ఈ వారం కథ

విద్యాదానం - కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మేము హైద్రాబాద్ వచ్చేశామమ్మా.. మావూళ్లో పనులు దొరకడం లేదు.. మీ ఇంట్లో పనిమనిషి కావాలన్నారంట.. 501 ఫ్లాట్లో కూడా చేస్తున్నాను..’ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది సావిత్రి.
‘ఏమేం పనులు చేస్తావు? పొద్దునే్న రాగలవా?’ అడిగాను.
‘అన్ని పనులూ చేయగలనమ్మా.. మీకేమేం చేయాలి?’ వినయంగా ఆరా తీసింది సావిత్రి.
ఆమె వినయ విధేయతలకి ముచ్చపడి- ‘మీ ఆయన ఏం చేస్తుంటాడు? పిల్లలెంతమంది?’అని అడిగాను.
‘మా ఆయన పక్క అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా వున్నాడమ్మా. ఇద్దరమూ ఇస్ర్తి కూడా చేస్తుంటాం. పిల్లలిద్దరూ గవర్నమెంట్ స్కూల్లో అయిదూ, ఏడూ క్లాసులు చదువుతున్నారు. మేమొచ్చి నాలుగు నెలలవుతోంది. ఇంకో రెండిళ్లు చేసుకుంటేనేగానీ ఖర్చులకి సరిపోయేలా లేదు..’ బాధ వెళ్ళబోసుకుంది.
‘నేను తొమ్మిదింటికే కాలేజీకి వెళ్లిపోవాలి. నీవు బాగా చేస్తే 202 ఫ్లాట్ వాళ్ళు కూడా కుదుర్చుకుంటారు. అన్ని పనులూ చేస్తే చెరి పదిహేనొందలు ఇస్తాం.. సరేనా?’ అన్నాను.
‘ఈ రోజుల్లో ధరలు మీకు తెలీనివామ్మా? ఇంకో రెండు వందలివ్వండి’ అని అడిగి రెండిళ్ళూ కుదుర్చుకుంది సావిత్రి.
***
‘ఏం ఇంత లేటయింది? నాకు లేటయిపోతున్నది.. త్వరగా పని ముగించు..’ అని కోపంగా సావిత్రి వైపు చూశాను.
‘రాత్రి మా ఆయన తాగొచ్చి గొడవ చేశాడమ్మా.. ఒకే రూమ్.. వర్షంలో అందరం ఇబ్బంది పడ్డాం .. లేచేప్పటికి లేటయిపోయిందమ్మా?’
‘అలాగా.. మొహం పీక్కుపోయింది. మీ ఆయన రోజూ తాగుతాడా?’ ఆరా తీశాను.
‘అవునమ్మా.. ఏం చేయను..? నాలుగు డబ్బులు కనిపిస్తున్నాయి.. ఇంట్లో ఖర్చులకి కూడా ఇవ్వడం తగ్గించేశాడు.. ఊళ్ళోని అప్పులు నా సంపాదనతోనే తీరుస్తున్నాను. చాలా కష్టంగా ఉందమ్మా..’.
‘మీ పిల్లలైనా బాగా చదువుకుంటున్నారా?’ ఓదార్చాను.
‘ఆ గవర్నమెంట్ స్కూల్లో ఏమీ చెప్పడం లేదమ్మా.. వాళ్ళే ట్యూషన్ పెట్టించుకోమంటున్నారంట. ఎలాగో అమ్మాయి స్వప్న ఏడో క్లాసు పాసయిపోయిందీ సంవత్సరం. ఎనిమిదో క్లాసుకి ప్రైవేటు స్కూల్లో చేరిస్తే ఎట్లా ఉంటుందమ్మా..?’ సలహా అడిగింది.
‘డబ్బుకిబ్బందంటూ వాపోతున్నావు.. ప్రైవేట్ స్కూల్‌కి ఫీజులెలా కడతావు సావిత్రీ. నీవల్లవుతుందా..?’
‘ఇంకో రెండిళ్లు చేసుకుంటే సరిపోతుందేమోనమ్మా.. పక్క అపార్ట్‌మెంట్‌లో కూడా అడుగుతున్నారు’.
‘సరే.. నేనీ సెలవల్లో ఎంక్వయిరీ చేసి చెప్తాను. తక్కువ ఫీజులతో ఏ ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తున్నారో చూద్దాం. ఆ మధ్య ఒక అనాథ శరణాలయంలో పిల్లని ఎవరో స్పాన్సర్ చేసి దగ్గరి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారని విన్నాను. అక్కడి ఫీజులు మరీ ఎక్కువగా లేవని తెలిసింది..’ ధైర్యం చెప్పాను.
‘సరేనమ్మా! మీ దయ..’ కృతజ్ఞతతో చూసింది సావిత్రి.
***
ఆ రాత్రి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. సావిత్రి పడుతున్న కష్టాలు స్వప్న పడగూడదు. ఏదైనా ఉద్యోగంలో స్థిరపడి తల్లిని సుఖపెట్టాలి. ఈ మూడు సంవత్సరాలూ నేనే ఫీజు కట్టిస్తే గవర్నమెంట్ కాలేజీలో సీటు సంపాదించుకుని ఇంటర్ చదువుతుంది. లేదా ఏదైనా పాలిటెక్నిక్ కోర్సులో చేరుతుంది. ఈ మాత్రం సాయం నేను చేయగలిగితే ఒక గర్ల్ చైల్డ్‌కి మంచి దారి చూపినట్లవుతుంది.
ఆ వేసవి సెలవల్లో సావిత్రినీ, స్వప్ననీ వెంటబెట్టుకుని రెండు, మూడు ప్రైవేట్ స్కూల్స్‌లో ఆరా తీసి వచ్చాను. మర్నాడు- సావిత్రి కష్టాలు వివరించి, స్వప్నకి నేనే ఫీజులు కడతానని చెప్పి ఒక స్కూల్లో అడ్మిషన్ ఫీజు కట్టేశాను. ప్రతి నెలా స్వప్న ఎలా చదువుతున్నదో టీచర్లను అడిగి వచ్చేదాన్ని. స్వప్నకి మంచి మార్కులు రావడం లేదని గమనించి రోజూ సాయంత్రం ఒక గంట నేనే ప్రశ్నలడిగినపుడు ఒక విషయం బయటపడింది. ఏడవ క్లాసు వరకూ పాఠాలు చదవకుండానే జవాబులు బట్టీకొట్టే పద్ధతిలో స్వప్న చదువు సాగిపోయింది. పాఠాలు చదివి జవాబులు స్వంతగా రాయడం నేర్పాలి. పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే తన ఆలోచనా శక్తిని మెరుగుపరచాలి. మూడు సంవత్సరాల్లో నేననుకున్నట్లుగా స్వప్నని మార్చగలిగాను.
***
‘అమ్మా... స్వప్నకి టెన్త్‌లో 7.5 మార్కులు వచ్చినయ్యంటమ్మా. అంతా మీ దయ..!’ అని సావిత్రి చెప్పగానే- నాకే ఫస్ట్‌క్లాసు వచ్చినట్లుగా ఫీలయ్యాను.
‘మీరేమో ఇంటర్ చదివాక నర్సింగ్ కోర్సు చేస్తే ఉద్యోగాలు బాగా ఉన్నాయన్నారు. మా ఆయనేమో ‘నర్స్’ అని చెప్పుకోవడానికి ఏం బాగుంటుందని అంటున్నాడు. నాకేమీ తోచడం లేదు. మీరే చెప్పాలమ్మా’
నా మనసు చివుక్కుమన్నది. రోగాలొచ్చినపుడు దేవతల్లా కనిపించే నర్సుల గురించి వాళ్ళ అభిప్రాయం అర్థరహితమే. అయినా తన కూతురికి ఫీజు కట్టలేని తండ్రి ఆమె భవిష్యత్తునెలా శాసించగలడనే ఆవేదనతో- ‘స్వప్నా.. ఇంటర్ తరువాత డిగ్రీ చేసినా ఉద్యోగాలు వెతుక్కుంటూ రావు. బైపిసి కోర్సుతో ఇంటర్ చదివి నర్సింగ్ కోర్స్ చేస్తే ఏ హాస్పిటల్లోనైనా ఉద్యోగం వస్తుంది. మానవ సేవ చేసిన పుణ్యం దక్కుతుంది. నేను చెప్పిందే చేయమని బలవంతం చేయను. నీవూ ఆలోచించుకో..’ అన్నాను.
ఒక రోజు దగ్గరలోని అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడి వార్డెన్‌ని అడిగాను. రోజూ ఒక గంట సేపు చిన్నపిల్లలకు నేను పాఠాలు చెప్పడానికి ఆమె ఒప్పుకున్నది. సాయంత్రం వేళల్లో నా దగ్గరకు వచ్చిన పిల్లలకు హోంవర్క్ చేయడంలో సాయపడేదాన్ని. కొంతమంది పిల్లలకు వాళ్ళ పుట్టినరోజుల సందర్భంగా తల్లిదండ్రులు తీసుకొచ్చి మిఠాయిలు, పళ్ళు పంచి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకోసం పిల్లలు పాటలు పాడేవాళ్ళు. ఆ పిల్లలు తిండికీ, బట్టకీ లోటు లేనివాళ్ళయినా, వాళ్ళ కబుర్లు విని ఆనందించే మాతృ హృదయానికి చేరువలో లేని లోటు వాళ్ళల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించేది. ఈ రెండు నెలల్లో వాళ్ళకెన్నో కబుర్లు,కథలూ చెప్పి దగ్గరయ్యాననిపించింది.
***
‘స్వప్నని ఏ కాలేజీలో చేరుస్తున్నారు..?’ సావిత్రిని అడిగాను.
‘గవర్నమెంట్ కాలేజీలో చేరనని మొరాయిస్తున్నదమ్మా.. తన ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ కాలేజీల్లో చేరుతున్నారంట. అప్పు చేసైనా ఫీజులు కట్టాలనుకుంటున్నాం. మీరో పదివేలు అప్పు ఇస్తారామ్మా..?’ ఆశగా అడిగింది సావిత్రి.
‘కష్టపడి చదువుకుంటానంటే గవర్నమెంట్ కాలేజీలో చేర్పిస్తాను. అంతేగానీ, ఎవరో కట్టగలిగారని వేలకు వేలు అప్పు చేసి ప్రైవేటు కాలేజీలోనే చదవాలని లేదు. మూడేళ్ళు ఫీజులు కట్టాను కదా అని నన్ను ఇబ్బంది పెట్టకు..’.
‘మీరే ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? పిల్ల టీచర్నవుతానని పట్టుబడుతున్నది. వాళ్ళ నాన్న ఓ ప్రైవేటు కాలేజీలో మాట్లాడి వచ్చాడు. రేపు ఫీజు కట్టేయాలంట. మీరు సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారమ్మా?’ దీనంగా అడిగింది సావిత్రి.
‘కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే- కష్టపడితే ఏదైనా సాధించవచ్చునంటారు సావిత్రీ.. గవర్నమెంట్ కాలేజీల్లో చదివి చాలామంది గొప్పవాళ్ళయ్యారు. కష్టపడి చదివేవాళ్ళని వృద్ధిలోకి తేవడానికి అక్కడ కూడా శ్రద్ధ చూపుతారు. ఏమీ చదవని వాళ్ళని బాగుచేయలేరేమో గానీ, మీ అమ్మాయి లాంటి వాళ్ళని చక్కగా చదివిస్తారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే, అసూయాద్వేషాలు లేని మనిషంటే టీచరే సావిత్రీ.. నా మాట విని మా గవర్నమెంట్ కాలేజీలో చేర్పించండి.. ఇప్పటిలాగే నేను శ్రద్ధ తీసుకుంటాను. నీకే ఖర్చూ వుండదు..’ నచ్చచెప్పాను.
వారం రోజులు గడిచిపోయాయి. వాళ్ళేం ఆలోచించారనేది తెలియలేదు. స్వప్న కూడా రావడం మానేసింది. ఒకవేళ ఆరా తీస్తే- సావిత్రి అప్పడుగుతుందేమోనని నేనూ వౌనంగా ఉండిపోయాను. పది రోజుల తరువాత స్వప్న ఉదయమే తొమ్మిది గంటలకొచ్చి తనతో కాలేజీకి రమ్మన్నది. ఎక్కడికో నాకు అర్థం కాలేదు.
‘ప్రైవేట్ స్కూల్లో కూడా మీరే చేర్చారు గదా... దగ్గరగా ఉంటుందని ప్రైవేట్ కాలేజీలోనే ఫీజు కట్టాం. మీరు నాతో ఒకసారి వస్తారా?’ నవ్వుతూ అడిగింది స్వప్న.
***
ఓ రోజు స్వప్న ఎలా చదువుతున్నదని అడిగినపుడు- ‘చాలా బాగా చదివిస్తున్నారమ్మా.. అక్కడే సాయంత్రాలు కూర్చోబెట్టి చదివిస్తున్నారమ్మా..’ సంతోషంగా చెప్పింది సావిత్రి.
‘అవును.. వేలకి వేలు ఫీజులు కడితే చదివిస్తారు మరి.. చదువుకునే బుద్ధి పిల్లలకే ఉంటే ఇంట్లోనే చదువుకోవచ్చును గదా? అప్పులు చేసి, వడ్డీలు కట్టే బాధ మీకూ తప్పేది’ నిష్ఠూరంగా అన్నాను.
‘మీరివ్వలేదు కదా అప్పు.. బీదవాళ్ళం.. పిల్ల పట్టుబడితే అప్పు చేయక తప్పుతుందా..?’
నా మనసు ఒక్కసారిగా కుంగిపోయింది. అందుకే- నా మనసు ఒక్కసారి మూడు సంవత్సరాల వెనక్కు పరిగెత్తింది. స్వప్నని బాగుచేయాలనే పట్టుదలతో పాఠాలు చెప్పేందుకే ఆనాడు ఎక్కువ శ్రమ తీసుకున్నాను. ఫీజు కట్టినందుకు బాధ లేదు. అయినా, ఇప్పుడు సావిత్రి నా శ్రమని డబ్బుతోనే ముడిపెట్టింది. మానవ సంబంధాలు ‘మనీ’ సంబంధాలే అనుకోవాలా? నేనే స్వప్నకి ప్రైవేటు చదువులు అలవాటు చేసి, నా శ్రద్ధతోనే టెన్త్ గట్టెక్కిందని అనుకుంటున్నానా..? ఎవరో అప్పిచ్చారని పొగరుగా మాట్లాడుతున్న సావిత్రి వల్ల నేనెందుకు కుంగిపోవాలి..? అని సర్ది చెప్పుకున్నాను.
***
ఆ రోజు అనాథ శరణాలయానికి వెళ్లినపుడు పిల్లలంతా ఒకేసారి ‘‘మేడం.. మీరు శ్రీరామనవమికి తెచ్చిన పానకం ఇంకోసారి తెస్తారా..? మాకు మళ్లీ తాగాలని ఉంది..’ అన్నారు.
నాకు ఆ క్షణంలో అనిపించింది- వీళ్ళకు తరచుగా తినే కేకులు, మిఠాయిల కన్నా అరుదైన ఆప్యాయతని రంగరించి పోసిన పానకమే మిన్న అని. వీళ్ళకసలు అప్పులే తెలియవు. వీళ్ళు అలమటిస్తున్నది అమ్మలోని అనురాగం, ఆప్యాయతల కోసమే! ఎంతోమంది చదువుకున్నవాళ్ళు ‘కిట్టీ పార్టీలం’టూ వెచ్చించే సమయంలో కొంత సమయం ఈ చిన్నారులకు వెచ్చిస్తే ఎంత బాగుంటుందో? అని అనుకున్నా. మానవ సంబంధాలకు అసలైన అర్థం- ఆ పిల్లల ఆర్ద్రమైన చూపుల్లోనే అవగతమైంది.
***
‘అమ్మా..! మీరో అయిదువేలయినా అప్పివ్వకపోతే నా ఇల్లు గడవదమ్మా.. చాలా అప్పులు చేశాం..’ సావిత్రి మళ్లీ పాతపాట మొదలెట్టింది.
‘అప్పిస్తాను గానీ, రేపు నీ కొడుకు కూడా ప్రైవేట్ కాలేజీలోనే చదువుతానంటే నేను సర్దగలనా? మాలాటి మధ్యతరగతి వాళ్ళను ఈ అప్పులు భయపెడతాయి గానీ, మీకేమీ భయమంటూ ఉండదా?’ అంటూ అయిదువేలిచ్చాను.
రెండు నెలలు గడవకుండానే మళ్లీ ఐదువేలు బదులడిగింది సావిత్రి.
‘ఏమిటి..? అప్పులకి అంతంటూ వుండదా? ఇక నేను ఇవ్వనుగాక ఇవ్వను..’ తేల్చి చెప్పాను.
‘ఇలా అయితే నేను వేరే ఇల్లు చూసుకుంటానమ్మా.. మీ ఇష్టం’ నిక్కచ్చిగా చెప్పింది సావిత్రి.
‘పాత్రాయ కృతం దానం’ అని ఎందుకన్నారో ఇపుడు అర్థమయింది. ఫీజుల రూపంలో కాక నా ఆత్మీయతనే కోరుకుంటున్న అనాథ శరణాలయంలోని చిన్నారులతో కొన్నాళ్లుగా పెనవేసుకున్న బంధమే అసలైన మానవ సంబంధం అనిపించింది. రోజూ సాయంత్రం వాళ్ల చేత హోం వర్క్ చేయిస్తూ, నైతిక విలువలతో కూడిన కథలు వారికి చెప్పడంలోనే నా విద్యాదానం సఫలీకృతమయింది.
*

రచయిత్రి సెల్ నెం: 939 1011 891

-ముసునూరు ఛాయాదేవి