ఈ వారం స్పెషల్

‘కుస్తీ’ మే సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్యం ఎంతటిదైనా దాన్ని అందుకోవడం అంత తేలిక కాదు. ఆశయం ఎంత ఉన్నతమైనా దాన్ని సాధించడం ఆషామాషీ కాదు. ఒకే కుటుంబంలోని ఆరుగురు అతివలను రెజ్లింగ్‌వైపు నడిపించి, భారతదేశానికి నిరుపమాన ఖ్యాతిని తీసుకురావడమంటే ఓ తండ్రికి శక్తికి మించిన పనే. కండలు తిరిగిన గండరగండుడలదే పైచేయిగా ఉన్న రంగంలో మారుమూల గ్రామీణ యువతులు అసమాన ప్రతిభ చూపించగలరని ఊహించడం కష్టసాధ్యమే. ఏ ఆడపిల్లా అడుగుపెట్టడానికి సాహసం చేయని రెజ్లింగ్ రంగమది. ఏ తండ్రి అయనా కలలో ఊహించడానికి కూడా భయపడే పోటీ అది. సాధారణ యువకులే వెనకడుగు వేస్తున్న తరుణంలో కట్టుబాట్ల సంకెళ్లను తెంచి తన కుమార్తెలకు రెజ్లింగ్‌ను కెరీర్‌గా నిర్దేశించడం ఓ సాహసమే. తానే గురువుగా మారి, విజయపథాన నడిపించడమంటే భారత్‌లాంటి కట్టుబాట్ల దేశంలో ఊహకందని విషయమే. ‘ఆడపిల్ల’ అనే భావన తన మనసులోకి, తన కుమార్తెల మనసులోకి రానివ్వకుండా అనుక్షణం కార్యోన్ముఖుల్ని చేయడం ఏ తండ్రికైనా కష్టసాధ్యమే. అతివలు అడుగుపెట్టని రంగం లేదని దేశానికి చాటేలా ఓఆడపిల్లల తండ్రి చూపిన ధైర్యం, తెగువ, సాహసం గురించి ఎంత చెప్పినా తక్కువే. పిల్లల పసితనంలోనే వారి లక్ష్యాన్ని నిర్దేశించి ఆ దిశగా అతను చేసిన సాహసం వృథా పోలేదు, అతను చూపిన తెగువ దారితప్పలేదు, అతని నిర్ణయం ఏ దశలోనూ నీరసించిపోలేదు, అతని నమ్మకమూ వమ్ముకాలేదు. ఆ కుమార్తెలు సాధించిన విజయాలే అందుకు నిలువెత్తు ఉదాహరణ. తండ్రి ఆశయాన్ని, ఆకాంక్షని అణువణువూ అందిపుచ్చుకుని విజయ శిఖరాలకు చేరి మాతృదేశం సగర్వంగా తలెత్తుకుని నిలబడేలా చేశారు. ఉన్నతమైన ఆశయం కలిగిన తండ్రికి, మాతృదేశానికి పతకాలనే కానుకగా ఇచ్చి నీరాజనాలు అందుకున్నారు. స్ఫూర్తిదాయకంగా నిలిచారు. గెలుపు కాంక్షని నరనరాన జీర్ణించుకుని, అడుగడుగునా ఎదురైన అవమానాలను దిగమింగుకుని, కట్టుబాట్లను పతకాలతోనే ఛేదించిన ఆ ఆరుగురు కుమార్తెలకు తండ్రే గురువు, ఆయనే మార్గదర్శకుడు. శారీరక శ్రమతో అలసిపోతున్నా... నిద్ర సరిపోని రాత్రులు గడిపినా... విశ్రాంతి తీసుకునే సమయం చిక్కకపోయినా... తోటి ఆడపిల్లల్లా సరదాలకు దూరమైనా... అవేవీ వారిని అప్పుడూ, ఇప్పుడూ బాధించలేదు. ప్రత్యర్థిని మట్టికరిపించడం, విజయాన్ని అందిపుచ్చుకోవడం. అదే వారి లక్ష్యం... అదే వారి ఊపిరి! ఆ ఆరుగురే - గీత, బబిత, రీతు, సంగీత, వినీష్, ప్రియాంక. వీరిలో తొలి నలుగురు మహవీర్ కుమార్తెలు కాగా, చివరి ఇద్దరూ అతని సోదరుడి కుమార్తెలు.

చిన్నప్పుడు ఆ తెల్లవారుజామున తండ్రి ఎందుకు పరుగు తీయమన్నాడో, ఆయన ఉద్దేశం ఏమిటో తొలి పతకాన్ని అందుకున్నప్పుడు గానీ తెలిసిరాలేదు. అప్పుడు తండ్రి కోరిక వారికి నవ్వు తెప్పించినా, జోకులేసుకున్నా - దాని వెనుక ఎంత బలమైన లక్ష్యం ఉందో ఆ తర్వాత అర్థమైంది. ఆడపిల్ల అనగానే కట్టుబాట్లు విధించే తల్లిదండ్రులున్న భారతీయ సమాజంలో ఒక మహా సాహసం వైపు తమను నడిపించిన తండ్రి మహవీర్‌ను చూస్తే వారికి చెప్పలేని ఆరాధనా భావం. ఆయనే వారి గురువు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అభినవ ద్రోణాచార్యుడు. మహిళల పట్ల వివక్షకు, దురన్యాయాలకు, అణచివేతలకు కేంద్ర బిందువైన హర్యానాలోనే మహవీర్‌సింగ్ తన చిన్నారులను అనూహ్యమైన కుస్తీ రంగంలోకే అడుగుపెట్టించాడు. తానే కోచ్‌గా, వారిని అన్నివిధాలుగా తీర్చిదిద్ది ప్రతి దశలో ఎదురైన కష్టాన్నీ, నష్టాన్నీ తానూ భరించాడు. సభ్య సమాజం బెదిరింపులనూ ధిక్కరించాడు. కట్టుబాట్ల సంకెళ్లను తానే తొలగించాడు. ఒక తండ్రిగా తన బాధ్యతని, తన కుమార్తెల భవిష్యత్తునీ, కుటుంబ పరువు ప్రతిష్ఠలనీ ఫణంగా పెట్టాడు. హర్యానా ఎలక్ట్రిసిటీ బోర్డులో ప్రభుత్వ ఉద్యోగాన్నీ వదులుకున్నాడు. ఓ సాధారణ తండ్రిలా కాకుండా, ఓ మార్గదర్శకుడిలా ఆలోచించాడు. ఆ దిశగా అడుగులు వేసి విజయాలను, పేరు ప్రతిష్ఠలను సొంతం చేసుకుని జాతి గర్వించదగ్గ ఓ తండ్రిలా, ఓ శిక్షకుడిలా నిలిచాడు.

ఆ కుటుంబం ‘కుస్తీ’కే అంకితం
బలాలి... హర్యానాలోని ఓ మారుమూల కుగ్రామం. నాగరికత ఏమాత్రం సోకని ఓ పల్లె. ఈ గ్రామానికి చెందిన మహవీర్‌సింగ్‌కు కుస్తీపై మక్కువ ఎక్కువ. ఎలాగైనా ‘కుస్తీ’పై పట్టు సాధించాలని పదహారవ ఏటనే ఢిల్లీకి పయనమయ్యాడు. ఢిల్లీలోని ప్రముఖ రెజ్లర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత చాంద్గీరామ్ వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఆయన శిక్షణలో రాటుదేలిన మహవీర్ 1980 దశకంలో కుస్తీ బరిలోకి దిగి విజయకేతనం ఎగురవేశాడు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన కుస్తీ పోటీల్లో పలు పతకాలు సాధించాడు. ద్రోణాచార్య అవార్డునూ అందుకున్నాడు. రెజ్లింగ్‌లో మెలకువలతో పాటు గురువు చాంద్గీరామ్ ఆలోచనలు మహవీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కుస్తీ పోటీల్లో యువతులకు శిక్షణ ఇస్తున్న తొలి కేంద్రం చాంద్గీరామ్ అఖారా ఒకటి కావడం గమనార్హం. చాంద్గీరామ్ ఆలోచనలు, ఆయన శిక్షణలో నేర్చుకున్న మెలకువలతో మహవీర్ స్వగ్రామం చేరాడు. ఆ తర్వాత నలుగురు ఆడపిల్లలు జన్మించారు. వారు పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఓసారి చాంద్గీరామ్‌ను మహవీర్ కలిశాడు. అప్పుడు ఆయన చెప్పిన మాటలే మహవీర్‌కు శిరోధార్యమయ్యాయి. ‘నీ ఆడపిల్లల కోసం ఏం చేస్తున్నావు?... ఏదో ఒకటి చెయ్యి. ఏదో ఒకరోజు వారు నీకు ఎనలేని సంతోషాన్ని అందిస్తారు. దేనికీ భయపడకు. కుస్తీ పోటీలో ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొంటావో అంతటి ధైర్యాన్ని ప్రదర్శించు. ఎన్ని విమర్శలు వచ్చినా చెవిటివాడిలా వుండు’ అని చాంద్గీరామ్ హితబోధ చేశారు. గురువు హితబోధతో మహవీర్‌కు ఏంచేయాలో బోధపడింది.

1988నాటి శీతాకాలం ఉదయం... ఓ ఇంట్లో నిండు గర్భిణి తొలి ప్రసవం... ‘ఆడపిల్ల పుట్టింది’ అని వినగానే ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవు. చేతుల్లో గువ్వలా ఒదిగిపోయిన ఆ బిడ్డని పొదివి పట్టుకుని - ఈ పాప ఓ రోజు నా కుటుంబం గర్వపడేలా చేస్తుంది - అన్నాడు. ఆ వాక్కు బ్రహ్మవాక్కు అయింది. భారతీయ మహిళా రెజ్లింగ్‌కు వెలుగుదివ్వె అయంది. ఔరా అనుకునేలా చేసింది.
తెల్లవారుజామున కోడికూసే వేళ... గ్రామమంతా ఇంకా నిద్రట్లోనే జోగుతోంది. ఆ సమయంలో ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలు పడుకున్న గదిలోకి అడుగుపెట్టాడు. ఆదమరచి నిద్రపోతున్న వారిద్దరినీ నిద్ర లేపాడు. అప్పుడు వారి వయసు పది, ఎనిమిది. కళ్లు నులుముకుంటూ లేచి తండ్రివైపు చూశారు. ‘మీరు ఎంత బాగా పరిగెత్తుతారో చూడాలని వుంది’ అని అన్నాడు. వారిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నా, తండ్రి మాట కాదనలేదు. ఎందుకూ, ఏమిటీ - వంటి ప్రశ్నలు వేయలేదు. విసుక్కోలేదు. అప్పుడు వారికి తెలియదు - అది ‘కుస్తీ’ వైపు తొలి పరుగని... అది అంతటితో ఆగదని.. దేశానికే పతకాలు తెచ్చిపెడుతుందని.. ఎందరికో స్ఫూర్తిదాయకమవుతుందని... ప్రత్యేకతని ఆపాదిస్తుందని! ఆ పరుగుని తిలకించి, వారి ఉత్సాహాన్ని చూసి, ఎదురు ప్రశ్నించని గుణాన్ని గమనించి - ఆ తండ్రి తన ఇంటి పక్కనే ప్రత్యేకంగా అఖాఠా నిర్మించాడు. అక్కడ మొదలైన శిక్షణ అంతర్జాతీయ ఖ్యాతికి ఎదిగింది. భారత్ పేరు మారుమోగేలా చేసింది. ఆ తండ్రి పేరు మహవీర్‌సింగ్... రెజ్లింగ్‌లో ద్రోణాచార్య అవార్డు అందుకున్న మల్లయోధుడు... ఆ కుమార్తెలిద్దరూ గీతా ఫొగట్, బబితా కుమారి. భారతీయ మహిళా రెజ్లింగ్‌ను విశ్వవిఖ్యాతం చేసి కీర్తి పతాకాన్ని ఎగురవేసిన మహిళా కుస్తీ వీరులు. నారు నీరు పోసే గురువే తండ్రి అయతే... ఆ కుమార్తెలు ఎలా పొదివితే అలా ఒదిగిపోయే మనస్తత్వం కలిగినవారైతే... విజయాలకు కొదవేముంది? పతకాలకు అడ్డేముంది?

అవమానాలు... సామాజిక బహిష్కరణ
బూర్జువా మనస్తత్వానికి హర్యానా పెట్టింది పేరు. పసిగుడ్డు దశనుంచి ఆడదాన్ని గడప దాటనివ్వని కట్టుబాట్లకు పెట్టింది పేరు. అక్కడ బాలబాలికల నిష్పత్తి 1000:879. దీన్ని బట్టి అక్కడ లింగవివక్ష ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. మగపిల్లాడి సంతానం కోసం ఎంతగా తాపత్రయపడతారనేది ఈ గణాంకాలే ఓ ఉదాహరణ. ఇక మహిళల అక్షరాస్యతా శాతం 65.94. ఆడపిల్లను బడికి కూడా పంపని కట్టుబాట్లు. అలాంటి రాష్ట్రంలోని ఓ మారుమూల పల్లె బలాలి ఇందుకు మినహాయింపు కాదు. ఆడపిల్లలకు కుస్తీ పోటీల్లో శిక్షణ ఇస్తున్నాడన్న విషయం బయటకు పొక్కగానే - స్థానికులంతా విరుచుకుపడ్డారు. ‘నీ బుర్ర చెడింది. గ్రామాన్ని నాశనం చేస్తున్నావు. నీ సొంత పిల్లల్నే నీవు ప్రదర్శనకు పెడుతున్నావు. సిగ్గనిపించడం లేదా?’ అంటూ సూటిపోటి మాటలు. అవమానాలకు అంతులేదు. ‘నీ కూతుళ్లు మగరాయుళ్ల మాదిరిగా తయారవుతున్నారు. వారిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఒకవేళ చేసుకున్నా పిల్లల్ని కనలేరు’ అంటూ మహవీర్ భార్య దయాసింగ్‌ను బెదరగొట్టేవాళ్లు. ఈ మాటలకు దయా మనసులో బాధ కలిగినా ఎలాంటి ఆందోళన చెందలేదు. ‘ఆడపిల్లలు భిన్నంగా ఏది చేసినా వ్యతిరేకత వస్తుంది. వాళ్ల మాటలు వింటుంటే నాకు కోపం వచ్చినా, నా పిల్లలు ఎంచుకున్న రంగంలో చివరికంటా పోరాడాలనేదే నా కోరిక’ అని సమాధానపరుచుకునేది దయాసింగ్. గీత, బబితలకు కూడా ఈ బెడద తప్పలేదు. బిగుతైన డ్రస్ వేసుకుని వీధుల్లో ఫిట్‌నెస్ కోసం పరుగులు పెడుతుంటే తోటి ఆడపిల్లలు సైతం మాట్లాడేవారు కాదు. కనీసం తలెత్తి చూసేవారు కాదు. చివరకు మహవీర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసినంతగా గ్రామస్థులంతా కట్టుకట్టారు. అయినా మహవీర్ పట్టు వీడలేదు, ఆయన కుమార్తెలూ వెనక్కి తగ్గలేదు.
మారుమోగిన బలాలి
2010లో జరిగిన కామనె్వల్త్ గేమ్స్‌లో రెజ్లింగ్ బరిలోకి దిగిన గీతా ఫొగట్ ఏకంగా బంగారు పతకాన్ని గెలుచుకుంది. దీంతో ఒక్కసారిగా బలాలి గ్రామం పేరు మారుమోగింది. తండ్రీ కూతుళ్ల పేర్లు పతాక శీర్షికన చేరాయి. పదిరోజుల పాటు ఉత్సవాలు జరిగాయంటే ఆ విజయాన్ని ఏ స్థాయిలో ఆస్వాదించారో అర్థం చేసుకోవచ్చు. విమర్శించిన నోళ్లే ప్రశంసలు కురిపించాయి... హీనంగా చూసిన కళ్లే ఆ సంబరాల్ని ఆస్వాదించాయి. ఔరా అనుకున్నారు. ఓ ఆడపిల్ల ఇంతటి విజయాన్ని సాధించిందా? వారిలో ఇంతటి ప్రతిభా సామార్థ్యాలు ఉంటాయా? ఆడపిల్లలకు కూడా ఇంతగా పేరు ప్రతిష్ఠలు వస్తాయా? గీత సాధించిన పతకంతో దేశంలోని ఆడపిల్లల్లోనూ, వారి తల్లిదండ్రు ల్లోనూ ఉదయంచిన ప్రశ్నలివి. వీటన్నింటికి ఒకే ఒక్క సమాధానం - మహిళలకు అనితర సాధ్యమైన రెజ్లింగ్‌లో సాధించిన బంగారు పతకమే.
శిక్షణ కోసం బారులు తీరిన బాలికలు
గీత సాధించిన రెజ్లింగ్ పతకం ఓ విప్లవానికి నాంది పలికింది. బలాలివైపు, రెజ్లింగ్‌వైపు అందరి దృష్టీ పడింది. మహవీర్ శిక్షణ కోసం ఆడపిల్లల తల్లిదండ్రులు బారులు తీరారంటే ఆశ్చర్యం కలిగించక మానదు. శిక్షణ కోసం వచ్చే బాలికల సంఖ్య ఒక్కసారిగా 36కు పెరిగింది. అఖారా పక్కనే బాలికల కోసం మహవీర్ ఓ హాస్టల్‌లే నిర్మించాల్సిన స్థాయికి చేరింది. మహవీర్ సింగ్ అఖారాలో ఇప్పుడు బాలికల ప్రాతినిధ్యం పెరిగింది. చిన్నారులు సైతం కఠోర శిక్షణ పొందుతున్నారు. మట్టి కొట్టుకుపోయిన శరీరం, దుస్తులు, అలసిన ముఖాలు, అరుపులు కేకలతో ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించేందుకు బాల యోధులు ప్రతిరోజూ పోటీ పడుతూనే ఉన్నారు. హర్యానా డంగల్స్‌లో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రెజ్లింగ్ పోటీలు జరపలేదు. కానీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. యువకులతో పోటీపడేందుకు యువతులు వెనుకంజ వేయకపోవడం తాజా పరిణామం. ‘కుస్తీ’వైపు యువతీ యువకులు ఆకర్షితులు కావడం వెనుక ఫొగట్ కుటుంబం సాధించిన విజయాలే కారణమని చెప్పక తప్పదు.
ఆడపిల్ల పుట్టగానే గుండెలమీద కుంపటిలా భావించే సమాజంలో, నలుగురికి తోడు మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఓ కుటుంబంలో - అంతా ఒక మాటగా నిలిచి, ఒకే లక్ష్యంవైపు పయనించడం అరుదు. ఆధునికతవైపు యువత పరుగులు పెడుతున్నా, ఇతర క్రీడలవైపు మొగ్గు చూపుతున్నా, తమ చుట్టూ ఇతరత్రా ప్రభావాలు ఊరిస్తున్నా... సంప్రదాయ ‘కుస్తీ’ని కెరీర్‌గా ఎంచుకోవడం, దానికి తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకోవడం, విజయాలతో స్ఫూర్తిదాయకం కావడం ఎప్పటికీ చిరస్మరణీయం, మారదర్గకం. ఆడది గడపదాటడమే గగనమయ్యే విపత్కర పరిస్థితుల నుంచి ఎందరికో ఆదర్శంగా నిలిచిన అరుదైన సాహసం ఎంతో ఘనంగా విజయతీరాలకు చేరింది. ధైర్యం, పట్టుదలే జీవనంగా సాగిన సూర్తిదాయక వ్యక్తిత్వం ఎన్ని తరాలు ఆస్వాదించినా తరగని స్ఫూర్తిదాయక పరిణామం.

ఒలింపిక్ గోల్డ్ లక్ష్యం
స్వతహాగా మల్లయోధుడైన మహవీర్ లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు. భారతీయ మహిళలు అడుగుపెట్టలేని రెజ్లింగ్‌లో తన కుమార్తెలు పతకాలు సాధిస్తున్నా అతను అంతటితో సంతృప్తి చెందలేదు. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారం పతకం సాధించిపెట్టినప్పుడే నా ఆశయం నెరవేరుతుందని, తన లక్ష్యం పూర్తవుతుందని అంటున్నాడు మహవీర్. ‘‘మరో పదేళ్ళు ఆగండి. కుస్తీ పోటీల్లో మహిళలను అనుమతించలేదన్న విషయమే మరిచిపోతారు. ఎందుకంటే 2014 కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్ 65 పతకాలు గెలుచుకుంటే అందులో 49 మహిళలు సాధించినవే. ఆడపిల్లల్ని ఇంట్లో బంధించకండి’ - తనవద్దకు వచ్చే తల్లిదండ్రులకు గానీ, తెలిసినవారికి గాని మహవీర్ చెప్పే మాట ఇది. ‘నా చిన్నతనంలో ఆడపిల్లలు స్కూలుకు వచ్చేవారుకాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కాలేజీ చదువు దాకా వెళుతున్నారు. అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మార్పు అనివార్యం’ అంటాడు మహవీర్.

కరణం మల్లీశ్వరి స్ఫూర్తి

2000లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించిన విషయం విదితమే. మల్లీశ్వరి విజయం మహవీర్‌లో స్ఫూర్తి నింపింది. తన ఇంట్లో నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఒక్క కరణం మల్లీశ్వరే ఇంత విజయం సాధిస్తే, నలుగురు కుమార్తెలు ఎన్ని విజయాలు సాధిస్తారో అనుకున్నాడు. వారిని మల్లయోధులుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నాడు. తన గురువు చాంద్గీరామ్ దగ్గర నేర్చుకున్న మెలకువలకు తోడు శిక్షణ ఇచ్చే నైపుణ్యం తోడవడంతో తన కుమార్తెలను అంతర్జాతీయ స్థాయి మల్లయోధులుగా తయారుచేయడం అసాధ్యం కాదనే దృఢనిశ్చయానికి వచ్చాడు. ఆ ఆలోచన తడవుగా అతను వెనుదిరిగి చూడలేదు, ఎవరి మాట వినలేదు. ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా భరించాడు. తన కుమార్తెల భవిష్యత్తు కోసమే కాదు, దేశానికి పతకాలు తేవాలన్న తపన వాటన్నింటినీ భరించే శక్తినిచ్చింది.

వెండితెరకెక్కిన
విజయగాథ
చారిత్రక ఉదంతాలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. మన కళ్లముందు చోటుచేసుకున్న చారిత్రక విజయాలే భావి తరాలకు స్ఫూర్తిదాయకమయ్యే రీతిలో వెండితెర సరికొత్త వాస్తవ కథలతో వెలుగు పూలు పూయిస్తోంది. రెజ్లర్ల కుటుంబంగా, తొలి మహిళా రెజ్లర్లుగా ఖ్యాతిగాంచిన మహవీర్ కుటుంబ విజయగాథ ‘దంగల్’ పేరుతో వెండితెరకెక్కింది. ఈ సినిమా ఇతివృత్తం అక్కాచెల్లెళ్ల వాస్తవ కథే. ఈ సినిమాలో తండ్రి పాత్రను అమీర్‌ఖాన్ పోషించాడు. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం, ప్రతి కదలిక, ప్రతి మాట ప్రేక్షకులను తన్మయభరితులను చేసిందంటే, ఉద్విగ్నానికి గురిచేసిందంటే ఫొగట్ సోదరీమణులు ఎంతగా సామాజిక దురన్యాయాన్ని ఎదుర్కొన్నారో ఈసడింపులను తట్టుకున్నారో అణచివేత ధోరణులను అధిగమించారో అర్థమవుతుంది. వాస్తవం వేరు, సినిమా వేరు. మరి వాస్తవమే సినిమా అయితే ఆ సినిమాకు ఇతివృత్తంగా మారిన అతివలు మన కళ్లముందు ఉంటే చూసేవారికి అది కన్నుల పండువే. అక్కాచెల్లెళ్ల విజయగాథను, వారిని విజయపథంవైపు నడిపించడంలో ఓ తండ్రి ప్రదర్శించిన తెగువనూ ఈ సినిమా కళ్లకు కట్టి సంచలన విజయాలను నమోదు చేసుకుంది.

- ఎస్. మోహన్‌రావు