ఈ వారం స్పెషల్

జీవనసుధ రామకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రో భద్రయా స చమాన ఆగాత్
స్వసారం జారో అభ్యేతి పశ్చాత్
సుప్రకేతైర్ద్యుభి రగ్ని ర్వితిష్ఠన్
రువద్భిర్వర్లై రభిరామ మస్థాత్
-ఋగ్వేదము
మొట్టమొదటి పర్యాయంగా బీజ రూపంలో, ఋగ్వేదంలోని, ఈ మంత్రంలో శ్రీరామకథ కనిపిస్తుంది. నాలుగు చరణాల్లో, శ్రీరామ కథలోని నాలుగు ప్రధాన ఘట్టములు సంకేతింపబడినాయి. భద్రుడు అనగా సర్వమంగళ స్వరూపుడైన రామభద్రుడు, భద్రతో అనగా సర్వమంగళ స్వరూపిణి అయిన సీతతో, వనమునకు వచ్చాడని, జారుడైన రావణుడు సోదరిని దుష్టబుద్ధితో సమీపించాడని, ఆకాశాన్నంటే హర్మ్యాలు అగ్నికి ఆహుతి అయ్యాయని, తన భయంకరమైన వాహినులతో రావణుని, రాముడు ఎదుర్కొన్నాడని నిరుక్తకారులు ఈ ఋగ్వేద మంత్రాన్ని నిర్వచించారు.
వేద వేద్యుడైన పరంధాముడు దశరథాత్మజుడైన శ్రీరాముడుగా అవతరించగా, నాదాత్మకమైన వేదం, రసాత్మకమైన రామాయణ మహాకావ్యంగా ఆవిర్భవించింది.
భారతీయ సంస్కృతికీ, ధార్మిక జీవన విధానానికి మణి దర్పణం - రామాయణం. వేదాంత దర్శనంగాను, ధర్మ ప్రబోధకంగాను, ఇహపర సాధకంగాను, జన జీవితాన్ని ప్రభావితం చేసేదిగాను, అందించబడింది - శ్రీరామకథ.
త్యాగం ప్రశంసనీయమైన గుణం. అది కలిగిన వారు శాశ్వతమైన కీర్తినొంది, ఇహపర సుఖములను పొందుతారు. సత్యధర్మాలు, ఎన్ని ఆటంకములకు గురి అయినా చివరకు విజయాన్ని పొంది తీరుతాయన్న సంకేతాన్నిస్తుంది - శ్రీరామకథ.
సత్యము, ధర్మము, త్యాగము, కర్తవ్య నిష్ఠ, పితృవాక్య పరిపాలన, మాతృభక్తి, భ్రాతృప్రేమ, అనురాగము, క్షమ, స్నేహము, సౌశీల్యము, వాత్సల్యము, సహనము, సౌహార్దము, మొదలగు సుగుణములచే మానవ జాతికి ఆదర్శప్రాయుడైన శ్రీరామచంద్రుని దివ్య చరిత్రము, వాల్మీకి మహర్షి సుమధుర కవిత్వమూ మిళితమై మధురాతి మధురమైన శ్రీరామకథ, శ్రీమద్రామాయణ మహాకావ్యంగా ఆవిర్భవించింది.
వాల్మీకి మహర్షి - రామాయణ రచన
వాల్మీకి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రచేతసుని కుమారుడు. అందుకే ఆయనకు ‘ప్రాచేతసుడు’ అనే పేరు కూడా ఉంది. చిన్నతనంలో తండ్రి శాపం వలన కిరాతకునిగా తిరిగాడు. సప్త ఋషులను నిర్బంధించగా వారు తారక మంత్రాన్ని ఉపదేశించి, దానిని జపం చేయమన్నారు. జపములో నిమగ్నుడై, దేహ ధ్యాస కోల్పోయి సమాధి స్థితిని పొందాడు. అతని చుట్టూ చీమల ప్టులు అనగా వాల్మీకములు పెరిగినాయి, చివరకు సిద్ధిని పొంది ‘వాల్మీకి మహర్షి’ నామధేయుడైనాడు.
వాల్మీకి ఆనాటి సామాజిక పరిస్థితులను గురించి, మానవ స్వార్థ స్వభావం, చతుర్విధ పురుషార్థముల గురించి, జీవిత పరమార్థం గురించి, మానవునికి సంపూర్ణ మానవత్వ వికాసం గురించి, ఇలా అనేక విషయముల మీద ఆలోచన చేస్తూ ఉన్నాడు. నారద మహర్షి వారి దర్శనమయింది. ఈ లోకంలో సంపూర్ణ సద్గుణవంతుడైన వారున్నారా? అని పదహారు సద్గుణములను చెప్పి, అవి అన్నీ ఒకే వ్యక్తిలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి వివరాల్ని అడిగాడు, వాల్మీకి మహర్షి నారద మహర్షిని. లేకేం ఉన్నాడు. ఇక్ష్వాకు కులదీపమగు, దశరథ మహారాజు తనయుడు, శ్రీరామచంద్రుడని చెప్తూ, రాముడు షోడశ కళాప్రపూర్ణుడు అని తెలిపాడు, నారద మహర్షి.
తమసా నది ఒడ్డున, నారద మహర్షి చెప్పిన శ్రీరామచంద్రుని గురించి తలచుకుంటూ ఉండగా, ఒక క్రౌంచ పక్షుల జంటలో, మోహితమైన మగ పక్షిని, ఒక బోయవాడు, బాణంతో చంపాడు. ఆడపక్షి దిక్కుతోచక విలపిస్తోంది. ఆ దృశ్యాన్ని చూసి, విచలితమైన మనస్సుతో ఉన్న వాల్మీకి మహర్షి నోట ఛందోమయంగా ఉన్న శ్లోకం వెలువడింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, వాల్మీకి మహర్షి నోట వెలువడిన మాటలు అత్యంత ఛందోబద్ధమై మహిమాన్వితమైన శ్లోకమని, శ్రీరామ కథను అదే ఛందస్సులో వ్రాయమని చెప్పాడు. నారద మహర్షి, బ్రహ్మదేవుల ప్రేరణ, ఆశీస్సులతో, ప్రేమ కరుణ జాలితో కూడిన హృదయ స్పందనతో ధర్మ ప్రచారంగా, అంతర్గత చైతన్యం పలికించగా, ఆచంద్ర తారార్కం వర్థిల్లేటట్లుగా, శ్రీమద్రామాయణ మహా గ్రంథాన్ని రచించాడు - వాల్మీకి మహర్షి.
‘కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్, ఆరుహ్య కవితాశాఖామ్, వందే వాల్మీకి కోకిలమ్. వాల్మీకేర్ముని సింహస్య కవితా వనచారిణః శృణ్వన్ రామకథా నాదం కోనయాతి పరాంగతిమ్’ అని వర్ణించాడు వాల్మీకి మహర్షిని, ఒక మహనీయుడు.
శ్రీరామ జననమ్
పుత్రకామేష్ఠి యాగం పూర్తయిన తరువాత పనె్నండో నెల అయిన చైత్రమాసంలో నవమి తిథి నాడు, పునర్వసూ నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో, గురు చంద్రులుండగా, ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉండగా, కౌసల్యాదేవి జగత్కల్యాణ కారకుడైన శ్రీరామచంద్రుణ్ణి ప్రసవించింది. భరతుడు, చైత్ర శుక్ల దశమి మంగళ వారం పుష్యమీ నక్షత్రంలో తైతుల కరణం, గంధయోగంలో జన్మించాడు. లక్ష్మణుడు చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశే్లషా నక్షత్రంలో, గరకరణంలో, వృద్ధి యోగంలో జన్మించాడు. లక్ష్మణుడు ఆదిశేషుని అంశ. అందుకే ‘శేషుడు, శివునికి భూషుడు లక్ష్మణ వేషియై కొలువలేదా’ అని కీర్తించాడు, త్యాగయ్య. శతృఘు్నడు, చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశే్లషా నక్షత్రం, గరకరణం వృద్ధి యోగంలో జన్మించాడు.
నాలుగు వేదములే నలుగురు సోదరులు
నాలుగు వేదముల సారమే, నలుగురు సోదరులు. రాముడు ధర్మానికి ప్రతీక అయిన యజుర్వేదము. లక్ష్మణుడు - రామనామమే సర్వశాస్తమ్రుల సారమని ఉచ్ఛరించి రామ నామమునే చింతించే ఋగ్వేదము. భరతుడు - రామ నామమే తన జీవిత ఆధారముగా విశ్వసించి, రామ నామమును గానము చేసే సామ వేదము (శంఖ నాదము - వేద నాదము) శతృఘు్నడు, రామ లక్ష్మణ భరతుల ఆజ్ఞలను శిరసావహించి అంతర్ శక్తులను దునుమాడి శాంతిని చేకూర్చే అధ్వరణ వేదం.
రాముని పేరే రామతారక మంత్రం
శివపంచాక్షరీ మంత్రం - ఓం నమశ్శివాయలో ‘మ’ అనేది జీవాక్షరం. నారాయణాష్టాక్షరీ మంత్రంలో ‘రా’ అనేది జీవాక్షరం. ఇది వ్యత్యస్తమై, ‘మరా’ అనేది ‘రామ’ అయింది. శివకేశవాత్మకుడు రాముడు. అందుకే దేవామృత వర్షిణి రాగంలో త్యాగయ్య దీనిని ఉటంకిస్తూ హృద్యంగా గానం చేశాడు. ఇదే తారక మంత్రము. రామకథా రస వాహిని యందు క్రుంకులిడి, రామకథామృతమును గ్రోలి తారక రాముని నిజ తత్త్వమును, స్వస్వరూపాను సంధానతతో ఉపాసించి తరించిన వారు, ఎందరో మహానుభావులు. ఎన్ని జన్మముల నుండి చూచిననూ ఏకోనారాయణుడని, అన్ని రూపుడై యున్న ఆ పరమాత్మ నామము, కథ విన్నా ఎన్ని జన్మముల చేసిన పాపములు, ఈ జన్మతో విడునని రామ మంత్రముచే, ఇది కడసారి జన్మమని, శాశ్వత నిత్యానందము, మోక్షగతి మొదలగు విషయములను మనకందిస్తూ ‘తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా’ అని తారక రాముని కీర్తించాడు - భద్రగిరి రాముని భక్తుడు - భక్త రామదాసు.
రామాయణం చెప్పిన ఆధ్యాత్మికం
రామ, అయనం = రామాయణం. అంటే రామ, అయనం అనే రెండు మాటలతో ‘రామాయణం’ ఏర్పడింది. అయనము అనే మాటకి, గమనము, గమ్యము అనే అర్థాలున్నాయి. ‘నాన్యః పంథా అయనాయ విద్యతే’ అన్నది వేదం. అయనం - అంటే అక్కడ - చేరవలసిన స్థానం. దాన్ని చేర్చేది ‘పంథాః’ అనే మాట. దానే్న పరాయణమని కూడా పేర్కొన్నారు. పరమమైన గమ్యమేదో, అది పరాయణం. ‘సత్యజ్ఞానానంద రూపా సామరస్య పరాయణా’ అన్నది లలితా సహస్ర నామం. కనుక, ‘రామాయణం’ అంటే - రాముడే గమ్యం. అనగా, ఆత్మ తత్త్వమే ఎప్పటికైనా మనం చేరవలసిన స్థానం. ఇదే ఆత్మారామ, తారకరామ తత్త్వం.
