ఈ వారం స్పెషల్
బాపు.. ఓ ఉత్తరం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సత్తిరాజు లక్ష్మీనారాయణ అంటే ఇప్పటికీ చాలామందికి తెలియకపోవచ్చు. ‘బాపు’ అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. అదేంటో! అసలు... ‘పేరు’ వచ్చిన చాలామందికి, ‘అసలు పేరు’ మరుగున పడిన సందర్భాలు ఇలానే ఉంటుంటాయ్!
‘బాపు’ అంటే ఓ కార్టూనిస్టు, ఓ చిత్రకారుడు, ఓ సినిమా దర్శకుడు, వీటన్నింటికీ ముందు -‘గొప్ప’ అనే విశేషణం చేర్చాలి! ఎందుకంటే తనేం చిన్నాచితకా పనులు చేయలేదు. తెలుగుకే వెలుగు తెచ్చాడు. తెలుగు ‘వర్ణమాల’ను తన చేతిరాతతో సుస్థిరం చేసి ‘లిపి’కారుడయ్యాడు. బాపు గురించి కొత్తగా చెప్పేదేముంది? అంటే - ఆయన ఎప్పటికీ తన బొమ్మల ద్వారా, సినిమాల ద్వారా ‘కొత్త’గానే కనిపిస్తాడు మరి! ఆయనలో బోలెడు ‘ఏంగిల్స్’ వున్నాయి; ప్రతిభ విషయానికి వస్తే. మార్క్స్ - ఏంగెల్స్ నచ్చే కొందరికి, ఆయన నచ్చకపోవచ్చు. కానీ బాపు - శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ కవితలకు బొమ్మలు వేశాడు. రావిశాస్ర్తీ కథలకూ బొమ్మలు వేశాడు. దిగంబర కవుల సంపుటికీ ముఖచిత్రం గీశాడు. ఆయనకు రాముడు అంటే ఇష్టం! రామాయణం అంటే ఇష్టం! ఆ రామాయణం కథలనే ‘సోషలైజ్’ చేసి, సినిమాలు తీశాడు అని ‘క్రిటికే’ వారూ వున్నారు. రామాయణం - విషవృక్షం అని రంగనాయకమ్మగారు రాసి, ఆ పుస్తకానికి ముఖచిత్రం వేయమని - డబ్బిస్తూ, ముందుగా చెక్కు పంపించినా, దాని వెనుక ‘శ్రీరామ.. శ్రీరామ..’ అంటూ రాసి, వెనక్కు పంపేసి, బొమ్మ వేయలేదు బాపు. ‘నిధి చాల సుఖమా! రాముని సన్నిధి చాల సుఖమా’ అని పాడుకుంటే- రాముని సన్నిధినే ఆంజనేయుడిలాగానే, ఉండాలని కోరుకుంటాడాయన. తన కార్టూన్ల పుస్తకం మీద తనను తాను ‘కోతి’లా చిత్రించుకోగలగడం అందుకే ఆయనకే చెల్లింది!
బాపు వ్యక్తిత్వంలోని కోణాలు - ముళ్లపూడి వెంకటరమణ అనే వెంకట్రావుకే బాగా తెలుసు. వాళ్లిద్దరినీ ‘స్నేహం’ అనేదానికి ‘ఐకాన్’గా చేసుకున్నారు తెలుగువారు. ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్’ అని నమ్మి, అయినా ‘స్నేహం’ అనే సినిమా తీశారు వాళ్లు. బాపు డిసెంబర్ 15, 1933లో పుట్టారు. మూడు వందల అరవై అయిదు రోజుల సంవత్సరంలో ఇంకో పదహారు రోజులు మాత్రమే వుండగా పుట్టారు కనకేమో, బాగా ‘మితభాషి’ అయ్యారు. ముళ్లపూడి జూన్ 28, 1931లో పుట్టారు కనుక - మాటలు రాయడం, మాట్లాడడం అంతా తానే! అయితే ఆయనా ‘అధిక ప్రసంగి’ ఎప్పుడూ కాలేదు. వారి జమలిక వాడని ధవళమల్లిక!
బాపు - లాయర్ చదువులు చదివారు గానీ, ఆ వృత్తి చేపట్టలేదు. మాట్లాడితే సూటిగా, సుత్తి లేకుండా మాటాడతారు మరి! ‘సాక్షి’ సినిమాను మైసూరు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మే సందర్భంలో ఓ ఉదంతం జరిగిందిట! భక్తవత్సల, సురేంద్ర, ఆ డిస్ట్రిబ్యూటర్లు. ‘బెంగుళూరు వస్తే ఎగ్రిమెంట్ చేసి చెక్కిస్తాం’ అన్నారు. వీళ్లు బెంగళూరులో శారదా మూవీస్‌కు బాపు సొంత కారులో వెళ్లారు. ఉడ్‌లాండ్స్‌లో దిగి ఫోన్ చేసి వెళ్లారు. సురేంద్రగారు ఎగ్రిమెంట్లు రెడీ చేశారు. రిలీజ్ నాటి నుండి అయిదేళ్లు శారదా మూవీస్ బెంగుళూరుకు లీజుకిస్తున్నట్టు. ఆ తర్వాత వారు ప్రింట్లు వాపసు ఇచ్చేట్టుగా ఒప్పందం. లీగల్ పార్ట్‌నర్స్ సంతకాలు పెట్టారు. ఇక భక్తవత్సలంగారు ఎగ్రిమెంటు మీద సంతకం పెడుతూంటే - అంతవరకు తలవంచుకు కూర్చున్న బాపు ‘సార్! వన్ మినిట్’ అన్నాడు. ఆయన సంతకం ఆపి చూశారు. ‘మా పిక్చరు కొనే ముందు ఇంకోసారి ఆలోచించండి’ అన్నాట్ట బాపు. భక్తగారు ఆశ్చర్యంగా, మిగతా పార్ట్‌నర్స్ అయోమయంగా చూశారు. ‘ఈ పిక్చర్ రాసింది రమణగారు. తీసింది నేను. ఆయన పని ఆయన బాగానే చేశాడు గానీ, డైరెక్టర్‌గా నాకు తృప్తిగా లేదు. టెక్నికల్‌గా కొన్ని లోపాలున్నాయి. దిద్దడానికి టైము లేదు, డబ్బూ లేదు. మీకు వార్నింగివ్వడం నా కనీస ధర్మం. ఆపైన మీ ఇష్టం’ అన్నాడు బాపు. ‘ఐమీన్ వాటైసెడ్’ అంటూ లేచి గది బయటకు వెళ్లిపోయాడు. తలుపు తీస్తూ ఆగి ‘అయామ్ నాటె ఫూల్ - బట్ - చెప్పడం నా ధర్మం - తరువాత మీ ఇష్టం’ అని తలుపు లాగేసాడు. కానీ భక్తవత్సలం సంతకం పెట్టేశారు రమణను ఖంగారుపడద్దు అని.
‘బాయ్! ది హైట్ ఆఫ్ హానెస్టీ - అండ్ హ్యూమన్ అండ్ అర్రగెన్స్ - ఆల్ ఎట్‌ది సేమ్‌టైమ్’ అన్నారు భక్తవత్సలం. అదీ బాపు! బాపు బి.కాం., బి.ఎల్.గానీ - ఆ రూటు వదిలేశారు. బిజినెస్ ధ్యాస లేదు. అంతా ముళ్లపూడి చూసుకోవాల్సిందే! అందుకే ముళ్లపూడి పోయాక - ‘నన్ను గోడలేని చిత్తరువును చేసిన వెంకట్రావు’ అని స్నేహితుడి గురించి వాపోయాడు. బాపు గురించి ‘కోతికొమ్మచ్చి’లో ముళ్లపూడి బోలెడు విషయాలు రాశారు. అవిభక్త కవలల కథనం వంటిదది.
బాపు బొమ్మలు వేయడమే కాదు. మాటలు.. అంటే ఎక్కువ సన్నిహితుల మధ్యేగానీ, ఎందుకో ఎన్నో సందర్భాల్లో ‘ఉత్తర రచన’ చేశాడు బాపు. బాపు రాసిన ఉత్తరాలు ఫ్రేం కట్టించుకుని దాచుకున్న వాళ్లున్నారు. ఆయన అందమైన అక్షరాలే కాదు, ఆయన ‘ఆత్మీయతా’ అంత అందమైనది. అది ఉత్తరాల్లో తొణికిసలాడేది. రచన శాయి, బాపుగారు ఎందరికో రాసిన ఉత్తరాలను వారివారి సౌజన్యంతో సంపాదించి, నెలనెలా భాగాలుగా ప్రచురించి, బాపు ఉత్తర రచనను - తొమ్మిది రచన సంచికల ‘నవరత్నమాలిక’గా కూడా సంతరించారు! పదమూడు వందల ఎనభై ఎనిమిది పుటలలో బాపు అభిమానులకు, ఆత్మీయులకు రాసిన నవరసభరితమైన ఉత్తరాలు, మునుపెక్కడా కనిపించని బాపురేఖాచిత్రాలు, వర్ణచిత్రాలు, అలాగే బాపు గూర్చిన స్మరణీయ కబుర్లు 550 రూ./- ఆ ‘నవరత్న మాలిక’లో కూర్చారు. అదో అపురూప నిధి.
బాపుగారి ఉత్తరాల్లో ఆయన హాస్య ప్రియత్వం, అభిమానం, నిరాడంబరత, నిక్కచ్చితనం అన్నీ ద్యోతకమవుతాయి. ఆయన ఎంత స్నేహశీలో అర్థమవుతుంది. అంతెందుకు? ఒక్క బి.వి.ఎస్.రామారావు అనే ‘సీతారావుడు’కు ఆయన రాసిన ఉత్తరాలు చూడాలి! సినిమా కబుర్లూ, కాకరకాయలూ అందులో బోలెడు. అలాగే చనువులూ, సెటైర్లూ కూడాను. ఓ ఉత్తరం చివర్లో ఇలా ఉంటుంది-
‘- వెంకట్రావు పెళ్లి బహుశా జనవరి 26 ప్రాంతాల్లో వుండచ్చు. ఇంకా తేలలేదు. మరి మా జ్యోతి అన్యూల్ ఫంక్షన్ కూడా ఆ ప్రాంతాల్లోనే ఉంటుంది. తవఁరు తప్పక దయచేయాలి మరి. మళ్లీ మినిష్టరొస్తున్నాడూ, వాడొస్తున్నాడూ, వీడొస్తున్నాడూ, రాలీ, ఫిలిప్సూ అంటే కుదర్దు మరి. గాన గ్రహించ ప్రార్థన.
చి.సత్యకళకి జోళ్లు కొన్నావా?
ఎస్పీగారి పెరట్లో దాక్కున్న ఆవు ఈనిందా
పాము కుబుసం విడిచిందా?
నీ కెమెరా కులాసాగా ఉందా?
అదీ విషయము
బాపు
4.1.64
నీ న్యూఇయర్ గ్రీటింగ్స్ శుభలేఖ అందింది. ఎవడక్కడ నీకు సెలక్ట్ చేసింది. దొమ్మరి రాస్కెల్. ఇలా సాగుతూంటాయి కొన్ని బాపు ఉత్తరాలు.
-ఎంతటి వారి ముందయినా ‘వినమ్రం’ కాగలగడం బాపుగారి ప్రత్యేకత. తన బొమ్మల గొప్పదనాన్ని తానెప్పుడూ చెప్పుకోరు. ‘బొమ్మ బాగా కుదిరింది’ అనుకునేవారు గానీ, ‘బాగా వేశాను’ అని ఎప్పుడూ అనుకునేవారు కాదు. ఎవరేనా తమ పుస్తకానికి బొమ్మవేసి పెట్టమని అడిగినప్పుడు ఆ రచన కూలంకషంగా చదివి, ఆ రచన ఆత్మను పట్టుకుని, అలవోకగా చిత్రరచన చేయడం బాపుగారి అలవాటుగా వుండేది. అయినా కొన్ని సందర్భాలలో అడిగిన వారికి అసంతృప్తి... కలిగితే అలాంటి సందర్భాలలో ఓపిగ్గా ఒకటికి రెండుసార్లు మరో బొమ్మ ప్రయత్నించడం, వారిని సంతృప్తి పరచడం బాపుగారికే చెల్లింది. అంతేకాదు! కొన్ని రచనలకు బొమ్మలు వేయడం తన అదృష్టం అనుకునేవారు ఆయన.
‘బ్నింగారు- మిసెస్ అండర్‌స్టాండింగ్ అని 88లో రాసిన కొన్ని దాంపత్య రహస్యాలు పుస్తకంగా వేస్తున్నారు. చాలా చాలా బావున్నాయి. తయారవగానే చూద్దురుగాని. ఎందుకు రాస్తున్నానంటే దానికి బొమ్మలు వేసే అదృష్టం నాకు లభించింది కనుక’ అని మరొకరికి రాసే లేఖల్లో పేర్కొనగల సౌశీల్యం ఆయనిది.
గత 2011లో ’డ’ సంబరాలకు అతిథులుగా బాపు రమణలకు ఆహ్వానం అందింది. కానీ ఫిబ్రవరిలోనే ముళ్లపూడి అస్తమించారు. 18.6.11న శ్రీ మధుగారికి శిరీషగారికి అమెరికాకు లేఖ రాస్తూ బాపుగారు అందులో ఇలా రాశారు-
‘బాపు రమణ వస్తున్నారని మీరంతా ఎంత ఎదురుచూస్తున్నారో తెలుసుకుంటూనే ఉన్నాం.
