ఈ వారం స్పెషల్

‘స్నేహవారధి’కి సమయమిదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఫలితంగా తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ వాసుల దశాబ్దాల పోరాటం ఎట్టకేలకు ఫలించి వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ, నవ్యాంధ్ర రాష్ట్రాలు ఏర్పడ్డాక- గత అయిదేళ్లలో ఉభయ ప్రాంతాల మధ్య పరిస్థితి ‘ఉప్పు-నిప్పు’గానే కొనసాగింది. జూన్ 2న ‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం’ నిర్వహిస్తుండగా, గత అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఆవిర్భావ దినోత్సవాల ఊసే లేదు. నవ్యాంధ్రలో వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం పాలనా బాధ్యతలు స్వీకరించినందున- ఇకముందు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వైఖరి ఉండదన్న సూచనలు కనిపిస్తున్నాయి. ‘మనం రాష్ట్రాలుగా విడిపోదాం.. తెలుగు ప్రజలుగా కలిసి ఉందాం’ అనే నినాదం వాస్తవ రూపం దాల్చడానికి అనుకూల సమయం ఇదే. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు భౌగోళికంగా విడిపోయినా- ఉభయ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, సామాజిక సంబంధాలు బలంగానే ఉన్నాయి. ఇపుడు రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా కొత్త వాతావరణం నెలకొంది.
తెలంగాణ ప్రాంతం తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు 58 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం చేసి చిరకాల వాంఛను 2014లో సాధించింది. 1948లో వీర తెలంగాణ సాయుధ పోరాటం, 1956లో విశాలాంధ్రలో విలీనానికి తీవ్ర వ్యతిరేకత, 1969లో ముల్కీ ఉద్యమం, ఆరు సూత్రాల పథకం, పెద్ద మనుషుల ఒప్పందానికి తూట్లు, అనంతరం తెరాస పార్టీ ఆవిర్భావం, శాంతియుతంగా 14 ఏళ్ల పాటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజల శాంతియుత పోరాటం ఫలించి ప్రత్యేక రాష్ట్రం అవతరించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా అవతరించింది. తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ప్రమాణం స్వీకారం చేశారు. ఆయన మంత్రివర్గం పడిపోవడంతో, బెజవాడ గోపాలరెడ్డి రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆనాటి ఆంధ్ర పాలకులు దీర్ఘకాలంలో తలెత్తే ప్రతికూల పరిణామాలను పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల మిగులు హైదరాబాద్ రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతాన్ని విలీనం చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబర్ 1న అవతరించింది. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. రెండు ప్రాంతాల కలయికతో ఆవిర్భవించిన ‘ఆంధ్రప్రదేశ్’ కాలగతిలో అనేక ఆటుపోట్లకు గురైంది. 1972లో ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ‘జై ఆంధ్ర’ పేరిట పెద్ద ఉద్యమం నడిచింది. కాని ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న తాత్కాలిక ఉపశమన చర్యలకు ఆంధ్ర పాలకులు లొంగి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని ముగించారు. రాష్ట్ర విభజన తర్వాత ఈరోజు ఎలాంటి వౌలిక సదుపాయాలు లేని రాజధాని (అమరావతి)తో, ఆర్థిక లోటుతో నవ్యాంధ్ర సతమతమవుతోంది. 1972లోనే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను ఏర్పాటు చేసి ఉంటే, ఈ రోజు నవ్యాంధ్ర రాష్ట్రం పంజాబ్, హర్యానాల కంటే వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉంటూ, సకల సంపదలతో తులతూగి ఉండేది. ఇపుడు ఆంధ్ర ప్రాంత ప్రజలు ప్రత్యేక హోదా లేదా ఉత్తమమైన ప్యాకేజీ కోసం ఢిల్లీ పాలకుల కరుణా కటాక్ష వీక్షణాలకు ఎదురుచూడడం దురదృష్టం.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1వ తేదీన అవతరించింది. మిగులు హైదరాబాద్ ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రం 1956 నవంబర్ 1వ తేదీన విలీనమైంది. 1956 నుంచి 2013 వరకు నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ ఉత్సవాలను జరుపుకుంది. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలు అవతరించాయి. తెలంగాణ రాష్ట్రం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జరుపుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఐదేళ్లుగా అవతరణ దినోత్సవానికి నోచుకోలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఏటా జూన్ 2న ‘నవనిర్మాణ దీక్ష’ పేరుతో కార్యక్రమాలను చేపట్టడం విమర్శల పాలైంది. తమకు ఎలాంటి అవతరణ దినోత్సవం లేదన్న ఆవేదన నవ్యాంధ్ర వాసుల్లో నెలకొంది. కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1న లేదా నవంబర్ 1న జరిపేలా నిర్ణయం తీసుకోవాలని ఐదు కోట్ల ఆంధ్రులు ఎదురుచూస్తున్నారు.
వైకాపా ప్రభంజనం
ఆంధ్రప్రదేశ్‌లో తాజా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర వైఫల్యాన్ని మూటకట్టుకుంది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లలో 151 సీట్లను వైకాపా కైవశం చేసుకోగా, తెదేపాకు కేవలం 23 సీట్లు దక్కాయి. సినీనటుడు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి ఒకే ఒక్క సీటు లభించింది. పోటీ చేసిన రెండు చోట్లా ‘జనసేనాని’కి చుక్కెదురైంది. కాగా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ స్థాయిలో ఎప్పుడూ పరాభవం ఎదుర్కొనలేదు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో వైకాపా 22 చోట్ల విజయ దుందుభి మోగించగా, తెదేపా మూడు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పోలైన వోట్ల వివరాలను విశే్లషిస్తే ఆసక్తికరమైన విశేషాలు తెలుస్తాయి. వైకాపాకు 49.9 శాతం ఓట్లు లభించాయి. ఈ పార్టీకి 1,54,83,592 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల ఫలితాలతో పోల్చితే వైకాపాకు 84 అసెంబ్లీ సీట్లు అదనంగా లభించాయి. టీడీపీకి 39.2 శాతం ఓట్లు లభించాయి. వైకాపా కంటే తెదేపాకు పదిశాతం ఓట్లు తక్కువగా పోలయ్యాయంటే జనంలో అధికార పార్టీపై ఐదేళ్లుగా గూడుకట్టుకున్న అసంతృప్తి, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. తాజా ఎన్నికల్లో తెదేపాకు 1,23,01,741 ఓట్లు దక్కాయి. గత ఎన్నికలతో పోల్చితే చంద్రబాబు పార్టీకి 80 అసెంబ్లీ సీట్లు తగ్గాయి. జనసేన పార్టీకి 21,30,367 ఓట్లు వచ్చాయి. కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానం దక్కింది. ఈ పార్టీకి 6.78 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి కేవలం 3,68,810 ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 1.17 శాతం ఓట్లు సాధించినా, ఒక్క సీటును కూడా సాధించలేక పోయింది. బీజేపీకి 2,63,849 ఓట్లు పోలయ్యాయి. ఈ పార్టీకి 0.84 శాతం ఓట్లు పోలయ్యాయి. బీఎస్‌పీకి 0.28 శాతం, సీపీఎంకు 0.34 శాతం, సీపీఐకు 0.11 శాతం, ‘నోటా’కు 1.28 శాతం ఓట్లు వచ్చాయి.
*
జిల్లాల వారీగా..
జిల్లాలు నియోజకవర్గాలు వైఎస్‌ఆర్‌సీపీ టీడీపీ జనసేన
శ్రీకాకుళం 10 8 2 0
విజయనగరం 9 9 0 0
విశాఖపట్నం 15 11 4 0
తూర్పు గోదావరి 19 14 4 1
పశ్చిమ గోదావరి 15 13 2 0
కృష్ణా 16 14 2 0
గుంటూరు 17 15 2 0
ప్రకాశం 12 8 4 0
నెల్లూరు 10 10 0 0
కడప 10 10 0 0
కర్నూలు 14 14 0 0
అనంతపురం 14 12 2 0
చిత్తూరు 14 13 1 0
మొత్తం 175 151 23 1
*
ఆంధ్రప్రదేశ్‌లోని 3,93,45,717 ఓటర్లలో 3,13,33,631 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 80 శాతం మంది ఓట్లు వేశారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 85.93 శాతం మంది, గుంటూరులో 82.37 శాతం, విశాఖపట్నంలో 73.67 శాతం మంది ఓట్లు వేశారు. నియోజకవర్గాల వారీగా విశే్లషిస్తే అద్దంకిలో 89.82 శాతం మంది గరిష్టస్థాయిలో, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో కనిష్టంగా 58.19శాతం మంది ఓట్లు వేశారు. తాజా ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో- 49 చోట్ల వైకాపా, మూడు చోట్ల తెదేపా గెలిచింది. కర్నూలు, కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో మొత్తం అసెంబ్లీ సీట్లన్నీ వైకాపా ఖాతాలోనే పడ్డాయి. విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో నాలుగేసి అసెంబ్లీ సీట్లు తెదేపాకు వచ్చాయి.
ముందున్న సవాళ్లు..
వచ్చే ఐదేళ్ల పాటు అంటే 2024 వరకూ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ అయిదేళ్లలో ఆయన సాధించాల్సింది ఎంతో ఉంది. రాజధాని అమరావతి అభివృద్ధి, పోలవరం సాగునీటి పథకాన్ని సత్వరం పూర్తి చేయడమనే కీలక సవాళ్లు జగన్ ముందున్నాయి. కాలహరణం చేయకుండా అమరావతిలో భవనాల నిర్మాణాలు చేపట్టి ముందడుగు వేయాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం లేదా రాష్ట్రం ఎవరు చేపట్టినా నిర్ణీత కాలపరిమతిలో పూర్తి చేయాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపై ఉంది. ఆంధ్రులు ఈ రెండు అంశాలను వేయికళ్లతో పరిశీలిస్తారు.
ఇక, రాయలసీమ ప్రజల ఆకాంక్ష మేరకు హైకోర్టు బెంచిని కర్నూలులో ఏర్పాటు చేసేలా కొత్త సర్కారు దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏ మాత్రం తాత్సారం చేసినా సీమప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదు. 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాజధానిగా ఉన్న కర్నూలు నగరానికి పూర్వ వైభవం తెచ్చే అవకాశం జగన్‌కు ఇపుడు లభించింది. కర్నాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్టత్రో పాటు అనేక రాష్ట్రాల్లో రెండేసి ప్రాంతాల్లో హైకోర్టులు పనిచేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టును నిర్మించి శ్రీశైలం ప్రాజెక్టులో మిగులు జలాలను రాయలసీమ అవసరాలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలి. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, అన్ని జిల్లాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి సారించడం ఎంతో అవసరం. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పట్టుదలతో ఉన్నారు. కేంద్రం దయాదాక్షిణ్యాలపైనే ఇది సాధ్యమవుతుంది. 46 ఏళ్లకే లభించిన ముఖ్యమంత్రి పదవిని సద్వినియోగం చేసుకుని, జనహృదయాల్లో తనదైన ముద్ర వేసుకొనేలా జగన్ మంచి బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
తిరుగులేని నేత కేసీఆర్
తెరాస పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్రానికి వరుసగా రెండవ సారి ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రజారంజక పాలన అందిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు పట్టుదల, కార్యదీక్షకు మారుపేరుగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కేసీఆర్ ఉద్యమ పథాన్ని ఎంచుకొన్నారు. ముందుగా ఒకే ఒక్కడుగా పోరాటంలో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత యావత్తు తెలంగాణ అంతా కేసీఆర్ వెంట నడిచింది. ప్రజాఉద్యమాన్ని అకుంఠిత దీక్షతో, గాంధేయ మార్గంలో నడిపారు. మెదక్ జిల్లా చింతమడకలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించిన చంద్రశేఖరరావు సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎంఏ చేశారు. కేసీఆర్, శోభ దంపతుల సంతానం తారక రామరావు, కవిత. కేసీఆర్‌కు కుటుంబ అనుబంధం, ఆప్యాయతలు ఎక్కువ. దైవభక్తి మెండు. దేశం మొత్తం మీద ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ హైందవ సంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించేలా యాగాలను నిర్వహించిన గొప్ప ధార్మికుడు ఆయన. చాలామంది నేతలు హిందుత్వ గురించి మాట్లాడుతారు. కాని ఆచరణలో హైందవ సంప్రదాయాలు, వేద సంస్కృతిని అమలు చేసి చూపించిన కేసీఆర్ రాజకీయాల్లో అత్యంత అరుదైన నాయకుడు.
తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లను కేసీఆర్ ఎదుర్కొన్నారు. నమ్మిన అనుచరులు, ఎమ్మెల్యేలే ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినా పట్టించుకోకుండా, అనుకున్న లక్ష్యం దిశగా సహనంతో నడిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు దీక్షతో ఉద్యమించారు. చివరకు అన్ని గండాలు, కష్టాలు, సంక్షోభాలను అధిగమించి, 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం అవతరించేందుకు కారణమైన నేత కేసీఆర్. జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలను రాష్ట్ర విభజనకు ఒప్పించిన ధీశాలి. కేసీఆర్ ఒక రాజనీతిజ్ఞుడు.
వినూత్న పథకాలు..
తెలంగాణలో హైదరాబాద్‌ను మినహాయిస్తే మిగతా ప్రాంతంలో పేదలు ఎక్కువ. మెజారిటీ ప్రజలు బీసీలు, దళితులు, మైనారిటీలే. వీరి సంక్షేమానికి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా గొప్ప పేరు గడించాయి. రైతుబంధు, అమ్మఒడి, ఆరోగ్యలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చేనేత లక్ష్మి, ఆసరా పెన్షన్లు, గ్రామజ్యోతి, పల్లెప్రగతి, హరిత హారం, ఫైబర్ గ్రిడ్, మన ఊరు, మిషన్ భగీరథ, మిషన్ భగీరథ, మహిళల రక్షణకు షీ టీమ్స్ వంటి కార్యక్రమాలను అమలు చేసి ప్రజల హృదయాలను ఆయన దోచుకున్నారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి రూపొందించిన టీఎస్ ఐపాస్, టీ హబ్ పథకాలు మంచి ఫలితాలు ఇచ్చాయి. పారిశ్రామిక రంగలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీని వల్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఐదు సంవత్సరాల్లో దాదాపు పదివేల కొత్త పరిశ్రమలు తెలంగాణకు తరలివచ్చాయి. దాదాపు రూ.1.66లక్షల కోట్ల నిధులు వచ్చాయి. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మొదటిసారిగా రూ.1.09 లక్షల కోట్ల ఎగుమతులు చేసి తెలంగాణ రికార్డు సృష్టించింది. బ్లాక్ చైన్ పాలసీని ఆవిష్కరించారు. డ్రై పోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. పేదల సంక్షేమం కోసం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌ను నెలకొల్పారు. కంటి వెలుగు పథకం ద్వారా నేత్ర వ్యాధుల నివారణకు బృహత్తర ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు ఇవ్వడమే గాక, అవసరమైన వారికి శస్తచ్రికిత్సలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నియంత్రణలో ఉంచారు. తెలంగాణ వస్తే నక్సలైట్లు రాజ్యమేలుతారన్న కొంతమంది మేధావుల ఆలోచనలు పటాపంచలయ్యాయి. నక్సలైట్లు జనజీవనస్రవంతిలోకి వచ్చారు. ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టేందుకు పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.
కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను తగ్గించేందుకు రూపొందించిన ఈ పథకం పట్ల కేంద్రంలో భాజపా ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తిని కనపరిచాయి. ఎన్డీఏ సర్కార్ గత బడ్జెట్‌లో రైతు బంధును స్ఫూర్తిగా తీసుకుని రైతుల సంక్షేమానికి ప్యాకేజీని అమలు చేసింది. ఈ స్కీం కింద రైతులకు ఎకరానికి ఒక సీజన్‌కు రూ.5వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ విషయమై ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే విద్యుత్ కష్టాలు తప్పవని, ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలివెళతాయన్న రాజకీయ విమర్శకుల నోళ్లకు తాళం వేసిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్రం అవతరించిన సమయంలో 7వేల మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ ఉంటే, ఈ రోజు 14వేల మెగావాట్ల కెపాసిటీకి విద్యుత్ ఉత్పాదన చేరింది. సౌర విద్యుత్‌లో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ చేపట్టిన సంక్షేమ ఫలితాల వల్లనే ప్రజలు గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీతో రెండవసారి తెరాస పార్టీని ఎన్నుకున్నారు. కేసీఆర్ ప్రతి ఆలోచన వినూత్నంగా ఉంటుంది. సామాన్య ప్రజల కష్టాలను లోతుగా విశే్లషించి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారు. తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి రాష్ట్రంలో పది జిల్లాలు ఉండేవి. ఈ రోజు 33 జిల్లాలు ఉన్నాయి. పరిపాలనను వికేంద్రీకరించారు. కేసీఆర్ మాటలు కంటే పనికి ప్రాధాన్యత ఇస్తారు. అధికారులతో సమీక్షల వేళ గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చి సమయాన్ని వృథా చేయరు. అవసరమైన అంశం, దాని ప్రాధాన్యత గుర్తించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
తెలంగాణ ఒక మినీ భారత్. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. దక్షిణ, ఉత్తర భారతానికి వారధిలా ఉండే తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల రైతులకు ఎనలేని ప్రయోజనం చేకూరుతోంది. కేంద్రం సహాయం లేకుండా బృహత్తరమైన కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే మహా యజ్ఞాన్ని చేపట్టారు. తెలంగాణ నిజంగా ధనిక రాష్టమ్రే. బంగారు తెలంగాణ సాధనకు రాష్ట్రంలోని ఆర్థిక వనరులు, కేంద్రం ఇచ్చే నిధులను సద్వినియోగం చేస్తున్నారు.
తాజా లోక్‌సభ ఎన్నికల్లో భాజపా ప్రభంజనాన్ని ఎదురొడ్డి 9 సీట్లలో టీఆర్‌ఎస్ గెలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో 41.29 శాతం ఓట్లు తెరాసకు వచ్చాయి. కాంగ్రెస్‌కు 29.48 శాతం, బీజేపీకి 19.45 శాతం ఓట్లు వచ్చాయి. సంక్షేమ పథకాల జోరు కొనసాగుతుండగా- లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడు, బీజేపీకి నాలుగు సీట్లు దక్కడం తెరాస నేతలకు విస్మయం కలిగించింది. ఎప్పటిలానే మజ్లిస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ సీటును నిలబెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 88 సీట్లు, కాంగ్రెస్‌కు 19 సీట్లు, ఎంఐఎంకు 7 సీట్లు, బీజేపీకి ఒక సీటు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల బంధం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణతో మంచి సంబంధాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ ఆలోచనను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతించారు. జగన్ దంపతులను కేసీఆర్ ‘ప్రగతి భవన్’కు ఆహ్వానించి సత్కరించారు. భౌగోళికంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు వేరైనప్పటికీ- సామాజికంగా, సాంస్కృతికంగా, భాషాపరంగా ఒక్కటేననే బలమైన సంకేతాలను కేసీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు పంపారు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ హాజరయ్యారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం, తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని సందర్శించుకుని మొక్కులు చెల్లించారు. కుటుంబ సమేతంగా కొద్ది రోజుల క్రితమే తిరుమలను సందర్శించి పూజలు నిర్వహించారు. భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, ఆగమశాస్త్రానికి అనుగుణంగా నిర్మిస్తున్న దైవభక్తి పరాయణుడు కేసీఆర్.
నదీజలాల సద్వినియోగం కావాలన్న ఆకాంక్ష కేసీఆర్‌కు ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను విశే్లషిస్తే నదీ జలాల లెక్కలను తడుముకోకుండా చెప్పడంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దిట్ట. ఆ తర్వాత అంతటి పట్టు సాధించిన నేత కేసీఆర్. దేశంలోని అన్ని నదుల నుంచి 70 వేల టీఎంసీ జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయని, వీటిని మళ్లించి బీడువారిన భూములను సస్యశ్యామలం చేయాలనే కోరిక కేసీఆర్‌కు ఉంది. కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ జెండా, అజెండాలను పక్కనపెట్టి రైతు బంధు స్కీం మాదిరిగానే నదీ జలాల వినియోగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. నదీజలాల వినియోగంపై కేసీఆర్ చేసిన కసరత్తు ప్రపంచ స్థాయి నీటిపారుదల నిపుణులు కూడా చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని వివాదాలు ఉండవచ్చు. అధికారంలో ఉన్న నేతలు సుహృద్భావ వాతావరణంలో తరచుగా సమావేశమైతే అవన్నీ సులువుగా పరిష్కారమవుతాయి. ఈ దిశగా వచ్చే ఐదేళ్లు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం అడుగులు వేస్తుందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా రావాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కేసీఆర్ పదేపదే చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు. కాని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సంక్షేమం, అభివృద్ధికి వెచ్చించేలా ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి పయనిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. *
జగన్‌కు జేజేలు...
నవ్యాంధ్ర అవతరించాక రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న విజయవాడలో కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రమాణస్వీకారం చేశారు. వైకాపాకు ఇది చరిత్రాత్మక విజయం. అలుపెరుగని పోరాట యోధుడిగా జగన్ నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజారంజక పాలన అందించి, కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మ ఇచ్చిన ఘనత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు, కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కార్ ఏర్పడేందుకు తన శక్తియుక్తులను అందించిన ధీశాలి, రాజనీతిజ్ఞుడు వైఎస్. 1956 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకునే ముగ్గురు నేతలు ఎన్టీ రామారావు, వైఎస్‌ఆర్, చంద్రబాబు నాయుడు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు, ఆరోగ్య బీమా, ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన పాలనాదక్షుడు వైఎస్‌ఆర్.
వైఎస్ రాజశేఖర రెడ్డి, విజయమ్మ దంపతుల కుమారుడైన వైఎస్ జగన్ తొమ్మిదేళ్ల సుదీర్ఘ రాజకీయ పోరాటాల్లో పదునెక్కారు. తాను అనుకున్నది సాధించేందుకు ఓపికతో, ఆత్మవిశ్వాసంతో నిరీక్షించారు. అంతర్గత శత్రువులు, బాహ్య శత్రువులు, రాజకీయ శత్రువుల కుట్రలను ఎదిరించి ప్రజాబలంతో అఖండ మెజారిటీతో బలమైన నేతగా ఆయన ఎదిగారు. 1972 డిసెంబర్ 21న కడప జిల్లాలో జన్మించిన జగన్ పాఠశాల విద్యను పులివెందులలో, హైస్కూలు, ఆ తర్వాత ఉన్నత విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఇంగ్లాండ్‌లో మేనేజ్‌మెంట్ కోర్సును అభ్యసించారు. ఆయన ఆంగ్లం, తెలుగు భాషల్లో మంచివక్త. తన తండ్రి వైఎస్‌ఆర్ మాదిరిగా తన భావాలను అందరితో పంచుకోరు. జగన్ అంతర్ముఖుడు. కాని తండ్రి మాదిరిగానే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు దేనికైనా తెగిస్తారు. 2009 ఎన్నికల్లో కడప నుంచి గెలిచి తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కొన్ని నెలలకే ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీకి చెందిన నేతలు అవినీతి అభియోగాలు మోపడం, సీబీఐ విచారణ ఫలితంగా 16 నెలల పాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. పిన్న వయస్సులో జగన్ మాదిరి మరెవరూ ఇంత విపత్కరమైన పరిణామాలను, మానసిక వేదనను అనుభవించి ఉండరు. తన తండ్రి వైఎస్‌ఆర్ పేరును జనం గుర్తుచేసుకునేలా ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ని స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై ఆయన పోరాడారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైకాపా అధికారానికి చేరువ కాలేకపోయింది. ఆ ఎన్నికల్లో జగన్ పార్టీకి 67 సీట్లు వచ్చాయి. అసెంబ్లీ లోపల, వెలుపల ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను లెక్కపెట్టకుండా అకుంఠిత దీక్షతో, ప్రజాసేవ చేయాలన్న సంకల్పంతో 3వేల కి.మీ మేరకు ప్రజాసంకల్ప యాత్ర చేశారు. జగన్‌కు కుటుంబ అనుబంధం ఎక్కువ. తల్లి విజయమ్మ, భార్య భారతీదేవీ, సోదరి షర్మిల అండదండలతో, రాజకీయంగా వడివడిగా అడుగులు వేసి, ప్రజాశీస్సులతో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.

కె.విజయ శైలేంద్ర 98499 98097