డైలీ సీరియల్

భవబంధ విమోచకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞానప్రసూనాంబ స్తుతి
శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై ఉన్న శ్రీకాళహస్తిమహాక్షేత్రంలో వెలసిన మహాదేవి జ్ఞాన ప్రసూనాంబా దేవి. ఆమె మంచుకొండల రాయడగు హిమవంతుని, కులవర్థిని మేనాదేవి శరీరమనే పూతీగకు పూసిన మహాద్భుతపుష్పము. పతిదేవుడైన నీలకంఠుడు వస్త్రంగా ధరించిన గజచర్మం నుండి వెలువడే ఘోరదుర్గంధాన్ని నివారించే సుగంధభరితమైన తరంగాలు గలిగినది. శివునిపై నిలిచే అచంచల భక్తి అనుభవమైన - అద్వైత తత్త్వజ్ఞానసారాన్ని నిరంతరం స్రవింపచేసే మకరందధార. పరమహంస శ్రేష్ఠుల హృదయాలలో కదలాడే వివిధభావాలనే తుమ్మెదలగుంపును జీవబ్రహ్మైక్య రూపంగా అనుసంధానించి వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదించే వినోదక్రీడలలో ప్రధానంగా విహరించే లీలావిలాసిని. సమస్తవిద్యారహస్యాల్ని బోధపరచే ‘సో-హం, అహం బ్రహ్మా-స్మి, తత్త్వమసి, త్వమేవాహం’ అనే మహావాక్యాల సారమనే పుప్పొడిచే నింపబడి ప్రకాశించే అద్భుత అఖండ బ్రహ్మాండాలకు నిధానమైన మహాపేటిక (పెద్ద పెట్టె).
ఆ విధంగా ప్రకాశిస్తూ కొప్పుపై నెలవంకను ధరించి, వికసించే జ్ఞానపుష్పానికి మొగ్గరూపంగా విలసిల్లే జ్ఞానప్రసూనాంబను సేవిస్తాను.
కాలభైరవమూర్తి స్తుతి
శ్రీచక్రాధిష్ఠానదేవత శ్రీరాజరాజేశ్వరి. ఆమెకు మంత్రిణి శ్యామలాదేవి. ఆమెకు ప్రత్యంగదేవత నకులి (ముంగిస), దండనాయిక వారాహీదేవి (వారాహి-పంది). సహజంగా వారు భయంకరాకారులు. అట్టి వారు కూడ భయంతో కంపించిపోయేటట్లుగా భ కారమాది ఔకారయుతమైన ‘్భ’ శబ్దాన్ని (ఇదే భైరవమంత్రబీజం) భయంకరంగా పలికే భైరవాన్ని (కుక్క) తనకు వాహనంగా చేసికొని విలాసంగా నీలాచలం మీద లీలావిహారం చేసే సకల విద్యాస్వరూపుడు శివావతారుడైన భైరవమూర్తికి నమస్కారం.
దుర్గాస్తుతి
కాళహస్తీశ్వరక్షేత్రంలో సువర్ణముఖీ నది ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తూ ఉంది. ఆ నదికి ఉత్తర తీరంలో గల ఒక పెద్దకొండ కొమ్మున భక్తులపాలిటి కొంగు బంగారంగా దుర్గాదేవి వెలసి పూజలందుకొంటూంది. మహిషాసురుడిని సంహరింపగా కంఠం నుండి వెలువడిన రక్త్ధారలే పారాణిగా పూయబడిన పాదపద్మాలతో ఆ దుర్గామాత కొలువైయుంది. చండుడు-ముండుడు అను రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో చేసే వీరవిహారం వల్ల స్తనాలపై ఏర్పడిన స్వేదబిందువులే కంఠంలో మణిహారంగా అమరి ఆమె ప్రకాశిస్తూ ఉంది. రక్తబీజుడు - అసిలోముడు - బిడాలుడు మొదలైన ఉక్కురక్కసుల్ని యుద్ధంలో మర్దించే సమయం లో చేసిన వికటాట్టహాసమే ఆమె మోమునకు పూయబడిన తెల్లలొద్దుగ (ఒక పుష్పజాతి) పుప్పొడిగా ప్రకాశమానమై విరాజిల్లుతూ ఉంది. శుంభ నిశుంభాది రాక్షసుల్ని సంహారం చేసే వేళ నేలనుండి లేచి ఆమె ముఖాన్ని కప్పివేసిన ధూళి స్వయంగా తన సుందరవదనారవిందానికి కప్పుకొనిన మేలిముసుగుగా రమణీయంగా ఉంది. అట్టి వీరశృంగార స్వరూపిణి అయిన దుర్గామాతకు నమస్కారం.
వినాయక స్తుతి
సృష్టి - స్థితి - సంహారకార్యాల్ని సృష్ట్యాదిలో ఆరంభించే ముందు తమ కార్యాలకు విఘ్నాలు రాకుండ ఉండేందుకై బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు ముగ్గురు ఓ విఘ్ననాయకుడా ! నిన్ను ప్రార్థించారు. నీవు వారినావిధంగా అనుగ్రహించడమే కాక నిన్ను వారెప్పుడు స్మరించినా వెంటనే వారు చేసే పనులకు ఏర్పడిన విఘ్నరూపమైన దుర్లక్షణాల్ని తొలగించి నిత్యం దయతో చల్లగా చూచే విఘ్నేశ్వరా! నినే్న సేవిస్తాను.
కృతిపతి నిర్ణయం
ఈ రీతిగా ఇష్టదేవతారాధన చేసి శ్రీకాళహస్తి మాహాత్మ్యమనే కన్యకు విద్యా పారంగతుడైన తగిన వరుడెవ్వడా? అని ధూర్జటి మహాకవి మనస్సులో విచారించాడు.
జీవ-బ్రహ్మల ఐక్యాన్ని సమర్థించే అద్వైతవిద్యాగోష్ఠియందు వాక్కు-అర్థము, శ్రోత-వక్త అని చెప్పబడువాడు ఈశ్వరు డొక్కడే కదా. అతడు కాక నా ఈ ప్రబం ధానికి పతి కాగలిగిన వాడు వేరొకడు ఉన్నాడా? ఇక ఆ విషయంగా విచారణ ఏల? కేవలం హృదయం చేత మాత్రమే తెలియబడునట్టి శ్రీకాళహస్తీశ్వరునే ఈ ప్రబంధకన్యకకు భర్తగా నిర్ణయించు కొంటాను.
గుర్వాజ్ఞ

శ్రీకాళహస్తి మాహాత్మ్యమనే ఈ కావ్యానికి శ్రీకాళహస్తీశ ని కృతిభర్తగా చేసిన నా సంకల్పానికి మనసులో చాలా సంతోషపడ్డ దేశిక సార్వభౌముడయిన నా గురువు ఓ ధూర్జటీ! కావ్యమార్గంలో నీ శివభక్తి ధన్యత పొందే రీతిగా వినూతన భాషారీతులతో, వ్యంగ్య వైభవంతో నవరసాలు చిప్పిల్లే విధంగా ప్రబంధాన్ని రచించు.
అని గురువు అపారకరుణాసముద్రుడై అనుగ్రహభాషణం చేసాడు. అంత ధూర్జటి మహామునుల హృదయపద్మవనాలలో సంచరించే రాజహంసయు, కేవలం అనుభూతికి మాత్రమే కనబడువాడూ కృతిభర్తయూ అయిన శ్రీకాళహస్తీశ్వరుణ్ని సన్నుతిస్తాను.
- ఇంకావుంది...