డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 100

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలస్యం చేశావంటే నేను మన్మథ తాపంతో మరణిస్తాను. కావున నిజంగా నీవు నా మేలు కోరినదానివైతే ‘‘నీవు అవివేకివి’’ అంటూ అసంగతాలైన మాటలతో నన్ను నిందించకుము. శీఘ్రంగా సైరంధ్రిని పిలిపించుము’’ అని అన్నాడు కీచకుడు.
కీచకుడలా చెప్పేటప్పటికి సుదేష్ణ శోకంతో మిక్కిలి వ్యధ చెందింది. తరువాత అతడితో
‘‘నీ కారణంగా నా సోదరులు, మంత్రులందరూ నశించిపోతారు. నేను దీనికోసం యేమిచేయగలను. నీమేలేదో నీవు తెలుసుకొనలేక పోతున్నావు. కేవలం కామానికి దాసుడవయ్యవు. ఓ నరాధమా! నీవు నన్ను చేయకూడని పాపకృత్యానికి యొడిగట్టేలా చేస్తున్నావు. కులంలో యొక్కడు పాంప చేస్తే వాని కారణంగా కులంలోని వారంతా నశించిపోతారని పూర్వం పెద్దలు, నిపుణులు సరిగానే చెప్పారు. నేను ఈ సమస్త పరిణామాలను తెలిసిగూడా సోదర ప్రేమతో నీ ఆజ్ఞను పాటిస్తున్నాను. అదే నాకు అన్నింటికీ మింగిన దుఃఖ కారణం. నీవు మాత్రం వంశాన్నంతరింపచేసి సంతుష్టుడవగుదువుగాని’’ అని సుదేష్ణ దుఃఖిస్తూ అన్నది.
తదుపరి సుదేష్ణ తాను చేయవలసినదేమిటో ఆలోచించి కీచకుని కోరికను గుర్తించి అతడికి ద్రౌపది యొక్క పొందు లభించడానికి తగు యుపాయాన్ని ఆలోచించి కీచకుడితో అన్నది
‘‘కీచకా! ఎందుకు అంతగా చింతిస్తావు. ఎట్లాగైనా సైరంధ్రిని యొప్పించి నీతో పొందును కల్పించటం అసాధ్యమేమీగాదు. ఊరట పొంది యింటికి వెళ్ళుము. నీ యింటిలో మద్యాన్నీ, భోజన సామగ్రినీ సిద్ధం చేయించుము. ఆపై నేను సైరంధ్రిని ‘సుర’తెచ్చే పనిమీద నీవద్దకు పంపుతాను. అక్కడికి పంపబడిన ఆమెను యేకాంతంలో యేలాంటి ఆటంకం లేకుండా నీ యిష్టానుసారం బుజ్జగించుకో, అప్పుడు నీకు ఆమె వశపడటానికి సిద్ధం కావచ్చును’’ అని అన్నది.
అక్క మాటలతో తృప్తి చెందిన కీచకుడక్కడినుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి సమయాను కూలంగా రాజులు యుపయోగింపదగిన యుత్తమమైన, రుచికరమైన మద్యాన్ని తెప్పించాడు. రక రకాల పిండి వంటలను, శ్రేష్టమైన యన్నపానాలను తయారుచేయించాడు. ఒక మనోహర ప్రదేశంలో కూర్చుండి యవివేకి కావడంచేత సైరంధ్రి తన దగ్గరికి వచ్చినటుల నలో మన్మథ భావాలను రేకెత్తించినట్లు భావించి ఆ భావనలో కొట్టుమిట్టాడసాగాడు. ‘‘ఆ కోమలి నా ముందు విలాసంగా మసలితే చాలు. నన్ను కన్నుతెరచి చూస్తే చాలు. ఆమె నన్ను పొందితే చాలు. అవన్నీ నా శరీరానికి అమృతాన్నభిషేకం చేసినట్లు. నాకు శ్రవణానందాన్ని కలిగించినట్లు. నాకు పరమానందం సిద్ధించినట్లు. ఈ పుట్టుక పుట్టినందులకు ఫలాన్ని పొందినట్లు’’ అని ఊహించుకొని మన్మధుడికి వశమైపోయాడు.
కామాందుడై పలవరింపులు, ప్రేలాపాలు చేస్తున్నాడు. సైరంధ్రి రాకకై యెదురుచూస్తున్నాడు. అప్పుడు అంతఃపురంలో సుదేష్ణ సైరంధ్రిని రావించింది. సైరంధ్రితో
‘‘సైరంధ్రీ! లే. కీచకుని యింటికి వెళ్ళుము. కళ్యాణీ! నాకు దాహం వేసి బాధిస్తోంది. అందుకని అక్కడినుండి నేను త్రాగటానికి తగిన పానీయాన్ని తెచ్చిపెట్టుము.’’ అని అనగా
‘‘రాజకుమారీ! నేను అతని యింటికి వెళ్ళలేను. మహారాణీ! నీకుగూడా తెలుసుగదా అతడెంత సిగ్గుమాలిన వాడో? నేను నీ భవనంలో నా భర్తల దృష్టిలో స్వేచ్ఛాచారిణిగ, వ్యభిచారిణిగా మారియుండలేను. నేను ఈ రాజభవనంలో ప్రవేశించే సమయంలోనే చేసిన ప్రతిజ్ఞ కూడా నీకు తెలుసు. అతడు మదన దర్పంతో ఉన్మత్తుడైయున్నాడు. అతడు నన్ను చూడగానే అవమానిస్తాడు. నేనక్కడికి వెళ్ళను. ఇంకా చాలామంది దాసీలున్నారు. వారిలో యెవరినైనా పంపుము. నీకు మేలు జరుగుతుంది’’ అని ద్రౌపది చెప్పగా సుదేష్ణాదేవి.
‘‘నేను నిన్ను యిక్కడినుండి పంపుతున్నాను. కనుక అక్కడ అతడు నీకు ఎట్టి హానీగానీ చేయడు.‘‘ అని చెప్పి సైరంధ్రి చేతిలో ఒక మూతయున్న బంగారు పాత్రను పెట్టింది.
ద్రౌపది ఆ పాత్రను తీసికొని శంకించింది. ఏడుస్తూ తన పాతివ్రత్యాన్ని రక్షించుకోవడానికై మనసులోనే సూర్యభగవానుని వేడుకొంది. ‘‘్భగవాన్! సూర్యదేవా! నేను నా పతులను తప్ప మరెవరనీ మనస్సులో తలపనిదానినైతే, ఆ సత్యప్రభావం వలన కీచకుడు తన యింటికి వచ్చు అబలనైన నన్ను బలవంత పెట్టకుండును గాక!’’ అని సూర్యుని ఆరాధిస్తూ యుండిపోయింది. తదుపరి కీచకుని యింటికి బయలుదేరి వెళ్ళింది.
సూర్యభగవానుడు ద్రౌపది వేడుకను మన్నించి అప్పటి ఆమె పరిస్థితినంతటిని గ్రహించి ఆమె రక్షణకై అదృశ్యరూపంలో ఒక రాక్షసుడిని నియమించాడు. ఆ రాక్షసుడు యెట్టి పరిస్థితులలోనూ పతివ్రతయైన ద్రౌపదిని అక్కడ అసహాయురాలిగా వదలిపెట్టడు.
ద్రౌపది వచ్చింది. ఆమెను చూచిన కీచకుడు ఆనందంతోపొంగిపోయి దిగ్గున లేచాడు. నదిని దాటాలనుకొనే వానికి ఒక నావ లభించినంత ఆనందం పొందాడు. ఓపిక పట్టలేని ఆ నీచ కీచకుడు ద్రౌపదిని చూచి
..........................ఇంకావుంది

-- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము