డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభూ! ఉత్తమమైన, ప్రకాశవంతమైన ఆ దివ్య పుష్పాన్ని చూడుము. దీని దివ్య గంధం వాసన ఆఘ్రాణిస్తే ఆనందంగా ఉంది. సుగంధమే దీని స్వరూపం. దీనిని ధర్మజునకు కానుకగా ఇస్తాను. నా కోరిక తీర్చటానికై నీవు వనానికి వెళ్లి ఇంకా కొన్ని తీసుకొనిరా! నాపై ప్రేమ ఉంటే నా కోసం వీటిని చాలా తీసుకొనిరా! వాటిని నేను కామ్యకవనంలోని ఆశ్రమానికి కూడా తీసుకొని వెళతాను’’ అని ఆ పుష్పాన్ని తీసికొని ద్రౌపది ధర్మరాజుకు చూపించటానికై వెళ్లింది.
ద్రౌపది కోరికను తీర్చటానికై భీమసేనుడు ఆ సౌగంధిక కమలాలను తెచ్చుటకొరకై గంధమాదన పర్వత మధ్యభాగంలో విహరించాడు. పోతూ పోతూ సింహనాదం చేశాడు. ఆ ధ్వనికి పైకెగసిపోయే పక్షుల రెక్కలు తడిసి ఉండటం చూసి సమీపంలో ఏదో ఒక కొలను ఉన్నట్లు భావించి మిక్కిలి వేగంగా వెళ్లి కొంత దూరంలో అరణ్యం చెంతననున్న సరోవరానికి చేరాడు. ఆ సరస్సులో స్నానం చేసి దాని ప్రక్కనే అందంగా శోభిల్లుచున్న అరటి తోపులో ప్రవేశించి శంఖం పూరించి గొప్ప ధ్వనిని చేశాడు.
అలా పోతుండగా మార్గమధ్యలో ఉన్న శ్రీరామబంటు, రామసేవకుడు, వాయుపుత్రుడు, కేసరీసుతుడు, అంజనీదేవి తనయుడు, మహాబలశాలి అయిన హనుమంతుని ఆ అరటివనంలో వీక్షించాడు. హనుమంతుడు పెట్టిన కొంత పరీక్ష అనంతరం భీమసేనుడు, హనుమంతుడు ఒకరినొకరు తెలుసుకున్నారు. భీమసేనుని కోరిక మేరకు హనుమంతుడు త్రేతాయుగంనాటి తన భీకర దివ్య స్వరూపాన్ని చూపించాడు. తదుపరి భీముడికి గంధమాదన పర్వతానికి పోయే మార్గాన్ని చూపించాడు.
భీమసేనుడు గంధర్వ పర్వతాన్ని చేరాడు. అక్కడ వున్న ఒక బంగారు పద్మాలుగల ‘విశాలనదిని’ చూచాడు. అది హంసలతో, కారండవాలతో, చక్రవాక పక్షులతో ప్రకాశిస్తోంది. ఆ నదిలోనే గొప్ప సౌగంధిక వనాన్ని చూచాడు. కొంచెం ముందుకు సాగి రాక్షసగణం చేత రక్షింపబడుచున్న సుందరవనాన్ని, రమణీయ సరస్సును చూచాడు. ఆ సరోవరమంతా బంగారు సౌగంధికాలతో నిండి రమణీయంగా వున్నది. ఆ తామరల కాడలు వైఢూర్యపు రంగులోవున్నాయి. ఆ సరోవరాన్ని ‘కుబేరుని’ ఆజ్ఞానుసారం రాక్షసులు రక్షిస్తున్నారు. ఆ రాక్షసులు భీమసేనుని చూచారు. వెంటనే వారు-
‘‘నీవెవరవు? ఎందుకు వచ్చావు? ఆయుధాలు ధరించి దేనికోసం వచ్చావు? పూర్తిగా దాచక చెప్పుము’’ అని ప్రశ్నించారు. అందుకు భీమసేనుడు
‘‘నేను పాండు మహారాజు కుమారుడిని. ధర్మరాజు తరువాత పుట్టినవాణ్ణి. ‘విశాల’ అనే పేరుగల బదరీతీర్థానికి చేరి సోదరులతో ఉంటున్నాను. పాంచలరాకుమారి అయిన ద్రౌపది నా భార్య. అక్కడ మేముండగా గాలివాటున పడిన సౌగంధిక పుష్పాన్ని చూచి దాని పరిమళానికి ఆనందించిన ఆమె ఇంకా కొన్నిటిని కావాలని కోరింది. నా ధర్మపత్ని కోరిక మేరకు ఈ పుష్పాలను కానుకగా ఇవ్వాలని వీటిని తీసుకొనిపోవడానికి వచ్చాను’’ అని అన్నాడు.
‘‘ఇది కుబేరుని ఉద్యానవనం. ఇతరులు విహరించరాదు. కుబేరుని ఆజ్ఞను ధిక్కరించి ఈ తామరలను అపహరించుకొనిపోరాదు’’ అని అన్నాడు. అయితే భీమసేనుడు వారిని లెక్క చేయక సరోవరంలోనికి దిగాడు అప్పుడు రాక్షసులు ‘‘ఇతణ్ణి పట్టుకొనండి’’ అని ఆయుధాలు పైకెత్తి భీముని వైపునకు పరుగెత్తారు. భీముడు యమదండంతో సమానమైన తన గదాదండంతో వారిపైబడ్డాడు. భీమసేనుని ధాటిని వారు ఎదుర్కొనలేక పారిపోయారు. కొందరు మరణించగా తక్కినవారు పారిపోయారు.
అంత భీముడు స్వేచ్ఛగా సరస్సులోనికి దిగి ఉత్తమ సుగంధ భరితాలైన సౌగంధిక కమలాలను పెకలించి తీసుకొన్నాడు.
భయభ్రాంతులైన క్రోధవసులు కుబేరుని చేరి యుద్ధంలో వారు చూచిన భీమసేనుని పరాక్రమాన్ని వర్ణించి చెప్పారు. వారి మాటలను విని దేవశ్రేష్ఠుడైన కుబేరుడు నవ్వాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము