ఈ వారం స్పెషల్

విశ్వరూప వీక్షణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

**కరిగే కాలంలో- చెదరని మధుర స్మృతులకు ప్రతిబింబాలు..
జీవితకాలం పదిలంగా దాచుకునే అనుభూతులు..
అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగుర్తులు.. ఫొటోలు..
అందుకే జీవితంలోని ప్రతి ముఖ్య సన్నివేశాన్ని కెమెరాలో బంధించి అపురూపంగా దాచుకుంటుంటాం..
ఎందుకంటే..
ఓ మాట వింటే కొన్నాళ్ళకు మర్చిపోతాం..
ఓ పదం చదివితే కొన్నాళ్ళకు దాన్ని మరుగున పడేస్తాం.. కానీ..
ఓ ఫొటో చూస్తే మాత్రం.. అది చాలాకాలం మదిలో చెరగని ముద్ర వేసుకుంటుంది.**.
=================================================

ఎందుకంటే..
ప్రతి ఫొటో వెనుక ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి దాగి ఉంటుంది. ఇన్ని తీయటి గుర్తుల ముద్రలు వేసే ఫొటోగ్రఫీని ఇష్టపడనివారుంటారా చెప్పండి!? అందుకే ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ తేదీనే ఎందుకు జరుపుకుంటారంటే.. ఫొటోగ్రఫీ ప్రక్రియ అయిన ‘డాగ్యుర్రియో టైప్’ను లూయిస్ డాగ్యుర్రె ఈ రోజునే కనుగొని అభివృద్ధి పరిచాడట.. అందుకని ఈ రోజును ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా పాటించడం ఆనవాయితీ..
ఫొటోలను, వీడియోలను ‘రేడియో సెన్సిటివ్’ పదార్థం (్ఫటోపేపర్, ప్లాస్ డ్రైవ్, హార్డ్ డిస్క్)పై రికార్డ్ చేయడానే ఫొటోగ్రఫీ అంటారు. దీన్ని వినోదం, వ్యాపారం, సైన్స్ ప్రయోగాలు, కళాత్మకం, మాన్యుఫాక్చరింగ్ ప్రక్రియల కోసం వాడతారు. 1839లో ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైనె్సస్ డాగ్యుర్రె టైప్‌ను ప్రకటించింది. తరువాత అదే సంవత్సరంలో రాయల్ సొసైటీకి చెందిన ‘సర్ జాన్ హెర్ సెల్’ ఫొటోగ్రఫీని ప్రపంచానికి పరిచయం చేశాడు. మరో ఫొటోగ్రఫీ ప్రక్రియ అయిన ‘కెలొటైప్’ను విలియం ఫాక్స్ టాల్బొట్ కనుగొనగా దాన్ని 1841లో ప్రకటించారు. ఇలా చరిత్రకు సాక్షిగా ఫొటోగ్రఫీని విజ్ఞానం, వినోదం వంటి ఎన్నో రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మొదట బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మాత్రమే తీయగలిగే స్థాయి నుంచి కలర్ ఫొటోలు.. వీడియోలు.. ఇలా అంతకంతకు ఎదిగి.. చివరకు ప్రతి సెల్‌ఫోన్‌లోనూ కెమెరా ఒదిగిపోయే స్థాయికి ఫొటోగ్రఫీ ఎదిగిందంటే.. ఈ రంగం ఎంత అభివృద్ధి చెందిందో అర్థమవుతుంది. దీనే్న డిజిటల్ ఫొటోగ్రఫీ అంటారు.
మొదటగా..
చైనీస్ ఫిలాసఫర్ మొట్రై, గ్రీకు మేథమెటీషియన్లు అరిస్టాటిల్, యూక్లిడ్‌లు మొదటగా పిన్‌హోల్ కెమెరాలను గురించి వివరించారు. ఆ తరువాత బెజంటైన్, అంథెమియస్ తన ప్రయోగాల కోసం అబ్సెక్యురా కెమెరాను ఉపయోగించాడుట. ఇబ్న్ ఆల్ హేతమ్ అనే మరో శాస్తవ్రేత్త అబ్స్క్యురా, పిన్‌హోల్ కెమెరాల గురించి అధ్యయనం చేశాడు. అల్బెర్టస్ మాగ్నస్ సిల్వర్ నైట్రేట్‌ను గుర్తించగా, జార్జెస్ ఫాబ్రిసియస్ సిల్వర్ క్లోరైడ్‌ను కనుగొన్నాడు. 1568లో డేనియల్ బార్ బరొ అనే శాస్తవ్రేత్త డయాఫ్రమ్‌ను వర్ణించాడు. విల్‌హెల్మ్ హాంబర్గ్ అనే ప్రముఖుడు కొన్ని రసాయనాలను (్ఫటో కెమికల్ ఎఫెక్ట్) కాంతి ఏ విధంగా చేధిస్తుందన్న విషయాన్ని వివరించాడు. మరో ఫ్రెంచ్ నిపుణుడు 1729-1774 సంవత్సరాల మధ్య ఫొటోగ్రఫీ గురించి వివరించాడు. ఇలా నేడు రెప్పపాటులో క్లిక్‌మనిపించే ఫొటోగ్రఫీ వెనుక ఎందరో శాస్తవ్రేత్తల కృషి, అధ్యయనాలు ఉన్నాయి.
ఫొటోగ్రఫీకి సమాంతరంగా సైన్స్ అభివృద్ధి చెందిందో.. లేక సైన్స్‌తో పాటు ఫొటోగ్రఫీ అభివృద్ధి చెందిందో తెలియదు కానీ.. నేడు విహంగ వీక్షణంలో కెమెరా పాత్ర మాత్రం ఎనలేనిది. విహంగ వీక్షణానికి, ఫొటోలకు లంకెలా కుదురుతుంది..? మరీ చాదస్తం కాకపోతే.. అంటున్నారు కదూ.. కానీ ఫొటోగ్రఫీ కేవలం వినోదానికి మాత్రమే పరిమితమవలేదు. విజ్ఞానశాస్త్రంలో దానిపాత్ర ఎనలేనిది. ఎందుకంటే ఫొటోగ్రఫీ ద్వారానే ఏరియల్ ఫొటోగ్రఫీ, ఆస్ట్ఫ్రోటోగ్రఫీల పేరుతో అంతరిక్షంలో జరిగే ప్రతీదాన్నీ ఫొటోల రూపంలో బంధించగలుగుతున్నాం. ఖగోళశాస్త్రం, ఆధునిక ఖగోళశాస్త్రంలో ఫొటోలు, డేటా కాప్చర్, డేటా ప్రాసెసింగ్ వంటివి చాలా ముఖ్యమైనవి. ఇందులో ఫొటోగ్రఫీ పాత్ర అత్యంత ముఖ్యమైనది.
ఏరియల్ ఫొటోగ్రఫీ (విహంగ ఛాయాగ్రహణం)
విహంగ ఛాయాగ్రహణం ఓ అద్భుతమైన అనుభూతి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు శాటిలైట్ ఇంకా స్పేస్‌క్రాఫ్ట్ టెక్నాలజీ సాయంతో తమ భూభాగాన్ని ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షిస్తున్నాయి. అంతరిక్ష నిఘా నేత్రం మరింత ఆధునీకతను సంతరించుకున్న నేపథ్యంలో కొత్త వర్షన్ స్పేస్‌క్రాఫ్ట్స్, ఇంకా ఉపగ్రహాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇవి భూమికి 110 నుంచి 500 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటు ఏరియల్ ఫొటోగ్రఫీ ద్వారా పలు ఛాయాచిత్రాలను చిత్రీకరిస్తున్నాయి. నాసా, ఐఎస్‌ఎస్ వంటి ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థలు తమ ఆధునిక స్పేస్ టెక్నాలజీ సాయంతో అంతరిక్ష ఫొటోలను తీస్తున్నాయి.
ఆస్ట్రో ఫొటోగ్రఫీ
రాత్రివేళల్లో అంతరిక్షంలో జరిగే ఖగోళ మార్పులను, ఖగోళ వస్తువులను ఫొటోలు తీయడాన్ని ఆస్ట్రో ఫొటోగ్రఫీ అంటారు. ఇందులో మొదట ఆరియన్స్ బెల్ట్‌ద్వారా చిత్రం ఎరుపు, నీలం ఆస్ట్రొనామికల్ ఫిల్టర్స్ ద్వారా డిజిటలైజ్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోగ్రాఫిక్ ప్లేట్స్‌లో రికార్డ్ అవుతుంది. ఇదంతా కంప్యూటర్ సింథసైజ్డ్ గ్రీన్ చానల్ ద్వారా జరుగుతుంది. ఈ ఆస్ట్రో ఫొటోగ్రఫీ ద్వారా మొదటగా ఫొటోలను తీసింది శామ్యూల్ ఆస్చిన్ అనే టెలిస్కోప్. అంటే ఆస్ట్రో ఫొటోగ్రఫీలో టెలిస్కోప్‌ది ఎనలేని పాత్ర అన్నమాట.
టెలిస్కోప్‌లు
టెలిస్కోప్‌లను రూపొందించడానికి ముందు కళ్లజోడును రూపొందించడం.. ఈ దిశగా సాగిన ప్రగతిలో తొలిమెట్టు. ఖగోళ విజ్ఞానంలో నిజమైన విప్లవాన్ని తెచ్చింది కోపర్నికస్. ఆయన సూర్య కేంద్రవాదాన్ని ఆవిష్కరించనప్పుడే నిజమైన విప్లవానికి బీజం పడింది. కోపర్నికస్‌కు నిజమైన వారసుడు ఇటలీకి చెందిన గెలీలియో గెలిలి. చర్చి ఆగ్రహానికి లోనైనప్పటికీ ఆయన తన నమ్మకాన్ని మాత్రం బలిచేయలేదు. ఆయన తను కనుగొన్న టెలిస్కోప్ ద్వారా సముద్రంలో వచ్చే శత్రువుల ఓడల వైపు తిప్పడానికి బదులు ఆకాశం వైపు తిప్పాడు. ఆ క్షణంలోనే వేలాది సంవత్సరాలుగా చంద్రుడి గురించి మానవాళికి ఉన్న నమ్మకాలన్నీ పటాపంచలైపోయాయి. భూమి ఉన్నచోట సూర్యుడిని ఉంచి మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుడి ఆజ్ఞలను పాలించేవేనని ఘోషించాడు. విప్లవ రథ చక్రాలు పరుగులు తీయడానికి ఇదే ప్రారంభం. ఈ నాలుగు శతాబ్దాల్లో ఖగోళ విజ్ఞానం అపారంగా పెరిగిపోయింది. కొత్త బ్రహ్మాండం, కొత్త సౌరమండలం, భూమిలాంటి మరో కొత్త గ్రహం, వ్యాకోచిస్తున్న విశ్వం.. ఇలా ఈ జాబితా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది.
ఇప్పుడు టెలిస్కోప్‌లు కొత్త వస్తువులను చూడటానికి మాత్రమే ఉపయోగపడటం లేదు. విశ్వం ఆవిర్భావానే్న వెతుకుతున్నాయి. టైమ్ మిషన్ల తరహాలో ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు- కోటి కోటి బ్రహ్మాండాల్లో.. కోటి కోటి సూర్యులున్నారనే విషయమూ తెలిసింది. అలాంటి సూర్యులలో మన సూర్యుడు కూడా ఒకడు. అలాంటి వాటిల్లో మన భూమిని వెతుక్కోవడమంటే హాస్యాస్పదమే! ఈ వెతుకులాటే మన విజ్ఞానాన్ని మరింతగా విస్తరింపజేసింది. ఇలాంటి విషయాల్లోనే ఫొటోగ్రఫీ, టెలిస్కోప్ శాస్తజ్ఞ్రులు మనకు అందించిన దివ్య చక్షువులు.
వంకరగా ఉన్న దర్పణం, దానిలోంచి చూస్తే బింబం పెద్దదిగా కనిపిస్తుంది అనేది కూడా ఆకస్మికంగా కనుగొన్న సత్యమే.. కుంభాకార కటకం, వస్తు కటకం (ఆబ్జెక్టివ్ లెన్సు)గానూ, పుటాకార కటకం, అక్షికటకం (ఐ లెన్స్)గానూ ఉంటాయి. ఈ రకం ఆప్టికల్ టెలిస్కోపునే గెలీలియో టెలిస్కోప్ అంటారు. గెలీలియోతో పాటు కెప్లర్ కూడా ఇంచుమించు అదే సమయంలో ఓ టెలిస్కోపును కనుగొన్నాడు. ఇప్పడు మనం వాడుతున్న బైనాక్యులర్లు ఈ నమూనా ప్రకారమే తయారయ్యాయి. దీనిలో అక్షి కటకంలో కూడా కుంభాకార కటకానే్న వాడతారు. ఆప్టికల్ టెలిస్కోప్‌లో పరావర్తన (రిఫ్లెక్టింగ్) టెలిస్కోపులు ఇంకోరకం. 1663లో జేమ్స్ గ్రెగరీ వీటిని ప్రతిపాదించాడు. ఈ రకం టెలిస్కోపులో కాంతిని ఒక పుటాకార దర్పణం మీద పడేటట్లు చేస్తారు. ఈ టెలిస్కోపును తయారుచేసింది ఐజాక్ న్యూటన్. ఆయన దీన్ని 1668లో తయారుచేశాడు. అయితే ఖగోళ వస్తువుల్ని చూడటానికి ఉపయోగించే ఇప్పటి టెలిస్కోపులన్నీ న్యూటన్ నిర్మించిన పరావర్తక దూరదర్శినిపై ఆధారపడ్డవే. ఓ పెద్ద పుటాకార దర్పణం వస్తువు నుంచి వచ్చే కిరణాలను పరావర్తనం చేసి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. మరో అక్షి కటకం దీన్ని ఇంకా పెద్దదిగా కనబడేలా చేస్తుంది. ఈ ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడుతుంది. కానీ ఖగోళ వస్తువులను చూడటానికి దీనివల్ల అంతగా ఇబ్బంది ఉండదు. కటకాలతో నిర్మించిన వక్రీభవన దుర్భిణులలో ఉన్న వౌలికమైన ఇబ్బందులను మొదటగా అర్థం చేసుకున్నవాడు కూడా న్యూటనే. కటకాలకి బదులు దర్పణాలను వాడి ఆయన పరావర్తన దుర్భిణులు (రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్స్) అనే కొత్త జాతి దుర్భిణుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. కటకాలకి బదులు దర్పణాలను వాడటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటిని అర్థం చేసుకున్న విలియం హర్షెల్‌కు- ఎన్నో కష్టాలు పడి శనిగ్రహానికి అవతల, సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సరికొత్త గ్రహం ఒకటి ఉందని టెలిస్కోపులో కనిపించింది. దాంతో ఒక్కసారిగా సూర్య కుటుంబం పరిధి పెరిగింది. ఆ కొత్త గ్రహమే యూరెనస్. ఇదే పద్ధతిలో ఐర్లండులోని లార్డ్‌రాసీ ఆరు అడుగుల వ్యాసం ఉన్న దర్పణం ఉపయోగించి, నిర్మించిన పెద్ద టెలిస్కోపులో సర్పిలాకారంలో ఉన్న పాలపుంతను చూడగలిగాడు. మనం దాని మధ్యలో ఉన్నాం కనుక దాని ఆకారం, దాని ఫొటోలు తీయలేము.
అప్పటి నుంచి ఇప్పటి వరకు టెలిస్కోపు నిర్మాణ శిల్పంలో ఎంతో ప్రగతి సాధించాం. ఈ రోజుల్లో పెద్ద పెద్ద టెలిస్కోపుల్లో కాంతిని కూడగట్టే దర్పణాల వ్యాసం పది మీటర్లు అంటే 33 అడుగులు ఉంటోంది. దక్షిణ కాలిఫోర్నియా లో, పాలోమార్ కొండపై ఉన్న హేల్ టెలిస్కోప్ దర్పణం వ్యాసం 5.1 మీటర్లు. టెలిస్కోప్ చరిత్రలోనే ప్రసిద్ధి చెందినది ఇది. దర్పణం వ్యాసం రెట్టింపు అవటంతో ఇప్పటి టెలిస్కోపులు హేల్ కంటే నాలుగింతల కాంతిని సేకరిస్తున్నాయి. ఈ టెలిస్కోపులు ఎతె్తైన భవనాల్లో, గుహల్లాంటి గదుల్లో ఉంటాయి. ఇవి యంత్రాలు నడిపే స్వయం చాలితాలైన పరికరాలు. అబ్జర్వేటరీ నిర్మాణం అర్ధగోళాకారంలో ఉంటుంది. పగలంతా ఈ తలుపులు మూసే ఉంటాయి. చీకటి పడిన తరువాత ఇవి వాటంతట అవే తెరుచుకుంటాయి. రాత్రంతా ఎంతోమంది పరిశోధకులు తమతమ పరిశోధనలకు కావలసిన నక్షత్రాల వైపు టెలిస్కోపును సారిస్తారు. ఇదంతా మానవ ప్రమేయం లేకుండా యంత్రాల ద్వారా జరిగిపోతుంది. పరిశోధకులు అబ్జర్వేటరీ రూమ్సులో ఉండక్కరలేదు. ఎవరి ఇంట్లో వారు ఉండచ్చు. కానీ టెలిస్కోపులు తీసిన ఫొటోలు మాత్రం అంతర్జాలం ద్వారా పంపిణీ అయిపోతాయి.
ప్రపంచంలో ఉన్న అతి పెద్ద టెలిస్కోపుల్లో మూడు హవాయి రాష్ట్రంలో ఉన్నాయి. వాటిపేర్లు ఉత్తర జెమినై, సూబరూ, కెక్. హవారుూ ద్వీపాలలో కియా అనే చల్లారిపోయిన అగ్నిపర్వతం ఒకటుంది. దాని శిఖరం ఎత్తు 14,000 అడుగులు. ఇంత ఎత్తుకు వెళ్లేసరికి భూ వాతావరణంలో దరిదాపు సగం దాటి పైకి వెళ్లినట్లే.. ఇలా కొండలపై అబ్జర్వేటరీలను కట్టడం వల్ల ప్రయోజనం ఉంది. దూరం నుండి వచ్చే పరారుణ కిరణాలని మన వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి (వాటర్ వేపర్) చాలావరకు పీల్చుకుంటుంది. కొండపైకి వెళితే ఆ కిరణాలు మన పరికరాలకి కనిపిస్తాయి. ఈ ఆధునిక యుగంలోని పెద్ద పెద్ద టెలిస్కోపులు ఆకాశపుటంచుల నుండి వచ్చే కాంతిని సేకరించటంలోనే కాకుండా, ఇంకా అనేక విధాలుగా మన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనకి కనిపించే బొమ్మ ప్రస్ఫుటంగా, మసకలు లేకుండా కనిపించేటట్లు చేస్తున్నాయి. భూ వాతావరణం వల్ల కలిగే అరిష్టాలు సముద మట్టానికి పది కిలోమీటర్లు పైకెళ్లేవరకు ఉంటూనే ఉంటాయి. వీటివల్ల బొమ్మ నిలకడగా ఉండక చెదిరిపోతుంది. ఎలాగంటే ఫొటో తీసేటప్పుడు చెయ్యి కదిలితే ఫొటో ఎలా వస్తుందో అలాగన్నమాట! ఇలాంటి సమయంలో కాంతి కిరణం ప్రయాణం చేసే దారిలో ఉన్న వాతావరణంలోని సమీరితం (టర్బులెన్స్) ఎంతుందో తెలిస్తే అప్పుడు ఆ సమీరితం (టర్బులెన్స్)వల్ల బొమ్మ ఎంత కదిలిపోయిందో అంచనావేసి, దానిని చెదిరిపోయిన బొమ్మలోంచి తీసేస్తే మనకు స్పష్టమైన ఫొటో వస్తుంది. ఈ రకం సవరింపు లెక్కలు వెయ్యటానికి ‘లేజర్ బీమ్’ని వాడతారు. ఆకాశంలోని లేజర్ బీమ్‌ను 56 మైళ్లు వెళ్లేవరకు ప్రసరింపచేస్తారు. ఈ కిరణాలు అక్కడ ఉన్న సోడియం అణువులను ఉత్తేజపరుస్తాయి. అప్పుడు అవి దీపం వెలిగినట్లు వెలుగుతాయి. ఈ వెలుగుని ఆర్ట్ఫిషియల్ స్టార్ (కృత్రిమ తార) అంటారు. ఈ తారని మనం టెలిస్కోపు ద్వారా చూసి భూమట్టం నుండి 56 మైళ్ళ ఎత్తువరకు వాతావరణం ఎంత కల్లోలంగా ఉందో లెక్కగడతారు. తద్వారా నిజం నక్షత్రాల నుంచి వచ్చే లైట్ సిగ్నల్స్ నుండి మసక (బ్లర్)గా ఉన్నదాన్ని తీసేస్తారు. ఇలా చేయడం వల్ల అంతవరకు మసకగా ఉన్న బొమ్మ అమాంతంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ పద్ధతిని ‘ఎడాప్టివ్ ఆప్టిక్స్’ అంటారు. చత్వారం ఉన్న మనిషికి కళ్లద్దాలు ఎలాంటివో టెలిస్కోపుకి ఈ పద్ధతి అలాంటిది అన్నమాట.
టెలిస్కోపులు నేలను ఆనుకుని ఉండాలన్న నిబంధన ఏదీ లేదు. నిజానికి టెలిస్కోపు సముద్ర మట్టానికి ఎంత ఎత్తున ఉంటే అంత లాభదాయకం. భూమిని ఆవరించుకుని ఉన్న వాతావరణపు పొరలని దాటుకుని ఎంత పైకి వెళితే అంత బాగా గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు కనిపిస్తాయి. అందుకనే టెలిస్కోపులని కొండలపై నిర్మిస్తారు. కొండకంటే ఎత్తుకి టెలిస్కోపును తీసుకెళ్లడం కన్నా అంతరిక్షంలోకి తీసుకెళ్లడం వల్ల చాలా లాభాలున్నాయి. భూ వాతావరణం వల్ల చెదరకుండా ఫొటోలు స్పష్టంగా కనిపిస్తాయి. నక్షత్రాల దగ్గర బయలుదేరిన విద్యుదయస్కాంత తరంగాల్లో కొన్ని వాతావరణ పొరలని దాటుకుని భూమిని చేరలేవు. కాబట్టి నక్షత్రాల నుండి వెలువడే ‘గామా’ కిరణాల్ని చూడాలన్నా, ‘ఎక్స్’ కిరణాలను చూడాలన్నా మనం మన టెలిస్కోపుని అంతరిక్షంలోకి తీసుకువెళ్లాలి. అలా తీసుకెళ్లిన వాటిల్లో ముఖ్యమైనది హబుల్ టెలిస్కోప్.
హబుల్ టెలిస్కోప్
ఈ టెలిస్కోపు బాగా ప్రాచుర్యం పొందింది. ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఆకాశంలో చూసిన ఎన్నో విషయాలను శాస్తవ్రేత్తలు తెలుసుకోవడానికి దోహదపడుతుంది. హబుల్ టెలిస్కోప్ కంటి కనిపించే కాంతితో ఖగోళ వస్తువులను ఫొటో తీస్తుంది. ఈ టెలిస్కోపులో ఐదు రకాల పనిముట్లు అమర్చటానికి అరల్లాంటివి ఉన్నాయి. ఈ అయిదు అరల్లోనూ విశాల దృక్పథంతో గ్రహాలను అనే్వషించే కెమెరా (వైడ్ ఫీల్డ్ అండ్ ప్లానిటరీ కెమెరా), మేలురకం స్పెక్ట్రోగ్రాఫ్ (హై రెసల్యూషన్ స్పెక్ట్రోగ్రాఫ్), కాంతిని కొలిచే సాధనం (హై స్పీడ్ ఫొటోమీటర్), మినుకు మినుకుమంటూ నిస్తేజంగా ప్రకాశించే వాటికి ఫొటోలు తీసే కెమెరా (ఫెయింట్ ఆబ్జెక్ట్ కెమెరా), నిస్తేజంగా ప్రకాశించే వాటి నుంచి వచ్చే కాంతిని పరిశీలించడానికి స్పెక్ట్రోగ్రాఫ్ (ఫెయింట్ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోగ్రాఫు) ఉండేవి. వీటిలో కొన్నింటిని ఇటీవల ఆధునీకరించారు. ఈ టెలిస్కోపును 1990, ఏప్రిల్ 24న అంతరిక్షంలోని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. పెద్ద బస్సు పరిమాణంలో ఉన్న ఈ టెలిస్కోపు సముద్ర మట్టానికి 600 కిలోమీటర్ల ఎత్తులో ప్రదక్షిణలు చేస్తుంది. ఒక్కో ప్రదక్షిణకి 97 నిముషాలు పడుతుంది. అంటే సెకనుకి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందన్నమాట. హబుల్ టెలిస్కోపు కక్ష్యలోకి ప్రవేశపెట్టక మునుపు విశ్వం వయస్సు ఎంతో మనం సరిగ్గా చెప్పలేకపోయేవాళ్లం. ఈ టెలిస్కోప్ వల్ల ఇప్పుడు విశ్వం వయస్సు 13.7 బిలియన్ సంవత్సరాలు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మన సూర్యమండలానికి, బయట ఉన్న గ్రహానికి మొట్టమొదటిసారి ఫొటో తీసిన ఘనత కూడా హబుల్ టెలిస్కోపు దక్కించుకుంది. హబుల్ టెలిస్కోప్ ఇప్పటివరకు విశ్వంలోని వస్తువులకు సంబంధించి కోట్లల్లో ఫొటోలను తీసి పంపించింది. గ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు వంటి ఆశాశంలోని అనేక వస్తువులకు సంబంధించిన ‘జాతకాల’ను పంపించింది. అయితే ఇరవయ్యో శతాబ్దంలో మానవ మేధస్సుకు సంబంధించిన అత్యున్నత శిఖరమా? అని ఆలోచిస్తే.. అంతకంటే అత్యున్నతమైన టెక్నాలజీతో మరిన్ని టెలిస్కోపులను రూపొందిస్తున్నారు.
టెలిస్కోప్ ‘చంద్ర’
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా 1999లో ఈ టెలిస్కోప్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ఇది కక్ష్యలోకి ఎగసిన ఎక్స్ రే టెలిస్కోప్. భారతదేశంలో జన్మించిన డాక్టర్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ నక్షత్రాల వికాసాన్ని గణితశాస్త్రం ఆధారంగా లెక్కవేసి అవి ఏ దశలో వికాసానికి సంబంధించిన ఏ మార్గాన్ని అనుసరిస్తాయనే విషయాన్ని లెక్కవేశాడు. ఆయన కర్మక్షేత్రం అమెరికా. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఆయన పేరు మీదనే నాసా ఎక్స్ కిరణాల నేపథ్యంలో విశ్వాంతరాళాన్ని అధ్యయనం చేయడం కోసం ఈ ‘చంద్ర’ టెలిస్కోపును కక్ష్యలోకి పంపించింది. ఇది భూమి చుట్టూ తిరగడానికి 64 గంటలా 26 నిముషాలు పడుతుంది. దీని బరువు 4, 790 కిలోగ్రాములు. విశాలమైన విశ్వంలో ఈ టెలిస్కోపు ఎన్నో ఎక్స్ కిరణాల సముదాయాలను గుర్తించింది.
హర్షల్, ప్లాంక్ అంతరిక్ష టెలిస్కోప్‌లు
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ టెలిస్కోప్‌లను అంతరిక్షంలోకి పంపింది. ఈ రెండు టెలిస్కోప్‌లను ఏరియన్ అనే రాకెట్ ద్వారా కక్ష్యలోనికి తీసుకెళ్లింది. ‘కక్ష్య’ అంటే హబుల్ టెలిస్కోప్ పరిభ్రమిస్తున్నట్లుగా భూమికి దగ్గరగా ఉన్న కక్ష్య కాదు. బాహ్యాకాశంలో 15 లక్షల కిలోమీటర్ల ఎత్తులో భూమి, సూర్యుడి ఆకర్షణ శక్తులు సమంగా ఉన్నట్లుగా రుజువైన ‘ ఆగ్రాంజియన్ పాయింట్’. ఈ రెండు టెలిస్కోపుల్లో ఒకటైన హర్షల్ టెలిస్కోప్ ఇప్పటివరకు ఆకాశంలోకి ప్రయోగించిన అతి పెద్ద ‘ఇన్‌ఫ్రా రెడ్ టెలిస్కోప్’ అన్న కీర్తిని సంపాదించుకుంది. ఇన్‌ఫ్రారెడ్ కిరణాల వ్యాప్తి మొదలుకొని సబ్ మిల్లీమీటర్ తరంగాలను కొలవడం దాకా దీని కార్యక్షేత్రం విస్తరించి ఉంది. దీని ప్రాథమిక దర్పణం వ్యాసం 3.5 మీటర్లు. ఇది హబుల్ దర్పణం కన్నా పెద్దది. ఇది రెండు కెమెరాలతో పాటు ఒక రోహిత మాపకాన్ని కూడా తీసుకెళ్లింది. ఇందులో క్రయోజనిక్ వ్యవస్థ కూడా ఉంది. ఈ టెలిస్కోప్ విశ్వంలో నక్షత్రాలు ఎక్కడెక్కడ పుడతాయో.. ఆ ప్రాంతాలను వెతకడం, బ్రహ్మాండాల వికాసానికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందిస్తుంది.
ప్లాంక్ అనే మరో టెలిస్కోపు విశ్వం పుట్టుక గుట్టును తెలుసుకోవడానికి వెళ్లింది. ఇది విశ్వాన్ని తన కంటితో చూసేటప్పుడు ఒక మైక్రో కెల్విన్ ఉష్ణత మారినా దాన్ని సైతం గ్రహించే శక్తి దీనికి ఉంది.
మనదేశంలో..
ఏరిస్
నీలివర్ణ ఆకాశంలో ఎన్నో ఆకర్షణలు. మిలమిల మెరిసే తారలు, పాలపుంత అందాల గురించి తెలుసుకునేందుకు భారత్, బెల్జియం దేశాలు సంయుక్తంగా ఓ టెలిస్కోపును రూపొందించాయి. దానిపేరు ఏరిస్. ఆసియాలోనే అతి పెద్ద టెలిస్కోప్ ఇదే. భారత ప్రధాని మోదీ, బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖేల్ సంయుక్తంగా ఏరిస్ టెలిస్కోపును ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ సమీపాన దేవస్థల్ వద్ద దీన్ని ఏర్పాటుచేశారు. ఆసియాలోనే అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్ ఇది. ఇది పాలపుంత పరిణామక్రమం, అక్కడ సంభవించే మార్పులను అధ్యయనం చేస్తుంది. క్షేత్ర వలయాల అధ్యయనం, పాలపుంత కాంతి వలయానికి కారణాలు, నక్షత్రాల కదలికలు, గ్రహాల నిర్మాణం వంటి అంశాలనూ అధ్యయనం చేస్తుంది. ఇందులో ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ కెమెరాను ఉపయోగించారు. దీనిని ముంబయికి చెందిన టాటా ఫండమెంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తయారుచేసింది. ఇందులోని వెడల్పైన అద్దం సహాయంతో ఈ టెలిస్కోప్ పరిసరాల్లోని కాంతిని శోషించుకుంటుంది. ప్రైమరీ మిర్రర్ ఆధారంగా అద్భుతంగా ఫొటోలు తీస్తుంది. దీని బరువు నాలుగు వేల కిలోలు. సెకండరీ మిర్రర్ ద్వారా పరిసరాలను అధ్యయనం చేస్తుంది. ఆర్యభట్ట రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైనె్సస్ (ఏరిస్) ఈ టెలిస్కోప్‌ను పర్యవేక్షిస్తోంది.
జెయింట్ రేడియో టెలిస్కోప్
పుణె- నాసిక్ హైవేపై ఉన్న నారాయణ్ గావ్ వద్ద జెయింట్ రేడియో టెలిస్కోప్ ఉంది. ఈ విశ్వం బాల్యావస్థను తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం. జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్‌గా ఇది ప్రఖ్యాతి చెందింది. 45 మీటర్లు ఉండే 45 డిష్ యాంటెనాలు గుంపుగా ఒకేచోట ఉండటమే ఇక్కడి ప్రత్యేకత. మొత్తం 25 కిలోమీటర్ల పొడవున వీటిని ఏర్పాటు చేశారు. భారతదేశ అంతరిక్ష పరిశోధకులు రూపొందించిన అతి పెద్ద ప్రాజెక్టు ఇది. ఇక్కడ 14 డిష్‌లు ఒకే కేంద్రంలో వరుసగా ఉంటాయి. ఇవి ఆక్రమించిన ప్రదేశం కేవలం ఒక చదరపు కిలోమీటర్! మరో పదహారు యాంటెనాలను ఇంగ్లీషు అక్షరం ‘వై’ ఆకారంలో ఏర్పాటుచేశారు. వీటన్నింటినీ కలిపితే 25 కిలోమీటర్ల వ్యాసం ఉండే డిష్ యాంటెనా పొందగలిగినంత సమాచారం వీటిద్వారా లభిస్తుంది. జమ్మూ కశ్మీరులోని హిమాలయ పర్వతశ్రేణిలో 4,500 మీటర్ల ఎత్తులో ఉన్న హ్యానె్ల అనేచోట హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ ఏర్పాటైంది.
ఇవన్నీ టెక్నాలజీకి తుట్ట తుది ఘట్టాలు అని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరెన్ని ఇలాంటి దైత్యాకార టెలిస్కోప్‌లు వస్తాయో..!
*

--ఎన్.ఎస్.ఉమామహేశ్వరి