డైలీ సీరియల్

సర్వం శివమయం( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునులారా! తెలియకుండా చేసినా శివరాత్రి వ్రతం ఎంతటి ఫలితాన్నిచ్చిందో చూసారా!’’ అన్నారు సూత మహర్షి. గురుద్రుహుని గాద కూడా శివరాత్రి వ్రత ఫలాన్ని తెలుపుతుంది.
గురుద్రుహుడు / గుహుడి కథ(కోటి రుద్ర సంహిత)
పూర్వం జాలీ దయా లేని స్వార్థపరుడైన గురుద్రుహుడనే బోయ వాడొకడుండేవాడు. ఒక మహా శివరాత్రి పర్వదినాన వేటకి వెళ్ళిన అతనికి సంధ్యా సమయం దాకా ఏ మృగమూ కనిపించలేదు. చీకట్లో తిరుగు ప్రయాణం ఇష్టం లేక, ఆ రాత్రికి అడవిలోనే ఉండి, నీటి కోసం తానున్న కొలను వద్దకి ఏదైనా మృగం వస్తే చంపవచ్చునని భావించి అతడు ఆ కొలను గట్టున ఉన్న ఒక ‘బిల్వ’ వృక్షాన్ని ఎక్కి కూర్చున్నాడు. ఒక ఎండు సొరకాయ బుర్రలో నీళ్ళు మాత్రం దాహానికి ఉంచుకున్నాడు.
అతనాశించినట్లే రాత్రి తొలి ఝాములో ఒక ఆడజింక అక్కడికి దాహం తీర్చుకోటానికై వచ్చింది. బోయవాడు దాన్ని చంపుదామని విల్లు సంధించే ప్రయత్నంలో ఉండగా ఆ కదలికకు చెట్టుపై నుండి కొన్ని బిల్వ పత్రాలు రాలి, చెట్టు క్రిందనున్న శివలింగంపై పడ్డాయి. అతని సొరకాయ గినె్నలోని నీరు కూడా వొలికి లింగాన్ని అభిషేకించింది.
అయితే అతడు తనను చంపేలోగా ఆ జింక మానవ భాషలో,
‘‘అయ్యా! ఇంటి వద్ద నా మగడూ, సవతీ, మా పిల్లలూ నాకై ఎదురు చూస్తూ ఉంటారు. వారికి తుది వీడ్కోలు చెప్పి వెంటనే వస్తాను. అలా రాకపోతే నాకు పంచ మహాపాతకాలూ చుట్టుకుంటాయి. దయచేసి అనుమతి నీయి. వచ్చి నీకు ఆహారాన్ని అవుతాను.’’ అని అర్థించింది.
ఏ పూర్వ పుణ్య విశేషమో అంతటి కసాయి వాడూ కరగిపోయి అందుకు వొప్పుకున్నాడు. జింక ఇంటి దారి పన్టీగా, మరో వైపునుండి దాని సవతి కొలను వద్దకు నీటికై రాత్రి రెండో ఝాములో వచ్చి బోయవాడిని చూసి సరిగ్గా తన సవతి పలికినట్లే పలికి అనుమతి తీసుకుని ఇంటికి వెళ్ళింది.
మూడవ ఝాములో తన పత్నులని వెదుకుతూ మగ జింక అక్కడికి వచ్చి, తనను చంపబోతున్న బోయవాడి అనుమతి తీసుకుని తానాతనికి ఆహారమవుతున్నానని భార్యలతో చెప్పి రావటానికి వెళ్ళింది. రెండవ ఝామూ, మూడవ ఝాములో కూడా బోయవాడి కదలికకి చెట్టు పైని ఆకులూ, సొర పాత్రలోని నీరూ వొలికి శివాభిషేకం జరిగిపోయి, దానితోపాటూ అతడి మనస్సు కూడా పునీతమై, పవిత్రమయిపోయింది.
ఇంటిలో కలుసుకున్న జింకలన్నీ తమ పిల్లలతో పాటూ బోయవాడికి ఆహారం కావటానికి నిశ్చయించుకుని తరలి వచ్చే సరికి నాలుగవ ఝామయిపోయింది. అతడా కలకలానికి కదలగా మరోసారి బిల్వ పత్రాలతో, శుద్ధ జలాలతో శివాభిషేకం జరిగింది.
ఆ సరికి బోయవాడికి జ్ఞానోదయమూ అయింది. అతడా జింక కుటుంబపు నిజాయితీకి కరిగిపోయి,
‘‘ఆహా! మృగములారా! మీరు ధన్య జీవులు. జీవితం అశాశ్వతమని పలికి, పరోపకారానికై శరీరాన్ని త్యజించటానికి సిద్ధపడి సత్యవచనులై తిరిగి వచ్చిన మీకున్న జ్ఞానం మానవుడినైన నాకు లేకపోయింది. నేనిక ఈ నీచ జీవితానికి స్వస్తి చెపుతాను’’ అని పలికి వాటిని వదలివేసాడు.
ఆ పశ్చాత్తాపమూ, శివరాత్రి నాడు తెలియకనే అతను చేసిన ఉపవాస, జాగరణ, అభిషేకాలూ చాలు ఆ భక్తవత్సలుడైన శంకరుడను గ్రహించటానికి. ఆయన అతని ఎదుట ప్రత్యక్షమయి,
‘‘నాయనా! ఎన్నటికీ ఈ భక్తిని వదలకు. అన్ని జన్మలు గడిచాక చివరి జన్మలో శ్రీహరి శ్రీరామ చంద్రుడిగా జన్మించినప్పుడు నీతో సఖ్యం చేసి నీ ఇంటికి అతిథిగా వచ్చి నిన్ను అనుగ్రహిం చాక, అంత్యాన నీవు నా సాయు జ్యాన్ని పొందుతావు.’’ అని వరమిచ్చాడు.
ఆ గురుద్రుహుడే అలనాడు త్రేతాయుగాన తన శృంగబేరీ పురంలోని గృహంలో రామయ్య కు ఆతిద్యమిచ్చి నావలో నదిని దాటించిన పరమ పావనుడైన ‘గుహుడు’. శివుడు గురుద్రుహుడిని అనుగ్రహించిన ప్రదేశం ‘అర్చుదా’చల క్షేత్రంగానూ, అక్కడ బిల్వవృక్ష ఛాయలో నున్న శివలింగం ‘వ్యాధేశ్వర’ లింగమనీ ప్రసిద్ధి గాంచాయి. ‘వ్యాధుడు’ అనగా బోయవాడు.
గురుద్రుహునితోపాటుగా శివదర్శనం పొందిన జింకలకు కూడా స్వర్గం లభించింది.’’ అని తెలిపారు సూతమహర్షి.
భక్త ‘వ’ శంకరుడు
‘‘మునులారా! మనసా వాచా కర్మణా శివుడిని నమ్ముకున్న వారే ఆయన నిజమైన భక్తులు. నిజమైన శివ భక్తుడికి సర్వమూ శివ స్వరూపంగా, శివమయంగా కనిపిస్తుంది. శివ భక్తుల గూర్చి చెప్తూ నందీశ్వరుడు సనత్కుమారుడితో ఇలా అన్నాడు.
‘‘మునిశ్రేష్ఠా! నిర్మలమైన మనస్సులతో తమకి తెలిసిన ‘శివస్మరణ’, ‘అతిథిసేవనం’ అనే రెండు సిద్దాంతాలు పాటించి సన్మార్గంలో చరిస్తూ నిరక్షరాస్యులైన ఓ భిల్ల దంపతులు పూర్వం శివుడిని సేవించి తరించిన ఓ ఉదంతం చెప్తాను. విను’’

- ఇంకావుంది...

శ్రీమతి గౌరీ గార్లదిన్నె