ఈ వారం స్పెషల్

‘తీరం’లో ఘోరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోరుమనే అరేబియా సముద్రం ఒకవైపు..
ఎగసిపడే సౌపర్ణికా నది మరొక వైపు..
ఇక్కడి సంగమ స్థలంలో సోయగాల సముద్రం..
ఒంపు సొంపుల నది..
రెండూ కొంత దూరం అలా సాగిపోతాయి..
అలలు జోరుమీదున్నపుడు సాగరం అలా దూసుకొచ్చి నదీ జలాలను ముద్దాడుతున్న దృశ్యం అత్యంత మనోహరం..
పోటెత్తిన నదీ జలాలు సముద్రాన్ని సంతోషపెడతాయి..
ఈ నయనానందకర దృశ్యాన్ని ప్రకృతి ప్రేమికులు ఎప్పుడో గానీ చూడడం అరుదు..
తీరంలో ఇసుక తెల్లగా, స్వచ్ఛంగా ఉండడంతో కర్నాటకలోని ‘మరవంతే బీచ్’ అందరినీ అబ్బురపరుస్తుంది.
***
కెరటాల కేరింతలతో సాగిపోయే అరేబియా సముద్రం ఒకవైపు, ఆ కడలి గర్భాన కలిసిపోతూ కనువిందు చేసే నేయ్యర్ నది సోయగాలు మరోవైపు.. ఆ తీర ప్రాంతంలోని కుగ్రామాలు పర్యాటక ప్రియులకు స్వర్గ్ధామాలే! అలల గలగలలు, నేలంతా పరచుకొన్న పచ్చదనం సందర్శకులను పోటాపోటీగా అలరిస్తాయి.. అక్కడి పిల్లగాలి చిగురాకులను తడిమిన చప్పుడు గుప్పెడు గుండెలో నూతనోత్తేజాన్ని నింపుతుంది.. తీరంలోని అలలు గలగలమని సవ్వడి చేసినపుడు మానస సరోవరంలో ఉల్లాస తరంగాలు ఉవ్వెత్తున లేస్తాయి..
* * *
కర్నాటక, కేరళ మాత్రమే కాదు.. మన సువిశాల భారత్‌లో సముద్ర తీరాలకు, సంగమ స్థలాలకు కొదవలేదు. తీర ప్రాంతంలో సొగసులీనే ప్రకృతిని చూస్తుంటే గంటలు నిమిషాల్లా గడచిపోతాయి. తీర ప్రాంతం పల్లెవాసుల జీవనశైలి మనల్ని అబ్బురపరుస్తుంది. సముద్రంలోకి ‘వేట’కు వెళ్లే జాలరులు, వారి రాకకోసం సాయంత్రం వేళ తీరంలో ఎదురుచూసే మహిళలు.. చీకటి పడ్డాక ఆట పాటల కోలాహలం... మనల్ని మైమరపిస్తాయి. కడలి అంచున కట్టిన కాటేజీలు, రిసార్టులు పర్యాటకులకు ఆతిథ్యమిస్తాయి..
పచ్చని ప్రకృతి ఎక్కడున్నా ఆస్వాదించొచ్చు..
సోయగాల తీరం ఎంత దూరానున్నా అక్కడికి వెళ్లిపోవచ్చు..
ఆహ్లానం ఏ దిక్కునున్నా రెక్కలు కట్టుకుని వాలిపోవచ్చు..
... ఇదంతా ‘తీరం’లో తళుకులీనే ఓ కోణం మాత్రమే! మరో కోణాన రొద చేస్తున్న ‘విధ్వంస గీతం’ మనకు వినపడదు..
సందేహమేం లేదు..
రంగులుతున్న కుంపటి మీద కూర్చుని..
ఏదో కాసింత వెచ్చగా ఉందని సంబరపడిపోతున్నాం..
రాబోయే సంక్షోభాలను, సవాళ్లను ఇంకా గుర్తించలేకపోతున్నాం..
ఇన్నాళ్లూ సమస్య మనదాకా రాలేదని, మన బతుకులకేం బెంగలేదని భ్రమ పడ్డాం.. ఆ భ్రమలు, అపోహలు పటాపంచలైపోయి ఇప్పుడిప్పుడే మన కళ్లకు కఠోర వాస్తవాలు గోచరిస్తున్నాయి. అభివృద్ధి పేరిట సుందర సాగర తీరాల్లో అంతులేని నిర్మాణాలు, పర్యావరణ హననంతో ఏర్పడే విపరిణామాలు మనల్ని చుట్టుముట్టి కకావికలం చేసే రోజులొచ్చేశాయి.. కాకపోతే ఆ విషయాన్ని మనం గుర్తించడం లేదంతే..
అకాల కుంభవృష్టితో చెన్నై నగరం అవస్థల పాలైనా, మళ్లీ అంతలోనే దాహార్తితో నానాపాట్లు పడినా... వరద ముంపుతో వీధులన్నీ జలమయమైపోయి ముంబయి నగరం నీటిలో తేలిపోయినా... రుతుపవనాలు జాడలేక కర్షకులు కలవరపడినా... కీటకాలు చెలరేగి విష జ్వరాలు విజృంభించినా.. ఇందుకు పర్యావరణ మార్పులే కారణమని తెలుసుకోం.. అనేకానేక అనర్థాలకు పర్యావరణ మార్పులే హేతువులని వాతావరణ శాస్తజ్ఞ్రులు చేస్తున్న హెచ్చరికలను మనం అంతగా పట్టించుకోం. ఆహ్లాదం కోసం ‘బీచ్’లకు పరిగెడతామే తప్ప- సముద్ర తీరం వెంబడి టన్నులకొద్దీ చెత్తాచెదారం పేరుకుపోతున్నా- పర్యావరణంపై మనకు ఎలాంటి ధ్యాస ఉండదు.. పర్యాటకుల వల్లే ‘తీరం’ పాడవుతోందని తెలిసినా పాలకులకు పట్టదు. సాగరాల చెంత కట్టడాలను అనుమతించేది లేదంటూ ‘తీర నియంత్రణ’ (సీఆర్‌జెడ్) చట్టం అమలులో ఉన్నా అక్రమ నిర్మాణాలకు అంతే లేదు..
సాగర తీరాలు.. మురికి కూపాలు!
మన దేశంలోని సాగర తీరం కాలుష్యానికి నిలయంగా మారుతోందని తాజా అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఇటీవల కొంతమంది పర్యావరణ నిపుణులు దేశవ్యాప్తంగా 34 బీచ్‌లలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టగా ఆందోళనకరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ 34 బీచ్‌ల వెంబడి సుమారు 35 టన్నుల చెత్తాచెదారాన్ని అధ్యయనం సందర్భంగా తొలగించారు. 26 మంది సమన్వయకర్తలు, 6,700 మంది వాలంటీర్లు ఈ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో, బీచ్‌ల వద్ద వ్యర్థ పదార్థాలు కొండల్లా పేరుకుపోయాయని, ఒడిశా, గుజరాత్ బీచ్‌లలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని అధ్యయనంలో తేల్చారు. సాగర తీరంలో మూడు రకాలుగా చెత్త పేరుకొనిపోతోందని పర్యావరణ నిపుణులు తేల్చారు.
ప్రధానంగా ప్లాస్టిక్, గాజు, కాగితం, రబ్బరు, ఫ్యాబ్రిక్ వ్యర్థాలు సాగర తీరంలో గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, సీసాలు, తినుబండారాల కాగితాలను, పానీయాలకు వాడే సీసాలను తీరం వెంబడి పర్యాటకులు ఇష్టానుసారం పారవేస్తున్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను యథేచ్ఛగా చెత్తకుప్పల్లో వేస్తున్నారు. బీచ్‌లు ఉన్న ప్రాంతాల్లో స్థానికులు సైతం ప్లాస్టిక్, రబ్బరు, గాజు, ఫ్యాబ్రిక్ వ్యర్థాలను సముద్రాల ఒడ్డున పడవేస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల అధికారులు పట్టించుకోవడం లేదు. చట్టాలను అమలుచేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చోద్యం చూస్తున్నాయి.
పర్యావరణ నిపుణులు చేపట్టిన ‘పారిశుద్ధ్య నిర్వహణ’ కార్యక్రమం సందర్భంగా కోజికోడ్ (కేరళ) బీచ్‌లో 4, 022 కిలోలు, సాగరేశ్వర్ (మహారాష్ట్ర) బీచ్‌లో 3, 000 కిలోలు, వేదారణ్యం (తమిళనాడు) బీచ్‌లో 2, 100 కిలోలు, మంగళూరు (కర్నాటక) బీచ్‌లో 2, 057 కిలోల చెత్తను తొలగించారు. పూరీ బీచ్ (ఒడిశా)లో 35 కిలోలు, డుమాస్ (గుజరాత్) బీచ్‌లో 132 కిలోల వ్యర్థాలను సేకరించారు. ముంబయి, చెన్నై, విశాఖ వంటి తీర ప్రాంత నగరాలు అపరిశుభ్రతకు నెలవుగా మారుతున్నాయి. చెత్తాచెదారంతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలను తీరం వెంబడి పారవేస్తున్నారు. సముద్రంలో పారవేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు జలచరాల పాలిట మృత్యువుగా పరిణమిస్తున్నాయి.
అందమైన ఇసుక తినె్నలతో అలరారే కేరళలోని బీచ్‌లు చెత్తకుప్పలతో నిండిపోతున్నాయి. ఆహ్లాదకర వాతావరణానికి నెలవైన కేరళ బీచ్‌లంటే పర్యాటకులు మిక్కిలి ఇష్టపడతారు. అధిక సంఖ్యలో తరలివచ్చే పర్యాటకులే బీచ్ అందాలను పాడుచేస్తున్నారని అధ్యయనంలో తేలింది. ‘జాతీయ తీర ప్రాంత అధ్యయన సంస్థ’ (ఎన్‌సీసీఆర్) జరిపిన సర్వేలో కేరళ, మహారాష్ట్ర తీర ప్రాంతాలు కాలుష్య కేంద్రాలుగా మారుతున్నట్లు కనుగొన్నారు. రెండు గంటలపాటు జరిపిన అధ్యయనం సందర్భంగా కేరళలోని అయిదు బీచ్‌లలో 9, 519 కిలోలు, మహారాష్టల్రోని మూడు బీచ్‌లలో 5, 930 కిలోలు ఒశాలోని నాలుగు బీచ్‌లలో 478 కిలోల చెత్తను తొలగించారు. సముద్ర తీరంలో తాము సేకరించిన 35 టన్నుల చెత్తలో 50 శాతం వ్యర్థాలకు పర్యాటకులే కారకులని, మిగతా చెత్తకు చేపలవేట, గృహ సంబంధ వ్యర్థాలు కారణమని తేలింది. బీచ్‌ల వెంబడి తొలగించిన చెత్తలో 20 శాతం వరకూ గాజు సీసాలే ఉండడం గమనార్హం. పర్యాటకులు పారవేసే ప్లాస్టిక్ వస్తువులు, ఆహార పదార్థాలవల్ల సాగర తీరాలు మురికి గుట్టలుగా మారుతున్నాయి.
మనదేశంలో పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగా 22 బీచ్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఆందోళనకర స్థాయిలో పేరుకుపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఈ వ్యర్థాల వల్ల సాగర జలాల్లో మైక్రో ప్లాస్టిక్ విస్తరిస్తోంది. మైక్రో ప్లాస్టిక్ చాపలు వంటి జలచరాల పాలిట మృత్యువుగా మారుతోంది. మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలను తిన్న చేపలను ఆహారంగా వినియోగించేవారు సైతం రోగాల బారిన పడుతున్నారు. పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను విచక్షణారహితంగా పారవేస్తుండగా, మరోవైపు స్థానికులు గాజు, పింగాణీ వ్యర్థాలను, పాత టైర్లు, చెప్పులు, దుస్తులు, పూలు, భారీ విగ్రహాలను, ఆర్గానిక్ పదార్థాలను బీచ్‌ల ఒడ్డున డంప్ చేస్తున్నారు. పాత భవనాలను కూల్చివేసినపుడు వచ్చే చెత్తను పారవేస్తున్నందున చాలాచోట్ల సముద్ర తీరాలు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయ. ఆకర్షణీయమైన బీచ్‌లలో చెత్త పేరుకుపోవడానికి పర్యాటకులే ప్రధాన కారణమని తెలిసినా టూరిజం ఆదాయం తగ్గుతుందనే ఆలోచనతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు సాహసించడంలేదు. సముద్ర తీరాల్లో అధిక జనాభా కలిగిన అనేక నగరాలు ఉండడంతో మురుగునీరు, ఆస్పత్రి వ్యర్థాలు తదితర చెత్తా చెదారాలను తీరం వెంబడి కుమ్మరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యం విస్తరించి పర్యావరణం పాడవుతోంది. రామేశ్వరం వంటి ఆధ్యాత్మిక క్షేత్రాలున్న బీచ్‌లలో వాడేసిన మద్యం సీసాలు బుట్టల కొద్దీ కన్పిస్తున్నాయని పర్యావరణ నిపుణులు గుర్తుచేస్తున్నారు. పాడైన వలలను, పగిలిన సీసాలను సముద్రంలో పడవేస్తున్నందున అవి జలచరాలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. బీచ్‌లు పర్యావరణంతో పరిఢవిల్లాలంటే, పర్యాటకుల్లో, పాలకుల్లో చట్టాలపట్ల శ్రద్ధపెరగాలని జాతీయ పర్యాటక అధ్యయన సంస్థ సూచిస్తోంది.
శిథిలమైన వలల కారణంగా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో అరుదైన నల్ల తిమింగలాలు అసహజ మరణం పొందుతూ కళేబరాలుగా దర్శమిస్తున్నాయి. సముద్రంలో పారవేస్తున్న ప్లాస్టిక్ స్ట్రాలు ముక్కులలో ఇరుక్కుని సముద్రం తాబేళ్లు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నాయి. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నేడు సముద్రాల పరిస్థితి ‘ప్లాస్టిక్ ద్రావకం’లా మారిందని పర్యావరణ శాస్తవ్రేత్తలు అభివర్ణిస్తున్నారు. సముద్రాల్లో పేరుకొన్న చెత్త వల్ల ఇప్పటికే మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బీచ్‌లవద్ద కన్పించే ప్లాస్టిక్ సీసాలు, పాలిథీన్ కవర్లు, స్ట్రాలు, రబ్బరు వస్తువులే కాదు- సముద్రంలో పడవేసే శిథిల వలలవల్ల జలచరాలకు చేటు కలుగుతోంది. ఏటా ప్రపంచ వ్యాప్తంగా 6.40 లక్షల టన్నుల శిథిల ప్లాస్టిక్ వలలను సముద్రంలో పారవేస్తున్నరని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
ప్లాస్టిక్ ప్రాణాంతకం
విశ్వవ్యాప్తంగా గత కొన్ని దశాబ్దాలుగా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం అనూహ్యంగా పెరిగింది. వీటి వాడకం కొన్ని నిమిషాలు మాత్రమే అయినా ఆ తరువాత ఇవి కాలుష్య భారాన్ని అనూహ్యంగా పెంచుతున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కొన్ని శతాబ్దాల తరబడి భూగర్భంలో కలిసిపోకుండా అలాగే నిక్షిప్తమై ఉంటాయి. ప్లాస్టిక్ వినియోగం లేనిదే ఆధునిక జీవితం గడపడం సగటు మనిషికి అంచనాకు అందని విషయం. సముద్రంలో పారవేస్తున్న ప్లాస్టిక్ వలలను తిమింగలాలు, సీల్స్, తాబేళ్లు వంటివి ఆహారంగా భ్రమపడి తింటూ మరణిస్తున్నాయి. సముద్రంలో పారవేసిన శిథిల వలలవల్ల ఏటా 6.50 లక్షల తిమింగలాలు, సీల్స్ వంటి పెద్ద చేపలు మరణించడమో, లేదా తీవ్రంగా గాయపడడమో జరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగినట్లయితే, 2037 సంవత్సరం నాటికి ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో తిమింగలాలన్నీ అంతరించిపో ప్రమాదం పొంచి ఉంది. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల నెలకు సగటున ఆరు తిమింగలాలు మృత్యువాత పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తిమింగలాలు, ఇతర జలచరాలను రక్షించేందుకు ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది. తిమింగలాలు, సీల్స్, షార్క్‌లు సముద్రంలో పాడైపోయిన వలల కారణంగా మరణిస్తే, అందుకు సంబంధిత కంపెనీలే బాధ్యత వహించాలంటూ గత ఏడాది ఒక చట్టాన్ని రూపొందించారు.
కాగుతున్న సాగర జలాలు
సముద్ర జలాలు అత్యంత వేగంగా వేడెక్కుతున్నాయని, మంచుకొండలు తరగడంవల్ల సముద్రంలో అలలు పోటెక్కి జనావాసాలలోకి చొచ్చుకొస్తున్నాయని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. భూగోళంలో మూడింట రెండు వంతులు సముద్ర జలాలు ఆవరించి వున్నాయి. మిగిలినది ఒక వంతు భూభాగం. భూభాగం వేడిని భూగర్భ జలాలు కొంతవరకు ఉపశమింపజేస్తుంటాయి. అయితే చాలాచోట్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో భూమి యొక్క వేడి అంతర్లీనంగా సముద్రాల్లోకి వ్యాపిస్తోంది. ఫలితంగా సాగర జలాలు ఇంతకు ముందుకంటే వేగంగా, ఎక్కువగా వేడెక్కుతున్నాయి. ప్రస్తుతం సముద్ర జలాలు 40 శాతం వేగంగా వేడెక్కుతున్నాయని 2014లోనే ఐక్యరాజ్య సమితికి చెందిన ఒక కమిటీ స్పష్టం చేసింది. వాతావరణం మార్పులవల్ల సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. 1950 సంవత్సరం చివరిలోగా సముద్ర జలాలలో మార్పులు నిలకడగా వుండేవి. అంటే.. తరువాత సముద్ర గర్భంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోవడం మొదలైంది. సాగర జలాల సగటు ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణంలోకి విడుదలవుతున్న విషవాయువుల ప్రభావానికి ఒక సూచికగా పరిగణించవచ్చు. సాగర జలాలు వేడెక్కడం వల్ల వ్యాకోచం ఫలితంగా సముద్ర మట్టం పెరుగుతోంది. ధృవ ప్రాంతాలవద్ద మంచుకొండలు కరగడం కన్నా సాగర జలాలు వేడెక్కడం వల్లనే సముద్ర మట్టం ఎక్కువగా పెరుగుతోంది. పర్యావరణంలో కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువుల పెరుగుదలను నివారించకపోవడంతో సముద్రమట్టం మరింతగా పెరిగే అవకాశం వుంది. దీనివల్ల విశ్వవ్యాప్తంగా తీర ప్రాంత నగరాలకు భారీ నష్టం జరిగే అవకాశం వుంది. సముద్ర జలాలు ఇలా వేడెక్కుతుంటే ధృవ ప్రాంతాల వద్ద మంచు మరింతగా కరిగి సముద్ర మట్టం పెరుగుతోంది. దీంతో తీర ప్రాంతంలోని నగరాలు తరచూ వరదల తాకిడికి గురవుతాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల వర్షపాతం ఎక్కువై కొన్ని ప్రాంతాల్లో తుఫానులు సంభవిస్తాయి. అంచనాలకు అందని తుఫానుల కారణంగా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం అనివార్యమవుతుంది. తరచుగా సంభవించే తుఫాను బీభత్సాల ఫలితంగా సముద్రాలలోని మత్స్యసంపదకు అపార నష్టం జరుగుతోంది. సముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో మార్పులు ఈదురుగాలులకు కారణమవుతాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుండి చల్లని గాలులు దక్షిణాది ప్రాంతాలకు వీచి సీతాకాలంలో చలి తీవ్రమవుతోంది. ఈ పరిణామాలు పెంగ్విన్‌లు, ధ్రువ ప్రాంతాల ఎలుగుబంట్ల మనుగడకు ప్రమాదాన్ని తెస్తోంది. సాగర జలాలు వేడెక్కడంవల్ల తీర ప్రాంతంలో నివసించేవారికి పరోక్ష ఇబ్బందులు కూడా తప్పడం లేదు. సాగర జలాలు వేడెక్కితే పెద్ద సంఖ్యలో చేపలు వంటి జలచరాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నాయి. దీనివల్ల మత్స్య సంపద వేటపై ఆధారపడినవారికి ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. తీర ప్రాంత నగరాలలో ఆహారాల కొరత ఏర్పడుతోంది. ఈ పరిణామాలు వివిధ దేశాలమధ్య సంఘర్షణలకు దారితీయవచ్చు. సముద్ర జలాలలో ఉష్ణోగ్రతలు నిలకడగా వుంటే, భూవాతావరణంలో సంతులనం దెబ్బతినకుండా వుంటుంది. అది విశ్వవ్యాప్తంగా అనేక పరిశ్రమలు విచక్షణారహితంగా గాలిలోకి వదులుతున్న విషవాయువుల కారణంగా ఉష్ణోగ్రతల్లో 93 శాతాన్ని సముద్ర జలాలు పీల్చుకుంటున్నాయి. ఈ పరిణామం భూగోళ వాతావరణంలోని సమతుల్యాన్ని దెబ్బతీస్తోంది.
అంతరిస్తున్న మత్స్యసంపద
ప్రపంచంలో మితిమీరుతున్న పారిశ్రామికీకరణ ఫలితంగా భూఉపరితల వాతావరణంలో నిండిపోతున్న పలు రకాల విషవాయువులు సముద్ర జలాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇది సాగర జలాల మత్స్య సంపదపై పెను ప్రభావం చూపుతోంది. గత కొద్ది సంవత్సరాలుగా సాగర జలాలలోని జీవరాశులపై జరిపిన పరిశోధనల్లో తేలిందేమంటే, ఇప్పటికే కొన్ని రకాల చేపలు దాదాపు అంతరించిపోయాయి. వాతావరణంలో పెనుమార్పులు చాలా పెరిగిపోతున్న భూఉపరితల ఉష్ణోగ్రతలే ఇందుకు ప్రధాన కారణాలు. పెద్ద సంఖ్యలో జలచరాలు చనిపోతుండగా, మరికొన్ని చిక్కి శల్యమైపోతున్నాయి. 2050 సంవత్సరం నాటికి సముద్రాల్లో జీవించే సుమారు 600 జాతుల చేపల శరీర పరిమాణం 14 నుండి 24 శాతానికి కుంచించుకుపోనున్నాయి. ఇప్పటికే సముద్ర గర్భంలో ఆక్సిజన్ శాతం తగ్గడంతో ఎన్నో జాతుల జలచరాలు అదృశ్యమైపోతాయి. భూవాతావరణం వేడెక్కడంవల్ల సముద్ర జలాల్లోనూ ఉష్ణోగ్రతలు పెరగడంతో చేపల జీవక్రియలో వేగం పెరిగింది. తగినంతగా ఆక్సిజన్ లభించకపోవడంతో పెద్ద సంఖ్యలో చేపలు మరణిస్తున్నాయి. సముద్ర జలాలలో ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ పెరగడంవల్ల చేపల శరీర పరిమాణం 22 నుంచి 30 శాతం తగ్గిపోతోంది. చిన్న చిన్న చేపల్ని తిని బతికే పెద్ద చేపలపైన కూడా ఈ ప్రభావం వుంటోంది. భూ ఉపరితల వాతారణం వేడెక్కినపుడు దాని ప్రభావం సముద్ర జలాలలో ఒకేవిధంగా వుండదు. సముద్రం అడుగుభాగం కంటే ఉపరితలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ. నీటి సాంద్రతలోను కూడా తేడా వుంటుంది. వేరు వేరు ఉష్ణోగ్రతలు కలిగిన సముద్ర జలాలలో నీటి సాంద్రత కూడా వేరుగా వుంటుంది. అందువల్ల సముద్రం అడుగున వుండే ఖనిజ లవణలు, ఇతర పోషక పదార్థాలు ఉపరితల జలాల వద్దకు చేరవు. ఇది సముద్ర ఉపరితలంలో మొక్కల పెరుగుదలను అడ్డుకుంటుంది. ఫలితం ఆక్సిజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. ఆక్సిజన్‌తో పాటు తమకు అవసరమైన ఆహారం లభించక చేపలు చిక్కి శల్యమైపోతున్నాయి. *

-పి.ఎస్.ఆర్.