డైలీ సీరియల్

త్యాగమే ఉన్నతోన్నతం(శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిల్ల దంపతులు
పూర్వం కైలాస పర్వతానికి దగ్గరలోని ఓ అరణ్యంలో ఆహుకుడు, ఆహుకి అనే భిల్ల దంపతులు నివసించేవారు. భర్త తెచ్చిన కందమూలాలూ, పుట్టె తేనె, వెదురు బియ్యమ్ఱుతో శివ పూజలు చేస్తూ మాంసాదులు వండి అతిథి సత్కారాలు చేస్తూండే భిల్లాంగననూ, ఏ పని చేస్తున్నా శివుడినే ధ్యానిస్తూ ఉండే భిల్లుడినీ పార్వతీ పరమేశ్వరులు పరీక్షించదలిచారు.
శివుడు సన్యాసి రూపంలో వచ్చి విందారగించి, వారి కుటీరాన ఉండిపోగా, భిల్లుడా రాత్రి వేళ క్రూర మృగాలు లోనికి జొరబడకుండా బయట కావలి కాయసాగాడు. పరీక్ష ప్రకారం పార్వతీదేవి, ఒక వ్యాఘ్ర రూపాన వచ్చి ఆ భిల్లుడిని చంపి వేసింది. రాత్రంతా దుఃఖాన్ని అణచుకుని, ప్రొద్దున అతిథిని సేవించాక అతని అనుమతి తీసుకుని సహగమ నానికి చితి మంటలు రగుల్చుకుంది భిల్లాంగన. సహగమనం చేయబో తూండగా యతీశ్వరుడు శంకరుడై పార్వతితో సహా దర్శనమిచ్చి, పులివాత పడ్డ భిల్లుడిని బ్రతికించాడు.
శివదంపతులు వారిని దీవించి వారి సిద్ధాంతాలు అనుసరిస్తూ భక్తులై జీవించి, కొద్ది జన్మల అనంతరం తమ సన్నిధి చేరే వరాన్ని ప్రసాదించారు.
ఉపమన్యుడు
మహా శివభక్తుడైన వ్యాఘ్రపాదుని పుత్రుడు ఉప మన్యుడు. ఉపమన్యుడు శివుని బాల భక్తుడు. శివుడిని పరిహాసానికై కూడా ఎవరైనా నిందిస్తే సహించలేక పోయేవాడు. ఒకసారి ఆ బాలుడు సంపన్నుడైన తన మేనమామ ఇంటిలో కొన్నాళ్ళుండి చక్కటి చిక్కటి పాలు త్రాగి వచ్చి, ఇంటికొచ్చాక కూడా తనకు రోజూ అలాటి పాలే కావాలని మారాము చేసాడు. పేద బ్రాహ్మణుడైన అతని తండ్రి బాలకుడిని బుజ్జగించి ‘నాయనా! నీవు రోజూ ‘శివ పంచాక్షరీ’ మంత్రం జపిస్తూ ఉంటే ఆ సాంబ శివుడు నీకు మంచి ఆవు దూడలని ప్రసాదిస్తాడు. అప్పుడు నీవు రోజూ చిక్కటి పాలు త్రాగవచ్చు. అన్నాడు.
ఉపమన్యుడు ఎంతో సంతోషించి ఎంతో శ్రద్ధగా నిత్యమూ శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూండగా ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయారు. పార్వతి ఆ పసి బాలుడిని ముద్దాడి తన అరచేతి నుండి క్షీరాన్ని ఒక కాలువగా ఆ బాలుడి కోసం ప్రవహింప జేసింది. ఆ ప్రదేశమే ‘క్షీరా రామము’గా ప్రసిద్ధి చెందింది. (అదే నేటి పాలకొల్లు).
క్షీరారామము, దక్షారామము, కుమారారామము, సోమారామము, అమరారామము అనేవి పంచారామాలుగా ప్రసిద్ధమైన ఆంధ్రదేశంలోని శివ క్షేత్రాలు.
పార్వతీ పరమేశ్వరులు ఉపమన్యుడికి జరామరణాలు లేని దీర్ఘాయుష్షునూ, శివభక్తుడై తరించే వరమునూ ఇచ్చారు.ఉపమన్యుడు మహామునియై ద్వాపర యుగాన శ్రీకృష్ణుడికి ‘శివపంచాక్షరి’ని ఉపదేశించే భాగ్యాన్ని పొందాడు. అంతేకాక శివ సహస్ర నామాలను పఠించి శివుని కటాక్షాన్ని పొందగలిగాడు’’ అని నందీశ్వరుడు మార్కండేయునికి తెల్పిన విషయాలు సూతులవారు మునులకు వివరించారు.
9
ద్వాదశ జ్యోతిర్లింగాలు
(శతరుద్ర మరియు కోటి రుద్ర సంహితలలో)
‘‘పుణ్య చరితులైన శౌనకాదులారా! ప్రఖ్యాతి చెందిన ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా భక్తులననుగ్రహించటానికే ఆవిర్భవించాయి. ఆ వివరాలు వినండి’’ అంటూ పరమ శివుడిభక్త సౌలభ్య వివరణ కొనసాగించారు సూతమహర్షి.
1. శ్రీ సోమనాధేశ్వర లింగము
చాలా యుగాల క్రిందట ఒకప్పుడు దక్ష ప్రజాపతి, తన అల్లుడైన చంద్రుడు తన ఇతర పుత్రికలందరినీ నిర్లక్షం చేసి ఒక్క రోహిణి పట్ల మాత్రమే అనురాగం తో వర్తిస్తున్నందుకు కోపించి అతడిని క్షయ వ్యాధిగ్రస్తుడిని కమ్మని శపించాడు. దాని ప్రభావాన క్షీణించసాగిన చంద్రుడు భూలోకంలోని ప్రభాస క్షేత్రానికి వెళ్ళి పరమేశ్వరుని గూర్చి తీవ్ర తపస్సు చేసి రోగ విముక్తుడయాడు. అయితే దక్షుడిచ్చిన శాపాన్ని మన్నించాలి కనుక పరమేశ్వరుడు, చంద్రుడు కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకూ క్షీణిస్తూ, మళ్ళీ శుక్ల పక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ వృద్ధి పొందేట్లు వరం ఇచ్చి శాపాన్ని తగ్గించాడు. చంద్రుడు కోరగా పరమేశ్వరుడు ప్రభాస క్షేత్రంలో అతడు తపమాచరించిన స్థలాన ‘సోమనాథుడి’గా జ్యోతిర్లింగ రూపంలో వెలసాడు. ఆ ప్రభాస క్షేత్రమే కృష్ణ నిర్యాణ ప్రదేశమైన సోమనాద పుణ్యక్షేత్రము.
2. శ్రీశైల మల్లికార్జున లింగము
పూర్వం ఒకానొకప్పుడు శివతనయుడైన కుమార స్వామి తన సోదరుడైన గణపతికి విఘ్నాధిపత్యం ఈయటమే కాక, వివాహం కూడా తనకంటే ముందుగా జరిపించినందుకు తల్లి తండ్రులైన పార్వతీ పరమేశ్వరులపై అలిగి రజతాచలాన్ని వదలి శ్రీశైలానికి వెళ్ళిపోయాడు. కుమారుడిపై ఉన్న ప్రేమ కొద్దీ పార్వతి భ్రమరాంబికగానూ, శంకరుడు మల్లికార్జున లింగంగానూ శ్రీశైలాన వెలసారు. చంద్రవతిఅనే రాకుమార్తె ఆ లింగానికి రోజూ తానర్పించే మల్లెమాలలను తుమ్మెదలు పాడు చేస్తున్నాయని బాధ పడుతుండేది.
- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె