డైలీ సీరియల్

యాజ్ఞసేని-85

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యభామా! నీవు ఎంతటి అందగత్తెవి అయిననూ నన్ను తక్కువ స్థాయిలోని ఆడువారితో జమకట్టి ఇటువంటి మాటలు మాటాడవచ్చునా? నీవు ఇటువంటి మాటలు పలుకుతావనే విషయాన్ని నేను ఊహించలేదు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుని భార్యగా ఉండదగిన అర్హత నీలో లేదు సుమా? శ్రీకృష్ణునికి ఇష్టమైన రాణివి, మంత్ర తంత్రాలు పెట్టే భార్యను గురించి తెలిస్తే అతడు చాలా వ్యాకుల పడతాడు. మంత్ర తంత్రాలతో భర్త భార్యకు వశవౌతాడని అనుకుంటున్నావా? ఎందరో స్ర్తిలు భర్తను వశపరచుకోవాలని వారిని జలోదర, శే్వతకుష్ఠు వ్యాధులకు గురిచేశారు. నపుంసకులుగా, గుడ్డివారుగా, మూగవారుగా కూడా చేశారు.
సత్యా! మహాత్ములైన పాండవులతో నేనెలా ప్రవర్తిస్తానో యధార్థంగా చెపుతాను వినుము! నేను అహంకారాన్నీ, కామక్రోధాలనూ ఎప్పుడూ దరిచేరనీయక పూర్తిగా ఏకాగ్రతతో నిత్యమూ పాండవులనూ వారి ఇతర భార్యలను సేవిస్తుంటాను. అన్యకాంతల యెడల అనురక్తులై వారిని కూడినప్పటికినీ నేను కోపం చెందను. ఎల్లప్పుడూ భర్తల ఎడల వినయంతో, పూజ్యాభావంతో వారికి సపర్యలను చేస్తాను. భర్తల అభిప్రాయాలను గ్రహించి అనుసరిస్తాను. వింత పనులను చేయను. కౌంతేయులు సూర్యాగ్ని సములు. చంద్ర సమానులు. మహారథులు కంటితోనే శత్రువులను చంపగల ధీరులు.
దేవుడయినా, పరపురుషులు దేవతలైనా సరే, మనుష్యుడైనా, గంధర్వుడైనా, అందగాడైనా సరే వారిని గడ్డిపోచతో సమానంగా చూస్తానేగానీ వారి యెడల పతి భావన చేయను. స్నానం, భోజనం, శయనం మున్నగు సౌకర్యాలను భర్తలకు ముందుగా ఏర్పరిచి, తదుపరి నేను అనుభవిస్తాను.
భర్తలు ఇంటికి విచ్చేసినపుడు లేచి అభినందిస్తాను. వాళ్లకు కాళ్లు కడగుకొనటానికి నీరు, కూర్చోవటానికి ఆసనాలు నేనే స్వయంగా ఏర్పాటుచేస్తానుగానీ, ఆ పనులు చేయటానికి సేవకులను నియోగించను. నా పతులకు ఆయాసమయాలలో కనిపెట్టి నిర్ణీత పద్ధతి తప్పకుండా స్నానం, ఆసనం, మున్నగు సదుపాయాలను సమకూరుస్తాను. ధాన్యంగానీ, ధనం గానీ వ్యర్థంకానీయను. చుట్టాలకు సంతోషాన్ని కలిగిస్తాను. పలు మారులు ఇంటి గుమ్మం దగ్గర, ముంగిలి వాకిట్లో తిరుగుతూ ఉండటం, చెడ్డ ఆడువారితో ఎక్కువగా స్నేహం చేయటం, వాదులాడటం, హాస్యపు మాటలతో మితిమీరి నవ్వడం అనేవి నాకు ఇష్టం కలిగించేవిగావు. అట్టిపనులకు పోను.
సుందరీ! భర్త లేనపుడు, ఎచ్చటకైనా వెళితే పూలనలంకరించు కొనటం మానివేస్తాను. వ్రతాలు ఆచరిస్తుంటాను. భర్త తినని వాటిని, త్రాగని వాటిని, సేవించని వాటిని నేను గూడా విడిచి పెడతాను.
మా అత్త గతంలో నాకు చెప్పిన కుటుంబ ధర్మాలన్నింటినీ ఎప్పుడూ ఏమరుపాటు లేకుండా పాటిస్తాను. పగలు రేయి కూడా అలసత్వం లేకుండా భిక్షపెట్టటం, బలివైశ్వదేవం, శ్రార్థం, పర్వకాలలో చేయదగిన స్థాలీపాకం, మాన్యులను సత్కరించటం మొదలైన పనులనూ, నియమాలను అన్నింటినీ సప్రయత్నంగా పాటిస్తాను.
భర్త ఏలుబడిలో ఉండటమే స్ర్తిలకు సనాతన ధర్మం. భర్తయే దేవుడు. పతి ఏడుగడ. ఆయనే గతి. అటువంటి భర్తకు ఇష్టం లేనట్లుగా ఏ స్ర్తి ప్రవర్తించగలదు? నేను భర్తలను మించిపోను. వారికంటే ఎక్కువ తినను. ఎక్కువగా అలంకరించుకొనను. అత్తగారికి ఎదురుచెప్పను. ఆ కుంతీమాతకు నిత్యము నేనే పరిచర్యలను అలరిస్తాను. వస్త్ర, భూషణ, భోజన విషయాలలో ఎప్పుడూ ఆమెను మించిపోను. సత్యభామా! భర్త మనస్సును లోబరచుకొనేందుకు నీకొక ఉపాయం చెపుతాను. దానిలో భ్రాంతికి అవకాశం లేదు. ఈ మార్గంలో యథాతథంగా నడిస్తే నీ భర్తను ఇతర పత్నులనుండి నీ వైపుకు లాగవచ్చును. సత్యా! దేవలోకంతో సహా ఏ లోకంలోగూడా భార్యకు భర్త వంటి దైవము మరొకరు లేరు. భర్త ప్రసన్నుడైతే స్ర్తిలకు కోరికలన్నీ తీరుతాయి. భర్త కోపిస్తే కోరికలు నశిస్తాయి. భర్త సేవ వలననే స్ర్తికి సంతానం, శయ్య, ఆసనం, అందమైన వస్త్రాలు, మాలలు, సుగంధాలు, స్వర్గలోకం, మహాకీర్తి అన్నీ లభిస్తాయి. పతివ్రత అయిన స్ర్తి దుఃఖం ద్వారానే సుఖాన్ని పొందగలదు. నీవు నిత్యము సౌహృదయంతో, ప్రేమతో, వ్యవహార కౌశలంతో, పుష్పమాలలతో, ఔదార్యంతో శ్రీకృష్ణుని ఆరాధించుము. దానితో ‘‘సత్యకు నేనంటే చాలా ఇష్టం’’ అని భావించి నినే్న మనస్సులో నిలుపుకొనేటట్లు ప్రవర్తించుము.

- ఇంకా ఉంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము