ఈ వారం స్పెషల్

రుతురాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరీడు చల్లబడ్డాడు.
భగభగలు తగ్గుముఖం పట్టాయి. సాహసం చేసిన
కరిమబ్బులు ఆకాశంలో తచ్చాడటం మొదలైంది. ఇక
వానదేవుడి కరుణతో
నీటిచుక్కలు కురిసే సమయం వచ్చేసింది. ఈ వాన చినుకుకోసం దేశం యావత్తూ ఎదురుచూస్తోంది. జనమే కాదు
ప్రభుత్వానిదీ అదే చూపు. ఎందుకంటే ప్రపంచంలో
మరే దేశంలోనూ లేనంతగా మన ఆర్థిక, సామాజిక
వ్యవస్థలను ప్రభావితం చేసేది ఈ వానలే. వీటిని
మోసుకొచ్చేది రుతుపవనాలే.
మనిషి అత్యాశవల్ల, వారి నిర్లక్ష్యంవల్ల భూతాపం పెరిగి రుతురాగం శ్రుతితప్పుతోంది. వానలపై అంచనాలు తరచూ తప్పుతున్నాయి కానీ.. మన
జనజీవన స్రవంతిలో
ఆనందాన్నైనా, కష్టాలనైనా మోసుకొచ్చేవి అవే. ఇది ఈనాటి భావన మాత్రమే కాదు.. అనుభవం అంతకన్నా కాదు... ఓ విశ్వాసం. అదే
ప్రాణికోటికి జీవనాధారం.

మన దేశంలో ఏడాదిని ఆరు రుతువులుగా విభజించారు. వాతావరణంలో మార్పుల ఆధారంగా వాటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వర్షరుతువును ‘రుతుపవనాలు-మాన్‌సూన్’గా చెప్పుకోవచ్చు. నిజానికి మాన్‌సూన్ అనేది ఓ సీజన్ మాత్రమే. ఖచ్చితంగా వర్షాలను మోసుకొస్తుందన్న భరోసా ఏమీ లేదు. అయితే అప్పుడప్పుడు మినహా వేలాది సంవత్సరాలుగా రుతుపవనాలు మనల్ని చల్లగానే చూస్తున్నాయి. అందుకే దేశం యావత్తు ఆ రతుపవనాల కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది.. ఆర్తితో..
ఎదురుచూపు ఎందుకు?
గ్రీష్మరుతువులో ఎండలతో తల్లడిల్లిపోవడం మామూలే. మనమే కాదు, జంతువులు, వృక్షసంపద, జీవకోటి అంతా కళాకాంతులు కోల్పోయి ఉంటాయి. మనదేశానికి సంబంధించినంతవరకు వ్యవసాయమే కీలకం. భారత ఆర్థిక వ్యవస్థలో 85 శాతం వాటా ఆ రంగానిదే. అందుకే అటు రైతులు, ఇటు ప్రభుత్వం రుతుపవనాల రాకపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటాయి. వర్షపాతం ఏ మేరకు ఉంటుందో, వ్యవసాయ దిగుబడులు, వాటి ప్రభావం ఎలా ఉంటుందో అంచనాకొస్తాయి. మనదేశంలో సగానికిపైగా ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు వానలతో నీటి అవసరాలు తీరిస్తే మిగతా భాగానికి ఈశాన్య రుతుపవనాలు ఆ పని చేస్తాయి. ఏడాదిలో ఈ సీజన్ నాలుగునెలలే అయినా ప్రభుత్వం, రైతులు మరో రెండు నెలలపాటు వీటి రాకపోక, లాభనష్టాలపై కసరత్తు చేస్తూనే ఉంటారు. ఎండిన మాను, చెట్టూపుట్టా, చెలమలు చెరువులు కళకళలాడాలంటే రుతుపవనాలు మోసుకొచ్చే చినుకులే ఆధారం.
రుతుపవనాలంటే...?
వేడెక్కిన ప్రాంతాన్ని చల్లబరిచేందుకు, అక్కడి వాతావరణాన్ని సమతులం చేయడానికి సముద్ర ఉపరితలంపైనుంచి చల్లటి గాలులు గణనీయమైన వేగంతో చొచ్చుకురావడంతో మేఘాలు ఏర్పడి వేడెక్కిన ప్రాంతంలో వర్షాలు కురవడాన్ని రుతుపవనంగా చెప్పుకోవచ్చు. లేదా హిమాలయాల్లాంటి చల్లటి ప్రాంతం నుంచి వేడిగా ఉన్న సముద్రభాగంవైపు గాలులు వీచి మేఘాలు ఏర్పడి వానలు కురియడాన్ని కూడా రుతుపవనాల ప్రభావంగా చెప్పుకోవచ్చు. మొత్తంమీద గాలుల దిశ మార్చుకుని వీయడాన్ని రుతుపవనంగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఇలా రుతుపవనాల కారణంగా వర్షాలు కురిసి ఆయా ప్రాంతాలు సస్యశ్యామలం కావడం ముఖ్యంగా మూడు ప్రాంతాల్లో జరుగుతుంది. పశ్చిమ ఆఫ్రికా, ఆసియా-ఆస్ట్రేలియన్, నార్త్-సౌత్ అమెరికాలోని ఒకటీఅరా ప్రాంతాల్లో మాత్రమే రుతుపవనాలు వస్తాయి. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే ఇవి ఏర్పడతాయి.
వీటన్నింటిలో నాటకీయ, అతి ప్రభావ, అతి దీర్ఘకాల ప్రభావం చూపే రుతుపవనాలుగా ‘ఇండియన్ మాన్‌సూన్’కు పేరుంది. ప్రపంచంలో దీనంతటి ఘనమైన, కీలకమైన, స్థిరమైన, ప్రభావవంతమైన ‘మాన్‌సూన్’ సీజన్ మరొకటి లేదు. వేలాది సంవత్సరాల నుంచి ఈ ప్రత్యేకత భారత్‌కు ఉన్నప్పటికీ 1886 నుంచి ఈ రుతుపవనాలకు సంబంధించిన రికార్డులు నమోదయ్యాయి.
అప్పటినుంచి 2001 మధ్య కాలంలో 24 సార్లు (అప్పుడు కరవు విలయతాండవం చేసింది) మినహా రుతుపవనాల క్రమం తప్పలేదు. కాకపోతే దాని ప్రభావంలో ఎక్కువతక్కువలు మాత్రం సంభవించాయి. భారత్‌లో వచ్చే రుతుపవనాల్లో నైరుతి రుతుపవనాలు జూన్-సెప్టెంబర్‌ల మధ్య వీస్తాయి. వీటిరాక ఒకటిరెండు రోజులు ఆలస్యమైనా దేశ వ్యవసాయ, ఆర్థిక, ఆహార రంగాలపై విపరీత ప్రభావం పడుతుంది. సమృద్ధిగా వర్షాలు కురిస్తే వ్యవసాయ, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక రంగాలకు కొత్తకళ, శక్తి లభిస్తాయి. అందుకే ప్రపంచంలో మరే ప్రాంతం, దేశంలో పెద్దగా ప్రాముఖ్య, ప్రభావం చూపని రుతుపవనాలు మనదేశంలో మాత్రం ఊపిరులూదుతాయి. అందుకే వీటికోసం దేశం యావత్తూ ఎదురుచూస్తుంది.
రెండు రకాలుగా..
ఎండాకాలంలో మనదేశంలో భూవాతావరణం బాగా వేడెక్కిపోతుంది. తేమ తగ్గిపోతుంది. అదే సమయంలో అటు హిందూ మహాసముద్రం, ఇటు బంగాళాఖాతం ఉపరితలం భూవాతావరణంతో పోలిస్తే చల్ల ఉంటుంది. ఈ తేడాను సరిచేయడానికి, వేడెక్కిన భూవాతావరణాన్ని చల్లబరచడానికి సముద్రతలంపై నుంచి చల్లటి గాలులు వేగంగా అటు పయనిస్తాయి. ఈ ప్రయాణంలో మట్టి, ధూళి, తేమతో కూడిన మేఘాలు ఆవృతమై నల్లటి మబ్బులుగా మారతాయి. ఆకాశంలో గుమిగూడిన ఈ మేఘావృతమైన గాలులు హిమాలయాల దిశగా పయనిస్తాయి. అయితే దక్షిణాసియావైపు ఆ గాలులు వెళ్లకుండా అవి అడ్డుగోడగా ఉండటంతో చల్లబడి వర్షాలు కురుస్తాయి. హిందుమహాసముద్రం వైపు నుంచి వీచే గాలులవల్ల కొన్ని ప్రాంతాల్లోను (కేరళ, పశ్చిమ కనుమలు, లక్ష్మద్వీప్, కర్నాటక), బంగాళాఖాతం మీదుగా వచ్చే గాలులవల్ల మరికొన్ని ప్రాంతాల్లోను రుతుపవనాలు ప్రవేశించి దక్షిణ ప్రాంతం మీదుగా ఉత్తరాదికి నెమ్మదిగా కదలివెళుతూ వర్షాన్నిస్తాయి. వీటిని నైరుతి రుతుపవనాలనికదా పిలుస్తాం. వీటివల్ల దేశ అవసరాల్లో 60 శాతం వర్షపాతం లభిస్తుంది. ఇక సూర్యుడి ప్రతాపం తగ్గిన తరువాత నైరుతి పవనాలు దిశ మార్చుకుని వెనక్కుమళ్లుతాయి. సూర్యుడి ప్రతాపం తగ్గిన తరువాత నేల త్వరగా చల్లబడిపోతుంది. కానీ సముద్రతలంపై ఉన్న వాతావరణం వేడిగానే ఉంటుంది. అక్కడ తేమశాతం తగ్గిపోతుంది. అందువల్ల ఆ ప్రాంతాన్ని చల్లబరచడానికి ఈశాన్యం నుంచి గాలులు బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాల మీదుగా వీస్తాయి. ఈ సమయంలో ఆంధ్ర, తమిళనాడు సహా తీరప్రాంత రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. దాదాపు దేశ అవసరాల్లో 40 శాతం వర్షపాతాన్ని ఈ రుతుపవనాలు అందిస్తాయి. అక్టోబర్-డిసెంబర్‌ల మధ్య ఈ సీజన్ ఉంటుంది. మొత్తం మీద జూన్ నుంచి డిసెంబర్ వరకు దేశంలో రుతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయి. వీటి రాకపోకలో తేడా వస్తే పెనుప్రభావమే ఉంటుంది. నైరుతి రుతుపవనాలు క్రియాశీలం కావడానికి థార్ ఎడారి కీలక పాత్ర పోషిస్తే, ఈశాన్య రుతుపవనాల్లో కదలికకు హిమాలయాలు కారణమవుతాయి. మనదేశంలో సంభవించే రుతుపవనాలు ఎంత తీవ్రంగా ఉంటాయో పాశ్చాత్య సమాజం ఓ నానుడితో ఉదహరిస్తుంది. భారత్‌లో రుతుపవన వర్షాలు కురిసినపుడు ఎలుకలు సురక్షిత ప్రదేశానికి వెళ్లేందుకు కప్పల వీపులపై ఎక్కి నీటిలో ప్రయాణిస్తాయని వారు చెబుతూంటారు. అంటే ఆ వర్షాలవల్ల వరదలు ముంచెత్తుతాయన్నది పరోక్షంగా చెప్పడమన్నమాట. వారి మాటలో నిజం కూడా ఉంది. ఉధృతంగా, తెరపిలేకుండా కురిసే వర్షాలు దీర్ఘకాలంలో ఎంత మేలు జరుగుతుందో తాత్కాలికంగా జనజీవన స్రవంతిని అతలాకుతలం చేస్తాయి. భారతదేశంలో కేవలం ఉరుములు, మెరుపుల కారణంగా రుతుపవనాల సీజన్‌లో 1500మంది ప్రాణాలు కోల్పోతూంటారు. ఇతర ప్రమాదాల లెక్క వేరు. అయితే రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, చెరువులు జలకళతో ఉట్టిపడి మిగతా సీజన్ అవసరాలు తీరుస్తాయి. ఎలా చూసినా భారత జనజీవన స్రవంతికి ఈ రుతుపవనాలు ప్రాణప్రదం.

చిటపట చినుకులు పడుతూ వుంటే...
రుతుపవనాలు మోసుకొచ్చే వర్షాలు భారతీయ జనజీవన స్రవంతిలో ముఖ్య భాగం. మన సంస్కృతిలో, చదువుసంధ్యల్లో, మాటలో, పాటలో, చేతలో, సామెతలో, విశ్వాసంలో, ఆధ్యాతికతలోనూ వానకు చోటుంది. నిజానికి నీటినిచ్చే వరుణుడినే కదా మనం వానదేవుడనీ అంటాం. మాంచి ఎండలు కాస్తున్నప్పుడు చిన్న చినుకుపడినా చాలు మనసు తేలికైపోతుంది. ఆ చినుకుతో చిందిన మట్టివాసన ముందు మసాలా ఘుమఘమలు బలాదూరే. తొలకరి వానను ఆహ్వానించడం, ఆ జల్లుల్లో తడిసిముద్దవడం ఒకనాటి మురిపెం. జలుబు, రొంప వేధిస్తాయని తెలిసినా అలా తడుస్తూ ఆడటంలో ఉండే మజా ఆ భయాన్ని దరిచేరనివ్వదు. వద్దువద్దని వారించినా వినేవారే ఉండరు. మరీ ఎక్కువసేపు తడిస్తే వీపుపై చరచి, ఇంట్లోకి లాక్కొచ్చి తరువాత తువ్వాలుతో తడి అద్దుతూ ముద్దాడటంతో మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించే కమనీయ దృశ్యం. వానలో పశుసంపద చిక్కుకుపోకుండా తాము తడుస్తూ వాటిని కొట్టాల్లోకి నెట్టుకురావడం గ్రామీణ భారతంలో కనిపించే అందమైన దృశ్యం. ఉధృతమైన గాలీవాన వీచినప్పుడు పిడుగులు పడితే ఆ శబ్దానికి పిడుగుల్లాంటి గడుగ్గాయిలు భయపడకుండా ‘అర్జునా, కిరీటీ, సవ్యసాచి’ అంటూ ప్రార్థన అందుకోవడం ఒకనాటి అలవాటు. కరిమబ్బులు నిండిన ఆకాశాన్ని చూస్తూ గబగబా ఇంటికి చేరుకోవాలని ఉరకలెత్తడంలో ఉన్న గాభరా ఒక జాగ్రత్తే కదా. పూరిళ్ల రోజులున్నప్పుడు చూరుకింద పడే సన్నని నీటిధారల్లో లయ తన్మయత్వాన్ని కురిపిస్తుంది. అక్కడే చేరిన నీటిలో ఇలా ఏర్పడి అలా ఠప్పున పేలిపోయే బుడగలను లెక్కపెట్టడం ఒక్కప్పటి సరదా. జీవితాన్ని బుద్బుద (నీటిబుడగ)గా చెప్పడంలో ఇమిడిన తత్వం.. ఓ జీవనసత్యం. నెమ్మదిగా ప్రవహించే వాన నీటిలో కాగితం పడవలను వేయడం, అవి వెళుతూంటే చిన్నారుల మోము వెలిగిపోవడం, అవి తడిసిపోయినప్పుడు వారు బుంగమూతి పెట్టడం ఓ అందమైన దృశ్యం. ఈ రోజుల్లో చూర్లూ లేవు... ముసుర్లూ లేవు.. ఆ సరదాలూ లేవు. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ అని పాడేందుకు అప్పటిలా వర్షాలూ లేవు. ఇష్టాలూ లేవు. ఇప్పుడు మిగిలింది ‘చిటపటలే’. మబ్బుకమ్మిన వేళ.. చల్లటిగాలులు వీస్తూంటే... కణకణలాడే బొగ్గుల కుంపటిపై కాల్చితెచ్చిన మొక్కజొన్న కండెలోని వేడిగింజలకు ఉప్పూకారం, నిమ్మరసం అద్దుకుని తింటూంటే వచ్చే కమ్మని ఆనందం వానతోపాటే వస్తుందికానీ మామూలు రోజుల్లో దానివంక చూసేదెవడు కనుక. ఆ రోజుల్లో సౌకర్యాలు తక్కువ అని, వర్షాలవల్ల చదువులు దెబ్బతింటాయని ఆవేదనను వ్యక్తం చేసేందుకు ‘వానాకాలం చదువులు’గా చెప్పుకోవడం ఒకప్పటి అలవాటు. ఇప్పుడు ఆ భయం లేదు. వదలని వర్షంలో బయటకు వెళ్లకతప్పకపోతే గొడుగు వేసుకుని యువజంట వెళ్తూంటే వారిమధ్య పెనవేసుకునే మమతానురాగం వానదేవుడు కురిపించినదేగా. గొడుగున్నా నీటిచుక్కలు పిల్లాడిమీద పడకుండా కొంగుచాటువేసి చకచకా అడుగులువేసే తల్లిప్రేమ వెల్లడయ్యేది చినుకుపడ్డప్పుడేకదా!. ఏ సౌకర్యాలూ లేని రోజుల్లో, ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రాని రోజుల్లో ఎదురైన అనుభవాలు కష్టమైనా ఇష్టంగా భరించింది ఈలోకం. కానీ ఈ ఆధునిక యుగంలో మనం తెచ్చిపెట్టుకున్న కష్టాలవల్ల వాన చిన్నచూపుచూసి అందమైన అనుభవాలను దూరం చేసింది. నల్లమబ్బులు తగ్గిపోవడం, శ్రావణ సంధ్య చిన్నబోవడం మన పాపఫలితమేకదా. ఒక్క వర్షాకాలమనే కాదు అన్ని రుతువులు శ్రుతి తప్పడానికి మనమే కారణం. వర్షాధార భారతంలో శ్రుతితప్పిన వర్షరుతువు ఎక్కువ కష్టాలకు కారణమవుతోందంతే. ‘వస్తానంటే వద్దంటానా’ అంటూ పాడటంలోనూ, వస్తే తడవటంలోనూ మనం మజా చేయాలంటే భూమి చల్లగా ఉండాలి. అలా ఉండాలంటే మనం మొక్కలు పెంచి ప్రకృతిని ప్రేమించాలి. అప్పుడే నాలుగు చినుకులు రాలి మన ఆశలు చిగురించి ఫలాన్నిస్తాయి. లేదంటే రుతురాగం శ్రుతి తప్పినట్లే.

ఇవీ విశేషాలు!
* భారతదేశంలో 65 శాతం వ్యవసాయం పూర్తిగా వర్షాధారం. అందులో 33 శాతం నైరుతి రుతుపవనాలే అందిస్తాయి.
* మాన్‌సూన్ అన్న ఆంగ్లపదం ‘మాసిమ్’ అన్న అరబిక్ పదం నుంచి పుట్టింది. బ్రిటిష్ ఇండియా హయాంలో 1886లో తొలిసారిగా ‘మాన్‌సూన్’ పదం వాడారు. తొలి మాన్‌సూన్ రాకను జూన్ 4, 1886న ప్రభుత్వం అధికారికంగా నమోదు చేసింది.
* అప్పటినుంచి 24సార్లు కరవు, 94సార్లు సాధారణ వర్షపాతం, మిగతా సందర్భాలలో అతివృష్టి సంభవించాయి. 1886కు ముందు పంచాంగాలే ఆధారమయ్యాయి. 2002, 2004లో రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ అంచనాలు తప్పయ్యాయి. ఇప్పటికీ భారతదేశంలో చాలామంది వర్షాలపై పంచాంగాలను విశ్వసిస్తూనే ఉన్నారు.
* భారత జిడిపిలో 14 శాతం వ్యవసాయమే అందిస్తోంది. ఈ రంగానికి రుతుపవనాలే కీలకం. అందుకే రుతుపవనాలను ‘అసలు ఆర్థికమంత్రి’గా భావిస్తారు. రుతుపవనాలు సమయానికి రాకపోయినా, తక్కువగా వర్షాలు నమోదైనా వ్యవసాయ, ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక రంగాలు తారుమారై జనజీవనస్రవంతి కష్టాల్లో చిక్కుకుంటుంది. దిగుబడులు తగ్గి ధరలు పెరుగుతాయి. ఉపాధి, ఉద్యోగాల కల్పన కష్టమవుతుంది.
* రుతుపవనాల వల్ల కురిసే వర్షాలు రెండుమూడు రోజుల కురిసిన తరువాత ఒకటి రెండు రోజులు ఆగి కురుస్తాయి. అంతా వాతావరణ పరిస్థితుల మహిమే. ఈ గ్యాప్‌లోనే రైతులు పనులు చక్కబెట్టుకుంటారు. సాధారణ ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారు.
* ఈ సీజన్‌లో ఏటా 5 లక్షల పిడుగులు పడుతూంటాయి. కనీసం 1700మందికి పైగా పిడుగుల వల్లే మరణిస్తూంటారు.
* భారతదేశ జనాభాలో 85 శాతంమంది జీవనస్థితిగతులను ఈ రుతుపవనాలు నిర్దేశిస్తాయి.
* ఈ సీజన్‌లో వర్షాల ఆధారంగా భారత్‌లో 25వేల కోట్ల వ్యాపారం సాగుతుందంటే నమ్మాలి.
*

అక్కడ వద్దంటే వర్షం

రుతువులతో సంబంధం లేదు... రుతుపవనాల కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు... వర్షించే మేఘం కోసం దిక్కులు చూడాల్సిన అవసరమూ లేదు... ఎందుకంటే అక్కడ వద్దన్నా వర్షం కురుస్తుంది. విసుగూ విరామం లేకుండా పడుతూనే ఉంటుంది. అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతాలుగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఓ రెండు గ్రామాలు మేఘాలయలో ఉండటం విశేషం. అవి మాసున్మ్,్ర చిరపుంజి గ్రామాలు. సూర్యుడి ప్రభావం ఇక్కడ అంతంతమాత్రం. కొన్నిచోట్ల వర్షాల కోసం పడిగాపులు పడుతుంటే, చాలా తక్కువచోట్ల వద్దంటే వర్షం పడుతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే అలా పడుతూనే ఉంటుంది. వద్దనుకున్నా అక్కడ వరుణుడు కరుణిస్తూనే ఉంటాడు. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా మేఘాలయలోని ‘మాసిన్మ్’్ర అనే గ్రామం రికార్డు సృష్టించింది. కొన్ని వివాదాలున్నా 2015లో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా గిన్నిస్ రికార్డు ప్రకటించింది. గతంలో ఈ రికార్డు చిరపుంజి పేరిట ఉంది. ఈ రెండూ మేఘాలయ రాష్ట్రంలోనివే కావడం గమనార్హం. మేఘాలయకు ‘ల్యాండ్ ఆఫ్ క్లౌడ్స్’ అని అర్థం. రుతుపవనాల ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. భారత్‌లో అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతాలుగా మహారాష్టల్రోని అంబోలి, కర్నాటకలోని అగుంబే, కేరళలోని నెరియమంగళం ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయ.

మాసిన్మ్ (మేఘాలయ)
సగటు వర్షపాతం: 11,872 మి.మీ
మాసిన్మ్.్ర. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతం. తూర్పు ఖాసి కొండ ప్రాంతంలోని ఈ గ్రామం ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.

చిరపుంజి (మేఘాలయ)
సగటు వర్షపాతం : 11,430 మి.మీ
అత్యధిక వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో చిరపుంజి ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఏడాది మొత్తం వర్షం కురిసే ఏకైక ప్రాంతం ఇదే. సెవెన్ సిస్టర్స్, నోకాలికాయ్ జలపాతాలు రుతుపవనాలు కేంద్రీకృతం కావడానికి దోహదపడుతున్నాయ.

అంబోలి (మహారాష్ట్ర)
దక్షిణ మహారాష్టల్రోని కొండ ప్రాంత గ్రామం. సహయాద్రి పర్వత శ్రేణుల్లో భాగమైన ఈ కొండ ప్రాంతం లెక్కలేనన్ని వృక్ష జంతుజాలాలకు ప్రసిద్ధి. ఎన్నో జలపాతాలకు నిలయమైన ఈ కొండ ప్రాంతం అత్యధిక వర్షపాతంతో అలరారుతుంటుంది. రుతుపవనాల కాలంలో విపరీతమైన పొగమంచు ఆవరించి వుంటుంది.
అగుంబే (కర్నాటక)
దక్షిణ భారత చిరపుంజిగా అగుంబే పేరుగాంచింది. కర్నాటకలోని పశ్చిమ కనుమల్లో అత్యధిక వర్షపాతం కురిసే గ్రామంగా ప్రసిద్ధి. అగుంబే పరిసరాల్లోని కొండలు సహజసిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారుతుంటాయ. ఔషధ మొక్కలు, జలపాతాలకు ఈ పర్వత శ్రేణులు పెట్టింది పేరు.
నెరియమంగళం (కేరళ)
కేరళ చిరపుంజిగా నెరియమంగళం ప్రసిద్ధి. పెరియార్ నది సమీపంలో ఉన్న ఈ గ్రామం ఎర్రాకులం జిల్లాలో ఉంది. పశ్చిమ కనుమల సింహద్వారంగా ఉన్న నెరియ మంగళం అత్యధిక వర్షపాతానికి నిలయం.

అది 1995 జూన్ 15, 16 తేదీలు...
ఆ రెండు రోజుల్లో చిరపుంజిలో కురిసిన వర్షం అక్షరాలా 2,493 మి.మీ. ప్రపంచ చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా చిరపుంజి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఈ రికార్డు చిరంపుజి పేరనే ఉంది.

- ఎస్.కె. రామానుజం