ఈ వారం స్పెషల్

బోనాల జాతర...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంట నగరాల్లో ఇపుడు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది.. నెలరోజుల పాటు జరిగే ‘బోనాల జాతర’ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.. ఏటా ఆషాఢ మాసంలో తొలి ఆదివారం ప్రారంభమయ్యే ఈ జాతర నెలంతా కన్నుల పండువగా జరుగుతుంది. జగత్తును కాపాడే మహంకాళి అమ్మవారిని మనసారా పూజించే పండగ ఇది. ఆషాఢమాసంలో జగన్మాత పుట్టింటికి వెళ్తుందని భక్తజనుల విశ్వాసం. అందుకే ఈ నెలలో అమ్మవారిని సందర్శించుకునేందుకు జంటనగరాల్లోని పలు ఆలయాల్లో భక్తజనులు బారులు తీరుతారు.
ఆషాఢ మాసం ప్రారంభమయ్యాక తొలి ఆదివారం- ఈనెల 15న చారిత్రక గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో తొలిపూజలు మొదలయ్యాక నాలుగు ఆదివారాల్లో జంట నగరాల్లోని నలుచెరగులా ‘బోనాల సంబురం’ జరుపుకుంటారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే బోనాల జాతర గోల్కొండ కోటలో ప్రారంభం కావడంతో ఎటుచూసినా పండగ వాతావరణం కనువిందు చేస్తోంది.
తొట్టెల ఊరేగింపులు, శివసత్తుల శివాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, గణగణ గంటల మోతలు, కోలాటాలతో గోల్కొండ కోట మార్మోగింది. అడుగడుగునా భక్తజనం ఆనంద పారవశ్యంలో మునిగింది. దేవతామూర్తుల వేషధారణలతో కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జాతరలో అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. ఆషాఢ బోనాల జాతరకు ‘కోట’లో అంకురార్పణ జరగడంతో నెలరోజుల ఉత్సవాలు భక్తులను అలరించనున్నాయి. గోల్కొండలోని జగదాంబిక, సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజాలోని సింహవాహిని మహంకాళి, బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయాల్లో ప్రధాన ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ కోటలో బోనాల జాతరకు శ్రీకారం చుట్టగా, అదే రోజు సికింద్రాబాద్‌లోని చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఎదుర్కోలు ఊరేగింపుతో బోనాల సంబురం మొదలైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈనెల 29న లక్షలాదిమంది భక్తులు బోనాలు సమర్పిస్తారు. 30వ తేదీన రంగం (్భవిష్యవాణి), అమ్మవారి గజాధిరోహణ కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా జంటనగరాల్లో మైసమ్మ, మహంకాళమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ వంటి అనేక పేర్లతో ఉన్న ఆలయాల్లోనూ ఆషాఢ మాస ఉత్సవాలను వేడుకగా జరుపుతారు.
కోలాహలంగా లష్కర్ బోనాలు..
లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. జంట నగరాలలో జాతర అంటేనే లష్కర్ బోనాలుగా చెప్పుకుంటారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర పేరిట ఎన్నో జానపద పాటలు ఉన్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు, బతుకమ్మ పండగలు ప్రతీకలు. గ్రామదేవతలైన అమ్మవారికి ఆషాఢంలో జాతరలు నిర్వహిస్తే ఎలాంటి ఈతిబాధలు ఉండవని భక్తుల నమ్మకం. తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తారు. బోనం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. లష్కర్ బోనాలకు తెలంగాణ, ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆషాఢ మాసం తొలి ఆదివారం సందర్భంగా ఈ నెల 15న ఘటం ఎదుర్కోళ్ళతో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతర ప్రారంభమైంది. ఈ నెల 29న బోనాలు, తొట్టెలు, ఫలహారం బండ్లు సమర్పిస్తారు. ఆషాఢ జాతర జూలై 30న అమ్మవారిని సాగనంపే కార్యక్రమంతో ఘనంగా ముగుస్తుంది.
ఆలయ చరిత్ర...
సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. తన స్వస్థలంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను 1813 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్దిరోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. అదే సమయంలో మిలటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలో కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడలని, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ (లష్కర్)లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామనీ వేడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అమ్మవారు కరుణించడం వల్లనే కలరా వ్యాధి తగ్గిందని సురటి అప్పయ్య, ఆయన మిత్రులు విశ్వసించారు. ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్‌కు వచ్చారు. ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబసభ్యులకు ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాతబోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో (ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో) కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉజ్జయిని మహంకాళిగా నామకరణ చేసి పూజలు ప్రారంభించారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావటంతో సికింద్రాబాద్‌లోనూ ఆషాఢంలో జాతర జరపాలని ఆయన నిర్ణయించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డబావిని పురుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. 1815 నుండి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహించి, వ్యాధుల బాధల నుండి ప్రజలను రక్షించాలని ఆయన నిర్ణయించారు. అప్పటి నుండి గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఆషాఢంలో సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకుంటున్నారు.
ఎదుర్కోలు ఉత్సవం..
చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఎంతో మహిమ గల దేవతగా భక్తులు విశ్వసిస్తున్నారు. ఆషాఢ మాసం ప్రారంభం రోజున- ఈనెల 15న ఘటాన్ని రాణిగంజ్‌లోని కర్బలా మైదానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఊరేగింపుతో ఎదురెళ్ళి స్వాగతించారు. దీనినే ఎదుర్కోలు ఉత్సవం అంటారు. ఈ ఉత్సవంతో లష్కర్ బోనాల జాతర ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఘటాన్ని సికింద్రాబాద్ పుర వీధులలో తిప్పుతారు. జాతర రోజు అమ్మవారిని దర్శించుకోలేని వృద్ధులు, వికలాంగులు, పిల్లలు వారి బస్తీలో ఇంటి ముందు ఘటాన్ని దర్శించుకొని అమ్మవారి దీవెనలు తీసుకుంటారు. ఘటం ఊరేగింపుతో బోనాల జాతర ప్రారంభమైనట్లు అందరికీ తెలుస్తుంది. బోనాలు సమర్పించే రోజును సికింద్రాబాద్ ప్రాంతవాసులు పర్వదినంగా భావిస్తారు. ఆ రోజు తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి.
జాతర సందర్భంగా మహంకాళి దేవాలయం పరిసర ప్రాంతాలను శోభాయమానంగా అలంకరిస్తారు. తెల్లవారు జాము నుండి మహిళలు భారీ సంఖ్యలో ఆమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మహిళలు తలార స్నానం చేసి కొత్తవస్త్రాలు ధరించి వేకువనే అమ్మవారికి బోనం (ప్రసాదం) తయారు చేస్తారు. బోనంతో పైన అగ్నిహోత్రి (గండదీపం) ఉంచుతారు. ప్రత్యేకంగా నూతన వస్త్రంతో ఈ గండదీపాన్ని తయారు చేస్తారు. పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించి వేపకొమ్మలను బోనం ఉంచిన పాత్ర చుట్టూ అల్లుతారు. దాని వెంట సాక పోయటం కోసం మరో చెంబులో శుద్ధజలాలను ఓ చేతిలో పట్టుకొని, మరో చేతిలో వేపకొమ్మలు పట్టుకొని తమ మొక్కులు చెల్లించటానికి అమ్మవారి దగ్గరికి బయలుదేరుతారు. మహంకాళి అమ్మవారి ముందు కొలువుదీరిన మాతంగేశ్వరి అమ్మవారికి ముందుగా సాక సమర్పిస్తారు. తర్వాత మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి తమను చల్లగా చూడాలని మొక్కుకుంటారు.
తొట్టెల సమర్పణ, పోతరాజులు..
బోనాలు జరిగే ఆదివారం తెల్లవారు జామునుంచే అమ్మవారికి మహిళలు మొక్కులు సమర్పించుకుంటారు. తమ కోర్కెలు తీర్చుకోవటం కోసం ఫలహారం సమర్పిస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఫలహారాన్ని అలంకరించిన బండిలో పెట్టుకొని దేవాలయానికి బయలు దేరుతారు. ఫలహారం బండి ముందు అమ్మవారి సోదరులుగా భావించే పోతరాజులు లయబద్ధంగా విన్యాసాలు చేస్తారు. మరికొందరు అమ్మవారికి అలంకరించిన తొట్టెలను సమర్పిస్తారు. అమ్మవారిని మొక్కుకోవటంతో తమకు సంతానం కలిగినందుకు బదులుగా కొందరు తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి తొట్టెలు సమర్పిస్తారు. వెదురు కర్రలు, రంగురంగుల అట్టలతో గోపురాల ఆకారంలో తయారు చేసే తొట్టెలు చూడముచ్చటగా ఉంటాయ. డప్పులచప్పుడు , కోలాటాల మధ్యన దేవాలయానికి తొట్టెలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. సాయంత్రం కాగానే సికింద్రాబాద్ పుర వీధుల్లో ఎక్కడ చూసినా ఫలహారం బండ్లు, తొట్టెలతో ఊరేగింపు జరుపుతూ భక్తులు ఆలయానికి రావడంతో పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా కనిపిస్తాయి. దూర ప్రాంతాల నుండి వచ్చే వారు అమ్మవారికి రాత్రి వరకూ బోనం సమర్పిస్తారు. అర్ధరాత్రి వరకు బోనాల జాతర కోలాహలంగా సాగుతుంది.
బలి చల్లటం
బోనాల జాతర మరుసటి రోజున సోమవారం తెల్లవారు జామున పొలిమేర ప్రాంతంలో బలి చల్లుతారు. ఎంతోభక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించిన బోనంలోని అన్నం ఎంతో పవిత్రంగా భావిస్తారు. అమ్మవారికి సమర్పించిన బోనం అన్నాన్ని సోమవారం తెల్లవారుజామున ప్రత్యేక బృందాల ద్వారా భక్తిశ్రద్ధలతో చల్లడం ఆనవాయతీ. దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుందని, దుష్టశక్తులు దరిదాపుల్లోకి రావని భక్తుల నమ్మకం.
రంగం అంటే ఎంతో ఆసక్తి..
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన జాతరలో రెండవ రోజు రంగం ప్రధానమైంది. రంగం పేరిట అమ్మవారు చెప్పే భవిష్యవాణి కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తారు. మహంకాళి అమ్మవారి ఆలయంలో ఎదురుగా ఉన్న మాతంగేశ్వరి ముందు ప్రత్యేకంగా కుమ్మరి తయారు చేసిన పచ్చికుండపైన కూర్చుని అమ్మవారికి ప్రతిరూపమైన మహిళ భవిష్యవాణి చెప్పటం భక్తులందరినీ ఆకట్టుకుంటుంది. బోనాల జాతర ముగిసిన వెంటనే సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో భవిష్యవాణి చెప్పే మహిళను ఎదురుగా ఉన్న దేవాలయం నుండి పోతరాజుల విన్యాసాలు, బాజభజంత్రీల మధ్యన దేవాలయానికి తీసుకువస్తారు. ఆమె అమ్మవారికి ఎదురుగా ఉన్న మాతంగేశ్వరి అమ్మవారి ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పచ్చిమట్టి కుండపైన నిలబడి మేలతాళాల మధ్యన అమ్మవారిని అవహించుకొంటారు. రాబోయే సంవత్సర కాలంలో జరిగే ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, రుతుపవనాల కదలికలు, వర్షాలు, పంటలు ఎలా ఉంటాయనే అంశాలపైన ఆమె వివరిస్తుంది. జాతర ప్రారంభమైన నాటి నుండి ఎలా జరుగుతోందో కళ్లకు కట్టినట్టు భవిష్యవాణి పేరిట ఆమె జోస్యం చెపుతుంది. ఈ సందర్భంగా భక్తులు అడిగే అనేక ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం చెప్పుతుంది. రంగం అనంతరం బలి (గావు) కార్యక్రమం వంశపారంపర్యంగా వచ్చిన పోతరాజు నిర్వహిస్తారు. పూర్వకాలంలో బలి అనగానే దున్నపోతును బలి ఇచ్చేవారు. గతంలో ఆర్యసమాజ్ లాంటి సంస్థలు దీన్ని వ్యతిరేకించటంతో బలులు మానివేసి ప్రస్తుతం గుమ్మడి కాయ లేదా సొరకాయలతో నేడు బలి ఇచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రంగం అయిన వెంటనే పోతరాజులు భవిష్యవాణి చెప్పిన అవివాహిత మహిళను అమ్మవారికి అవహించి ఉంటుంది కనుక అమ్మవారిని శాంతింపజేయటంకోసం ఈ బలి కార్యక్రమం నిర్వహిస్తారు. దేవాలయంలో పోతరాజులు ప్రత్యేకంగా విన్యాసాల మధ్యన భవిష్యవాణి చెప్పిన మహిళ అమ్మవారిని దర్శించుకుంటుంది. దీంతో రంగం కార్యక్రమం ముగుస్తుంది. రంగం కార్యక్రమం ముగిసే వరకు అమ్మవారి దర్శనాలు నిలిపి వేస్తారు. రంగం కార్యక్రమం ముగిసిన వెంటనే తిరిగి భక్తులను అమ్మవారి దర్శనం పునరుద్దరిస్తారు. సోమవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏనుగు అంబారిపైన ఊరేగించి సాగనంపుతారు. సికింద్రాబాద్‌లోని అమ్మవారి దేవాలయం నుండి రైల్వేస్టేషన్ మీదుగా మెట్టుగూడ వరకు అమ్మవారిని సాగనంపటంతో లష్కర్ బోనాల జాతర ముగుస్తుంది. జాతర సందర్భంగా ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేస్తారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాతర ప్రారంభం నుంచి ముగిసే వరకూ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు.
లాల్‌దర్వాజ జాతర
హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని లాల్‌దర్వాజ బోనాల జాతరకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ కూడ నిజాం ప్రభుత్వ కాలం నుండి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్ తరహాలోనే హైదరాబాద్‌లోనూ పలుచోట్ల ఆషాఢ అమ్మవారి జాతర జరుగుతుంది.
*

‘బంగారు బోనం’
జంటనగరాల్లో బోనాల జాతరను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది జాతర నిర్వహణకు పదిహేను కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. బందోబస్తు ఏర్పాట్లకు, భక్తుల సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. తొలిసారిగా ఈ ఏడాది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ‘బంగారు బోనం’ సమర్పిస్తున్నారు. దాదాపు మూడు కోట్ల రూపాయల ఖర్చుతో బంగారంతో బోనం సమర్పించే కలశాలను తయారు చేయించారు. సుమారు 250 కిలోల వెండితో అమ్మవారి గర్భాలయాన్ని తాపడం చేయిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అమ్మవారికి వజ్రాలు పొదిగిన ముక్కు పుడక, బొట్టు, బంగారు ఖడ్గాన్ని సొంతంగా బోనాల సందర్భంగా సమర్పిస్తారు.
‘బోనం’ అంటే..
అమ్మవారికి మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించే ‘బోనం’ ఈ జాతరలో ఎంతో ముఖ్యమైనది. జగన్మాతకు సమర్పించే నైవేద్యమే (అన్నం) ‘బోనం’. అన్నం, పాలు, బెల్లం, ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టికుండలు లేదా రాగిపాత్రల్లో నిష్ఠగా వండుతారు. ఆ బోనాన్ని మహిళలు తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాల మధ్య ఆలయానికి తీసుకువచ్చి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. బోనం తీసుకువచ్చే కుండలను, కలశాలను, పాత్రలను పసుపు,కంకుమలతో, వేపమండలతో అలంకరిస్తారు. బోనం తీసుకువెళ్లే మహిళల్లో కొందరు తమను అమ్మవారు ఆవహించిందని నమ్ముతారు. వీరు ఉద్వేగానికి లోనై అమ్మవారి సన్నిధికి చేరుకుంటారు. అమ్మవారు ఆవహించినందున బోనం పట్టుకొచ్చే మహిళల కాళ్లపై మిగతా భక్తులు నీళ్లు చల్లి శాంతింపజేస్తారు. బోనాల జాతరంటే మహిళల్లో ఎక్కడలేని ఉత్సాహం తొణికిసలాడుతుంది. ఉదయానే్న అభ్యంగన స్నానం ఆచరించి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి, నగలు అలంకరించుకొని మహిళలు బోనాల జాతరలో రోజంతా సందడి చేస్తారు. బోనం తయారు చేయడం నుంచి జాతర ముగిసే వరకూ మహిళలు అమ్మవారిని స్మరించుకుని మొక్కుబడులు తీర్చుకుంటారు.

-ఆస శ్రీరాములు 9440037196