ఈ వారం స్పెషల్

మధురిమల మాకందాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిడి వనె్న మెరుపు..
చూపుతిప్పుకోలేని అందం..
చూడగానే నోరూరుతుంది..
మత్తెక్కించే వాసన..
ఆస్వాదించే కొద్దీ కమ్మని అనుభూతి..
- దేని గురించి ఈ వర్ణన అంటూ కంగారుపడకండి.. ఫలాల్లో రారాజైన ‘మామిడి’ గురించే ఈ వర్ణన.
వేసవికాలమంటే ఎండలు, చికాకులు, చెమటలే కాదండోయ్.. మంచివి కూడా ఉన్నాయి. ఎండాకాలమంటేనే ఠక్కున గుర్తొచ్చేవి మామిడి పండ్లు, మల్లెపూలు. ఇవి లేకపోతే వేసవి మజా లేదు. చాలామంది వీటికోసమే వేసవికి స్వాగతం పలుకుతారంటే అతిశయోక్తి కాదు. వేసవి సెలవులు అనగానే ఇంటికి వచ్చే అత్తయ్యలు, మామయ్యలతో పాటు అమ్మమ్మ, నానమ్మలు పెట్టే ఊరగాయలు, పెరుగన్నం-మామిడిపండ్లు, తోటలకు వెళ్లి దొంగతనంగా మామిడికాయలు కోయడం.. తోటమాలి తరిమితే పారిపోవడం.. చెరువుగట్టున కూర్చుని దొంగిలించిన మామిడికాయలపై ఉప్పు, కారం చల్లుకుని తినడం.. ఇలాంటివన్నీ చిన్ననాటి వేసవి సెలవుల మధుర జ్ఞాపకాలు.. మామిడి మజాను ఆస్వాదించని వారు లేరంటే అతిశయోక్తి కాదు.. చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ మామిడి పండును చూస్తే నోట్లో నీళ్లూరాల్సిందే.. అలాంటి ‘మామిడి’ గురించిన విశేషాలను తెలుసుకుందాం..
ఘన చరిత్ర
తెలుగువారికి మామిడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రేమకు, సంపదకు, సంతానాభివృద్ధికి ప్రతీక మామిడి. జీవితానికి అతి ముఖ్యమైన ఈ మూడింటినీ అందించే మొక్కగా మామిడిని పూజిస్తారు తెలుగువారు. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతోపాటు ఇతర పురాణాల్లో కూడా మామిడి మొక్కల ప్రస్తావన ఉంది. మామిడాకుల పాత్ర లేకుండా ఏ శుభకార్యమూ జరగదు. మంగళతోరణాలు కట్టేందుకు అవసరం మామిడి ఆకులు.. భగవంతుణ్ణి పూజించేందుకు మామిడిని ఎక్కువగా వాడతారు. పూజకు ముందు నుంచే పూర్ణకుంభంలో అమర్చేది కూడా ఈ ఆకులనే.. పూర్ణకుంభమంటే భూదేవి రూపం. అందులో పోసే నీరు మన జీవితానికి మూలాధారం. ఆ కుంభంలో ఉంచే కొబ్బరికాయ, అమర్చే మామిడి ఆకులు జీవితాన్ని సూచిస్తాయి. పూర్ణకుంభం అమరిక పూర్తనయిప్పుడు అది లక్ష్మీదేవి రూపం అవుతుంది. దీనే్న ‘కలశం’ అని కూడా అంటారు. భారతీయ సాహిత్యంలో మామిడిని స్తుతించిన విధంగా మరొకచెట్టును స్తుతించలేదు. అందుకే
దీన్ని కల్పవృక్షమన్నారు. మామిడి పువ్వును మన్మథుని బాణాల్లో ఒకటిగా కాళిదాసాది కవులు వర్ణించారు. ప్రేమకు, భక్తికి సంకేతం ఈ చెట్టు. క్రీ.పూ. 150 కాలం నాటి సాంచీస్థూపంపై మామిడిచెట్టు, పండ్లు అద్భుతంగా చెక్కిన ఆనవాళ్లు కనిపిస్తాయి. శిల్పకళతోపాటు అనేక ఇతర హస్తకళల్లో కూడా మామిడి రూపం కనిపిస్తుంది. మామిడి ఆకారంలో బంగారంతో తయారుచేసిన వివిధ రకాల నగలు మనకు పరిచయమే.. అలాగే మామిడి ఆకారాన్ని పట్టువస్త్రాలపై కూడా చక్కగా ‘బుటా’ పేరుతో నేస్తున్నారు. ఇది మామిడితో భారతీయులకున్న అవినాభావ సంబంధం. మామిడిని చూతమనీ, ఆమ్రమనీ, తమిళంలో మాంగాయ్ అనీ, మలయాళంలో మాంగా అనీ, కన్నడంలో మావిన అని అంటారు. మామిడి పండు భారతదేశపు జాతీయ ఫలం. పచ్చి మామిడితో ఎన్నోరకాల ఊరగాయలను పెట్టుకుంటాం. ముఖ్యంగా ఆంధ్రుల ఇంటి ఆవకాయకున్న ప్రత్యేకత చెప్పలేనిది. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రులతో పాటు ఆవకాయ కూడా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు ఆవకాయపై శతకాలు కూడా వచ్చాయి. భారతీయ మామిడి శాస్ర్తియ నామం మ్యాంగిఫెరా ఇండికా.. అనాకార్డియాసియా కుటుంబానికి చెందిన మామిడి జాతి రకాల్లో ఇది కూడా ఒకటి. భారతదేశం అడవుల్లోను, సాగు ప్రాంతాల్లో కనిపించే ఈ రకాలు ప్రపంచంలోని ఇతర ఉష్ణప్రాంతాల్లోనూ పెరుగుతున్నాయి. మామిడికి నాలుగు వేల సంవత్సరాల చరిత్రే ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతటా మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఉష్ణ ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ పంటను ఇప్పుడు సమశీతోష్ణ పరిస్థితుల్లో కూడా పండిస్తున్నారు. భారత ద్వీపకల్పం అంతటా, కరేబియన్, మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు ఆసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాల్లోనూ పండిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీన్ని ఆమ్‌చూర్ అంటారు. అక్కడి వారు విరివిగా వంటల్లో ఆమ్‌చూర్‌ను వాడుతుంటారు. ఆంధ్రులు కూడా కొన్ని ప్రదేశాల్లో ఇళ్ళలో ఎండపెట్టిన మామిడి ముక్కలను సంవత్సరమంతా వాడే అలవాటు ఉంటుంది. వీటిని మామిడి ఒరుగులు అంటారు. పచ్చిమామిడికాయను వివిధ రూపాల్లో వంటల్లో వాడుతుంటారు. మామిడిలో కాల్షియం, విటమిన్-బి పుష్కలంగా ఉన్నాయి కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో సహా తింటారు. పడమటి దేశాల్లో పండ్లతో కూడా తీయటి పచ్చడిని చేస్తారు. ఫిలిప్పైన్స్‌లో మామిడికాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో కలిపి తింటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పైతో చేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో భోజనానంతర ఆహారంతో చేర్చి వీటిని అందిస్తారు.
రకాలు
మనకు తెలిసి మామిడి అనగానే రసాలు, బంగినపల్లి, ఆల్ఫాన్సో, హిమాయుద్దీన్, తోతాపురి, దశహరి, సువర్ణరేఖ, నీలం, కొబ్బరిమామిడి, మల్లిక, ఆమ్రపాలి, లాంగ్డా, అర్క అరుణ, బాంబే గ్రీన్, పంచదార కలశ, నీలం, చందూరా, రుమానియా, మల్గోవా, చక్కెర కట్టి, గిర్ కేసర్ మామిడి, చిన్న రసాలు, పెద్దరసాలు, చెరుకురసాలు, నూజీవీడు రసం, కోలంగోవా, ఏండ్రాసు, కలెక్టరు, కొండమామిడి, ఇమాం పసంద్, దసేరి, జహంగీర్, దిల్‌పసంద్, నూర్జహాన్, బేనీషా, హిమానీ, నీలిషాన్, ఆచారి, జలాలు.. ఇలా దాదాపు 300 రకాల మామిడి పళ్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అయితే సుమారు 1100 రకాలకు పైనే పండుతున్నాయి. వాటిల్లో ప్రాచుర్యం పొందిన తొలి ఐదు రకాలేమంటే..
ఆల్ఫాన్సో
పండ్లకు రాజు మామిడి అయితే, ఆ మామిడి రకాల్లో రారాజు ఆల్ఫాన్సో. మార్చి నుంచి జులై వరకూ కాసే ఈ రకం రుచిలోనే కాదు, ఖరీదైనదిగానూ పేరొందింది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండే ఈ రకం మామిడిలో టెంకను పాతితే కచ్చితంగా మళ్లీ అదేరకం మామిడి మొలకెత్తకపోవడమే దీని ప్రత్యేకత.
బాదామి
ఎక్కువ కాలం నిలువ ఉంటుంది ఈ రకం మామిడి. చాలా రుచిగా ఉంటుంది. అందుకే ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకూ ఎగుమతి అవుతుంది. చల్లగా తింటే దీని రుచి మరింత పెరుగుతుంది.
వేన్సియా ప్రైడ్
దక్షిణ ఫ్లోరిడా రాష్రానికి చెందినదీ రకం మామిడి. పెద్దపరిమాణంలో గులాబీ, ఎరుపు, పసుపు రంగుల్లో ఈ మామిడి అందాల విందు చేస్తుంటుంది. ‘ఎస్’ ఆకారంలో ఉండే ఈ పండులో పీచు ఏమాత్రం ఉండదు. దీని రుచీ అమోఘమైనదే..
నామ్‌డక్‌మాయ్
దీనినే బంగారు మామిడిపండు (గోల్డెన్ మ్యాంగో) అంటారు. ఇందులో పీచు అస్సలు ఉండదు. ఈ పండును ఎక్కువగా థాయ్‌లాండ్ వాసులు ఇష్టపడతారు. మే నుంచి అక్టోబర్ ప్రారంభం వరకూ వచ్చే ఈ పండ్లు తియ్యగా, రుచికరంగా మంచి సువాసనతో ఉంటాయి. వీటిని ఎడారిలో కూడా పండించుకోవచ్చు.
చౌసా
పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముల్తాన్, సాహివాల్ జిల్లాల్లో చౌసా రకాన్ని ఎక్కువగా పండిస్తారు. ఇది మంచి వాసనతో, అద్భుతమైన రుచితో ఉంటుంది. చౌసా ప్రాంతంలో హుమాయూన్‌పై గెలుపొందిన షేర్‌షాసురి అక్కడ పండే మామిడికి ఆ పేరు పెట్టాడు. జులై-సెప్టెంబరు దీని సీజన్.
ఇవేకాదు.. ఎరుపు, గులాబీ రంగుల్లో నోరూరించే గ్లెన్, హనీ మ్యాంగోగా పేరొందిన సింథేరీ, ఘాటైన తియ్యని రుచితో ఉండే మేడమ్ ఫ్రాన్సిక్, గుండ్రంగా చిన్నగా ఉండే తియ్యని కేసరి, ఎరుపురంగు మచ్చలతో ఉండే కెట్ రకాలు తరువాత ఐదు స్థానాల్లో మామిడి ప్రియులకు చవులూరిస్తున్నాయి.
గిన్నిస్‌బుక్ సర్వే
ఒక చెట్టుకి కాసిన కాయలే ఒక్కతీరున ఉండవే.. ఇక వేల రకాల మామిడి పళ్లన్నీ ఒకే రుచితో ఎలా ఉంటాయి? కచ్చితంగా ఉండవు. అందుకే మామిడి పళ్లన్నింటిలోకి రుచికరమైనది ఏమిటా అని ఆమధ్య ‘గిన్నిస్ బుక్’ వాళ్లు ఆరా తీశారట. తేనె మామిడిగా ప్రాచుర్యం పొందిన పాకిస్తానీ సింథ్, పసుపురంగులోనే కాసే థాయ్ నామ్‌డక్‌మాయ్, దక్షిణ భారతదేశానికి చెందిన బాదామి వంటి వాటన్నింటినీ తోసిరాజని తీపికే మారుపేరైనా ఫిలిప్పీన్స్ స్వీట్ ఎలినా, గుయ్‌మారాస్ మామిడి రకాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. ఇప్పుడు అమెరికాలోని వైట్‌హౌస్‌లోనూ, లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోనూ టెంక ఉందో లేదో అనిపించే ఆ పండ్లే మధుర రుచుల్ని అందిస్తున్నాయి.
భారీ మామిడి
జంతువుల మాదిరిగానే వృక్షజాతులు కూడా అంతరించిపోతుంటాయి. ఇందులో మామిడి రకాలకీ మినహాయింపు లేదు. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలోని కతివాడా ప్రాంతంలో పెరిగే నూర్జహాన్ అరుదైనదిగానూ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే త్వరలోనే అంతరించిపోయే రకాల్లో ఒకటిగానూ గుర్తింపు పొందింది. సైజులో కూడా రికార్డు సృష్టించిన ఈ రకంలో ఒక్కో మామిడికాయ సుమారు రెండున్నర నుండి ఐదు కిలోల బరువు ఉంటుంది. ఒక చెట్టుకి 70 నుంచి 80 కాయలు మాత్రమే కాస్తాయి. కాయల బరువు మోయలేక ఒక్కోసారి చెట్టు కొమ్మలు కూడా వంగిపోతుంటాయి. అలాగని ఇది అద్భుతమైన రుచి కలిగిన పండు అని చెప్పలేం. కేవలం సైజు కారణంగానే కాయకు సుమారు రూ. 300 అయినా కూడా చాలామంది కొంటూ ఉంటారు.
పండూరి
మామిడి రకాల్లోనే అత్యంత పురాతనమైనది ఆంధ్రప్రదేశ్‌లోని పండూరి మామిడి. ఈ రకం చెట్లు సుమారు వంద అడుగుల ఎత్తు వరకూ పెరిగి మూడొందల సంవత్సరాలు జీవిస్తాయట! ఈ కాయలు చూడటానికి కూర మామిడికాయల్లా చిన్న సైజులో ఉంటాయి. కానీ వీటి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇతర మామిడికాయల్లా పండినా రంగు తేలకుండా ఆకుపచ్చరంగులోనే ఉంటాయి ఇవి. మామిడి సీజన్ కూడా వీటితోనే మొదలవుతుంది. దీని పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా తెలియదు కానీ వీటి గురించి చాలానే కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం ఉండ్రాజవరం మండలంలోని వెలగదురు గ్రామ పరిసర ప్రాంతాల్లో దొంగలు ఓ పండును తిని టెంకను పాతగా, దాన్నుంచి మొలకెత్తిన చెట్టు నుంచే చాలా అంట్లు కట్టారట. ఆపై క్రమంగా ఇది అంతరించిపోతుండటంతో ఉద్యానశాఖ దీని పరిరక్షణకు నడుం కట్టింది. ఫలితం కడియం నర్సరీల్లో అంట్లు కట్టిన ఈ మొక్కలు దొరుకుతున్నాయి. పూర్వం ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన రాజులు తమ తోటల్లో వీటిని పెంచుకుని ఆ రుచిని తాము ఆస్వాదించడమే కాదు, మిత్ర రాజులకు కూడా వాటిని కానుకలుగా పంపించేవారట. తమ తోటల్లో కాసే ప్రత్యేక రకాలను బంధువులకు, స్నేహితులకూ పంపించే ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది.
పంజవర్ణం
తమిళనాడులోని రాజపాళ్యంకి చెందిన జగన్నాథ రాజా అనే సన్నకారు రైతు గుర్తించి పెంచుతున్న పంజవర్ణం కూడా తేనె అంత మధురంగా ఉంటుందట. ఈ చెట్లు సుమారు పదిహేనేళ్ల వయసొచ్చాక ఏడాదికి వెయ్యిపండ్ల వరకూ కాస్తాయట. అయితే ఈ కాయలను కూడా స్థానికంగానే వాడటంతో వీటి రుచి ఇతర ప్రాంతాలకు చేరలేదు.
ఇవన్నీ ఒక ఎత్తయితే చేతులకి, మూతులకీ పూసుకుంటూ, జుర్రుకుంటూ రసాస్వాదన కలిగించే బేనీషా, చెరుకు రసాలు, నూజివీడు రసాలు, చిన్న రసాలు, పెద్దరసాలు, సువర్ణరేఖ, పంచదార కలశ.. వంటివన్నీ మాత్రం తెలుగువారికే సొంతం. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోని ఇతర ప్రాంతాల్లో తినేవన్నీ కోత పండ్లే మరి. ఇవే కాదు.. ఆయా ప్రాంతాలకే పరిమితమవుతూ మన దృష్టికి రాని అపురూపమైన మామిళ్ల రుచులెన్నో.. ఎనె్నన్నో..!
పోషక విలువలు
మిగతా పండ్లతో పోలిస్తే మామిడిపండులోని పోషక విలువల గురించి ప్రచారం తక్కువే.. భారతీయుల ఇంటింటి ఆహారమైన ఈ మామిడిపండు గురించి పాశ్చాత్యులు కాస్త చులకనగానే చూస్తారు. మామిడి కేవలం జిహ్వ చాపల్యాన్ని తీర్చే తీపి పండుగానే వారు గుర్తిస్తారు. కానీ మామిడి పండులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. తాజా మామిడిపండులో పదిహేనుశాతం చక్కెర, ఒక శాతం మాంసకృత్తులు, గుర్తించతగిన మోతాదులో ఎ, బి, సి విటమిన్లు ఉంటాయి. మామిడిపండు ఎక్కువగా తియ్యగా ఉన్నా, కొన్ని జాతుల పండ్లు కొంచెం పుల్లగా ఉంటాయి. ముఖ్యంగా చిలకముక్కు (బెంగళూరు) మామిడి ఈ కోవకు చెందినదే. అందువలనే భారతదేశంలో చిన్న చిన్న వ్యాపారులు వీటిని సన్నని, పొడవైన ముక్కలుగా కోసం ఉప్పు, కారం చల్లి బండిమీద అమ్ముతూ ఉంటారు. ఇది చాలామందికి నోరూరించే ఆహారం. కొన్ని పండ్లు ఎక్కువ పీచును కలిగి ఉంటాయి. వీటిని రసాలు అంటారు. కొన్ని కరకరలాడే గుజ్జుతో ఉంటాయి. వీటిని మల్‌గోవా మామిడి అంటారు. బంగినపల్లి రకం మామిడికాయలు ఎక్కువ తీయగా, మెత్తటి గుజ్జును కలిగి ఉంటాయి. నీటిశాతం ఎక్కువ కనుక ఇవి రసభరితంగా ఉంటాయి.

ఔషధోపయోగాలు
క్యాన్సర్‌కు మందుగా..
మామిడిపండును చులకనగా చూసే పాశ్చాత్య దేశమైన అమెరికాలో మామిడిపండు గురించి ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. స్ర్తిల జీవితంలో విషాన్ని నింపే బ్రెస్ట్ క్యాన్సర్‌ను మామిడిపండు ఎదుర్కొంటుందని అధ్యయనాల్లో తేలింది. మామిడిపండులోని ‘పాలీఫినోల్’ అనే రసాయనాలు క్యాన్సర్ కణాలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో గమనించారు పరిశోధకులు. ఇందుకోసం వారు పెద్దపేగు, వక్షోజాలు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్.. తదితర క్యాన్సర్ కణాలపై ఈ పాలీఫినోల్స్‌ను ప్రయోగించి చూశారు. వీటిలో ప్రోస్టేట్, ల్యుకేమియా, ఊపిరితిత్తుల కేన్సర్ కణాలపై మామిడి పండ్లు ఎంతో కొంత ప్రభావం చూపినట్లు గ్రహించారు. ఆశ్చర్యకరంగా వక్షోజ, పెద్ద పేగు క్యాన్సర్ కణాలను నిరోధించడం, నాశనం చేయడంలో మామిడిపండ్లు అద్భుత ప్రభావం చూపాయట.
వైద్య చికిత్సల్లో క్యాన్సర్ కణాలతో పాటుగా ఆరోగ్యవంతమైన కణాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. వీటివల్ల రోగి నీరసించిపోవడం, మళ్లీ క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. కానీ మామిడిపండు నుంచి తీసిన రసాయనాలు మాత్రం కేవలం క్యాన్సర్ కణాలపై మాత్రమే దాడిచేయడం గమనార్హం. మామిడి నుంచి తీసిన పాలీఫినోల్స్ క్యాన్సర్ కణాలపై పనిచేసే తీరు కూడా చిత్రంగా ఉంటుంది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న క్యాన్సర్ కణాలను నిరోధించడంతో పాటు, దెబ్బతిన్న కణాలను బాగుచేయడంలో పాలిఫినోల్స్ అద్భుత పాత్రను పోషిస్తున్నాయట. తమ పరిశోధనలో మామిడి పండు సత్తా తెలిసింది కాబట్టి పాలిఫినోల్స్‌ను తీసిన మందులతో క్యాన్సర్ చికిత్సను ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టాలని పరిశోధకులు కోరుకుంటున్నారు. ఆ మందులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చేందుకు కొంత కాలం పడుతుంది కాబట్టి.. ఈలోగా తియ్యటి మామిడిపండ్ల రుచిని కాస్త ఆస్వాదిస్తే సరి.
* మామిడి పండులో పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటు సమస్యను నివారిస్తాయి. విటమిన్-సి, ఫైబర్ శరీరంలో హానిచేసే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
* మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బాక్టీరియా నశిస్తుంది. దంతాలు శుభ్రపడతాయి. పంటిపై ఎనామిల్ దృఢంగా ఉంటుంది.
* మామిడిపండు మంచి జీర్ణకారి. ఇది అజీర్ణం, అరుగుదల సరిగా లేకపోవడం వల్ల వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
* వీటిలో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో ఉన్నవారు మామిడిపండ్లను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల వృద్ధికి దోహదపడుతుంది.
* ఈ పండులోని విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. వృద్ధాప్య సమస్యలను తగ్గిస్తుంది. చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది.
* మామిడిపండు మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. శృంగార వాంఛను పెంచుతుంది.
* మామిడిపండులో బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* మామిడిపండులో పెక్టిన్ అధిక మొత్తంలో ఉంటుంది. దీనివల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు సమర్థవంతంగా తగ్గుతాయి. అంతేకాకుండా పెక్టిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కూడా అడ్డుకుంటుంది.
* మామిడిపండు అజీర్ణం, ఆమ్లత వంటి సమస్యలను తొలగించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఇందులో జీర్ణక్రియకు సహాయపడే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి.
* మామిడిలో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది గర్భిణులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
* మామిడిపండులో మెదడు పని నిర్వహణ, అభివృద్ధి కోసం కీలకమైన విటమిన్ బి6 అధిక పరిమాణంలో ఉంటుంది.
* మామిడిపండును తినడం వల్ల మధుమేహం తగ్గుతుంది అనేదానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం మాత్రం మామిడిపండు మధుమేహానికి గొప్ప సహజ నివారణ మార్గంగా ఉందని తెలుస్తోంది. పూర్వం మధుమేహ రోగులు తప్పనిసరిగా మామిడిపండును మానేయాలని అనేవారు. కానీ ఇప్పుడు పండు కంటే మామిడి ఆకులు కూడా మధుమేహ నివారణలో ఉపయోగపడుతున్నాయని అధ్యయనంలో నిరూపణ అయింది.
* ఒక కప్పు మామిడి పండ్ల ముక్కలను రోజూ తీసుకుంటే 25 శాతం విటమిన్-ఎ లభిస్తుంది. తద్వారా రేచీకటి, పొడికళ్లను నివారించవచ్చు. కంటిచూపు మెరుగవుతుంది.
* చర్మ సంబంధిత సమస్యలు, టాన్‌ను నివారించడానికి మాంగో ఫేస్‌ప్యాక్స్ బాగా ఉపయోగపడతాయి.
* చర్మంపై మురికిని తొలగించి చర్మరంధ్రాలను తెరిచేందుకు సమర్థవంతంగా పనిచేస్తుంది మామిడి. చర్మ రంధ్రాలు తెరచుకోవడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. మామిడి గుజ్జును ముఖానికి పూసి పది నిముషాలు ఆగి తర్వాత కడిగేయాలి. గుజ్జులో తేనె, పాలను కలిపి ముఖానికి, మెడకు పూయాలి. పది నిముషాల తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మం మృదువుగా తయారై కాంతులీనుతుంది.
* మామిడి గుజ్జును తరచూ ముఖానికి రాయడం వల్ల ఇందులోని విటమిన్-ఎ, సిలు శరీరంలో అధికమొత్తంలో కొల్లాజెన్ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి. కొల్లాజెన్ ప్రొటీన్ చర్మ వృద్ధాప్య ప్రక్రియను నిదానింపజేయడానికి, రక్తనాళాలు, శరీర కనెక్టివ్ కణజాలాలను సంరక్షించేందుకు సహాయపడుతుంది.
* ఆకుపచ్చ మామిడిరసంలో కొద్దిగా పంచదార, నీరు కలిపి తాగితే.. వడదెబ్బ తగ్గిపోయి శరీరం చల్లగా మారుతుంది. శరీరంలోని వేడి తగ్గకపోతే మూత్రవిసర్జన ఆగి తద్వారా మూత్రపిండాలు విషపదార్థాలతో ‘ఓవర్ లోడ్’ అయ్యే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి మామిడి కాయలు బాగా ఉపయోగపడతాయి.
* మామిడి జిగురుకు మూడురెట్లు నీళ్లు కలిపి పేస్టులా చేసి ప్రతిరోజూ పాదాలకు లేపనంలా రాసుకోవాలి. దీనితోపాటు సాక్సులు ధరిస్తే పాదాలపై పగుళ్లు తగ్గిపోతాయి.
* రెండుకప్పుల నీళ్లను మరిగించి, అందులో రెండు చెంచాలు మామిడిపూతను వేసి మరికాస్త మరిగించాలి. ఈ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే పుక్కిట పట్టాలి. అవసరమనుకుంటే ఇలా రోజుకు రెండు, మూడుసార్లు చేయవచ్చు.
* మామిడి టెంకలోని జీడిని వేరుచేసి ఆరబెట్టాలి. దీనికి ఒక చెంచా మెంతులను కలిపి మెత్తగా నూరాలి. దీన్ని ఒక సీసాలో భద్రపరిచి కొన్నిరోజుల పాటు మజ్జిగతో కలిపి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు చనిపోతాయి.
* అరచెంచా మామిడి జీడిని పొడిరూపంలో పెరుగుమీది తేటతో తీసుకుంటే ఆర్శమొలలు తగ్గుతాయి.
ఇవేకాదు మామిడి వేర్లు, చిగుళ్లను కూడా ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు చికిత్సగా వాడతారు. ఫలాల రారాజు మామిడి గురించి తెలుసుకున్నాం కదా.. ఒక్కపండులో ఎంత ఆరోగ్యమో.. అందుకే ఆలస్యం చేయకుండా వేసవి వెళ్లేలోగా కొన్నైనా మధుమ మామిళ్ళను తిందామా!
గ్లూకోజ్‌ను తగ్గిస్తుందా!?
రోజూ మామిడిని తినడం వల్ల ఊబకాయులపై పడే ప్రభావాలను ఓక్లహామా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు ఇటీవల అధ్యయనం చేశారు. ఒక్కొక్కరికి పది గ్రాముల మామిడితాండ్రను తినిపించారు. ఇది వంద గ్రాముల తాజా మామిడిపండ్లతో సమానం. పనె్నండు వారాల తర్వాత పరిశీలించగా.. వీరి రక్తంలోని గ్లూకోజ్ మోతాదులు గణనీయంగా తగ్గినట్లు తేలింది. అధిక కొవ్వుతో కూడిన ఆహారాన్ని తిన్న ఎలుకల్లో మామిడిపండు గ్లూకోజు మోతాదులను మెరుగుపరుస్తున్నట్లు గత పరిశోధనలో తేలిన అంశాన్ని తాజా అధ్యయన ఫలితాలు బలపరుస్తున్నాయని అధ్యయన నేత డాక్టర్ లూకాస్ చెబుతున్నారు. అయితే మామిడిలోని ఏయే పాలీఫెనోలిక్ రసాయనాలు ఇందుకు దోహదం చేస్తున్నాయో తెలుసుకోడానికి మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందంటున్నారు. మరోవైపు మామిడిలో పాలీఫెనాల్స్ రొమ్ము క్యాన్సర్, క్యాన్సర్ రహిత కణాల్లో వాపును అదుపుచేస్తున్నట్టు మరో అధ్యయనంలో బయటపడింది. *
మామిడికి నాలుగు వేల సంవత్సరాల చరిత్రే ఉంది. ఇప్పుడు ప్రపంచం అంతటా మామిడి పండు తినడం పట్ల మక్కువ పెరిగింది. ఉష్ణ ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ పంటను ఇప్పుడు సమశీతోష్ణ పరిస్థితుల్లో కూడా పండిస్తున్నారు. భారత ద్వీపకల్పం అంతటా, కరేబియన్, మధ్య అమెరికా, మధ్య ఆసియా, దక్షిణ తూర్పు ఆసియా, మధ్య మరియు దక్షిణ ఆఫ్రికా దేశాల్లోనూ పండిస్తున్నారు.
