ఈ వారం స్పెషల్

ఆకలిరాజ్యంలో అలుపెరుగని పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం జీవిస్తున్న ప్రపంచం ఓ ఆకలిరాజ్యం...
కానీ చాలామందికి ఇది తెలీదు..
తెలిసినా పట్టించుకోరు.
ఆనందం వచ్చినా...
పండగొచ్చినా..
బాధవచ్చినా..
భయం వేసినా...
నలుగురూ కలసి విందో, వినోదమో, కలసి ఉంటూ ఏదో ఒక పేరుతో ఒకచోట చేరి వంటావార్పూ చేసుకోవడం మామూలే. జనజీవనయానంలో విందు ఓ పసందైన వినోదమే. తిన్నంత తిని, మిగిలింది పారబోయడమూ సాధారణమే. కానీ విందు ఊసు కాదుకదా...ఎంగిలిపడటానికి ఓ మెతుకు కూడా లేని, అసలు తిండి ఊసేలేని జనం కూడా ఈ భూమీదే ఉన్నారు.
ఔను..అదీ సుష్టుగా తింటున్నవారికన్నా మూడింతలు ఎక్కువగా? నమ్ముతారా? అందుకే ఇది ఆకలిరాజ్యం అంటున్నది.
మనం మేల్కోకపోతే ఈ ప్రపంచం
ఆకలిరాజ్యంగానే మిగిలిపోతుంది.
నకనకలాడుతున్న కడుపులతో శక్తిచాలని గొంతులతో వారు పెట్టే కేకలు విన్పించుకోకపోతే మనమూ ఎప్పుడో ఒకప్పుడు కేకపెట్టాల్సిందే. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే ఇప్పుటు ఐక్యరాజ్య సమితి సిద్ధమైంది. విస్తృత కార్యక్రమాలకు ప్రాణంపోసింది. ఆకలిపై పోరాటం ప్రారంభించింది.
కడుపునిండా తిండి సంగతి దేవుడెరుగు..
గ్లాసుడు గంజికూడా లేని జన సంఖ్య తెలిస్తే గుండె చెరవవుతుంది.
జవజీవాలు లేని జనాలతో ఆకలిపోరాటం చేస్తున్నవారి లెక్కలు తెలిస్తే కళ్లు చెమ్మగిల్లక తప్పదు. బక్కచిక్కిన శరీరాలతో బతుకీడుస్తున్నవారిని చూస్తే గుండె బరువెక్కుతుంది. ఆ బాధతో చేష్టలుడిగి కూర్చుంచే సమస్య తీరదు. ముందుకు ఉరికి ఆకలిని తరిమేస్తేనే ఉపశమనం. అందుకు చక్కటి ఆహారం అందరికీ అందేలా చేయడమే పరిష్కారం. అలా చేయాలంటే ఆహారోత్పత్తులు పెరగాలి కదా. అంటే రైతులు ముందుకు రావాలి. ఆ రైతుకు వాతావరణం సహకరించాలి. అది ఎలా సాధ్యమవుతుందో ప్రపంచానికి చెబుతోంది. అందులో భాగంగా ఏటా అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
ఆహార దినోత్సవం ఎందుకు?
ప్రపంచంలో వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా 1945 అక్టోబర్ 16న ఐక్యరాజ్య సమితిలో ‘్ఫడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్’ (ఎఫ్‌ఎఒ) ఆవిర్భవించింది. మారుతున్న కాలంలో వ్యవసాయరంగం దెబ్బతినడం, ఆహార లభ్యత మందగించడం, జనాభా విస్ఫోటనంతో ఆహారానికి డిమాండ్ పెరగడం, పేదలకు ఆహార లభ్యత లేకపోవడంతో విపరిణామాలు మొదలయ్యాయి. దీనిని గమనించిన హంగేరియన్ వ్యవసాయశాఖ మంత్రి డాక్టల్ పాల్ రొమెనీ 1979లో ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యాన్ని గుర్తించి అప్రమత్తం చేశాడు. దీంతో అప్పటినుంచి అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఓ లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్లైమేట్ ఛేంజ్, దానికి అనుగుణంగా ఆహారం, వ్యవసాయ రంగాల్లో మార్పులు అనివార్యమన్న లక్ష్యంతో ప్రచార, అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నారు. సుమారు 193 దేశాల్లో భారీ ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. చిన్నపిల్లలకు డ్రాయింగ్ పోటీలనుంచి రైతు సంస్థలు, సుమారు 450 ప్రభుత్వ రంగ సంస్థలు ఈ క్రతువులో పాలుపంచుకుంటున్నాయి. ర్యాలీలు, సదస్సులు సరేసరి.
ఇవీ ఆకలి కేకలు
ప్రపంచ జనాభాలో 80 కోట్లమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇది అధికారిక సమాచారం. ఈ భూమీద ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తీవ్రమైన ఆకలితో బాధపడుతున్నారు. పైగా ఇలా ఆకలితో ఇబ్బంది పడుతున్నవారిలో 60శాతం మంది మహిళలు. ఇక పౌష్టికాహారం లేకపోవడంతో ప్రతి పదిమంది ఐదేళ్లలోపు చిన్నారులలో నలుగురు చనిపోతున్నారు. రోగాలతో కాకుండా ఆకలితో చనిపోవడం ఈ ఆధునిక ప్రపంచంలో అత్యంత విషాదం. ఇలా మరణిస్తున్నవారి సంఖ్య ఏడాదికి 50 లక్షల మంది అంటే ఇంతకంటే భయంకరమైన బాధ మరేమిటి. బతికి ఉన్న పిల్లల్లోనూ పుష్టి లేక మెదడు, నాడీవ్యవస్థ ఎదగక జీవచ్ఛవాల్లా ఉన్నవారి సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్న అగ్రరాజ్యం అమెరికాలోనూ ఆకలి కేకలు విన్పిస్తున్నాయంటే నమ్మాల్సిందే. అక్కడ 14.3 శాతం మంది కడుపునిండా తిండిలేనివారే. ప్రతి ఏడుగురిలో ఒకిరికి అక్కడ పొట్టనిండే పరిస్థితి లేదు. ఇక ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి చాలా దారుణం. అక్కడ 60శాతం మంది ఆకలి కేకలు పెడుతున్నవారే. ఆసియాది ఆ తరువాతి స్థానం. మిగతా ఖండాలతో పోలిస్తే ఐరోపా కొంత మెరుగు.
వృధాయే అసలు సమస్య
జనాభా పెరుగుదలకు తగ్గట్టు ఆహారోత్పత్తులు పెరగడం లేదు. ఉన్నంతలో ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మనం నిర్లక్ష్యం చూపుతున్నాం. వండిన ఆహార పదార్థాల్లో వినియోగించిన దానికన్నా వృథా చేస్తున్నదే ఎక్కువ. అలాగే పండిన పంటలను నిల్వచేయడంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వృధా ఎక్కువగా ఉంటోంది. ఈ పరిణామాలు పేదలకు కష్టాలు తెస్తున్నాయి. వరల్డ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ (యుఎన్‌ఇపి) సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఆహారంలో మూడోవంతు వృధా అవుతోంది. దీని విలువ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. పారిశ్రామిక ప్రగతి సాధించిన దేశాల్లో ఈ వృధా ఎక్కువగా ఉంటోంది. అక్కడ ఏటా 230 టన్నుల ఆహారం వృధా అవుతోంది. ఇక్కడ ఆహారం వృధా అంటే ఒక్క తినేపదార్థాలనే కాదు. వీటి తయారీకి వినియోగించిన విద్యుత్, శ్రమ, ఆదాయం, సహజ వనరులు అన్నీ వృధా అయినట్లే.
ఇదీ లక్ష్యం
2050 నాటికి ప్రపంచ జనాభా 960 కోట్లకు చేరుతుందని అంచనా. 2030నాటికి అందరికీ కడుపునిండా ఆహారం (జీరో హంగర్) దొరికేలా చేయడమే లక్ష్యంగా ప్రపంచ ఆహార సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అది సాధించాలంటే ఆహార, వ్యవసాయ రంగాల్లో వినూత్న పరిణామాలు సంభవించాల్సి ఉంటుంది. అయితే భూతాపం వల్ల వ్యవసాయోత్పత్తులు పెరగడం ఓ సమస్య. వాతావరణ మార్పులకు తగ్గట్టుగా పద్ధతులు, పోకడలు మార్చుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్న నినాదంతో ఈసారి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నవంబర్ 7 నుంచి 18వరకు మొరాకోలో జరిగే యుఎన్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ (కాప్-2)లోగా దీనిపై మరింత స్పష్టత తేవాలని చూస్తున్నారు. వాతావరణ ప్రభావం నేరుగా పశుసంపదపై పడుతుంది. వాటిపై ఆధారపడినవారు, వ్యవసాయరంగం దెబ్బతింటుంది. 2050 నాటికి మత్స్యసంపద 40శాతం తగ్గిపోతుందని, వాతావరణ పరిస్థితులు ఇలాగే ఉంటే పెనుముప్పు ఉందని అంచనావేస్తున్నారు. వీటివల్ల పరోక్షంగా లక్షలాదిమంది ఆకలితో అలమటించే పరిస్థితి దాపురిస్తుంది. అలాకాకుండా ఉండేందుకు పశుసంపద, మత్స్య పరిశ్రమ, వ్యవసాయరంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. హంగర్న్,్ర సేవ్ ఫుడ్ వంటి వినూత్న కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
భారత్‌లో ఇదీ పరిస్థితి
మనదేశంలో ఆహారోత్పత్తుల నిల్వ చేసుకునే అవకాశాలు, సౌకర్యాలు లేక వృధా ఎక్కువగా ఉంటోంది. ఇక ఆహార పదార్థాల వృధాలో దక్షిణ భారతదేశం ముందంజలో ఉంది. ప్రపంచంలో మనదేశంలో పిల్లలకు పౌష్టికాహార లోపం ఎక్కువ. ఈ విషయంలో భారత్ తొలిస్థానంలో ఉంది. 19.4 కోట్లమంది చిన్నారులు సరైన పోషకాహారం లేక ఎదుగుదలలో వెనుకబడుతున్నారు. నిజానికి చైనా ఒకప్పుడు మొదటి స్థానంలో ఉండేది. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఇప్పుడు రెండో స్థానానికి చేరింది. గడచిన రెండుమూడు సంవత్సరాలలో చైనా గట్టి చర్యలు తీసుకుంది. గతంలో 28కోట్లమంది చిన్నారులు అక్కడ పౌష్టికాహార లోపంతో ఉండేవారు. కాగా ఇప్పుడు ఆ సంఖ్య 15 కోట్లకు తగ్గింది.
చైతన్యమే ఆయుధం
ఆకలి సమస్య తీర్చడం ఒకరి పని కాదు. ఏ ఒక్క ప్రాంతానికో చెందిన సమస్య కాదు. ఇది ఐక్యరాజ్య సమితో, ప్రభుత్వాలో చర్యలు చేపడితే సమసిపోయే సమస్య కాదు. ప్రజల్లో చైతన్యమే దీనికి సమాధానం. ఆహార పదార్థాల వృధా నివారణ ప్రతి ఇంటినుంచి మొదలు కావాలి. ఆహార వృధా అరికట్టేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలి. ఈ విషయంలో భారత్‌లో స్వచ్చంద సంస్థలు ఇప్పటికే ముందుకు వస్తున్నాయి. విందువినోదాల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు సేకరించి అన్నార్తులకు అందిస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలి. నిజానికి ఆ స్పృహ అందరిలో కలిగితే ఆకలిని తరిమేయడం, అందరి మోములో వెలుగులు చూడటం కష్టం కాదు.

ఆశలకు ఊపిరి
కొద్ది సంవత్సరాలుగా చేపడుతున్న చర్యలకు ప్రతిఫలం దక్కుతోందని సర్వేల్లో తేలుతోంది. ఇది కొత్తఊపిరినిస్తోంది. 2000 సంవత్సరంలో తీసుకున్న ‘మిలీనియమ్ డెవలప్‌మెంట్ గోల్స్’లో ఒక్కొక్క అడుగూ ముందుకు పడుతున్నాయి. వృధాను అరికట్టడంలో 40 దేశాలు మంచి ప్రగతి సాధించాయి. ఇప్పుడు సబ్ సహారా దేశాలు, ఆఫ్రికా దేశాలపై ప్రపంచం దృష్టి సారించాల్సి ఉంది.

-రామానుజం