రమణగారు ఆ పండక్కి ఏమి రాసి తీసికెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండేవారు. మీలాంటి మంచి మిత్రుల మధ్య కొంత సమయం గడపవచ్చని ఎంతో ముచ్చటపడ్డాం.
కానీ రాముడి ఆదేశం మరోలా ఉంది.
గోడలేని చిత్తరువులా నన్ను మిగిల్చేశాడు. నిజానికి నేను సున్నాలాటివాడిని. రమణగారు ఒకటిగానీ, తొమ్మిదంకెలాగా గానీ నా పక్కన ఉంటేనే నాకు విలువ.
అలాంటిది నేనొక్కడినే రాగలనా!
మార్కండేయుణ్ణి రక్షిస్తూ శివుడు యముణ్ణి ఎడంకాలితో తన్ని తరిమేశాడట. నీ సగభాగం నేను కదా - అదీ ఎడం వైపున - అందువల్ల ఆ క్రెడిట్ నాదే అని అమ్మవారు పేచీ పెట్టిందట. అమ్మవారితో పోల్చుకుంటున్నందుకు క్షమించండి గానీ అలాగే నేను మాత్రం వద్దామనే సాహసించాను.
డాక్టర్ రాముడు వద్దన్నాడు.
అనారోగ్య కారణం అని అందామనుకున్నాగానీ అపశబ్దం సహించని రమణగారు పైనించి కోప్పడతారని ఆరోగ్య కారణం - తెలుగులో ‘హెల్త్ రీజన్స్’ వల్ల రాలేకపోతున్నానని మనవి చేసుకుంటున్న.
రమణగారు అప్పగించిన ‘శ్రీరామ రాజ్యం’ పూర్తి చేస్తున్నాను. ప్రతి మాటలోనూ ప్రతి షాటులోనూ మేమిద్దరం చర్చించుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆయన ప్రేరణతోనే పని చేస్తున్నా ఇది ఒంటిచక్రం నడక.
స్నేహం అంటే అవతలివాడి అవలక్షణాలను భరించడం అనేవాడు రమణగారు. అలాగే నా ప్రయత్నం భరించాలని ఆశిస్తున్నాను.
అక్కడి నుంచి రమణగారూ ఇక్కడ నించి నేనూ మీకు శుభాకాంక్షలు అందిస్తూ ఉంటాము. మేము ఎల్లప్పుడూ మీ మంచి హృదయాలతో ఇలాగే వుండాలని కోరుకుంటున్నాము. మీరు సత్సంకల్పంతో నిర్వహిస్తున్న ’డ’ సభలు దిగ్విజయంగా జరగాలని మనసా కోరుకుంటున్నా.
నేను లేనప్పుడు ఎవరేనా సంతకాలు అడిగితే ఘఖఆ్ద్యజఒళజూ చ్యిళూక అని రాసి నా సంతకం కూఢా పెట్టే రమణగారిని గుర్తుచేసుకుంటూ -
మీ బాపు రమణ
18.6.11
అలా ఇద్దరొకటిగా బ్రతికిన ఇలలోని స్నేహానికి, ఈ తరానికి ఆదర్శంగా నిలిచినవారు బాపు రమణ. ఎవరిని తలుచుకున్నా అనివార్యంగా మరొకరిని స్మరించక తప్పదు. దానిని అర్ధనారీశ్వరత్వంగా ‘శివం’గా సంభావించవచ్చును.
ఈ బాపు, రమణలకు ఇప్పటికీ ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేసారని వాపోతున్న తరమూ తయారైపోతోంది! బాపుకన్నా గొప్ప చిత్రకారులు ఉండచ్చు. రావచ్చు. కానీ బాపుగారిలా నిలిచిపోగల చిత్రకారులు బాపుగారే! ఆయన నిజమైన ‘గీతా’కారుడు. తెలుగు అక్షరం, తెలుగు హాస్యం, తెలుగు బొమ్మ, తెలుగు సినిమా, తెలుగు స్నేహం బాపువల్ల వెలుగు వెలిగింది. ముళ్లపూడి వెళ్లిపోయాక గోడలేని చిత్తరువు నయ్యాడన్నాడుగానీ బాపు, బాపు వెళ్లిపోయాక ఇంక ఆ గోడా లేదు. ఆ చిత్తరువూ లేదు. కలాలు కుంచెలు కంప్యూటర్ వౌస్ జీర్ణించుకున్న వర్తమానంలో - బాపు శకం ముగిసింది గానీ, ఆయన ఇచ్చిన నిధులు, స్మృతి శకలాలు శాశ్వతాలు. వారసులకు జేజేలు! బాపుకు జేజేలు! *