డైలీ సీరియల్

యాజ్ఞసేని-99

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీచకుడి నీచమైన ప్రేలాపనకు కలత చెందిన ద్రౌపది తనను తాను నిగ్రహించుకొని నేర్పుగా తప్పించుకోవాలని వాడితో
‘‘సూతపుత్రా! నీవు కోరదగని నన్ను కోరుతున్నావు... నేను హీనజాతిదానను. పైగా సైరంధ్రిని. వెగటు కలిగించే వస్త్రాలను ధరించిన దానను. ఇతరులకు కేశాలంకారాలను చేసి జీవించే దానను.
ఓ అన్నా అన్నిటికీ మించి నేను పరస్ర్తిని. కష్టాలలో వున్న నా పరిస్థితి నీవు వూహించటం లేదు. నా కట్టు, బొట్టు, తీరు యెంత అసహ్యంగా వున్నాయో ఆలోచించు. ఈ పరిస్థితిలో గూడా నీకు మదనవికారం కలగటం యేమీ భావ్యంగాలేదు. మంచివారు యిటువంటి మాటలు మాట్లాడవచ్చునా? నీవూ తోబుట్టువులు వున్నవాడివి. అందువలన అందరినీ ఆడబడుచులుగా భావించాలి. అట్లా మాట్లాడగూడదు. తక్కువ కులంలోని దాననూ, పతివ్రతనూయైన నన్నిట్లా యడగవచ్చునా?
అనుచిత కార్యాలు సర్వధా విడువదగినవి. ఇదే సత్పురుషుల వ్రతం. అసత్విషయాలలో యాసక్తిగలిగిన పాపాత్ముడైన పురుషుడు మోహంలోబడి ఘరమైన యపకీర్తిని పొందుతాడు. లేదా పెద్ద భయాన్ని (చావును) నెదుర్కొనవలసి వుంటుంది’’ అని సైరంధ్రి అన్నది.
ఈ రీతిగా హెచ్చరించినా కీచకునకు బుద్ధిరాలేదు. వాడు కామమోహితుడై వున్నాడు. ఇంద్రియ నిగ్రహం లేని కీచకుడు మరలా
‘‘పద్మాక్షీ! నా ఈ కోరిక తిరస్కరించకు. చారుహాసిని నీ గురించి నేను మన్మథునిచే పీడింపబడుచున్నాను. నేను నీకు అధీనుడను. నన్ను తిరస్కరించి నిశ్చయంగా నీవు పశ్చాత్తాపం పొందుతావు. నేను ఈ సమస్త రాజ్యానికి అధిపతిని. ఈ రాజ్యాన్ని నిలబెట్టినది నేనే. బల పరాక్రమంలో ఈ భూమి మీద నాతో సమానులు లేరు. ఈ దాసి పనిలో నీకెందుకాసక్తి.? ఈ సమస్త రాజ్యాన్నీ నీకు అప్పగిస్తాను. నీవు యిప్పుడు దీనికి మహారాణివి. నన్ను స్వీకరించుము’’ అని ప్రాధేయపడ్డాడు.
కీచకుని మాటలను విన్న ద్రౌపది వాడితో ‘‘ఓరుూ! సూతపుత్రా! మోహము వలదు. ఈ దినము జీవితము వదలకుము. అయిదుగురు ఘోర రూపులు నన్ను అనుక్షణం కాపాడుతుంటారు. నేను నీకు చేజిక్కను. నా పతులు గంధర్వులు, వారు కోపగించినచో నిన్ను చంపుదురు. ఊరక చావును కొనితెచ్చుకొనకుము. నీవు భూమిలో ప్రవేశించిననూ, ఆకసమునకెగసిననూ, సముద్రపు యావలి యొడ్డుకు పరుగెత్తిననూ వారి నుండి తప్పించుకొనజాలవు. వారు దేవతలు. ఆకసమున సంచరించరించువారు. ఓరుూ నీచుడా! నన్నవమానించితివో యెప్పుడోకాదు, యిప్పుడే ఈ క్షణమే పుత్రులతో, బంధువులతో కూడి కలసి చత్తురు. నా సంగతి యెఱుగక కామ రోగముతో తులువ పలుకులు పేలుచున్నావు. మహాత్ముల భార్యను అవమానించినవాడు చావక యెన్నటికనీ తప్పించుకొనజాలడు. అగ్నిలో ప్రవేశింప దలచుకొన్న నిన్ను యెవరు రక్షింపగలరు. గుట్టుగా బ్రతుకుచున్న నన్ను అవమానించువాని దేవ గంధర్వుల సమూహమునగానీ, పాతాళమునగానీ, రాక్షసుల లోకమునగానీ, బ్రదుక గోరినచో నీకు శరణు లభింపదు. ఓరీ కీచకా! తల్లి ఒడిలోని పిల్లవాడు చంద్రుని పట్టుకొనకోరినట్లు నన్ను పొందుగోరుదువా? నన్ను కామించు నీకు భూమిపై గానీ, ఆకసమున గానీ రక్షకుడుండడు’’ అని కఠిన పదజాలముతో కీచకుని వారించినది.
ద్రౌపది ఈ విధంగా ధిక్కరింపగా కీచకుడు సుదేష్ణాదేవి వద్దకు వెళ్ళి ఆమెతో
‘‘ఓ కైకేయి రాజపుత్రీ! సుదేష్ణా! సైరంధ్రి నన్ను పొందునట్లుగా చేయుము. ఉపాయమును ఆలోచించుము. ఆ యుపాయము నా ప్రాణముల నిలబెట్టవలయును’’ అని అన్నాడు.
అప్పుడు సుదేష్ణ వానియందు దయజూపించి వాడితో
‘‘కీచకా! సైరంధ్రి నన్ను శరణచొచ్చినది. ఆమె కు నేను అభయమిచ్చితిని. ఆమె నడవడి చాలా మంచిది. నీకు పుణ్యముంటుంది. నేను ఆమెకు చెప్పజాలను. ఇతరులెవ్వరూ ఆమెను పాపబుద్ధితో ముట్టజాలరు. ఆమెను ఐదుగురు గంధర్వులెపుడూ రక్షిస్తూ యుంటారు. సుఖపెట్టుదురట. ఇట్లని ఆమె మొదటనే నాకు చెప్పింది. ఆ మహాత్ములు కోపించినచో జీవితము నాశనము చేయుదురని కూడా నాకడ సత్యమునే చెప్పినది. అంతేకాదు రాజుగూడా మొదట ఈమెను చూచి మోహపడినాడు. నేను మంచి మాటలతో రాజు ను దారికి తెచ్చినాను. గంధర్వుల భయముతో ఈమెను రాజు మనసులోగూడా తలచుట లేదు. ఆ గంధర్వుల బలము గూర్చి సైరంధ్రి నాకు చెప్పినది. నీవు చుట్టమువు గనుక స్నేహముతో నేను నీకు ఈ రహస్యమును చెప్పుచున్నాను. నీకు ప్రాణములపయిన తీపి యున్నచో ఆమె యందు మనసు పెట్టు ఆలోచన చేయకుము’’ అని సుదేష్ణ అనగా
‘‘నేను వందలు, వేలు, లక్షలు గంధర్వులను కూడా ఒక్కడినే చంపివేయగలను. ఇక నాకు ఐదుగురొకలెక్కా? నీవు నాకు బుద్ధులు చెప్పటం మాని వేయుము. ఏదో ఒక యుపాయముతో నాకు ఆమెను పొందే సౌఖ్యాన్ని కలిగించుము.

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము