞానాన్ని అందించేదిగా ఉండాలని బెంగాలీ కవి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అన్నారు. బోధనతో పాటు నిర్దిష్ట నైపుణ్యాల అభ్యసనల సమీకరణమే విద్య. పరిజ్ఞానాన్ని, మంచి దృక్పథాన్ని , జ్ఞానాన్ని, మానవీయతను , సంస్కృతిని, వారసత్వాన్ని అందిస్తూ సామాజికతను అలవరిచేదే విద్య. విద్య మానసిక బలాన్ని పెంచాలని, మేధస్సును అభివృద్ధి చేయాలని, జీవన నిర్మాణానికీ మనిషిగా రూపొందించడానికి,వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడానికి తోడ్పడాలని స్వామి వివేకానంద పేర్కొన్నారు. కాని నేటి కార్పొరేట్ యుగంలో విద్యకు నిర్వచనం మారిపోతోంది. నాడు విజ్ఞాన సముపార్జనకు విద్యను ఆర్జిస్తే, విద్యను జ్ఞానానికి వినయోగించే తరం పోయి, ఉద్యోగం కోసమో, డబ్బు సంపాదించే మార్గంగానో చదువు మారిపోయింది. సంప్రదాయంగా కొంత మంది వ్యవసాయం, ఇంకొంత మంది వ్యాపారానికి, కులవృత్తులకు పరిమితమై, చాలా తక్కువ మంది మాత్రమే ఉద్యోగం వైపు చూసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. తమ శక్తి సామర్ధ్యాలను పక్కన పెట్టి అంతా ఉద్యోగాల వైపు పరుగులు తీస్తున్నారు. దీనిని అలుసుగా తీసుకుంటున్న విద్యాసంస్థలు తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి.
ఇంత జరుగుతున్నా నాణ్యమైన విద్యను అందించడంలో మన దేశంలో ఎక్కడో పెద్ద లోపం ఉందనేది చాలామంది నిపుణుల అభిప్రాయం. దేశంలో అసలు విద్యావ్యవస్థ ఉందా? అంటే అనుమానమే. ‘ఎగ్జామినేషన్ సిస్టం’ తప్ప ‘ఎడ్యుకేషన్ సిస్టం’ లేదనేది విద్యారంగ నిపుణుల ఆరోపణ. కేవలం జ్ఞాపకశక్తి ఆధారంగానే వ్యక్తి జ్ఞానాన్ని, కౌశలాలను అంచనా వేసి చేతిలో డిగ్రీ అందించే సంస్థలే ఎక్కువ. ఆలోచనా శక్తికి, విశే్లషణకూ , తార్కికతకు ఇప్పటి విద్యావ్యవస్థలో గుర్తింపు ఉందా? అనుమానమే. అసలు చదువంటే ఏమిటి? నాగరికతను వచ్చే తరానికి అందించడమే విద్య. అలాంటి విద్యను సాధించాలంటే విలువలు, ఆలోచనలపై కూడా దృష్టి పెట్టగలగాలి. విలువలతో కూడిన సమాజం ఆవిర్భవించేలా ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలి. వాస్తవాలను అవగాహన చేసుకుంటూ సూక్ష్మ విశే్లషణా నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. గుర్తుండేట్టు ప్రతి విషయం గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం చేయాలి. జ్ఞాపకశక్తిని, విశే్లషణలతో జోడించాలి. గణాంకాలు, సమాచారం, పనికొచ్చే విషయాలను మనం ఎలా అర్థం చేసుకోవాలనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అనులోచన తగ్గించుకుని ఆలోచన పెంచుకోవాలి, ఎవరో చెప్పింది విని దానిని రిపీట్ చేయడాన్ని స్వీయశక్తిగా గుర్తించలేం. పిల్లలు తల్లిదండ్రులు ఏం చెప్పారో దానిని నేర్చుకోరు, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో చూసి నేర్చుకుంటారనేది నిర్వివాదాంశం. మహాత్మాగాంధీ నయితాలిం కావాలని పేర్కొన్నారు. అంటే ప్రాయోగిక విద్య అందుబాటులోకి రావాలనేది ఆయన ఆలోచన. కాని మారుతున్న తరానికి అనుగుణంగా విజ్ఞాన శాస్త్రాలు, మానవీయ విలువలు, ప్రజాస్వామిక పంథా, మానవ హక్కులపై అవగాహన పెంచాలి. ఇంగ్లాండ్‌లో సమ్మర్‌హిల్ స్కూళ్లలా- విలువలను పెంపొందించే కేంద్రాలుగా పాఠశాలలు పనిచేయాలి. ఏ వ్యవస్థలోనైనా చదువుతోనే సంస్కారాన్ని, మానవత్వాన్ని తీసుకురాగలుగుతాం. అలాంటి చైతన్యవంతమైన సమాజాన్ని రూపొందించాల్సిన విధి ఉపాధ్యాయులపై ఉంటుంది. విద్య వ్యాపారంగా, స్కూళ్లు లాభాపేక్ష కేంద్రాలుగా మారకుండా అందరూ జాగ్రత్త పడాలి. అపుడు మాత్రమే అనుకున్న లక్ష్యాలను సాధించి సమాజం వెలుగొందుతుంది. *

విద్య.. ప్రాథమిక హక్కు
విద్యా ప్రమాణాల విషయం పక్కన పెడితే, విద్యావ్యవస్థకు సంబంధించి ప్రపంచంలో పకడ్బందీ చట్టాలున్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. రాజ్యాంగంలోనే చదువులకు సంబంధించి చాలా స్పష్టమైన వైఖరిని పేర్కొంది. రాజ్యాంగంలోని 14,15,16,17 ప్రకరణలు సమానత్వపు హక్కును విశదీకరిస్తున్నాయి. బలహీనవర్గాల వారికి విద్యను అందించడం, వారి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ విధి. రాజ్యాంగంలోని 19 నుండి 22 వరకూ ప్రకరణలు ప్రాథమిక హక్కులతో పాటు అత్యంత ప్రధానమైన స్వాతంత్య్రపు హక్కును కూడా వివరిస్తోంది. 23,24 ప్రకరణాల్లో పీడనాన్ని నిరోధించే హక్కును కల్పించారు. అధికరణం 25 ప్రకారం మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకునే హక్కును కూడా కల్పించింది. దేశంలో ప్రజలు అంతా తమకు ఇష్టమైన తమ విశ్వాసాలను కలిగి ఉండొచ్చు. ఏ మతాన్ని అయినా స్వీకరించవచ్చు. ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఈ హక్కు అందరికీ సమానంగా ఉంటుంది. అందుకే ఈ హక్కు భాగంగా ప్రజాసంక్షేమం, నైతికత, ఆరోగ్యం మొదలైన నిబంధనలకు లోబడి ఉంటుంది.
అధికరణం 28 చూస్తే విద్యాలయాల్లో మత బోధన పనికిరాదని స్పష్టం చేశారు. అయితే ఏదైనా ధార్మిక సంస్థ లేదా ధర్మకర్తలు కలిసి నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో మత బోధన తప్పనిసరైనపుడు (1)వ క్లాజు వర్తించదు. 29,30 ప్రకరణాల్లో సాంస్కృతిక హక్కులను ప్రకటించింది. 29వ ప్రకరణం వారి వారి భాషకు, లిపికి, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు ప్రజల్లో ప్రతి వర్గానికీ ఉందని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో జాతి, మత, కుల, భాషల ప్రాతిపదికలపై వివక్ష చూపకుండా అందరికీ ప్రవేశం ఉండాలని నిర్ణయించింది. 30వ ప్రకరణ మతం, భాష ప్రాతిపదికపై అల్పసంఖ్యాక వర్గాలకు వారికి ఇష్టమైన విద్యాసంస్థలను స్థాపించుకునే హక్కును, వాటి పోషణ కోసం మిగిలిన విద్యాసంస్థల మాదిరి ప్రభుత్వ సహాయాన్ని పొందే హక్కును కూడా కల్పించింది. మాతృభాషాభివృద్ధికి, హిందీ భాషాభివృద్ధికీ సైతం నిబంధనలున్నాయి. స్ర్తిలు, మైనార్టీలు, అల్పసంఖ్యాకులకు విద్య సదుపాయాలతో పాటు కేంద్ర ప్రభుత్వం జాతీయ పర్యవేక్షణ సంస్థలను కూడా నెలకొల్పింది. ఎంసీఐ, యూజీసీ, ఎన్‌సీటీఈ, ఎఐసీటీఈ, బీసీఐ, మరో పక్క జాతీయ విశిష్ట సంస్థల ఏర్పాటుకు సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ యాక్టు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ యాక్టు, ఎన్‌ఐటీ యాక్టు, ఎన్‌ఐటీఎస్‌ఈఆర్ యాక్టు , ఆర్కిటెక్చర్ యాక్టు, ఐఐఎం బిల్లు, ఇగ్నో బిల్లు చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
విద్యా స్వరూపాన్ని మార్చే అత్యంత కీలకమైనది నిర్బంధ ఉచిత విద్యా చట్టం. దీనిని పార్లమెంటులో 2009 ఆగస్టు 4న ఆమోదించారు. ఆరు నుండి 14 ఏళ్ల ప్రాయం ఉన్న వారు ఉచితంగా విద్యను పొందడమే గాక, వారు బడిబయట లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. ఇందుకోసం ప్రకరణ 21ఏ-ను రాజ్యాంగంలో చేర్చారు. విద్యను పొందడం ప్రాథమిక హక్కుగా నిర్ణయించిన 135 దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఈ చట్టం 2010 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చింది. నిజానికి 1960లోనే కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక విద్యకు ప్రకటన చేసింది. అది 50ఏళ్లు గడచినా అది నెరవేరలేదు. దాంతో ఉచిత నిర్బంధ విద్య అమలుకు ‘రూసా’ వంటి పథకాలతో పాటు కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలను కూడా నెలకొల్పింది. ప్రమాణాలున్న ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేదలకు ఉచితంగా సీట్లు కేటాయించాలని కూడా మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించకపోవడంతో ఈ నిర్ణయం అటకెక్కింది. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నపుడు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా సీట్లు పొందాలనే నిబంధన వర్తించబోదని మద్రాస్ హైకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడం ఈ నిబంధన అమలుకు శాపంగా మారింది.

-బీవీ ప్రసాద్ 98499 98090