డైలీ సీరియల్

ఆకృతి దాల్చిన శివరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇట్టి సకల భోగభాగ్యాలకు నివాసమైన ఆ యుడుమూరు అనే బోయపల్లెకు ప్రభువైన నాదనాథుడు మహాపరాక్రమశాలి. అతడు సింహాలకు కూడ పరాక్రమాన్ని విచక్షణతో శిక్షణనీయగల పరాక్రమవంతుడు. అరణ్యంలో గల ఆడ మదపుటేనుగులకు వైధవ్యాన్ని కల్పించగల బాహుబల సంపన్నుడు. ఆయన పరివారం జింక జంటల సంసారాన్ని నాశనం చేయడంలో అతి సమర్థులు. అతడు మృగాదనమనే జంతు సార్వభౌముని (తోడేలు) గర్వాన్ని అణచివేయడంలో అతిదారుణ పరాక్రమవంతుడు. వివిధ వన్యమృగాల ఊపిర్లను పీల్చి వేయగల నాగరాజులనే బాణవర్షాన్ని కురిపించ గల మేఘసదృశమైన విలుకాడు అతడు. ఆయన భార్య తందె. బోయరాజయిన మహేశ్వరుని కూడి చెంచెంతగా వచ్చిన గౌరీదేవిని పోలిన గొప్ప ఇల్లాలు.
తిన్నని జననం
ఆ నాదనాద - తందె దంపతులు కొండగుహలు- చరియలు -సెలయేళ్లు-అడవులలో స్వేచ్ఛగా తిరిగి రతిక్రీడలలో తేలి యాడారు. మహేశ్వరుని దయవలన ఆ తందెకు నెలతప్పింది.
క్రమంగా ఆ తందె యందు గర్భవతి లక్షణాలు కనబడసాగాయి. మైపూతగా పూసుకొన్న ఈశ్వరుని ధవళమైన విభూతి కాంతితో సాటివచ్చే రీతిగా ఆమె ముఖం తెల్లగా ప్రకాశించింది. శివుని కంఠం మీద ఉన్న హాలాహల విషపు మచ్చను పోలిన విధంగా అమె చనుమొనలు నల్లగా అయ్యాయి. పరమశివాకృతి వలె అణురూపంగా వెలుగొందే (ఈశ్వరుడు అణుస్వరూపుడని ‘అణోరణీయాన్’ అని వేదాలు చెప్పాయి. అంటె అణువు కంటె కూడ సూక్ష్మరూపుడని ఆ మాటకర్థం). ఆమె నడుము క్రమంగా ఘనంగా (లావుగా) మారిపోయింది. ఆత్మవిచారం చేత పొందిన శాంతిగా మనసున పెరిగే చాంచల్యరహిత స్వభావం ప్రకాశించింది. గర్భంలో ఉన్న తనయుడు ఈశ్వరుడై ప్రకాశింపనున్నాడని తెలిపే రీతిగా తొందరపాటు చేత కూడ భార్యభర్తల మధ్య రతిక్రియ జరుగని విధంగా ఆ తందెకు గర్భవతీలక్షణాలు ప్రారంభమయ్యాయి. మత్త్భే కుంభస్థలాల్ని పోలిన స్తనాల మధ్య నుండే అందమైన రేఖను మరియు మృగరాజు నడుమును పోలిన సన్నని అందమైన నడుముల సొగసును పుట్టబోయే శిశువు చెరిపి వేయగలడని చెప్పే విధంగా తందెవనిత చన్నుల, నడుము సొగసులు తప్పిపోయాయి.
తందెదేవి సింహాల్ని- ఏనుగుల్ని- పులుల్ని-పందుల్ని- మృగాల్ని చంపాలని మనసులో భావించేది. ఆమె కొండల దరినున్న ఏటి ఇసుక తినె్నలలో గల శివుని చూడాలని తరుచుగ తలంచేది. పుక్కిట పట్టిన జలంతో ఈశ్వరాభిషేకం చేయా లని ఆమె ఉవ్విళ్ళూ రుతుండేది. రుచికరమైన పంది మాంసాన్ని దొప్పలలో పెట్టి శివునకు సమర్పించాలని భావిస్తూ ఉండేది. నేత్రాలనే నీలోత్పలాలతో ఈశ్వరార్చన చేయాలని ఆ తందెవనిత చింతిస్తూ ఉండేది. ఈ విధంగా తన గర్భంలో నున్న పిల్లవానికి గల లక్షణాల న్నింటిని తెలుపుతూ ఆ తందె వనిత ప్రవర్తిస్తూ ఉండేది. బిడ్డను కనే సమయం సమీపిస్తున్న కొలది ఆమెకు పెంపుడు చిల్కపిల్లకు మాటలు చెప్పడానికి కాలం సుదీర్ఘమై విసువు కల్గించింది. బట్టలు, సొమ్ములు ధరించడానికే ఆమెకు చాల భారమయ్యింది. భర్తపాన్పుపై పరుండేందుకు కూడ అలసట అనిపించేది. గృహకృత్యాల్ని చేసుకోవడానికి సహితం శ్రమకలుగుతూ ఉండేది.
తందెదేవికి పురిటినొప్పులు ఆరంభమయ్యాయి. అప్పుడు మంత్రసానిని పిలవండి. కాయం (పురిటి స్ర్తిలకు పెట్టే ఒక ఔషధ వస్తువు) తయారు చేయడానికి ప్రయత్నాలు ఆరంభించండి. బిడ్డకు స్నానం చేయించడానికి వేడినీటిని కాచి ఆ జలం నిలుచుటకు గుంట నొకదానికి త్రవ్వ నారంభించండి. తందెను నిలబడకుండ చూడండి.’’ అని పలుకుతూ భిల్లస్ర్తిలందరు హడావిడిగా తిరుగసాగారు.
ఒక శుభముహూర్తంలో ఆగర్భశివభక్తి కలిగిన కుమారుని తందెమహాదేవి కంది. సంసారమనే వ్యామోహపాశాన్ని కోసివేసిన రీతిగ ఆ చంటిబిడ్డకు బొడ్డుకోసారు. ఈశ్వరభక్తి లక్షణాలు ప్రస్ఫుటంగా పైకి కనిపించే విధంగా ఆ బిడ్డకు విభూతిరేఖల్ని తీర్చిదిద్దారు. పాపపు మనస్సులోని మలినాల్ని తొలగించేందుకు ఆనందసుధారసాన్ని త్రాగించే విధంగా ఆ బిడ్డడికి చిట్టాముదాన్ని తెచ్చి భిల్లస్ర్తిలు త్రాగించి పానుపుమీద పడుకోబెట్టారు. ఆ పుట్టిన బిడ్డ జ్ఞానప్రసూనేశ్వరుని పరమధ్యానంలో మహా సౌఖ్యమనే గాఢనిద్రలో మునిగిన వానివలె కన్నులు తెరువక కొన్ని దినాలు అట్లే ఉండిపోయాడు. ఆ తరువాత ఆ పసివాడు ఈ లోకపు తీరు ఏవిధంగా ఉందోననే ఉత్సుకతతో కాబోలు కన్నులు తెరచి చూచాడు. దానిని చూచి తల్లిదండ్రులు చాల సంతోషించారు.
క్రమంగా ఆ బాలుడు శైశవక్రీడలు ప్రదర్శించాడు. ఈ లోకమంతా శివభక్తి శూన్యమై పోయిందని తెలిపే విధంగా ఆ బాలుడు నవ్వసాగాడు. సంసారమోహబంధం తెగిపో యేటట్లు తనే్న రీతిగా ముద్దుపాదాల్ని పైకెత్తి విదిలిస్తూ ఆడసాగాడు. సంసారానికి విముఖుడైన విధంగా సాత్విక స్వభావం కలవాడై మెత్తని పాన్పుపై బోరగిలపడ్డాడు. ఆనందసామ్రాజ్య సింహాసనంపై కూర్చున్న విధంగా ఆ బాలుడు కూర్చున్నాడు. ఈశ్వరతత్త్వమనే మణిని వెదకే వానివలె ఆ పసివాడు నేలపై తడవి తడవి ఆటలాడసాగాడు. సర్వజ్ఞుడు అయిన శివుని తాకుతాననే భీతిచేతనా అన్నట్లు అడుగుల్ని తప్పటడుగులుగా వేయసాగాడు. ఈ విధంగా ప్రతిదినం అభివృద్ధి పొందే ఆ బాలుని సద్గుణాలు శివభక్తి లక్షణాలను పోలినవై ప్రకాశించగా తల్లిదండ్రులయిన తందెయు- నాదనాథుడు కుమారుని తిన్ననిదనానికి మనస్సులో మహానందభరితులై తిన్నడు అని పేరు పెట్టారు. అప్పుడు అవ్యక్తమధురా రంభమైన బాల్యంలో ఆ తిన్ననికి తల్లి దండ్రులు స్నానం చేయించి విభూతి పెట్టారు. నడుమునకు గురివిందగింజలు గూర్చిన మొలత్రాటిని కట్టారు. నెమలిపురి రుూకల్ని భుజాలకు అలంకరించారు.
- ఇంకావుంది...

చరవాణి: 9490620512