ఈ వారం స్పెషల్

భారతీయ మూలాలు.. నవజీవన వేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్ సింగారించుకుంది..
అక్కడ భారతీయత వెల్లివిరుస్తోంది..
మనవారి జ్ఞానవీచికలతో సేదదీరుతోంది..
మెరికల్లాంటి మేధావులతో కొత్తశోభ అలంకారమైంది..
భారతీయ సాంస్కృతిక పరిమళాలు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి..
*
ప్రపంచం నలుచెరగులా తమ ప్రతిభాపాటవాలతో ఔరా అనిపించిన భరతమాత ముద్దుబిడ్డలు అక్కడి తీరానికి ఠీవిగా చేరుకున్నారు. మాతృభూమికి దూరంగా జీవితాలను, వ్యాపారాలను సాగిస్తున్న ‘ప్రవాస భారతీయులు’ ఇప్పుడు అక్కడ పండుగ చేసుకుంటున్నారు. కొత్త ఏడాదిలో కొంగొత్త వేడుకకు విచ్చేశారు. చాన్నాళ్లుగా పనిచేసే దేశంలో చదువు, ఉద్యోగం, వ్యాపారం చేసి పెద్దవారై పేరుతెచ్చుకున్న మనవాళ్లు ఇప్పుడు అమ్మవైపు, జన్మభూమివైపు చూస్తున్నారు. శరవేగంగా, శక్తిమంతంగా నవయుగంవైపు దూసుకుపోతున్న భారత్ వెలుగుల ప్రస్థానంలో తామూ పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. వలసపోయిన మన ‘మేధస్సు’ ఇన్నాళ్లూ తపస్సు చేసింది. ఇప్పుడు మనవారి, మన భూమిపై ఉషస్సుకోసం ఉరకలు వేస్తోంది. అలా ఉరకలెత్తుతున్న ప్రవాస భారతీయులకు దేశం స్వాగతం పలుకుతోంది. జేజేలు చెబుతోంది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా మాతృభూమి అభివృద్ధిలో పాలుపంచుకోమని ప్రభుత్వం పిలుపునిస్తోంది. సాంకేతిక ప్రగతిలో భాగస్వాములవ్వాలని కోరుతోంది. గడచిన పదిహేనేళ్లుగా ‘ప్రవాసుల’ ప్రత్యేక సేవలు భారత్ గమనాన్ని అభివృద్ధి దిశగా వేగాన్ని పెంచాయి. ప్రభుత్వ విధానాలు కూడా అందుకు తోడ్పడ్డాయి. అందులో భాగంగానే ఇప్పుడు సింగపూర్‌లో ప్రవాస భారతీయుల పండుగ జరుగుతోంది. కొత్త సంవత్సరంలో భారత్ తరపున జరుగుతున్న అతిపెద్ద కార్యక్రమం ఇది. ఈ ‘ప్రవాసీ భారతీయ దివస్’కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో మన జీవనాడి ఉంది. ఎత్తుగడ ఉంది. ఆర్థిక శక్తి ఉంది. వ్యూహ చతురత ఉంది. భవిష్యత్ ప్రణాళిక ఉంది. కావలసిందల్లా భరతమాత ముద్దుబిడ్డల శక్తియుక్తులను మాతృదేశ ప్రగతికి దోహదపడాలి. అదే లక్ష్యం. రెండేళ్లకోమారు భారత్‌లో ఏదో ఒక రాష్ట్రంలో నిర్వహించే ‘ప్రవాసీ భారతీయ దివస్’ ఈసారి సింగపూర్‌లో నిర్వహిస్తున్నారు. అందుకు బలమైన కారణమే ఉంది. దాదాపు 3వేల మంది మేధావులు ఈ వేదికపై తమ ఆలోచనలు పంచుకోనున్నారు. మేధోమథనం చేయనున్నారు. ఉజ్వల భవిష్యత్, భద్రమైన భారత్, ప్రపంచంలో బలీయమైన శక్తిగా ఎదగడానికి కావలసిన సాంకేతిక, పారిశ్రామిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ బంధాలను పటిష్టం చేసుకోవడం ఈ వేడుక లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగమే వేదిక సింగపూర్ కావడం. ఆగ్నేయాసియా దేశాలతో మన దేశం సంబంధాలు పెట్టుకుని పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రవాస భారతీయ దినోత్సవం ఆగ్నేయాసియా దేశాల కూటమికి ఇప్పుడు అధ్యక్షత వహిస్తున్న సింగపూర్‌లో నిర్వహించాలని నిర్ణయించడం సందర్భోచితం. పైగా ప్రపంచంలో ప్రభావం చూపించే శక్తివంతమైన దేశాలు అమెరికా, చైనా, జపాన్, భారత్ మధ్యలో, ఆసియాన్ దేశాలకు నడుమ సింగపూర్ ఉంది. ప్రపంచంలో ఏ మూలన ఉన్న భారతీయులకైనా ఇక్కడకు రావడం తేలికే.
ఏ దేశమేగినా ఎందుకాలిడినా... పొగడరా నీతల్లి భూమి భారతిని’ అన్నారు మనవాళ్లు.. పుట్టిన ఊరిని, దేశాన్ని వదిలి చదువుకోసమో, అవకాశాల కోసమో, అద్భుతమైన జీవితం కోసమో, ఆదాయం కోసమో దూరతీరాలకు వెళ్లిన మనవాళ్లు... ‘మేము భారతీయులం’ అని చెప్పుకునేందుకు ఎంతో గర్వపడతారు. జన్మభూమి రుణం తీర్చుకోవాలని ఉబలాటపడతారు. ఒకప్పుడు అలా దేశాన్ని వదిలి వేరే దేశాలకు వలసవెళ్లిపోవడం ఓ ట్రెండ్. అలా వెళ్లినవారిని కొందరు ‘స్వార్థపరులు’ అని అంటే మరికొందరు ‘మేధావులు’ అన్నారు. మేధోవలస వలన దేశం నష్టపోతోందని బాధపడినవారూ ఉన్నారు. అందులో కొంత నిజం ఉంది. అయితే లోకం మారింది. ఆ మార్పులు ఆలోచనా ధోరణుల్లోనూ మార్పు తీసుకువచ్చింది. దూరతీరాలకు వెళ్లిపోయిన వారికి సొంతగడ్డపై మమకారం పెరిగింది. జన్మభూమికి ఏదో ఒక ఉపకారం చేయాలనిపిస్తోంది. ఎక్కడో ఎందుకు మన దేశంలోనే వ్యాపారం చేస్తే ఏం పోయిందనిపిస్తోంది. ప్రభుత్వ ఆలోచనల్లోనూ మార్పు వచ్చింది. కాలంచెల్లిన విధానాలు మార్చారు. శషభిషలు వదిలి చురుకుగా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రవాసులకోసం, వారి సమస్యల పరిష్కారం కోసం, వారి సందేహాల నివృత్తికోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తున్నాయి. పెట్టుబడులతో రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఆలోచనలు పంచుకోమంటున్నాయి. విదేశాల్లో నేర్చుకున్న నైపుణ్యాన్ని, మేధోశక్తిని, సాంకేతిక ప్రజ్ఞను మాతృదేశం అభివృద్ధిలో ఉపయోగించాలని
ప్రభుత్వాలు కోరుతున్నాయి. అలా వచ్చేవారికి ఎర్రతివాచీ పరుస్తున్నాయి. ఇప్పటికి పద్నాలుగుసార్లు ‘ప్రవాసీ భారతీయ దివస్’లు జరిగాయి. ఇప్పుడు పదిహేనవ సదస్సు సింగపూర్‌లో జరుగుతోంది.
ప్రవాస భారతీయ దివస్ అంటే...
మనిషి వలసజీవి. పొట్టకూటి కోసం ఒకప్పుడు వలస వెళితే ఇప్పుడు అవకాశాలు, అభివృద్ధి కోసం సుదూర ప్రాంతాలకు వెళుతున్నాడు. సరికొత్త ప్రపంచం ఉందేమోనన్న కుతూహలంతో అంతరిక్షాన్ని మన వాళ్లు జల్లెడపడుతున్నారు. అక్కడకు వెళ్లడం కూడా వలసే. అలా దూరతీరాలకు, విదేశాలకు వెళ్లిన మనవాళ్లను ప్రవాస భారతీయులం అంటున్నాం. విదేశాల్లో పుట్టి పెరిగిన మనవాళ్లను భారతీయ సంతతికి చెందినవారిగా పిలుస్తున్నాం. ఎక్కడున్నా ఎవరూ మూలాలు మరిచిపోవడం సులభం కాదు. అందులో స్వస్థలానికి దూరంగా ఉంటే పుట్టిన ప్రాంతంపైనా, అక్కడి పరిస్థితులు, బంధువులు, స్నేహితులను మరచిపోవడం కష్టం. గతంలో విదేశాల్లో వచ్చిన అవకాశాలు ఇప్పుడు స్వదేశంలో కనిపిస్తున్నాయి. అప్పుడు ఆహ్వానం పలికిన విదేశాలు ఇప్పుడు చిన్నచూపు చూస్తున్నాయి. అందుకే విదేశాల్లో ఉన్న మనవాళ్ల ఆలోచనల్లో మార్పు వస్తోంది. దేశంలో పరిస్థితులు కూడా మారుతున్నాయి. విదేశాలకు వెళ్లి ప్రతిభకు పదునుపెట్టి, మెదడుకు మేతవేసి అద్భుతమైన వేతనాలు, సంపదను సృష్టించిన మేధావుల సేవలను దేశాభివృద్ధిలో, భద్రతలో ఉపయోగించుకోవాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే ప్రవాసులపై ప్రేమ పెరిగింది. వారికి ప్రాధాన్యం పెరిగింది. డిజిటల్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ విలువ తెలిసొచ్చింది. ప్రవాసుల సహాయంతో ఆయా రంగాలను భారత్‌లో అభివృద్ధి చేసి ప్రపంచంలో భారత్‌ను అద్భుతమైన శక్తిగా తయారు చేయాలన్న కేంద్రప్రభుత్వ లక్ష్యం. అందుకే ప్రధాని మోదీ ‘ప్రవాసుల’ మనసు చూరగొనే ప్రయత్నం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి మొదలుపెట్టారు. అమెరికాలోని మోడిసన్ స్క్వేర్ నుంచి తొలి పిలుపునిచ్చారు. ఆ తరువాత ఒక్కో దేశం చుట్టివస్తూ భారతీయ పరివారాన్ని ఉత్సాహపరిచారు. భావోద్వేగాలతో వారి హృదయాలను తట్టిలేపారు. ప్రభుత్వ విధానాలలో మార్పులను చాటుతూ లెక్కల గుట్టు విప్పి ఎర్రతివాచీ పరిచామని, ఆలోచనలు, ఆవిష్కరణలు, పెట్టుబడులతో రావాలని సాదరంగా ఆహ్వానించారు. వ్యాపారమే అయినా మాతృదేశ మమకారంతో చేయమన్నారు. అంకుర పరిశ్రమలు, మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేవలం మాటలు, ప్రకటనలతో కాకుండా అందరినీ ఒకచోట చేర్చి సదస్సులు, చర్చాగోష్టులు, ఆలోచనల పరస్పర మార్పిడి, అవకాశాల అవగాహన, అవసరాలపై వివరణలు ఇచ్చిపుచ్చుకోవడానికి ఓ వేదికగా ‘ప్రవాసీ భారతీయ దివస్’ మొదలైంది. అదే సందర్భంలో మన సంస్కృతీ పరిమళాలను వెదజల్లడం మరవలేదు. ఆర్థికం, వాణిజ్యం, సంస్కృతి, టెక్నాలజీ, చదువు, భద్రత వంటి అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఇప్పుడు రాజకీయంగానూ కొన్ని అంశాలు జోడీ అవుతున్నాయి. సింగపూర్‌లో ఈసారి ‘ప్రవాసీ భారతీయ దివస్’ నిర్వహించడంలో అందులో భాగమే.
ఎప్పుడు మొదలైంది...
జాతిపిత మహాత్మా గాంధీజీ కూడా చాలాకాలం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. ఆయన అప్పుడు ప్రవాస భారతీయుడే. 1915లో ఆయన అక్కడి నుంచి భారత్ (ముంబై)లో అడుగుపెట్టారు. జనవరి 9న ఆయన రాకకు గుర్తుగా ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహించాలని 2002లో నిర్ణయించారు. వాజ్‌పేయ ప్రధానిగా ఉన్నప్పుడు వేసిన హెలెవెల్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ కార్యక్రమం ఒక సంప్రదాయంగా మారింది. ఏటా జనవరి 7 నుండి 9 వరకు మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించడం మొదట సంప్రదాయం. 13 సదస్సులు అలాగే సాగాయి. ఆ తరువాత విధానం మారింది. రెండేళ్లకు ఒకసారి భారీఎత్తున ఈ వేడుకలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి నిర్వహించాలని నిర్ణయించారు. 2015లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 14వ ప్రవాసీ భారతీయ దినోత్సవం 2017లో బెంగళూరులో నిర్వహించారు. ప్రధాన వేడుక జరిగిన మరుసటి సంవత్సరం ఏదో ఒక నగరంలో చిన్నస్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈసారి ఈ వేడుకను రాజకీయ ప్రాధాన్యత దృష్ట్యా అట్టహాసంగా నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఆసియాన్ (ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి) దేశాలతో భారత్ సంబంధాలు ఏర్పరుచుకుని పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా జనవరి 6,7 తేదీలలో ఆయా దేశాల కూటమికి మధ్యలో ఉండే సింగపూర్‌లో ఈ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రపంచంలో భారతీయులు ఎక్కువగా ఉన్నది అమెరికా, కెనడా, బ్రిటన్ తరువాత సింగపూర్‌లోనే. అక్కడ దాదాపు 650,000 మంది ప్రవాస భారతీయులున్నారు. ఆసియాపై పట్టుకోసం పరితపిస్తున్న చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న భారత్ విదేశీ విధానంలో మార్పులకు ఈ వేదిక ఎంపిక ఉదాహరణగా నిలుస్తుంది. తూర్పువైపు చూపు మాత్రమే కాకుండా తూర్పువైపు కార్యాచరణ (లుక్ ఈస్ట్ - యాక్ట్ ఈస్ట్) విధానంలో భాగంగా మోదీ ప్రభుత్వం చురుకుగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మన దేశ గణతంత్ర దినోత్సవానికి ఆసియాన్ దేశాలను ఆహ్వానించిన ప్రభుత్వం అందుకు తగిన వాతావరణం సృష్టించేందుకు ఈ వేదికను ఇలా ఎంపిక చేసిందన్నది భావన.
నిజానికి ఆర్థిక విషయాల్లోనూ ప్రవాస భారతీయుల పాత్ర తక్కువేం కాదు. ఏ దేశంలో పనిచేసినా మాతృదేశానికి వారు ఏటా బిలియన్ యూఎస్ డాలర్ల మొత్తాన్ని పంపుతున్నారు. ఒక్క 2016-2017లోనే దాదాపు 70 బిలియన్ డాలర్ల మొత్తాన్ని వారు పంపారు. ప్రపంచంలో దాదాపు 7 కోట్లమంది ప్రవాస భారతీయులు ఉన్నారని అంచనా. భారతదేశ విముక్తి కోసం ‘సైన్యాన్ని’ ఏర్పాటు చేసి సింగపూర్‌లో తర్ఫీదు ఇచ్చిన సుభాష్ చంద్రబోస్ ఇప్పుడు అందరికీ గుర్తుకువస్తున్నారు. ఆయన నడచిన నేలపై ప్రవాస భారతీయ దివస్ నిర్వహించడం ఒక విశేషం.
ఆసియాన్‌కు ప్రాధాన్యం
ఈసారి సింగపూర్‌లో నిర్వహిస్తున్న ‘ప్రాంతీయ ప్రవాసీ భారతీయ దివస్’కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ దేశాలతో భారత్ సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని వాణిజ్య, వ్యాపార, రక్షణ, సాంకేతిక, విద్య, వైద్య వ్యవహారాలలో ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమై పాతికేళ్లు పూర్తయింది. 1967లో ఏర్పడిన ఆసియాన్‌లో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, లావోస్, బ్రూనే, మయన్మార్, వియత్నాం, లావోస్, కాంబోడియా, సింగపూర్ సభ్యదేశాలు. వాటితో మన బంధం ఏర్పడి పాతికేళ్లు పూర్తయ్యాయి. ప్రపంచంలో ఈ కూటమి అతిపెద్ద ఆర్థికశక్తుల్లో ఆరవది. జనాభా పరంగా ప్రపంచ జనాభాలో 8.8 శాతం ఉంది. ఈ దేశాలతో భారత వాణిజ్యం బాగా విస్తృతమవుతోంది. దాదాపు 69 మిలియన్ డాలర్ల మేర ఏటా వాణిజ్యం సాగుతోంది. రాజకీయంగానూ ఆ దేశాల కూటమితో అవసరం ఎక్కువే. చైనాను కట్టడి చేయడానికి ఈ దేశాల కూటమి మద్దతు అవసరం.
*
సింగపూర్‌లోనే ఎందుకు?
ఈసారి సింగపూర్‌లో ప్రవాస భారతీయ దివస్ నిర్వహించడాన్ని ప్రవాస భారతీయులు ఆహ్వానిస్తున్నారు. ఆధునికతకు, సృజనకు, నవకల్పనలకు, ప్రతిభకు కేంద్రమైన సింగపూర్‌లో జరిగే ఉత్సవానికి ప్రపంచం నలుమూలలనుండి వాణిజ్య, పారిశ్రామిక ప్రముఖులు, పెట్టుబడిదారులు, అంకుర పరిశ్రమల నిర్వాహకులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, రక్షణ నిపుణులు, శాస్తవ్రేత్తలు హాజరుకానున్నారు. దాదాపు 3వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ ఉత్సవానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హాజరవుతున్నారు. ఈ వేడుకల్లో ఆరు అంశాలపై దృష్టి సారించామని సింగపూర్‌లోని ఐఐటి అలుమిని సంస్థ అధ్యక్షుడు శాయంత్ బసు అంటున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫర్ స్మార్ట్ సిటీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఫైనాన్షియల్ ఇన్‌క్లూసన్, రెన్యువబుల్ ఎనర్జీ, అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్, డిజిటల్ హెల్త్, క్లీన్ ఇండియా అంశాలపై అవకాశాలను అందిపుచ్చుకుంటామని వారు అంటున్నారు. భారత్‌లో కొత్త అంకుర పరిశ్రమల్లో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తామని భారత్‌కు చెందిన ఔత్సాహిక అతిధులు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3500 మంది ఐఐటియన్స్, వందమంది పారిశ్రామికవేత్తలు ఈ ఉత్సవానికి హాజరవుతున్నారు. ఆ ఆకాంక్షలకు తగ్గట్టుగానే ఈ ఉత్సవ నినాదం రూపొందించారు. రెండు రోజుల పాటు 15 సెషన్స్‌లో జరిగే ఈ వేడుకల్లో కేవలం చర్చలే కాదు, సంగీత సాహిత్య, నృత్య కార్యక్రమాలు భారతీయతను చాటిచెబుతాయి. ఇక విందులూ ఉంటాయి. ‘ఏన్సియంట్ రూట్ - న్యూ జర్నీ, డయాస్పొరా ఇన్ ది డైనమిక్ ఏసియాన్-ఇండియా పార్ట్‌నర్‌షిప్’ అన్నది ఆ నినాదం. పురాతనమైన మార్గంలో చురుకైన ఆసియాన్, భారత సంతతి సరికొత్త ప్రయాణం అన్నది దాని సారాంశం. అది నిజమే. అందుకే భారత్ వేసే అడుగులను ‘చైనా’ ఆసక్తిగా గమనిస్తోంది.

-రవళి