ఈ వారం స్పెషల్

పుస్తకాల పూదోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంద తుపాకులు గురిపెట్టినా వెనుకడుగు వేయని నియంతలు సైతం ఒక్క సిరాచుక్కను చూసి భయంతో వెనుదిరిగిన చరిత్ర పుస్తకానిది. సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం ఎంతగా విస్తృతమైనా పుస్తకం తన ఉనికిని కోల్పోలేదు. జ్ఞాన కేంద్రాలైన ఈ పుస్తకాల్లోనే ప్రపంచం పొదిగి ఉంటుంది. పుస్తకాల్లో పండే జ్ఞాన పంటలు సమాజానికి ఎప్పటికీ సరికొత్త దిశ-దశలను నిర్దేశిస్తాయనేది వాస్తవం. పుస్తక రూపంలో చదువుకున్నపుడు కలిగే ఆనందం, సంతోషం, ఉల్లాసం చెప్పనలవి కానిది. అమ్మ ఒడిలోని ఆనందం పుస్తకాలు చదువుతున్నపుడు మాత్రమే కలుగుతుంది. అలాంటిది అక్షరమే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జీవించే పాఠక ప్రియులకు పుస్తకప్రదర్శన అనగానే వారిలో కలిగే ఉత్సాహం చెప్పనలవి కాదు. అదో అందమైన అక్షరాల సౌరమండలమే అవుతుంది. వేల లక్షల సంవత్సరాల చరిత్రను, సంస్కృతిని, ఇతిహాసాన్ని, పురాణాలను, గాథలను వివరించే అరుదైన గ్రంథాల సమాహారం ఒక గ్రంథాలయం అనుకుంటే అలాంటి వందలాది గ్రంథాలయాలు ఒకే చోటకు చేరడాన్ని పుస్తక ప్రదర్శనగా చెబుతున్నాం. పుస్తకాల సమ్మేళనం అంటే దేశ విదేశాల సమ్మేళనమే. ప్రాంతీయ, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక రంగాలను అవగతం చేసుకునే జ్ఞాన కేంద్రమే పుస్తకం. ప్రపంచ పరిణామ క్రమం ఎలా పురోగమించిందో తెలియజేసే సాధనమే పుస్తకం. పుస్తకం మన చేతిలో ఉంటే ప్రపంచమంతా మన చేతుల్లో ఉన్నట్టే. చరిత్రను చదువుకుని వర్తమానంలో నిలిచి భవిష్యత్‌కు ముందడుగు వేసేందుకు ఒక వారధి పుస్తకం. పుస్తకం ఒక బోధి వృక్షం. పుస్తకం ఒక సమాజం, ఎగిసి పడే పోరాటాల త్యాగం, పుస్తకం నడిచివచ్చే కాలం, పుస్తకం సర్వస్వం.
పసిపిల్లల దగ్గర నుండి వయోవృద్ధుల వరకు పుస్తకాల ప్రయోజనం, అవసరం అనివార్యం. అపుడే పుట్టిన పిల్లలకు రంగులు, రూపాలు, సంఖ్యలు, అంకెలు వివరించే చార్టులు మొదలు, వృద్ధాప్యంలో ఉన్న వారికి వైద్యం, ఆరోగ్యం, సంరక్షణ, ఆహారపు అలవాట్లు వరకూ అన్ని వయస్సుల వారికీ ఉపయోగపడే గ్రంథాలు ఒకే చోటకు నడిచివస్తే కలిగే గొప్ప అనుభూతే పుస్తకప్రదర్శన. వీటికి తోడు పాత, ప్రసిద్ధ గ్రంథాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొత్తకొత్తగా వచ్చే లక్షలాది పుస్తకాలు ఒకేచోట కనిపిస్తే అదొక విందుభోజనమే.
అంతర్జాలం అంతటా వ్యాపించినా, నట్టింట్లోనూ, ప్రతి ఒక్కరి అరచేతిలోనూ తిష్ఠ వేసినా... బ్లాగులు, వెబ్‌సైట్లు, ఈ-పేజీల్లో అవసరమైన పరిజ్ఞానమంతా కళ్ళముందు కదలాడుతున్నా... పాఠక ప్రియులు మాత్రం పుస్తకంవైపే మొగ్గు చూపడం ఎప్పటికీ విశేషమే. పుస్తక పఠనంపై అంతర్జాల ప్రభావం పడుతోందన్న ఆందోళన కేవలం ఆందోళనగానే మిగిలిపోతోంది. పుస్తకం చేతబట్టి హాయగా ఆస్వాదించే అనుభూతి ఎల్‌ఇడి మానిటర్లలో దొరకదనేది వాస్తవం. పుస్తకాల ముద్రణా తగ్గలేదు, పాఠకుల సంఖ్యా తగ్గలేదు. పుస్తకానికున్న విలువ అలాంటిది. ఏడాదికోసారి జరిగే పుస్తక ప్రదర్శన ఎప్పటికీ ఓ పండుగే...
ఓ సంబురమే!
జాతీయ ప్రదర్శనలు
ప్రతి ఏటా నేషనల్ బుక్ ట్రస్టు ఆధ్వర్యంలో ఢిల్లీలోని ప్రగతి మైదానంలో అతిపెద్ద వరల్డ్ బుక్ ఫెయిర్ జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలు, భారతీయ భాషలు, దేశ విదేశాలకు చెందిన ప్రచురణకర్తలు గ్రంథాలను ప్రదర్శిస్తారు. అలాగే ప్రతి రాష్ట్రంలోనూ ఎన్‌బిటి పుస్తక ప్రదర్శనలు నిర్వహించడమేగాక, మిగిలిన బుక్ ఫెయిర్‌లలోనూ పాల్గొని గ్రంథాలను అందరి ముందు ఉంచుతుంది. దేశంలో ఢిల్లీ, కోల్‌కతా తర్వాత జరిగే అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
చోదక శక్తి పుస్తకానిదే
గతాన్ని వర్తమానానికి, వర్తమానాన్ని భవిష్యత్‌కు అనుసంధానం చేస్తూ, మానవ సమాజాన్ని నవోత్సాహంతో ముందుకు నడిపే అద్భుత చోదక శక్తి పుస్తకానికే ఉంది. సామాజిక మాధ్యమాలు ఎన్ని రూపాల్లో ఎన్ని వచ్చినా, పామ్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు చివరికి సెల్‌ఫోన్లలో సైతం డిజిటల్ పుస్తకాలు వచ్చినా ముద్రణలో ఉన్న పుస్తకాన్ని చదివిన సంతృప్తి మరేదానితోనూ రాదనేది నిస్సందేహం. మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పుస్తకాలను చదువుకుంటూ ప్రపంచాన్ని చదివేవాడు. అందుకే నెహ్రూ పుస్తక ప్రియుడుగా ఖ్యాతిగాంచారు. నెహ్రూ ఆలోచనల ఫలితమే నేషనల్ బుక్ ట్రస్టు. ఆ వారసత్వంతోనే ఎన్‌బిటి వేలాది పుస్తకాలను అందించింది.
ఎన్నో రంగాలు
పుస్తక ప్రదర్శనల్లో సాహిత్యం, మరీ ముఖ్యంగా కాల్పనిక సాహిత్యం, చారిత్రక గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసం, పోటీపరీక్షల గ్రంథాలు, విజ్ఞాన - వికాస ప్రోత్సాహక గ్రంథాలు, కళలు, సంస్కృతులు, సంప్రదాయాలు, భక్తి, ఆధ్యాత్మికం, చరిత్ర, తత్వశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రాలు, భూగర్భ శాస్త్రం, మానవ పరిణామ శాస్త్రంలో లోతైన అధ్యయనానికి కావల్సిన పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. కాగితాల దొంతరల్లో కూర్చిన అందమైన అర్థవంతమైన అక్షరాల వెంట పరుగుపెట్టే నేత్రాలు భావాన్ని గ్రహించి మనసు పొరల్లో నిక్షిప్తం చేసే మరో ప్రపంచమే పుస్తకం. పుస్తకానికి వనె్న తగ్గలేదు, ఆదరణ తరగలేదు, వైభవం కోల్పోలేదు. పాఠకుడి ఆదరణ, జిజ్ఞాస మేరకు అన్ని రంగాల్లో రెక్కలల్లార్చుకుని విస్తరిస్తూనే ఉంది. అత్యాధునిక సమాచార సాంకేతిక విజ్ఞాన రంగంలోనూ, జీవరసాయన శాస్త్ర రంగం, జీవ వైవిధ్య రంగం,
జీవ సాంకేతిక విజ్ఞాన రంగం, జీవ గణాంక రంగం, అంతరిక్ష రంగం, భాషా పరివ్యాప్త రంగం ఇలా ఎన్నో రంగాల్లో విజ్ఞాన దాయక గ్రంథాలు అందుబాటులోకి వచ్చాయి.
అంతర్జాతీయ సంస్థలు
ఆక్స్‌ఫర్డు యూనివర్శిటీ ప్రెస్, ఓరియంట్ బ్లాక్ స్వాన్, కేంబ్రిడ్జి, పియర్సన్, టాటా మెగ్రాహిల్స్, ఓరియంట్ లాంగ్‌మెన్, ఇండియా బుక్ హౌస్ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు తమ గ్రంథాలతో పుస్తక ప్రదర్శనలో దర్శనమిస్తాయి. వీటితో పాటు విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవ చేతన, నవోదయ, హైదరాబాద్ బుక్ ట్రస్టు, ఎమెస్కో, నేషనల్ బుక్ ట్రస్టు, సాహిత్య అకాడమి, తెలుగు పబ్లికేషన్స్ వంటి జాతీయ ప్రచురణ సంస్థలు సైతం ఎంతో విలువైన అరుదైన విద్యాత్మక గ్రంథాలను అందుబాటులోకి తెచ్చాయి. రూపా పబ్లికేషన్స్ నుండి చేతన్ భగత్, రస్కిన్ బాండ్ వంటి రచయితల పుస్తకాలు అత్యధికంగా అమ్ముడుపోవడం చూస్తుంటే యువత ఆలోచనలు ఏ రీతిన విస్తరించాయో అర్థం అవుతోంది. చేతన్ భగత్, టు స్టేట్స్, త్రీ మిస్టేక్స్ ఆఫ్ మైలైఫ్, ఫైవ్ పాయింట్ సమ్‌వన్, వాట్ యంగ్ ఇండియా, రివల్యూషన్ 2020 వంటి గ్రంథాలు ఇప్పటికీ హాట్ కేకులే, రస్కిన్ బాండ్ చిల్డ్రన్ ఓమ్ని బస్, గ్రేట్ స్టోరీ ఫర్ చిల్ట్రన్, స్కూల్ డేస్ స్కూల్ టైమ్స్ వంటి పిల్లల పుస్తకాలకు క్రేజ్ తగ్గలేదు. ఇక విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అన్ని భాషల్లో పాఠకుడి మనసు దోచుకుంటూనే ఉంది.
తెలుగు పుస్తకాల వనె్న
పుస్తక ప్రదర్శనల్లో తెలుగు గ్రంథాల వనె్న తగ్గలేదు. తెలుగు సాహిత్యంలో ధోరణులు, అస్తిత్వ ఉద్యమాలు, రచయితల పాత్ర, కథ, నవల, వచన కవిత- పరిణామ వికాసాలు, ఉద్యమాలు- పాట ప్రభావం, తెలంగాణ సినిమా, అభ్యుదయ సాహిత్యం, స్ర్తివాద సాహిత్యం, బాల సాహిత్యం వంటి అంశాలపై ఎన్నో గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి.
పిల్లల కామిక్స్, ప్రాక్టీస్ పుస్తకాలు, నవలలు, ఆంగ్ల గ్రంథాలు, బిజినెస్, మేనేజిమెంట్, వ్యక్తిత్వ వికాసం, పోటీపరీక్షల పుస్తకాలే కాకుండా మిగిలిన రంగాలకు చెందిన తెలుగు గ్రంథాలకు కూడా విపరీతమైన ఆదరణ కనిపిస్తోంది. చిన్న పిల్లల కథల పుస్తకాలు, తెలుగు సినిమా సాహిత్యం, బాపు కార్టున్ల పుస్తకాలు, వట్టికోట ఆళ్వార్ స్వామి మట్టి మనిషి, గంగు నవల, రామయ్య అమెరికా పాఠం, మన చదువులు గ్రంథాలను సందర్శకులు వెతికి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఆధునిక మేనేజిమెంట్ పేరిట రామాయణం, మహాభారతం గాథల నుండి ఉదాహరణలతో వచ్చిన నూతన ఒరవడి గ్రంథాలకు సైతం మంచి ఆదరణ కనిపిస్తోంది. ఆనాటి పరిస్థితులను, నేటి స్థితిగతులను అన్వయిస్తూ భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను అంచనా వేసే ఈ కార్పొరేట్ గ్రంథాలపై మక్కువ చూపిస్తున్నారు.
చర్చాగోష్టులు
వైద్యులు రోగుల వద్దకు వెళ్లాలని ఆనాటి ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నార్మెన్ బెతూన్ పిలుపునిస్తే, పాఠకుల వద్దకు పుస్తకాన్ని తీసుకువెళ్లాలని నెత్తిన పెట్టుకుని మోసిన ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారు స్వామి కల నేడు నిజం అవుతోంది. పుస్తకాల అమ్మకాలకే పరిమితం కాకుండా రచయితల ప్రసంగాలు, ప్రముఖుల పరిచయాలు, గ్రంథావిష్కరణలు, సాహితీ పోటీలు, సాహితీ చర్చా గోష్టి కార్యక్రమాలను సైతం హైదరాబాద్ బుక్ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రత్యేకించి మహాశే్వతాదేవి సాహిత్య ప్రాంగణాన్ని నెలకొల్పారు.
పెరిగిన పుస్తక ప్రియులు
మునె్నన్నడూ లేని విధంగా లక్షలాది మంది పుస్తక ప్రియులు బుక్ ఫెయిర్‌లో పాల్గొంటున్నారు. పుస్తకాల పఠనం తగ్గిందని చెబుతున్న ఈ డిజిటల్ యుగంలో పుస్తక ప్రియులు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం అపూర్వమని వికీమీడియా ప్రతినిధి కృపాల్ కశ్యప్ పేర్కొన్నారు. కాలాలెన్ని మారినా పుస్తకం మాత్రం చిరంజీవిగా వర్ధిల్లుతూనే ఉంటుందని ప్రఖ్యాత కవి, కవిసంగమం సమన్వయకర్త యాకుబ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి పెద్ద పుస్తకాల పండగగా దీనిని చెప్పవచ్చని గీతం యూనివర్శిటీ సలహాదారు, ఎపిపిఎస్‌సి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ జి సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. పుస్తక ప్రదర్శనకు అపూర్వ ఆదరణ లభించడమే గాక, లక్షలాది పుస్తకాలు విక్రయం జరుగుతున్నాయని అన్నారు.
పుస్తక ప్రదర్శనలో పుస్తక ప్రచురణకర్తలు, విక్రేతలు, మార్కెటింగ్ ప్రతినిధులకే పరిమితం కాకుండా వివిధ దినపత్రికలు సైతం స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఉత్తర భారతానికి చెందిన కొన్ని ప్రచురణ సంస్థలు తమ గ్రంథాలను పాఠకులకు చేరువ చేయడానికి ప్రయత్నించడం ముదావహమని తెలుగు అకాడమి మాజీ సంచాలకుడు ప్రొఫెసర్ యాదగిరి పేర్కొన్నారు. పుస్తక సంస్కృతిని విస్తృత పరిస్తే అది విశ్వకళ్యాణానికి దోహదపడుతుందని వికీపీడియా ప్రతినిధి ప్రణయ్ వంగారి పేర్కొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
సురవరం ప్రతాప్‌రెడ్డి ప్రాంగణంలో మఖ్దూం మొహినుద్దీన్ వేదిక, మహేశ్వరాదేవి ప్రాంగణంలో గూడ అంజన్న వేదికలను ఏర్పాటు చేశామని, ప్రతి రోజు సాహితీ కళాకారులతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చంద్రమోహన్ అన్నారు. ఒగ్గుడోలు, కథక్ నృత్యం, ఒడిస్సా నృత్యం, పేరిణి నృత్యం, జానపద ఆర్కెస్ట్రా, మహిళా కవ్వాలి, చిందు యక్షగానం, జానపద పాటలు, ఫిల్మీ గజల్స్, కూచిపూడి నృత్యం, గుస్సాడి నృత్యం, కోయ నృత్యం వంటి కార్యక్రమాలతో పాటు ఆట- పాట కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
మరోపక్క తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ఎగిసిన కలాలు తమ గొంతు విప్పి ఈ ప్రాంగణంలో కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. స్ర్తివాద కవులు, విప్లవగీతాల రచయితలు, సామాజిక సముద్ధరణ గేయ రచయితలు తమ గళాన్ని విప్పుతున్నారు. ప్రతి రోజు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సీనియర్ అధికారులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు పుస్తక ప్రదర్శనకు రావడమేగాక, వివిధ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.

అంతర్జాతీయ ప్రదర్శనలు
ప్రపంచవ్యాప్తంగా పుస్తకప్రదర్శనలకు ఎంతో చరిత్ర ఉంది. పెరాటి ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్ బ్రెజిల్, సిడ్నీ రైటర్స్ ఫెస్టివల్ ఆస్ట్రేలియా, ఎడిన్‌బర్గ్ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ స్కాట్లాండ్, బెర్లిన్ ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్- జర్మనీ, బ్రూక్లీ బుక్‌ఫెస్టివల్- యుఎస్‌ఎ, ఇరవాడి ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ మయన్మార్ వంటివి అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిగడించాయి. షాంఘై లిటరరీ ఫెస్టివల్, వర్డ్సు బై వాటర్ ఫెస్టివల్ కాంబ్రియా, సదరన్ లిటరరీ ఫెస్టివల్ మిస్సిసిపీ, పెన్ వర్డ్సు వాయిస్ ఫెస్టివల్ న్యూయార్క్, ఎల్‌ఎ టైమ్స్ లిటరరీ ఫెస్టివల్ లాస్ ఏంజెల్స్, లిటరేచర్ ఫెస్టివల్ ఇటలీ, నేషనల్ బుక్ ఫెస్టివల్ వాషింగ్టన్, అగాథ క్రిస్టీ బుక్ ఫెస్టివల్ - యుకె, ఆథర్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ -కెనడా, వాంకోవర్ రైటర్స్ ఫెస్టివల్ కెనడా, మియామీ బుక్ ఫెయిర్- యుఎస్‌ఎ, జీ జైపూర్ లిటరరీ ఫెస్టివల్, హే ఫెస్టివల్ కొలంబియా, టోక్యో ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్ జపాన్, పోర్టు ఇలియట్ ఫెస్టివల్ ఇంగ్లాండ్ సైతం అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున జరిగే బుక్ ఫెస్టివల్‌గా ఖ్యాతి గడించాయి. అంతర్జాతీయ హోదా లభించకున్నా వాస్తవానికి హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ సైతం అదే తరహాలో నిర్ణీత నియమనిబంధనావళితో జరుగుతోంది.

పుస్తక విరాళాల హుండీ
పుస్తకాల నిధి, హుండీ అనగానే ఆశ్చర్యమనిపిస్తోంది కదూ. అవసరం పడింది మరి. రక్తనిధి లాగా పుస్తకాల నిధి ఏర్పాటుకు తొలి అడుగు పడింది. శరీరానికి రక్తం ఎంత అవసరమో, మనుషుల మనసులు, సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే పుస్తకాలకూ ఓ నిధి అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన సాహితీవేత్తలు ఈ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేకంగా ఓ హుండీని ఏర్పాటుచేశారు. చదివిన పుస్తకాలనీ, ఇతరులు చదువుకునే పుస్తకాలనీ విరాళంగా సేకరించి ఇతర ప్రాంతాలకు, ఎక్కువమంది పాఠకులకు చేర్చే సంకల్పంతో ఈ నిధిని ఏర్పాటుచేసినట్లు ప్రముఖ సాహితీవేత్త జయధీర్ తిరుమలరావు వెల్లడించారు. చదవాలని ఉన్నా కొనుక్కోలేని పేద పాఠకుల కోసం, అందుబాటులో లేనిచోటకు వీటిని చేర్చి ఇతర పాఠకులకు చేరువ చేయడమే ఈ నిధి ఉద్దేశమన్నారు. నగదును దాచినట్లుగా పుస్తకాలను బంధించకూడదని, నోటు చలామణిలాగా పుస్తకం కూడా విస్తృతంగా చలామణి కావాలన్నదే ఈ నిధి ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
మూడు దశాబ్దాల చరిత్ర
భిన్న సంస్కృతుల సమ్మేళనమైన హైదరాబాద్‌లో వందల ఏళ్లుగా పుస్తకం వర్థిల్లుతూనే ఉంది. దాదాపు మూడు దశాబ్దాలుగా పుస్తక ప్రదర్శన ఎంతో వేడుకగా, ఓ పండుగలా జరుగుతోంది. ఇందిరాపార్కు వద్ద ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 15న ఎంతో వైభవంగా ప్రారంభమైన పుస్తక ప్రదర్శన ఈ నెల 26వ తేదీ వరకూ జరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు కెరీర్ ప్రణాళికకు పుస్తక ప్రదర్శన ఒక కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వందలాది ముద్రణాలయాలు, వైయుక్తిక ప్రచురణకర్తలు, రచయితలు ఒకే చోటకు చేరడంతో ఏ రంగంలో ఏ గ్రంథాన్ని ఎవరు ముద్రించారో, అందులో ఉన్న విషయ సామర్ధ్యం ఎంతో కూడా పుస్తక ప్రదర్శనల్లో నేరుగా వెళ్లి తెలుసుకునే వీలుకలుగుతుంది. లేదా ఒక సబ్జెక్టుకు సంబంధించి ఎవరు ఏ పుస్తకాలు ముద్రించారో తెలుస్తుంది, అలాగే ముద్రాపకులు భవిష్యత్‌లో ముద్రించబోయే పుస్తకాల వివరాలు కూడా తెలుసుకునే భాగ్యం కలుగుతుంది. రచయితలను వ్యక్తిగతంగా కలుసుకుని వారితో తమ అభిప్రాయాలను పంచుకుని పరస్పర అవగాహనకు పుస్తక ప్రదర్శనలు పెద్ద వేదికలు.
290 స్టాల్స్ ఏర్పాటు
వైవిధ్య భరితమైన భాగ్యనగర సంస్కృతి, జీవన శైలి ఉట్టిపడే రీతిలో పుస్తకప్రదర్శన ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో దాదాపు 290 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8.30 వరకూ అనుదినం కొనసాగే ఈ పుస్తక ప్రదర్శన సెలవు రోజుల్లో మాత్రం మధ్యాహ్నం 12 గంటల నుండే ప్రారంభం అవుతుంది. గతంలో జరిగిన 29 పుస్తక ప్రదర్శనలు నగర ప్రజలపై చెరిగిపోని ముద్ర వేశాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత జరుగుతున్న అతి పెద్ద పుస్తక ప్రదర్శనగా చెప్పవచ్చు.

- బి. వి. ప్రసాద్