విశ్వామిత్రాశ్రమానికి రామలక్ష్మణులు
విశ్వామిత్ర మహర్షి, యాగ రక్షణకై, రాముణ్ణి తీసికొని వెళ్లటానికి, అయోధ్యకు వచ్చాడు. స్వాగతం పలికిన దశరథ మహారాజు, విశ్వామిత్ర మహర్షి ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. యాగ సంరక్షణార్థం, రాముణ్ణి తన వెంట పంపమన్నాడు, విశ్వామిత్రుడు. రాముడు ఇంకా పిల్లవాడని, తను స్వయంగా వచ్చి యాగ సంరక్షణ చేస్తానన్నాడు దశరథుడు. దశరథుణ్ణి వారించి, విశ్వామిత్రుడు - ‘నీ కొడుకును గైకొని చని మా కాకలి యంచు దిందుమా పిచ్చినృపా, మాకడ ప్రశస్త మన్త్ర వ్యాకృతి కలదద్ది నేర్పెదమింతే’ అన్నాడని, విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో, తన వద్ద ఉన్న శక్తివంతమైన అస్త్ర శస్త్రాలను , జగత్కల్యాణానికి ఉపకరించేవాడు, రాముడొక్కడేనని గ్రహించి, అతనికి వాటిని ప్రదానం చేసే నిమిత్తం, రాముణ్ణి తీసికొని వెళ్లటానికి అయోధ్యకు వచ్చాడు, విశ్వామిత్రుడు. ఇన్ని అస్త్ర శస్తమ్రులున్న విశ్వామిత్రుడు, తన యాగాన్ని తను రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. ఇందులో రాముని లోక కల్యాణ తత్త్వం, నిస్వార్థత, విశ్వామిత్రుని పరంగా వివరించబడినాయి. రాముణ్ణి విశ్వామిత్రునితో పంపాడు దశరథుడు, వశిష్ఠుని సలహా మేరకు.
తాటకి వధ
‘రామోద్విర్నా భిభాషతే’ రాముడు రెండు మాటలు మాట్లాడాడు. సత్య వాక్పరిపాలకుడు. అరణ్యంలో వెడుతూ ఉండగా ఒక భయంకర శబ్దం వినపడింది. బీభత్స భయానక రూపం కనపడింది. కొండ గుహలాంటి నోరు తెరుచుకుంది. రామలక్ష్మణులను మ్రింగటానికి మీదికి వస్తోంది తాటకి. స్ర్తి హత్య దోషమని సంశయిస్తున్న రామునితో, వ్యవధి లేదు రామా, దుర్మార్గమైనా సన్మార్గమైనా, పాతకమైనా, దోషమైనా, ప్రజారక్షణకై కర్తవ్యాన్ని నిర్వర్తించు. అది ప్రభు ధర్మం’ అన్నాడు విశ్వామిత్ర మహర్షి. వింట బాణం దూసుకుపోయింది, ప్రాణాలు విడిచింది తాటకి. మారీచ సుబాహులు వచ్చారు. సుబాహుణ్ణి బాణాగ్నితో దహించి మారీచుణ్ణి దూరంగా పోయేటట్లుగా బాణాలు వేశాడు, రాముడు.
‘వాచామ గోచరమే మనసా, వర్ణింప దరమె రామ మహిమ, రేచారి మారీచుని బడగపెట్టి, రెండో వాని శిఖినా సంగెనే’ అని కైకావశీ రాగంలో మారీచ సుబాహుల వృత్తాంతాన్ని అద్భుతంగా వర్ణించాడు త్యాగరాజస్వామి.
వశిష్ట, విశ్వామిత్ర మహర్షులు
శ్రీరామునికి శస్త్రాస్త్ర విద్యను బోధించిన గురువు - పరమ సాత్వికమూర్తి వశిష్ట మహర్షి. శ్రీరాముడు చేసే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు అవసరమైన శస్త్రాస్తమ్రులను అందించిన గురువు - రజ స్తమోగుణ రాశియై, చివరకు సత్వగుణాతీతుడైన రాజర్షి. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. విద్యాబుద్ధులు అక్షరాభ్యాసం నాటి నుండి నేర్పిన గురువు బ్రహ్మర్షి వశిష్ట మహర్షి, పరమ శాంతమూర్తి, కనుకనే రాముని శస్త్రాస్త్ర సామర్థ్యం లోకకల్యాణ కారకమయింది. ఇది ఈనాటి అణు విజ్ఞానాన్ని విశ్వకల్యాణానికి వినియోగించాలని హెచ్చరిస్తోంది.
అహల్యా గౌతములు
ధూళిలో వాయుభక్షిణియై, ఇతరులకు కనపడకుండా తపమొనర్చుచూ వేయి ఏండ్లు ఆశ్రమమున, పంచభూత సదృశముగా నున్నది ‘అహల్య’. రాముడింకనూ కొంత దూరమున ఉండగానే అతని మేని గాలి సోకుట వలన, కాలిసవ్వడి వినుట వలన, దేహ పరిమళము వ్యాపించుట వలన, శరీర నీల కాంతి గోచరించుట వలననూ ‘సచ్చిదానంద ఘనముల్ స్కందత్రయము గుర్తుగానున్న ఒక చెట్టుగాని చెట్టు వలె చూపట్టిన, శ్రీరామచంద్రుడు ఆతిథ్యము స్వీకరింప వచ్చుట వలనను, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములుగా పంచ మహాభూతముల పంచతన్మాత్రనబడే సూక్ష్మ స్థితులతో పంచేంద్రియములను పొంది, స్వ స్వరూపము పొందింది - అహల్య. గుణాతీత అయిన అహల్యకు పాదాభివందనం చేశాడు, శ్రీరామచంద్రుడు. రాతిని నాతినిగా చేసినట్లు వాల్మీకి వ్రాయలేదు. అహల్య, గౌతముడు, ఇంద్రుడు అంటే ఎవరు. వారి పవిత్ర బంధం ఏమిటి? అనే వాటికి గంభీర ఉదాత్త ఆధ్యాత్మిక రహస్యాలను యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం వివరించింది. అది అసలైన అర్థం. అందుకే అహల్యకు పాదాభివందనం చేశాడు రాముడు.
సీతాయాశ్చరితమ్ మహత్
అని, సీతకొక ప్రత్యేక స్థానమిచ్చాడు వాల్మీకి మహర్షి. సూర్యుని కంటె సూర్యకాంతి వేరు కాదు, అనే విధముగా సీతారాములొక్కటే. రాముడు వేద ప్రతిపాదితమగు సద్వస్తువు. సీత, రాముని కంటె భిన్నము కాక, భిన్నముగా గోచరించు ప్రకృతి సుందరి. ఆ ఆదర్శ దంపతుల తాత్విక అభేద స్థితి నెరుగుటయే, తత్త్వ సౌందర్యం. సద్వస్తువైన భగవంతునకు, దూరమైన జీవుని మరల సద్రూప బ్రహ్మముతో కూర్చదగునదే తత్త్వసౌందర్య సిద్ధి.
సీత అయోనిజ, పాతివ్రత్య తపస్సిద్ధురాలు. లోక కల్యాణార్థమై చేయు తపస్సు పరిపూర్ణమైంది. తపస్సిద్ధి పరిపూర్ణమైనదే. శ్రీరామ చంద్రుడు పరిపూర్ణ తపః స్వరూపుడు. జగత్కల్యాణమునకై అవతరించిన వాడు. ఆ విశ్వకల్యాణమునకే తపస్వి కంటె భిన్నరూపమై, తపస్సిద్ధియైన పరిపూర్ణురాలు, సీత. నవ వ్యాకరణ పండితుడై, వేదమూర్తియైన, హనుమంతుడు, తపస్వికి అనగా రాముని, తపస్సిద్ధిని అనగా సీతను, అందించినవాడు.
సీతామాత చిద్రూపిణి
మూల ప్రకృతి, ఆనందరూపిణి, స్వాత్మారాముని అర్ధాంగి. సీత త్రిలోక్య కుటుంబిని. ఆమె, ఒక సుందరమైన కాంతి. కనుకనే వాల్మీకి మహర్షి ‘మందం ప్రఖ్యాయ మానేన రూపేణ రుచిర ప్రభాం’ అన్నాడు. ‘రుచిర ప్రభాం’ అనగా సుందరమైన కాంతి. అగ్నివలె స్వప్రకాశరూపుడు - రాముడు. రాముని ధర్మపత్ని సీత. సీత, అగ్నిశిఖి. అందుకే వాల్మీకి సీతను, శిఖామివ విభావసోః అన్నాడు.
పాదుకా పట్ట్భాషేకం
అరణ్యవాసం చేస్తూ, చిత్రకూటంలో ఉన్న రాముణ్ణి మరల అయోధ్యకు తీసికొని వెడదామని, స్వచ్ఛందంగా వచ్చిన బంధువులు ప్రజావాహినితో వచ్చాడు - భరతుడు. ఆత్మ తత్త్వాన్ని బోధించి, కాలప్రాముఖ్యతను వివరించి, తన పాదుకలను, భరతుని అభీష్టం మేరకు ఇచ్చి పంపిన ఆత్మారాముడు - శ్రీరామచంద్రుడు. పాదుకలకు పట్ట్భాషేకించి, రాముని పనుపున రాజ్యపాలనం చేశాడు భరతుడు. అందుకే, భరతుని వంటి సోదరుడు మరొకరు లేరు, భరతునికి భరతుడే సాటి, అన్నాడు రాముడు.
రావణబ్రహ్మ
రావణాసురుడు, మహోగ్రమైన తపశ్శాలి. వేదార్థ పరిజ్ఞాత. అచంచల శివభక్తుడు. ఇంద్రియాల్ని జయించాడు, అపార శక్తిమంతుడు. అన్ని లోకాల్ని జయించాడు. అతన్ని చూచి దేవేంద్రుడు, యమ ధర్మరాజు భయపడిన మాట నిజమే. కాని లాభం ఏమిటి? ఇంద్రియాలు పగబట్టి అతన్ని ఎలాగైనా ఓడించటానికి ప్రయత్నించాయి. వాటికి విజయం లభించింది. ఇంద్రియాలకు లోబడే స్వభావం రావణునిలో, ఇంకా మిగిలి ఉంది. సీతామాత సౌందర్యాన్ని గూర్చి వినగానే అతని చెవులు అదుపు తప్పాయి. ధర్మాన్ని తప్పాయి. మనస్సు అధర్మం వైపు మళ్లింది. ఇంద్రియాలన్నింటికి వశుడైనాడు. ధర్మాన్ని కాలదన్నాడు. ఫలితంగా సీతాపసరణం జరిగింది, రావణునికి ఘోర పతనం జరిగింది.
సుందరకాండలో రావణుడు - సీత సంభాషణ
రావణునితో సంభాషించినపుడు తృణము కన్న హీనుడు, నీచుడు రావణుడన్న భావనతో, ఒక గడ్డిపోచను అడ్డముగా పెట్టుకుని మాట్లాడిన, సాధ్వీమణి సీత. రావణుణ్ణి, అతని భార్యయందు, అతని మనస్సును లగ్నము చేయమని సామ వచనములు చెప్పింది. పాపము చేసేవాడు పుణ్య ఫలమును ఆశించతగదని, వానికి పుణ్యం సిద్ధించదని ‘సాధువ్రతంచర’ అని ఉపదేశించింది. తను, రాముని కంటె వేరు కాదని ఖండితముగా చెప్పి, సీతారాములను విడదీయటం, రావణుడే కాదు, ఎవరి తరము కాదని చెప్పింది. రాముడు, శరణాగత వత్సలుడు గానీ, ఆయనను శరణు వేడమన్నది, అతని అనుగ్రహమునకు పాత్రుడవు కమ్మన్నది. నీవు పరాక్రమశాలివే అయితే, రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో దొంగచాటుగా, మారు వేషంలో మోసగించి, అపహరించవలసిన ఖర్మమేమి పట్టిందని’ ప్రశ్నించింది సీత, రావణుని. సీత ఎంత రాజనీతిజ్ఞురాలో తెలుస్తుంది.
సీత, రావణుని అజ్ఞానము తొలగించి, రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే యన్నట్లు తెలియజెప్పి, రాముని పరాక్రమమును విశదపరుస్తూ ‘ఇంతటి వాడు రాముడు, అట్టి రాముని, కీయబ్ధియనగ నెంత? లంకయనగ నెంత? దనుజుల పోలింకమెంత? నీవనగ ఎంత? నీలావు చేవ ఎంత? చెప్పనేటికి నీవె చూచెదవు గాక’ అని చెప్పిందని, మొల్ల రామాయణం చెప్పింది.
మూర్త్భీవించిన ధర్మస్వరూపిణి సీత. అన్నింటికంటె మిన్నయైనది సీత పాతివ్రత్య పవిత్ర ధర్మం. అట్టి ధర్మ నిష్ణాగరిష్ఠురాలగుట చేత, రామ బాణముతో పని లేకుండా తన తపశ్శక్తి తేజము, రావణుని సంహరించగలదని హెచ్చరిస్తూ, అమిత శక్తివంతమైన ఆ తపఃశక్తిని రావణుని సంహరించటమనే చిన్న కార్యమునకు ఉపయోగించ దలచుకోలేదని అదీగాక, రాముని ఆజ్ఞ కూడా లేకపోవుటచే, తాను రావణునిపై తన తపః శక్తి తేజమును ప్రయోగించలేదని చెప్పిన మహోదాత్త శక్తిరూపిణి -సీతామాత.
ఆంజనేయుడు: అతి బలవంతుడు
రామ కార్యమును సఫలము చేసిన బుద్ధిమతాంవరిష్ఠుడు, సీతా ప్రాణ ప్రదాత, రామాయణ మహామాలకు కొలికి పూస వంటి వాడు - ఆంజనేయుడు. శ్రీరామచంద్రునికి దాసుడై రాముని ప్రతిబింబమే, దాస స్వరూపుడుగా వెలసినవాడు, వాయునందనుడు హనుమంతునికి మహోత్కృష్ట స్థానాన్నిచ్చాడు వాల్మీకి మహర్షి. ‘పాహి రామదూత జగత్రాణ కుమార మాంపాహి’ అన్న వసంత వరాళి రాగంలోని కీర్తనలో, ఆంజనేయుని తత్త్వాన్ని, ముఖ్యంగా సుందరకాండలోని విశేషాల్ని హృద్యంగా, అందించాడు నాదయోగి త్యాగరాజ స్వామి. ‘గీతార్థము సంగీతానందము నీ తావున చూడరా మనసా, సీతాపతి చరణాబ్జము లిడుకొన్న వాతాత్మజునికి బాగ తెలుసురా’ అన్న సురటి రాగ కీర్తనలో ఆంజనేయుని వైభవాన్ని దాస భక్తిని అత్యద్భుతంగా వివరించాడు - నాదయోగి, సద్గురు త్యాగరాజ స్వామి. అందుకే, సీతమ్మ చేత ‘హనుమన్నా అని, శ్రీరామచంద్రుని చేత’ ‘మా కులదైవం’ అని పిలిపించుకున్న మహోదాత్తుడు - ఆంజనేయుడు. దేశంలో రామాలయములు ఎన్ని ఉన్నాయో అంతకంటె కొంచెం ఎక్కువగానే దాసుడైన ఆంజనేయునికి ఆలయాలున్నాయి. ‘అంతకారి నీ చెంత చేరి హనుమంతుడై కొలువలేదా’ లయకారకుడైన పరమశివుడు, హనుమంతుడై నిన్ను కొలిచినాడు’ అని ఆంజనేయుని విశేషాన్ని తెలియబరచాడు - త్యాగయ్య.
శబరికి మోక్షం
ఏ ఆధారము లేక, ఎట్టి శక్తి సామర్థ్యములు కల్గియుండక ఏ దిక్కూ తోచక గురువైన మతంగ మహర్షి వాక్కుపై విశ్వాసంతో, తనకు మోక్షాన్నివ్వడానికి, రాముడెప్పుడొస్తాడోనని, రాముడొక్కడే దిక్కని భావించి సంపూర్ణ దాసోహ భావంతో సాత్విక భక్తి విశ్వాసములతో, త్రికరణ శుద్ధిగా రామచింతనతో కాలము గడుపుతోంది బక్కచిక్కిన శబరి. రాముడు శబరితో ‘అవ్వా నీ తల యింత ముగ్గుబుట్టయినదేమి? అంటే, తల అంతా నెరిసిపోయిందన్న భావంతోను, జ్ఞాన వృద్ధురాలవు అన్న అంతర్లీన భావంతో అంటే, ‘నీ ఆత్మ వాకిట రంగవల్లులు దిద్దుటకయ్యా’ అన్నదిట శబరి. ‘నీ ఆయువంత ఏర్చి ఎండి ఏకైతివేమి?’ అని స్వామి అంటే, ఆర్ద్రంబుగా ఆ ఏకును యింత వత్తిగ చేసి వెలిగింపవే’ అన్నది శబరి. ఇది జీవాత్మ పరమాత్మల సంబంధం.
కమనీయం రమణీయం సీతా కల్యాణం
సీత పరా ప్రకృతి. రాముడు - పరాత్పరుడు. వారి అనుబంధం - సహజసిద్ధం. సర్వలోక రమణీయం. ‘్ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్థివం’ అని విశ్వామిత్రుడు రాజయోగి అయిన జనక మహారాజుకి ఆదేశమిచ్చాడు. ‘వత్స రామ ధనుః పశ్య’ ‘రామా ఈ ధనువును చూడుము’ అని గంభీరముగా పలికాడు. భావమెరిగిన రాముడు, శివ ధనుర్బంగం ఏశాడు. ఈ సందర్భముగా శ్రీరాముని ముద్దు మోముపైగల ముంగురులు ‘అలకలు’ అల్లలాడుట, కన్నులార చూచిన విశ్వామిత్రుడు - శ్రీరామ ఉపాసనా లక్ష్య సిద్ధిని పొందాడని, మధ్యమావతి రాగంలో, ‘అలకలల్లిలాడగని ఆ రాణ్ముని ఎటు పొంగెనో’ అంటాడు త్యాగయ్య. ‘ఫెళ్లుమనె విల్లు - గంటలు ఘల్లుమనె, గుభిల్లుమనె గుండె నృపులకు - ఝల్లుమనియె జానకీ దేహమొక నిమేషమ్ము నందె, నయము జయము భయము విస్మయము గదురా, శివధనుర్భంగము గావించిన ధీరోదాత్తుడు రాముడని, హృద్యంగా వర్ణించాడు కరుణశ్రీ. సీత పూజడవెన్నుగ శిరసు వంచె, చెఱుకు గడవోలె నడిమికి విరిగె ధనుస్సు’ అని అద్వైత శృంగార భావాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు, విశ్వనాథ, కల్పవృక్షంలో.
శివధనుర్భంగం - యోగ శాస్త్రాన్వయం
మనస్సును, మంత్రధ్యానంతో లయం చేసి, లక్ష్యాన్ని సాధించాలి. ప్రణవమనే ధనుస్సుతో బాణమనే మనస్సును సంధించి, ముక్తికాంత అనే లక్ష్యాన్ని సాధించడమనేది - ఉత్తమ తత్త్వం. ఇదే జీవిత ధ్యేయం కావాలి. ఇదే శ్రీరామచంద్రుడు ధనుర్భంగం గావించి సీతామాతను పరిణయ మాడటంలోగల తత్త్వ రహస్యం.
భగవంతుని జీవుడు ఆశ్రయించటం - కల్యాణం, మంగళప్రదం. జీవుడు భగవంతుని ప్రతిబింబం. కావున బింబ ప్రతిబింబ విషయమే దాంపత్య జీవితం. రాముడు పరబ్రహ్మం, సీత మోక్ష లక్ష్మి సీతారాముల కల్యాణం మంగళకరం కనుకనే ‘సీతా కల్యాణ వైభోగమే’ అని, సర్వమంగళ ప్రదమైన శంకరాభరణ రాగంలో గానం చేశాడు.
‘రాముడు లోకాభిరాముడీతని కొలువరో’ అని రామాయణ కథాగానం చేస్తూ, అందరికీ రక్షకుడితని కొలువరో’ అని త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని యందు చూస్తూ, హరి సంకీర్తనాచార్య అన్నమయ్య చేసిన గానం శ్రీరామనవమికి మనకిస్తుంది శ్రీరామరక్ష.
‘ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకె మనసా’ అన్న త్యాగయ్య కీర్తన, శ్రీరామ నవమి పండుగకు దీప్తినిస్తుంది.’

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464