బరువు తగ్గేందుకు..
మామిడిపండులో ఎన్నో విటమిన్లు, పీచు, ఖనిజాలు ఉంటాయి. మామిడిపండును తింటే బరువు పెరుగుతామని భ్రమ పడతారు. కానీ ఆఫ్రికా మామిడిపండ్లు శరీర బరువును తగ్గిస్తాయని మీకు తెలుసా? ఆఫ్రికా మామిడిపండు సాధారణ మామిడిపండు కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. అనేక దశాబ్దాల నుండి ఆఫ్రికా మామిడిపండ్లను బరువు తగ్గేందుకు సహజ ఆహారంగా వాడుతున్నారు. చాలామంది పోషకాహార నిపుణులు బరువు తగ్గేందుకు ఆఫ్రికా మామిడిపండ్లను తినమని సిఫార్సు చేస్తారు. ఆరోగ్యానికి ఇవి ఎంతో సురక్షితం. దుష్ప్రభావాలు అసలే ఉండవు. ఆఫ్రికా మామిడి పండ్ల ఆరోగ్య ప్రయోజనం ప్రధానంగా దాని విత్తనాల నుండే వస్తుంది. అంటే టెంక నుండి అన్నమాట. దీని టెంకలో పుష్కలంగా లభించే పీచు, ఎంజైమ్స్ అధిక బరువును కరిగించేస్తాయి. లెప్టిన్ అనే పదార్థం ఆకలిని ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది. ఫలితంగా శరీరంలో అధికంగా ఉండే కేలరీస్ ఖర్చయిపోతాయి. ఈ పండులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే అడిపోనెక్టిన్ అనే పదార్థం ఇన్సులిన్ ఉత్పత్తిని అధికం చేస్తుంది. అది తక్షణమే కొవ్వును శక్తిగా మారుస్తుంది. ఫలితంగా బరువు తగ్గడమే కాకుండా ఇతర వ్యాధులు రాకుండా చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. కఠిన ఆహారం పాటించకుండా, వర్కవుట్లు చేయకుండా బరువు తగ్గాలనుకునేవారికి ఆఫ్రికా మామిడిపండ్లు తినడం మంచి మార్గం.
మామిడిలో కాల్షియం, విటమిన్-బి పుష్కలంగా ఉన్నాయి కనుక అమెరికా జనం వీటిని చెక్కుతో సహా తింటారు. పడమటి దేశాల్లో పండ్లతో కూడా తీయటి పచ్చడిని చేస్తారు. ఫిలిప్పైన్స్‌లో మామిడికాయలను ష్రిమ్ప్ అనే చేపల గుజ్జుతో కలిపి తింటారు. పీచేస్‌పై అనే ఆహారాన్ని ఇప్పుడు మాంగో పైతో చేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో భోజనానంతర ఆహారంతో చేర్చి వీటిని అందిస్తారు.

వంద గ్రాముల మామిడిలో ముడి పోషక విలువలు

శక్తి 70 కిలోకేలరీలు
పిండిపదార్థాలు 17.00 గ్రాములు
చక్కెరలు 14.8 గ్రాములు
పీచుపదార్థాలు 1.8 గ్రాములు
కొవ్వు పదార్థాలు 0.27 గ్రాములు
మాంసకృత్తులు 0.51 గ్రాములు
విటమిన్- ఎ 0.38 మి.గ్రా.
థయామిన్ (బి1) 0.058 మి.గ్రా.
రైబోఫ్లేవిన్ (బి2) 0.057 మి.గ్రా.
నియాసిన్ (బి3) 0.584 మి.గ్రా.
పాంటోథీనిక్ ఆమ్లం (బి5) 0.160 మి.గ్రా.
విటమిన్ బి6 0.134 మి.గ్రా.
ఫోలేట్ (బి9) 0.14 మి.గ్రా.
విటమిన్-సి 27.7 మి.గ్రా.
కాల్షియమ్ 10 మి.గ్రా.
ఇనుము 0.13 మి.గ్రా.
మెగ్నీషియమ్ 9 మి.గ్రా.
భాస్వరం 11 మి.గ్రా.
పొటాషియం 156 మి.గ్రా.
జింకు 0.04 మి.గ్రా.

-ఎస్.ఎన్. ఉమామహేశ్వరి