డైలీ సీరియల్

యాజ్ఞసేని-94

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిగర్త రాజైన ‘సుధన్వుడు’ ధనుర్ధారుడై రథాన్ని దిగి యుధిష్ఠిరుడి నాలుగు గుఱ్ఱాలను చంపివేశాడు. కాలినడకన దగ్గరగా వచ్చిన సుధన్వుడిని ఒక అర్థచంద్రబాణంతో గుండె బ్రద్ధలయ్యేటట్లు ధర్మరాజు నరికి చంపగా రక్తాన్ని గ్రక్కుతూ అతడు నేలపైబడ్డాడు.
మరొకవైపున క్షేమంకరుడు, మహాముఖుడు అనే రాజులిద్దరూ నకులుని ఎదుర్కొని అతడిపై బాణవర్షం కురిపించారు. వారిద్దరినీ నకులుడు విపాఠమనే ఒక్కొక్క బాణంతో నేలకూల్చాడు. అంత వారి అన్న అయిన సురథుడు ఏనుగుమీద రాగా, ఆ ఏనుగు తొండాన్ని దంతాలతో సహా కత్తితో నరికివేశాడు.
పదునైన బాణాలను ప్రయోగించి సహదేవుడు యుద్ధ రంగంలో అశ్వికులను సంహరించి వీర విహారం చేశాడు.
అర్జునుడు తన బాణాలకు అడ్డు వచ్చిన త్రిగర్తులను, సైంధవులను, శిబి, ఇక్ష్వాకు ప్రముఖులందరినీ చంపివేశాడు. కోపంతో తనను ఎదుర్కొన్న పండ్రెండు మంది సౌవీర కుమారులందరి శిరస్సులను ఖండించి చంపాడు.
యుద్ధప్రదేశమంతా పీనుగుల పెంటతో నిండిపోయింది. యుద్ధ బీభత్సాన్ని చూచిన జయద్రథుడు భయపడి తన ప్రాణాలను రక్షించుకొనటానికై ద్రౌపదిని రథంనుండి క్రిందికి దింపి తాను వేగంగా రథాన్ని తోలుకొని అడవిలోనికి పోయాడు.
ధౌమ్యుడు ముందు నడవగా వెనుక వస్తున్న ద్రౌపదిని చూచి ధర్మరాజు సహదేవుని పంపి ఆమెను రథంలోనికి ఎక్కించాడు.
అర్జునుడు ఇంకనూ సైనికులను చంపుతున్న భీమసేనుని చూచి అతడిని శాంతింపజేసి ‘‘వ్యర్థంగా దీనులు, అమాయకులు అయిన భటులను వధించటం మంచిదిగాదు. జయద్రథుడు సిగ్గుమాలి యుద్ధాన్ని విడిచి పారిపోయాడు. మనం అతడిని వెంబడించి అతడి ప్రాణాలను తీయాలి’’ అని అనగా భీముడు ధర్మరాజుతో-
‘‘అన్నా! ధర్మరాజా! ద్రౌపదిని తీసుకొని మీరూన్నూ, ధౌమ్యుడు, నకుల సహదేవులు నిశ్చితంగా ఆశ్రమానికి వెళ్ళండి. నేనూ అర్జునుడూ ఆ నీచుడు జయద్రథుని ముట్టడిస్తాం’’ అని అనగా-
ధర్మరాజు ‘‘మహాభాగా! జయద్రథుడు ఎంతటి దుర్మార్గుడైనా అతడిని వధించటం కూడదు. అతడు ధృతరాష్ట్రుడి కూతురైన ‘దుస్సల’ (దశ్శల) భర్త. మనం గాంధారి, దుస్సలను చూచి అతడు చేసిన నేరాన్ని క్షమించవలయును. చంపగూడదు’’ అని అన్నాడు.
ఆ మాటలను విన్న ద్రౌపది ఇంద్రియాలన్నీ వ్యాకులం చెందగా, లజ్జావతి అయినప్పటికీ కోపంతో భీమార్జునులను ఉద్దేశించి ‘‘మీరు నాకు ప్రియం చేదలచుకొంటే ఆ నరాధముని వధించండి. భార్యను అపహరించిన శత్రువునిగానీ, రాజ్యాన్నిగానీ హరించిన శత్రువునుగానీ యుద్ధంలో ప్రాణదానం చేయమని ప్రాధేయపడినా వదలిపెట్టగూడదు’’ అని అన్నది.
పిమ్మట భీమార్జునులు తమ రథాలను వడిగా తోలుకొని జయప్రథుడిని సమీపించారు. అర్జునుడు దూరంలో ఆకస్మికంగా పడే బాణాలను ప్రయోగించి జయద్రథుడి రథాశ్వాలను నేలకూల్చాడు. అభిమంత్రించిన బాణాలను ఉపయోగించి ఈ దుష్కర కార్యాన్ని చేశాడు.
అంత భీమార్జునులను చూచిన సైంధవుడు కేవలం పారిపోవాలనే తపనతోనే అడవిలోనికి పరుగెత్తాడు. అప్పుడు అతడిని వెంబడించిన అర్జునుడు ‘‘రాకుమారా! ఇలాంటి పరాక్రమంతోనే పర స్ర్తిని బలవంతంగా పొందాలనుకొన్నావా? వెనుకకు తిరుగు. పారిపోవడం నీకు తగదు. శత్రుమధ్యంలో నీ సేవకులను వదలి ఎలా పారిపోతావు’’ అని అన్నాడు.
అయినా సైంధవుడు వెనక్కి తిరిగలేదు. భీముడు కోపంతో రథం దిగి పరుగెడుతున్న అతడిని వెంబడించి అతడి జుట్టు పట్టుకొన్నాడు. అప్పుడు దయాళువు అయిన అర్జునుడు ‘అతడి ప్రాణాలను తీయకు’ అని అన్నాడు.
భీముడు సైంధవుడిని పైకెత్తి భూమిపై పడవైచి నలిపివేశాడు. తలపట్టి ఎడా పెడా వాయించి వేశాడు. లేవబోతన్న అతడిని కాలితో తన్నాడు. అరుస్తూ ఏడుస్తున్న జయద్రథుడిని తనమోకాళ్ళ రెంటితో నొక్కి పట్టి పిడికిళ్ళతో పొడిచాడు. అర్జునుడు మరలా వారించి-
‘‘కురునందనా! దుస్సలను గురించి మహారాజు చెప్పిన మాటలను పాటించుము’’ అని అన్నాడు.
అప్పుడు భీముడు ఒక అర్థచంద్ర బాణంతో జయద్రథుడి జుట్టును పంచశిఖలుగా కత్తిరించాడు. ‘‘మూఢుడా! నీవు జీవించాలనుకుంటే రాజుల సభలో, పెద్దల సభలో నేను యుధిష్ఠిరుడి సేవకుడను’’ అని చెప్పాలి. అలా అయితే నీకు ప్రాణదానం చేస్తాను అని అన్నాడు. సైంధవుడు ఆ మాటలకు ‘అలాగే జరుగుతుంది’ అని అన్నాడు.

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము