డైలీ సీరియల్

మాణిక్యవల్లి బిడ్డలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాణిక్యవల్లి బిడ్డలిద్దరికి ఒంటికి నలుగు పెట్టి వేడినీళ్లతో స్నానం చేయించి మెత్తని తెల్లని వస్త్రంతో తడి ఒత్తేది. కాలివ్రేళ్లపై నున్న మట్టిని తీసి బొట్టు పెట్టేది. కంటికి కాటుక పెట్టేది. కడుపుకు బిడ్డల్ని హత్తుకునేది. చనుపాలు త్రాగించేది. జోల పాటలు పాడి జోకొట్టేది. ఏడుపుల నివారించి కుదుట పరచేది. తలకు చిట్టాముదాన్ని పట్టించేది. రక్షకొఱకై మంచం మీద ముష్టి చెట్లకొమ్మల్ని కట్టేది. త్రాటికి దిష్టికాయ (ఒక విధమైన కాయ) కట్టి పాదాలకు కట్టేసింది. ఉప్పు-వేపాకుల్ని మీద జల్లేది. దృష్టి దోషం పోయే విధంగా బిడ్డల చుట్టూ నిప్పులు త్రిప్పేది. ఈ విధంగా మాణిక్యవల్లి బిడ్డలికి శైశవోపచారాల్ని చేసింది.
ఆ బిడ్డలిద్దరిని మాణిక్యవల్లి బంగారు హారాల సోయగాలు తీర్చిన కొత్త ముత్యాల తొట్లలో ఉంచి అమూల్యమైన రత్నాల్ని గుత్తులు గుత్తులుగా అమర్చి కట్టింది. అప్పుడా బిడ్డలు వానిని ఆశ్చర్యంగా కన్నార్పక యోగమార్గ దర్శనాకాంక్షులు చూచే విధంగా నిశ్చల చిత్తంతో చూడసాగారు. వేశ్యావృత్తిలో ఈ ఆడుబిడ్డలు ఆరితేరాలని వారిని ఆ రీతిగా ఊయలలో ఉంచి కామశాస్త్ర కళావిలాసాల అర్థంగల జోలపాటల్నే మాణిక్యవల్లి తరచుగా పాడుతూ ఉండేది. వేశ్యాస్ర్తిలకు వావివరుసలు లేకపోవడం మరియు కేవలశృంగారం తప్ప మరేదియు ముఖ్యంకాదని తెలియచెప్పేందుకు మాణిక్యవల్లి ఇంటి నిండుగ రతీమన్మథులు, రంభాకుబేర పుత్రులు ఊర్వశీ పురూరవులు, మేనకా విశ్వామిత్రులు, గోపికా శ్రీకృష్ణులు, ధాన్యమాలినీ రావ ణులు, ఋష్యశృంగ-వారకాంతలు, సత్యవతీ పరాశరులు, తారాచంద్రులు, అహల్యాదేవేంద్రులు, జయంత-సురవేశ్యలు, ద్రౌపదీపాండవులు - కుంతీసూర్యుల చిత్రాలను చిత్రింపచేసి వారికి వారి నడవడికలను నేర్పుగా నేర్పేందుకు ప్రయత్నించింది.
అంతమాత్రంలో తృప్తిపడలేదు మాణిక్యవల్లి. పద్మిని- హస్తిని- చిత్తిని-శంఖిని అనే జాతి భేదాలుగా ఉండే స్ర్తిల రతిబంధవిలాసాల్ని, బాల-ప్రౌఢ-లోల-వృద్ధ అనే నాల్గురకాల వయస్సులలో ఉండే స్ర్తిల రతిబంధాల్ని, భద్రుడు, దత్తుడు, కూచిమారుడు, పాంచాలుడు (శృంగారశాస్త్ర రచయితలు) మొదలగువారి చిత్రాల్ని గోడలపై వ్రాయించింది.
అంతేకాక తన బిడ్డల్ని సంభోగశృంగారంలో ప్రవీణుల్ని చేయడానికి మాణిక్యవల్లి కూచిమారుడు, మన్మథుడు, గోణికాపుత్రుడు మొదలగువారు రచించిన కామశాస్త్ర సిద్ధాంతాల్ని వారికి నేర్పించింది. సంగీతవిద్యలలో విద్వాంసుల్ని చేసేందుకు సాటిలేని మధుర ధ్వనులు పలికే ఏడు తీగల వీణల్ని మీటడం నేర్పించింది. మధురమైన కంఠస్వరం అల వడేందుకు వారికి చిలుకలను, పావురాలను, గోరింకలను, బెగ్గురపక్షులను, హంసల్ని బిడ్డలకి అనుకూల పరచింది. నాట్యకౌశలాన్ని అలవరచడానికి దత్తల- భరత- మతంగ- ఆంజనేయ- కోహళమతి మొదలైన వారి నాట్యరీతుల్ని నేర్పించింది. ఈవిధంగా మాణిక్యవల్లి ఎన్నో పాట్లుపడి నేర్పించినా ఆ బిడ్డలకి శైవధర్మమే గాని వేశ్యా ధర్మం మాత్రం పట్టుపడలేదు.
మాణిక్యవల్లి కుమార్తెల శివభక్తి భావాలు
ఆ ఆడుబిడ్డల ఏ పూర్వజన్మ సంస్కారమో గాని కళ్లు విప్పి చూస్తే శివుని మాత్రమే దర్శించాలని తలచేవారు. మాటలాడ బోతే యోగీశ్వరుల మనస్సులలో సంచారం చేసే శంకరుని రూపానే్న స్తుతిస్తూ ఉండేవారు. తోడి వేశ్యాకన్యలతో ఆ ఆడుబిడ్డలు ఆటలాడేందుకు వెళ్లుతుండేవారు. ఆ సమయంలో వారి మనస్సు చంద్రశేఖరునిపై లగ్న మయ్యేది. తల్లి మాణిక్యవల్లి వారితో పోరా డుతూ ఉండేది. తోడి వారకన్యలందరు విటుల్ని గూడి ఆనందిస్తుండగా ఆ వేశ్యాంగనలు మాత్రం ఉమామహేశుల్ని దలంచి వారికి చేసే రమణీయమైన అలం కారాలు శివపార్వతులకు చేసే అర్చనా విధు ల్ని వివరిస్తూ ఉండేవారు. చేసే గానాల్ని పరమేశ్వరస్తుతిగా చేసేవారు.
బంగారుతీగల్ని తిరస్కరించే ఆ అంద గత్తెలు కట్టిన బొమ్మరిల్లు శివుని గుడే. అందలి బొమ్మ సాక్షాత్తు శివుడే. గుజ్జెన గూళ్లు ఆటలో వండిన పదార్థాలే శివుడికి భోజనం. వేడుకతో చేసే పనులన్ని శివుని సేవయే. వారి పూర్వజన్మసంస్కార విశేషమేమో గాని వారా విధంగా నిత్యం తలస్తూ ఉండేవారు. పుణ్యా చారులు మెచ్చుకొనే ఆ ఆడబిడ్డల పుట్టిన వేళావిశేషమేమో గాని, వేశ్యాకులాచార ప్రధా నమైన మన్మథవేదాలు - వాని అంగాలయిన కామశాస్త్రాల్ని చదివిస్తే వారికి లేశమాత్రమైనా పట్టుపడలేదు కాని ఆనందరసస్థానమై శైవా గమాల్ని ఒక్కమారు చదివితే చాలు వారికి సులభంగా అలవడేవి.
ప్రతిదినమూ చిన్ని చన్నులు పెద్దవయిన రీతిగా ఆ వేశ్యాకన్యలకు శివపూజపై ఆసక్తి క్రమంగా వృద్ధిపొందింది. దినదినమూ శరీరచ్ఛాయ నూతనం గా ప్రకాశించే రీతిగా శైవాగమాలలోని విజ్ఞానం మనసులో నూతనంగా ప్రకాశించింది. తలపై కేశపాశం నానాటికి పెరిగే రీతిగా వారికి పార్వతీ వల్లభుని మీద భక్తి క్రమంగా పెరుగసాగింది. బాల్యం నానాటికి దిగజారిపోవునట్లుగా వేశ్యాచార సంస్కారం దిగజారిపోయింది. ఆ విధంగా శైశవం తొలగిపోయి వన సంబంధవైన సౌందర్యాతిశయం శరీరావయవాలలో జనించినరీతిగా వారి హృదయాలలో శివసంబంధమైన తేజస్సు సంపూర్ణంగా నిండిపోయింది.

- ఇంకావుంది...

చరవాణి: 9490620512