డైలీ సీరియల్

నిర్గుణ రూపమే పరబ్రహ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్ణుమూర్తి సత్య సంధతకు సంతోషించి రుద్రునితో సమాన స్థాయిని ప్రసాదించాడు ఈశ్వరుడు.
బ్రహ్మ విష్ణువులు సంతృప్తులై మహేశ్వరుడిని స్తుతించి ఆనందింప జేసారు. లింగోద్భవం జరిగిన ఆ దినం శివరాత్రి పర్వదినంగా ఇప్పటికీ ప్రతి సంవత్సరం ప్రజలచే జరుపుకోబడుతోంది. ఆ దినాన ఉపవాస, అభిషేక, జాగరణ, శివపురాణ పఠనాదులతో శివలింగాన్ని ఆరాధించిన వారికి సంవత్సర పూజా ఫలమూ దక్కటమే కాక ఇహ పర సౌఖ్యాలూ, కైవల్యమూ వారి వారి భక్తిని బట్టీ, అభీష్ఠాలను బట్టీ సిద్ధిస్తాయి. స్వయంగా మహేశ్వరుడే ఆ సందర్భాన బ్రహ్మ విష్ణువుల స్తుతికి సంతసించి ఇలా తెలిపాడు.
‘‘బ్రహ్మ విష్ణువులారా!
నేను మీ నడుమ లింగరూపంగా ఉద్బవించిన దినము మాఘ బహుళ చతుర్ధశి. ఇది శివరాత్రి దినంగా ప్రసిద్ధవౌతుంది. శివరాత్రి దినాన శివలింగాన్ని ఆరాధించే భక్తులు నాకు నా పుత్రుడైన కార్తికేయుడి కన్నా ప్రీతిపాత్రులు. ఈ దినాన ఇక్కడ అగ్ని లింగము ప్రకటితమైంది కనుక ఈ ప్రదేశం ‘అరుణాచలమ’నే పేరుతో ప్రఖ్యాతి చెందుతుంది. అరుణ అనగా అగ్ని, అచలమనగా పర్వతము. పర్వత ప్రమాణంలో ఉద్భవించిన ఈ లింగము కాలక్రమాన చిన్నదౌతూ, మామూలు అరుణ వర్ణ గిరిగా అగుపిస్తుంది. ఇప్పటి ఈ తేజోలింగ పర్వతం క్రమక్రమంగా ఈ అగ్ని ప్రకాశాన్ని పైకి కనబడనీయక తనలోనే ఇముడ్చుకుని ఒక పవిత్ర స్థలంగా గుర్తింపబడుతుంది. ఈ స్థలంలో నివసించి సాధనలు చేస్తూ నన్ను సేవించిన వారికీ, లేక భాగ్యవశాత్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడే అశువులు బాసిన వారికీ తప్పక కైవల్యము లభిస్తుంది. అరుణాచలము లేక అరుణగిరిగా నా లింగము ఉద్భవించిన కారణంగా ఇక్కడి భూమి పవిత్రమై ‘లింగస్థానమ’ని కూడా వాసికెక్కుతుంది.
బ్రహ్మ విష్ణువులారా! శివలింగము ‘నిష్కలము’ అనగా అంగ ఆకృతులనూ ప్రకాశాన్నీ తనలో ఇముడ్చుకుని నామ మాత్రంగా సాకారమై, గుణాతీతమైన నా నిర్గుణ స్వరూపము. ఇది నా పరబ్రహ్మ తత్వానికి ప్రతీక. శివలింగమును భక్తి శ్రద్ధలతో స్థాపించేవారు నాతో సమానులు. లింగికీ, లింగమునకూ బేధము లేదు.
లింగము నుండి నేను మీకు ప్రకటితమైన ఈ రూపము అంగ సహితమైన నా ‘సాకార’ లేక ‘సకల’ రూపము. ఈ సాకార రూపాన మీరు నా దర్శనాన్ని పొందిన దినం ఆర్ర్దా నక్షత్రంతో కూడిన మార్గశిర మాస పౌర్ణమి. కనుక మార్గశిర మాసంలో కానీ, ఆర్ర్దా నక్షత్ర దినాన కానీ, పౌర్ణమి నాడు కానీ ఉమాసహిత పరమేశ్వరుడిగా కానీ, లేక నా లింగస్వరూపానికి కానీ పూజలు చేసిన వారికి అక్షయ పుణ్యం లభిస్తుంది. అలాగే ఆర్ర్దా నక్షత్రంతో కూడిన చతుర్దశి నాడు ప్రణవమంత్రాన్ని జపిస్తే ఆ పుణ్యఫలం అనంతం. ముఖ్యంగా సూర్య సంక్రమణంతో కూడిన ఆర్ధా నక్షత్రంలో ఒక్కసారి ప్రణవాన్ని జపిస్తే అది కోటి ప్రణవ మంత్ర ఫలాన్నిస్తుంది. అలాగే ప్రదోష వేళల్లోనూ, చతుర్దశీ తిథి యందూ, ఆర్ర్ధా నక్షత్ర యుక్త మార్గశిర మాసపు దినమందునూ నా పూజనమూ, కీర్తనమూ నాకు అత్యంత ఆనందదాయకం’’ అని తెలిపిన పరమేశ్వరుడు, తరువాత వారిరువురికీ ఓంకార మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్ర ప్రాముఖ్యతను గూర్చి ఇలా తెలిపాడు.
‘‘బ్రహ్మ విష్ణువులారా! సాకార రూపాన పంచముఖుడినై నేను సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహములనే ఐదు కృత్యాలను నిర్వహిస్తాను. నా ఉత్తర ముఖము, నుండి ‘అ’ కారము, పశ్చిమ ముఖము నుండి ‘ఉ’ కారము దక్షిణ ముఖమునుండి ‘మ’కారము, తూర్పు ముఖము నుండి బిందువు, మధ్య ముఖము నుండి నాదము ప్రకటితమయాయి. ఈ అయిదు అంగాలతో కూడినదే ‘ఓం’ కారము. అది నా అన్ని అవయవాలలోనూ నిండి, నాతో ఏకీకృతమైంది. కాబట్టి ఓంకార స్మరణము నా స్మరణమే! ఓంకారము నుండి స్వరములు, వ్యంజనములూ ఉద్భవించి ఆ వర్ణాలన్నీ నా వివిధ అంగాల్లో ఉపస్థితమయినాయి. ఆ వర్ణాల కలయికతో కోట్ల మంత్రములు ఉత్పన్నమయాయి. సప్తకోటి మహామంత్రాలన్నీ ఓంకారం నుండి ఉద్భవించినవే! ప్రణవ మంత్రమయిన ఓంకారమూ, ప్రణవ సహిత పంచాక్షరీ మంత్రమయిన ‘ఓం నమశ్శివాయ’ అన్న రెండు మంత్రాలూ భోగ మోక్షాలను రెండిటినీ సిద్ధింపజేయగలవు’’ అని వివరించాడు మహేశ్వరుడు.

ఇంకా ఉంది