డైలీ సీరియల్

యాజ్ఞసేని-84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకుల సహదేవుల అభివాదాలను స్వీకరించాడు. అర్జునుని కౌగిలించుకున్నాడు. ద్రౌపదిని ఓదార్చాడు.
శ్రీకృష్ణవాసుదేవుడు కొంత విశ్రాంతి గైకొన్న తరువాత పాండవులతో ఆసీనుడైనాడు. అప్పుడు ద్రౌపదిని చూచి-
‘‘యాజ్ఞసేనీ! ద్రౌపదీ! అర్జునుని పొంది నీ మనోరథాన్ని ఈడేర్చుకున్నావు. ఇది నీ అదృష్టం. పాంచల రాకుమారీ! నీ బిడ్డలు మంచివారు. ధనుర్వేద విశారదులు. వారు సజ్జనుల మధ్య నిలిచి సత్పురుషుల మార్గాన్ని అనుసరించి వర్తిస్తున్నారు. నీ పిల్లలు, నీ తండ్రి, సోదరులు పిల్చినా మేనమామలవద్ద ఉండటానికి ఇష్టపడలేదు. నీవుగానీ, కుంతీమాతగానీ ఏ విధంగా బుద్ధులు చెప్పి పిల్లలను పెంచగలరో అదేవిధంగా ‘సుభద్ర’కూడా ఏమరుపాటు లేకుండా వారిని పెంచుచున్నది. అభిమన్యుడు శూరులైన నీ కుమారులకు గద కత్తి, డాలులను ప్రయోగించటంలో, వివిధాస్తవ్రిద్యలలో అవిశ్రాంతంగా తీర్చిదిద్దుతున్నాడు అని చెప్పాడు. తదుపరి-
శ్రీకృష్ణ్ధర్మరాజులు మాట్లాడుకొనుచుండగా మహాతపస్వి, తపోవృద్ధుడైన మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చాడు. పాండవులు, శ్రీకృష్ణుడు, బ్రాహ్మణులు మహర్షికి అర్ఘ్యపాద్యాలనిచ్చి పూజించారు.
అనంతరం కొంతకాలంపాటు మార్కండేయ మహర్షి శ్రీకృష్ణ పాండవులకు, బ్రాహ్మణులకు విప్రమహాత్మ్యమును, అత్రిముని, పృథు మహారాజుల ప్రశంసలను, తారక్ష్య సరస్వతీ సంవాదమును, వైవస్వత మనువు చరిత్రను, కలిప్రభావమును, ఇంద్ర బక సంవాదమును, ఇంద్రద్యుమ్నుని వృత్తాంతాన్ని, శిబి మహాత్మ్యము, పతివ్రతా మహాత్మ్యముల గురించి వివరంగా తెలియపరచాడు.
43
ద్రౌపదీ సత్యభామల సంవాదం
పాండవులు అరణ్యవాసం చేస్తున్నపుడు మార్కండేయ మహర్షి వచ్చి వారికి ఎన్నో కథలను వివరించి చెప్పాడు. మార్కండేయ మహర్షి రావడానికి పూర్వమే శ్రీకృష్ణ వాసుదేవుడు కూడా తన ధర్మపత్ని అయిన సత్యభామతో వచ్చాడు. పాండవులతోపాటు ఆ పురాణ కథాగోష్ఠిలో పాల్గొన్నాడు. సత్యభామ ప్రగల్భ్యవతిగా, స్వాభిమానవతిగా ప్రసిద్ధినెక్కిన వనిత. ద్రౌపది వినయ వనిత.
మహాత్ములైన విప్రులూ, పాండవులు ఆశీనులై ఉండగా ద్రౌపదీ సత్యభామలిద్దరూ ప్రక్కనే కూర్చున్నారు. ఒకరినొకరు చూసికొని చాలాకాలమవడంతో ఇద్దరూ పరిహాసాలు చేసుకొంటూ ఉన్నారు. కురుయదు వంశాలలో జరిగిన విశేషాలన్నీ చెప్పుకొంటున్నారు. ఇరువురు కొంచెం ప్రక్కగా జరిగిపోయి సంభాషించుకొంటున్నపుడు సత్యభామ ఒక్కింత పరిహాస ధోరణిలో రహస్యంగా ద్రౌపదితో-
‘‘ఓ నలినాక్షీ! ద్రౌపదీ! నీకు దిక్పాలురవంటి అయిదుగురు భర్తలు. నీయందు మిక్కుటమైన అనురాగం కలవారు. ఒకరినిమించి మరొకరు నీమీద ప్రేముడి ప్రవర్తిస్తుంటారు. వారందరి ఎడల నీవు కూడా సమానమైన ఆసక్తి కలిగి మసలుకొంటూ ఉంటావు. వారందరూ దేదీప్యమైన తేజస్సు కలవారు. వారు నీమీద ఎప్పుడూ ఏ మాత్రమూ కోపించకుండా ఉన్నారే! అలాంటివారు నీ ఎడల ఎల్లప్పుడూ మురిపంతో ముసిముసి నవ్వులు ప్రసరింపజేయటం వింతలలో వింత. నీ ముఖ దర్శనం కోసం తహతహలాడుతుంటారు. ద్రౌపదీ! ఇందులోని రహస్యమేమిటి? ఇట్టి అద్భుత మహిమ నీకు ఏ విధంగా చేకూరింది? ఏవైనా గొప్ప వ్రతాలుగానీ ఆచరించావా? తపస్సుగానీ చేశావా? స్నాన మంత్రాలుగానీ అభ్యసించావా? మందులూ, మాకులూ (ఔషధాల, విద్యాశక్తి) ఏవైనా ప్రయోగించావా? మూలశక్తిగానీ, జపహోమాలుగానీ, అంజనాలుగానీ ఏమైనా ఉన్నాయా? వస్త్రాద్యలంకారంలో తెలివితేటలు కారణమా? చురుకుదనాలు, ఒయ్యారాలు ఒలికించగల నేర్పు ఏదైనా నీకు ఉన్నదా? ద్రౌపదీ! భర్తల అనురాగాన్ని ఈ విధంగా నీవు చూరగొంటానికిగల కారణం నాకు చెప్పవా? యాజ్ఞసేనీ! నీ వ్యక్తిత్వం అసాధారణమైనది. ఆ కిటుకులను, ఆ లోగుట్టును నాకు నిజంగా తెలిపితే నేను కూడా ఆ విధంగానే నా భర్త అయిన శ్రీకృష్ణుడి ప్రేముడి చూరగొంటాను. వాటితో నాకు సదా శ్రీకృష్ణుడు వశమై ఉంటాడు- అని సత్యభామ ఆ విధమైన ప్రశ్నలు వేయటంచేత ద్రౌపదికి మనస్సులో కొంచెం కోపము వచ్చింది. అయితే తన కోపాన్ని అణచుకుంది. నింపాదిగా సత్యభామను చూసి- ‘‘పద్మాక్షీ! సత్యభామా! దుష్టస్ర్తిల గురించి నన్ను అడుగుతున్నావు. దుష్ట స్ర్తిల గురించి ఏం సమాధానం చెప్పను? ఇటువంటి ప్రశ్నగానీ, సందేహం గానీ నీకు రాకూడదు. ఎలా వచ్చింది?
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము