ఈ వారం స్పెషల్

నవ కశ్మీరానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలనాడు దేశ విభజనపై జరిగినంత చర్చ- నేడు కశ్మీర్‌లో 370వ అధికరణం రద్దు నేపథ్యంలో జరుగుతోంది. 370వ అధికరణం రద్దు వల్ల లాభమా? నష్టమా? అంటూ విభిన్న వర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు 370 రద్దును వ్యతిరేకించినా, దాన్ని జమ్మూ కశ్మీర్ ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. వారంతా ఏదో పంజరంలో నుండి బాహ్య ప్రపంచంలోకి వచ్చిన అనుభూతిని పొందుతున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా గత రెండేళ్లుగా భారీ కసరత్తు చేసి జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విభజించింది. శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్‌ను, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్‌ను విభజించింది. విభజన అనంతరం సహజంగానే ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలూ కేంద్రం అధీనంలోకి వెళ్లాయి.
ఇంతకాలం ఇబ్బందికరంగా ఉన్న చట్టపరమైన అడ్డుగోడను కూల్చిన కేంద్ర ప్రభుత్వం ఇపుడు తన అజెండాను సులువుగా అమలుచేసేందుకు మార్గం సుగమం చేసుకుంది. వ్యూహాత్మకంగా రాజ్యసభలో తొలుత బిల్లును ప్రవేశపెట్టి, తర్వాత దానిని లోక్‌సభకు తీసుకురావడం ద్వారానే కేంద్ర ప్రభుత్వ రాజకీయ వ్యూహం ఇట్టే అర్థమవుతుంది. రాజ్యసభలో ప్రభుత్వ వ్యూహాన్ని దేశ ప్రజలంతా అర్థం చేసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల రానున్న రోజుల్లో జమ్మూ కశ్మీర్ ప్రజలకు మేలు జరగడమేగాక, కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ సైతం పెరుగుతుందనేది నిస్సందేహం.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 370 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్రం హోదాను కల్పించింది. 1947లో భారత్ -పాక్‌ల విభజన జరిగినపుడు కశ్మీర్ మహారాజు హరిసింగ్ స్వతంత్రంగా ఉండాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన కొన్ని షరతులతో భారత్‌లో విలీనం అయ్యేందుకు అంగీకరించారు. ఆ సమయంలోనే మన రాజ్యాంగంలో 370 ఆర్టికల్ చేరింది. దాని ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు దక్కాయి. రక్షణ రంగం, విదేశాంగ శాఖ, కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి పార్లమెంటుకు చట్టాలు చేసే హక్కు ఉంటుంది. 1951లో రాష్ట్రాన్ని, రాజ్యాంగ అసెంబ్లీని ప్రత్యేకంగా పిలవడానికి అనుమతి లభించింది. 1956 నవంబర్‌లో రాష్ట్ర రాజ్యాంగం పని పూర్తయింది. 1957 జనవరి 26న రాష్ట్రంలో ప్రత్యేక రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, కశ్మీర్ నేత షేక్ మహ్మద్ అబ్దుల్లా ఐదు నెలలు చర్చలు జరిపిన తర్వాత రాజ్యాంగంలో ఆర్టికల్ 370ని జోడించారన్నది అందరికీ తెలిసిందే. రక్షణ రంగం, విదేశాంగ విధానం, కమ్యూనికేషన్ రంగాలు మినహా ఏ ఇతర రంగానికి సంబంధించిన అంశంపైనైనా చట్టం చేయాలన్నా లేదా అమలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల ఆ రాష్ట్రంపై ఆర్టికల్ 356 అమలుచేయడం సాధ్యం కాలేదు. చివరికి రాష్టప్రతికి సైతం ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు లేదు. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగంలో సెక్షన్ 35ఏ ఉంది. అది ‘శాశ్వత నివాసి’ నిబంధనలను ప్రస్తావిస్తుంది. ఇది కూడా ఆర్టికల్ 370లో భాగమే. దీని ప్రకారం జమ్మూ కశ్మీర్‌లో భారత్‌కు చెందిన ఇతర రాష్ట్రాల్లోని వారెవరూ ఎలాంటి ఆస్తులను కొనలేరు. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి అమలుచేసే నిబంధన ఉన్నా అది కశ్మీర్‌కు వర్తించదు. దీనివల్ల జమ్మూ కశ్మీర్‌లో ఎమర్జన్సీని అమలు చేయలేరు. రాష్ట్రంలో అశాంతి, హింస విషమించినపుడు రాష్టప్రతికి అత్యవసర పరిస్థితిని విధించే అధికారం లేదు. ఆర్టికల్ 370 తొలగించడానికి సంబంధించి 2015లో సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌పై విచారణ జరిగింది. రాజ్యాంగం నుండి దీన్ని తొలగించే నిర్ణయం పార్లమెంటు మాత్రమే తీసుకోగలదని కోర్టు స్పష్టం చేసింది. ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు చాలా స్పష్టంగా పార్లమెంటు అధికారాలను వివరించారు. రాజ్యాంగంలోని పార్టు 21లో తాత్కాలిక నిబంధన అనే శీర్షిక కింద ఉన్నప్పటికీ- ఆర్టికల్ 370 ఒక శాశ్వత నిబంధన అని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 మూడో విభాగం ప్రకారం దానిని ఉపసంహరించడం గానీ, సవరించడం గానీ కుదరదని కోర్టు తెలిపింది. రాష్ట్ర చట్టం 35ఏను అది సంరక్షిస్తుంది. జమ్మూ కశ్మీర్ మిగతా రాష్ట్రాల్లా భారత్‌లో కలసి లేదు, అది భారత్‌తో ఒక ఒప్పంద పత్రంపై సంతకం చేసినపుడే ఒక పరిధి వరకూ తన సార్వభౌమాధికారాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకుందని హైకోర్టు వివరించింది. దేశ వ్యాప్తంగా వర్తించేలా భారత రాజ్యాంగం ఉన్నా, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంది. అందులోని సెక్షన్ 35ఏ గురించి చాలాసార్లు చర్చ జరిగింది. కశ్మీర్‌లోని ప్రముఖ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెముక్రటిక్ పార్టీల వైఖరి మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. నిజానికి 1947లో భారత్ పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత కాశ్మీర్ సంస్థానం ఎటు వెళ్లాలో తేల్చుకోలేని పరిస్థితిలో మిగిలింది. కాశ్మీర్ తన స్వయంప్రతిపత్తిని నిలుపుకోవాలని బలంగా కోరుకున్నా అప్పటి రాజకీయ పరిణామాలు ఎటో ఒక వైపు విలీనం కాకతప్పని పరిస్థితిని కలిగించాయి.
సిక్కు సామ్రాజ్యం స్థాపించి పాలిస్తున్న రంజిత్ సింగ్ మహరాజు 1822లో బహుమానం కింద తన సైన్యంలోని గులాబ్‌సింగ్‌ను జమ్మూకు రాజును చేశారు. 1846లో ‘అమృత్‌సర్ సంధి’లో భాగంగా కశ్మీర్ లోయను 75 లక్షల నానక్ సాహీ రూపాయిలకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి గులాబ్ సింగ్ కొనుగోలు చేశారు. ‘అమృత్‌సర్ సంధి’ ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం దీనిని శాశ్వతంగా మహారాజ్ సంగ్ , ఆయన వారసులకు మాత్రమే స్వతంత్ర నియంత్రణ ఉండేలా ఇచ్చేసింది.
జమ్మూ కశ్మీర్‌లో డోగ్రా వంశం పాలన మొదలైంది. వారి పరంపరలోనే 1925లో హరిసింగ్ కాశ్మీర్‌కు రాజు అయ్యారు. రాజ్యంలో అత్యధికులు మస్లింలే ఉన్నారు. హిందువులైన మహారాజులు తమ నియామకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే భావన అక్కడి ముస్లింలలో కలిగింది. 1932లో షేక్ అబ్దుల్లా ముస్లిం కాన్ఫరెన్స్ (నేషనల్ కాన్ఫరెన్స్) పార్టీని ప్రారంభించారు. మహారాజు డోగ్రా వంశీకులు కాశ్మీర్‌ను విడిచిపెట్టాలని ఉసిగొల్పాడు. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం లభించినపుడు రెండు దేశాలుగా విడిపోయింది. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్టు-1947’ ప్రకారం ఏమైనా రాజ్యాలు, సంస్థానాలు ‘ఇనుస్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్’ దస్తావేజులపై సంతకాలు చేయడం ద్వారా భారత్ లేదా పాక్‌లో విలీనం కావచ్చని పేర్కొన్నారు. జునాగఢ్, , హైదరాబాద్, జమ్మూ కశ్మీర్ తప్ప మిగిలిన అన్ని సంస్థానాలూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కశ్మీర్ మహారాజు హరిసింగ్ మొదట ఏ దేశంలోనూ విలీనానికి మొగ్గు చూపలేదు. కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్నది ఆయన కోరిక. వ్యాపారం, పర్యాటకం, రవాణాలకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా పాక్‌తో ఒక ఒప్పందం చేసుకున్నారు. 1947 అక్టోబర్‌లో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. పాలనావ్యవస్థపై పట్టు నిలుపుకోవడం, చొరబాటుదారుల దాడులను ఆపడం మహారాజుకు తలకు మించిన భారమైంది. విలీనం విషయమై భారత్‌తో హరిసింగ్ ఒప్పందానికి సిద్ధమయ్యారు. అపుడు భారత్ గవర్నర్‌గా ఉన్న లార్డ్ వౌంట్ బాటెన్‌ను హరిసింగ్ సంప్రదించారు. భారత్ సాయం కోరారు. భారత్‌లో విలీనం అవుతూ సంతకాలు చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండయా చట్టం-1935, ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టం- 1947కు చేసే మార్పులు స్వయంగా హరిసింగ్ అంగీకరిస్తూనే ఈ పత్రాలకు వర్తిస్తాయన్న నిబంధన ఇనుస్ట్రుమెంట్ ఆఫ్ యాక్సిస్‌లో పేర్కొన్నారు. భవిష్యత్‌లో భారత రాజ్యాంగపరంగా చేసుకునే ఏ మార్పులకైనా తాను కట్టుబడి ఉన్నట్టు కాదని, ఆయా అంశాలపై భారత్‌తో ఒప్పందం చేసుకునే అధికారం తనకు ఉంటుందని కూడా హరిసింగ్ నిబంధన పెట్టారు. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి చేసే చట్ట మార్పులకు అక్కడి రాజ్యాంగ సభ ఆమోదనం ఉండాలనే నిబంధన ఈ విధంగా వచ్చిందే. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి రావడం, ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి దక్కడం జరిగిపోయాయి. ఆర్టికల్ 370కి కాంగ్రెస్ పాలనలో చాలా సార్లు సవరణలు జరిగాయి. వాటిలో అతిపెద్దది 1954లో జారీ చేసిన రాష్టప్రతి ఆదేశాలు. భారత రాజ్యాంగంలోని 395 ఆర్టికల్స్‌లో 260 మాత్రమే జమ్మూ కశ్మీర్‌కు వర్తిస్తున్నాయి. మొదట్లో కాశ్మీర్‌కు అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఉండేవారు. ఇందిరాగాంధీ హయాంలో వీటిని గవర్నర్, ముఖ్యమంత్రి పదవులుగా మార్చారు. సదర్ ఏ రియాసత్‌ను ఎన్నుకునేవారు, ఇపుడు మిగతా రాష్ట్రాల్లో నియమించనట్టే జమ్మూ కశ్మీర్‌కూ కేంద్రం గవర్నర్లను నియమించేది.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే 370 ఆర్టికల్‌ను రద్దుచేయడంతో 371 ఆర్టికల్ పరిస్థితి ఏమిటనే చర్చ మొదలైంది. 371ఏ నాగాలాండ్‌కు, 371బీ అస్సాంకు, 371హెచ్ అరుణాచల్‌ప్రదేశ్‌కు, 371 మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు, 371సీ మణిపూర్‌కు, 371డీ, ఈలు ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు, 371ఎఫ్ సిక్కింకు, 371జీ మిజోరాంకు, 371ఐ గోవాకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నాయి. అయితే ఈ ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయా? పోతాయా? అనే చర్చ ఇపుడు జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కారనే విషయమై ఆందోళనలు కొనసాగిన సమయంలో ఆర్టికల్ 371 డీ ద్వారా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, ఉపాధి విషయాల్లో సమానత్వాన్ని పాటించేందుకు ఆర్టికల్ 371డీ ద్వారా జోన్లను ఏర్పాటు చేశారు. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు విద్యారంగంలో అవకాశాలను కల్పిచేందుకు ఆర్టికల్ 371 డీ పనిచేస్తోంది. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 95 ద్వారా ఈ ఆర్టికల్‌ను అలాగే కొనసాగించారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా దేశవ్యాప్తంగా 371 డీపై కూడా చర్చ జరుగుతోంది. ఆర్టికల్ 370 రద్దు డిమాండ్ ఈనాటిది కాదని, తానెపుడూ దానికి వ్యతిరేకంగానే ఉన్నానని , 370 రద్దుకు తాను విద్యార్థి దశ నుండి పోరాటం చేస్తూనే ఉన్నానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
సుప్రీంలోనూ చుక్కెదురు
జమ్మూ కశ్మీర్‌లో ఆంక్షలను సడలించాలంటూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ అరుణ్‌మిశ్రాతో కూడిన దర్మాసనం కొంత సమయం ఇవ్వాలనే భావన వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని అన్ని రకాల ఆంక్షలను విధించారని పిటిషనర్ తెహసీన్ పూనవాల ధర్మాసనానికి తెలిపారు. దీంతో జస్టిస్ అరుణమిశ్రా అక్కడి పరిస్థితులను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకూ జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, ప్రశాంత వాతావరణానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని వేణుగోపాల్ వివరించారు. క్రమంగా ఆంక్షలు సడలించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలిపారు. 2016లో మూడు నెలల పాటు కఠిన ఆంక్షలు విధించారని, కానీ నేడు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని ధర్మాసనానికి వివరించారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన వంటి కీలక నిర్ణయాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతను కేంద్రం ఏర్పాటు చేసింది.
అంతర్జాతీయ మద్దతు..
కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమేనంటూ ఆ మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సునామీని సృష్టించింది. తాజాగా మధ్యవర్తిత్వ ఆలోచన ఏమీ లేదని ట్రంప్ చెప్పడం ద్వారా భారత్ వత్తిడి ఎంత మేరకు పనిచేసిందో ఇట్టే అర్థం అవుతోంది. జమ్మూ కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం కోసం తాను చేసిన ప్రతిపాదన భారత్, పాకిస్తాన్‌ల అంగీకారంపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ గతంలో చెప్పారు. రెండు దేశాలూ ఒప్పుకుంటే మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కూడా పేర్కొన్నారు. అయితే అందుకు భారత్ నిరాకరించడంతో మధ్యవర్తిత్వం ‘ఆఫర్’ ఇంకెపుడూ చర్చకు రాదని ఆయన చెప్పారు. కశ్మీర్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేయకూడదనేది అమెరికా దశాబ్దాల నాటి విధానం. అయితే ఈ సమస్యను భారత్, పాక్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంలో మాత్రమే రెండు దేశాలనూ ప్రోత్సహిస్తున్నట్టు అమెరికా సర్దిచెప్పుకుంది.
దిగివచ్చిన పాక్
కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ సైతం పరోక్షంగా అంగీకరించారు. అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ప్రజల మద్దతుపై అసహనం వ్యక్తం చేశారు. కశ్మీర్ గురించి భారత్‌పై పాక్ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సిద్ధంగా లేదని కూడా ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ అంశాన్ని ఉపయోగించుకుని భావోద్వేగాలను రెచ్చగొట్టడం, అభ్యంతరాలను వ్యక్తం చేయడం చాలా తేలికైన పని. ఈ విషయంలో ముందుకు సాగడం చాలా కష్టం. ఐక్యరాజ్యసమితి పాకిస్తాన్‌ను పూలమాలలతో స్వాగతించడానికి సిద్ధంగా లేదు, శాశ్వత సభ్య దేశాల్లో ఎవరైనా తమకు అడ్డం పడొచ్చునని ఖురేషీ వ్యాఖ్యానించారు. ప్రజలు వివేకంతో ఆలోచించాలని హితవు పలికారు. కశ్మీర్‌పై భారత్ తీసుకున్న నిర్ణయానికి రష్యా మద్దతుగా నిలిచింది, మరో పక్క మధ్య ప్రాచ్య దేశాలు, చైనా సైతం పాక్‌కు మొండి చేయి చూపాయి. గతంలో చైనాలో పర్యటించిన ఖురేషీ మాట్లాడుతూ, కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో చైనా అండగా నిలువనుందని చెప్పారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాత్రం కశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్భాగమని స్పష్టం చేశారు. మొత్తం మీద పాక్‌కు అంతర్జాతీయ సమాజం నుండి స్పందన కొరవడటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
*
-బీవీ ప్రసాద్ 98499 98090
*
‘ఇస్లాం ఆక్రమణ’ పెను సవాల్..
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక స్వయంకృతాపరాధాన్ని పరిష్కరించడానికి ఈ నెల 5న గొప్ప సాహసం జరిగింది.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కట్టబెడుతూ రాజ్యాంగంలో చేర్చిన 370వ అధికరణాన్ని రద్దు చేయడానికి 70 ఏళ్లు పట్టింది.. ‘తాత్కాలికం’ అంటూ పొందుపరచిన ఈ అధికరణాన్ని ఇపుడు రద్దు చేయడంతో అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట పెరిగింది. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని పాక్, చైనా సహా ఇతర దేశాలు ఇక అంగీకరించక తప్పదు. మోదీ ప్రభుత్వం 370వ అధికరణాన్ని రద్దు చేయడం కాంగ్రెస్ పార్టీకి శరాఘాతం లాంటింది. 370వ అధికరణం రద్దును వ్యతిరేకించడంతో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతి బయటపడింది. పాకిస్తాన్‌కు దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. కొద్దిమంది ఉదారవాద మేధావులు మినహా అందరూ ఈ నిర్ణయాన్ని సమర్థించారు. 370వ అధికరణాన్ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం వల్ల కశ్మీర్ లోయలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. ఘర్షణలు, వ్యతిరేక ప్రదర్శనలు జరగవచ్చు. కొద్దిపాటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగవచ్చు. ఈ పరిణామాలను అదుపుచేసే శక్తి భారత్‌కు ఉంది. అంతర్గత శత్రువులను అణచివేస్తూనే కశ్మీర్‌ను ప్రగతి పథంలో తిరుగులేని శక్తిగా రూపొందించడానికి తగిన కార్యాచరణను అమలు చేయాలి. ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ కశ్మీర్‌కు రాజ్యాంగ భద్రత, చట్టబద్ధమైన భద్రత ఏర్పడవచ్చు. కానీ అక్కడ ‘ఇస్లాం ఆక్రమణ’ అనే పెను సవాల్‌ను భారత్ అధిగమించాల్సి ఉంది. ‘ఇస్లాం ఆక్రమణ’ అనేది భారత్‌కే కాదు, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అనేక మార్గాల్లో తాండవిస్తున్న ఈ సమస్యను ప్రపంచ దేశాలన్నీ తుదముట్టించాలి. కశ్మీర్‌లో శాంతి కోసం చేసే ప్రయత్నాల్లో అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలి. దానికి తగ్గట్టు రాజ్యశక్తి, సామాజిక శక్తి దేశంలో నిర్మాణం కావాలి. అదే శాశ్వత పరిష్కార మార్గం.
-రాంపల్లి మల్లికార్జునరావు (సామాజిక కార్యకర్త)
*
పాక్‌కు చెంపపెట్టు
దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాజకీయాలకు, ఎన్నికలకు పరిమితమైంది. కానీ బీజేపీ పూర్వరూపంలోనూ దేశభక్తే ప్రాతిపదికగా ఎదుగుతూ వచ్చింది. అప్పటి పరిస్థితులతో పోల్చితే- నేడు ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. దేశం కోసం, గౌరవప్రదమైన జీవితం కోసం ఆలోచిస్తున్నారు. తమ ప్రాంత అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమల కోసం ఆరాటపడుతున్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో కుటుంబ పాలన కొనసాగినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే కొంతకాలం కొనసాగింది. ఆర్టికల్ 370ను నెహ్రూ ఆనాడు దేశ భద్రతను పణంగా పెట్టి షేక్ అబ్దుల్లాకు కానుకగా ఇచ్చారు. దాంతో జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు అంటరానివిగా మారాయి. రెండు పౌరసత్వాలు దక్కినా, వాస్తవానికి జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రాలేదు. ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం వచ్చాయి. త్రివర్ణ పతాకాన్ని అవమానించినా నేరం కాదనే పరిస్థితి వచ్చేసింది. చట్టాలు, సుప్రీం కోర్టు తీర్పులు సైతం అక్కడ వర్తించవు. పాక్ యువకుడికి ఉన్న హక్కు మిగిలిన వారికి లేకుండా పోయింది. పాకిస్తాన్ యువకుడు కశ్మీరీ యువతిని పెళ్లి చేసుకుంటే అతనికి పౌరసత్వం, ఆస్తి హక్కులు ఉంటాయి. అక్కడ ‘కాగ్’ పనిచేయదు, ఆర్టీఐ వర్తించదు, పంచాయతీలకు అధికారాలు లేవు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు లేవు. 370 ఆర్టికల్‌ను ఆనాడు అంబేద్కర్ వ్యతిరేకించారు. పాక్ వేర్పాటు వాదుల మద్దతుతో కొంతమంది కశ్మీర్‌ను నరకానికి ప్రతిరూపంగా మార్చారు. అక్కడ అసెంబ్లీకి ఆరేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఇంత జరుగుతున్నా కాశ్మీరీ పండిట్లు ఏమీ సమాధానం చెప్పడం లేదు. పునర్విభజన అంశం చర్చకే రావడం లేదు. జమ్మూలో అధిక జనాభా ఉన్నప్పటికీ- అసెంబ్లీ సీట్లు మాత్రం పెరగలేదెందుకు? ఎన్నో దేశాల నుండి ముస్లిం కాందిశీకులను మన దేశం స్వీకరించింది. మన దేశానికి వచ్చిన హిందువులు లేరు. మన దేశం నుండి వేరొక దేశానికి వలస వెళ్లిన హిందువులు లేరు. విద్యా హక్కు చట్టం కూడా కశ్మీర్‌లో అమలులో లేదు. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుండి వచ్చిన ప్రతి ఒక్కరికీ సంపూర్ణ హక్కులు వచ్చాయి. కశ్మీర్‌లో నేటికీ కనీస వేతన చట్టం అమలులో లేదు. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, చిదంబరం వంటి వారు ఇస్తున్న ప్రకటనలు సమంజసంగా లేవు. మణిశంకర్ అయ్యర్ వంటి వారు సొంత దేశం కంటే పొరుగుదేశాలపైనే ప్రేమ చూపుతున్నారు. 2013లో పాక్ సైనికులు మన దేశ భూభాగంలోకి వచ్చి సైనికుడి తలనరికి వెళ్లినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో ఏదో జరుగుతుందని, ఉగ్రవాదం పెచ్చుమీరుతుందని ఆశించిన కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. దేశ సమగ్రత కోసం రాజకీయ పరిధి దాటే ధైర్యం కావాలంటూ వాజపేయి ఆనాడు భారత్ తరఫున జెనీవా సదస్సులో మాట్లాడుతూ చెప్పిన మాటను నేడు మోదీ ప్రభుత్వం అనుసరించింది. ఆజాద్ కశ్మీర్‌లోని కొంత భాగాన్ని ఆనాడు చైనాకు అప్పగించినా, కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేకపోయింది. 370 ఆర్టికల్ రద్దును వ్యతిరేకించే వారిని దేశం అసహ్యించుకుంటోంది. 370 ఆర్టికల్ ఉన్నంత వరకూ కశ్మీరీ యువత భారత్‌లో కలవలేదని జియా ఉల్ హక్ చెప్పిన మాటలను మనం గుర్తుచేసుకోవాలి. కశ్మీర్‌ను- 370 ఆర్టికల్ రద్దు ద్వారా జనజీవన స్రవంతిలోకి చట్టపరంగా తీసుకొచ్చారు. 75 సంవత్సరాల రావణకాష్టానికి ముగింపు దొరికింది. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి తలుపుతట్టినా పాక్‌కు ఎదురుదెబ్బ, భారత్‌కు విజయం ఖాయం. 370 రద్దుతో శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరుతుంది.
-ఎన్.ఇంద్రసేనారెడ్డి (భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు)
*
అభివృద్ధికి అంకురార్పణ
ఆర్టికల్ 370ని తాత్కాలిక ఏర్పాటుగా అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేయమని కోరితే భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ నిరాకరించారు. దాంతో గోపాలస్వామి అయ్యంగార్‌తో ఆ పని చేయించారు. భారీగా నిధులను ఖర్చు చేస్తూ, దేశ సరిహద్దులను కాపాడడం ఏమిటని అంబేద్కర్ ప్రశ్నించారు. డ్రాఫ్ట్‌లోనే ‘తాత్కాలికం’ అనే మాట వాడారు. 70 ఏళ్లు దాటినా అది ‘తాత్కాలికం’గానే ఉండిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈనాడు యూ టర్న్ తీసుకుంది. అంటే దేశ ప్రజలతో, వారి మనోభావాలతో ఎంతగా కటాఫ్ అయిపోయారో తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే వ్యతిరేకించినా ఆ పార్టీ నేతలు ‘370 రద్దు’ను అర్థం చేసుకోకపోవడం విచిత్రం. ఒక్క శాతం మంది కూడా దీన్ని వ్యతిరేకించడం లేదు, కానీ 99 శాతం మంది సమర్ధిస్తున్నారని మరిచిపోరాదు. దేశ వ్యతిరేక శక్తులు, విదేశీ శక్తులతో చేతులు కలిపిన వారు మాత్రమే 370 రద్దును వ్యతిరేకిస్తున్నారు. 370 రద్దుతో దేశంలోని పలుప్రాంతాల్లోని వారు కూడా కశ్మీర్‌కు వెళ్లి స్థిరపడి వ్యాపారాలు చేసుకునే వీలుకలుగుతుంది. అక్కడి ప్రజలతో మమేకం అయ్యే పరిస్థితి ఉంటుంది. తాము భారత్‌లో భాగమే అని కశ్మీరీ ప్రజలు భావించే పరిస్థితి తీసుకురావాలి. కశ్మీర్‌కు ఎవరైనా వెళ్తే ఇండియన్స్ అంటారు. అక్కడి ప్రజలకు ఏదో మేలు చేస్తున్నామని చెప్పి కొన్ని పార్టీలు చేస్తున్న హైరానా వల్ల వారికి తీరని అన్యాయం జరుగుతుందని గుర్తించాలి. ఆ ప్రాంతాన్ని ఈ రోజు సరిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నించడాన్ని హర్షించాలి. ఏ ప్రత్యేక నిబంధనలైనా ఎక్కువకాలం కొనసాగడం వల్ల నష్టమే జరుగుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని నిబంధనలను తెచ్చినా, వాటిని పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత తొలగించాల్సిందే. తీవ్రవాదం పెరగడంతో కశ్మీర్‌లో 370 తొలగించడం మంచిదని కరణ్‌సింగ్ సైతం చెప్పిన విషయం మనం మరువరాదు. మిగిలిన పార్టీలు వితండవాదం చేస్తున్నారని అంతా అర్థం చేసుకుంటున్నారు. ఇకపై కశ్మీర్ ప్రజల భవిష్యత్ బ్రహ్మాండంగా ఉండబోతోంది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి బీజం పడింది. పరిశ్రమలు వస్తున్నాయి, నిరుద్యోగ సమస్య తీరబోతోంది. కేంద్రం ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది.
-సుధీష్ రాంభొట్ల (భాజపా అధికార ప్రతినిధి)