డైలీ సీరియల్

పంచముఖుడు (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకారము సృష్టికర్త స్వరూపము, ఉకారము స్థితి కర్త స్వరూపము కాగా, మ కారము నిత్య అనుగ్రహ కర్త స్వరూపము. అనగా నారదా! సృష్టికర్తనైన నేను ‘అ’కార బీజ రూపుడను. నా తండ్రి ‘ఉ’ కార బీజ స్వరూప యోని రూపుడు. మా ఇరువురికీ స్వామి అయిన ఈశ్వరుడు బీజకము. అనగా బీజ, యోనులను తన ఇచ్ఛాశక్తితో సృజించిన వాడు. అనగా అకార రూప బీజమును, ‘ఉ’ కార రూప యోని లోనుండి ఉద్భవింపజేసిన మ కార రూప బీజకమైన ఈశ్వరుడు ఓం కార స్వరూపుడు. ఈ మూడు బీజాలకూ మూలమైనది ఆయన పరమేశ్వర స్వరూపము.
నారదా! మేమలా విస్మితులమై చూస్తూండగానే ఓ బ్రహ్మాండమైన అండము (గ్రుడ్డు) మాకు అగుపించింది. బంగారు రంగులో ప్రకాశిస్తున్న ఆ అండము సముద్రంలో వేయేళ్ళు ఉంటుందనీ, అనంతరం అది రెండుగా చీలగా క్రింది భాగం భూలోకముగానూ, పై భాగం భువర్లోక సువర్లోకాలుగాను త్రిభువనాలూ ఏర్పడతాయని ఆ సర్వేశ్వరుడు మాకు వివరించాడు.
దిగ్భ్రాంతులమైన తిలకిస్తున్న మాకు అంతలోనే ఏకాక్షరమైన ‘ఓం’ నుండి ‘ఓం’ అన్న ప్రణవ నాదం గొప్ప ప్రణవ మంత్రంగా వీనుల విందుగా వినిపించింది. అటు వెనుక ఆ శబ్ద బ్రహ్మంతో పాటూ మిగిలిన నలభై ఎనిమిది అక్షరాలూ కూడా ఓంకారాక్షరం నుండి ఉద్భవించాయి. మేము చూస్తుండగానే ఆ అక్షరాల కలయికగా రెండు ప్రధాన మంత్రాలయిన ‘మహదేవ’ మంత్రమూ, ‘గాయత్రీ’ మంత్రమూ ఓంకారం నుండి ఆవిర్భవించాయి.
‘‘తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నో రుద్ర ప్రచోదయాత్’’ అన్నది రుద్రమంత్రము కాగా,
‘‘తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్’’ అన్నది గాయత్రీ మంత్రము.
వాటి వెనుకే ఒకటి తరువాత ఒకటిగా ‘త్రయంబక’ మంత్రమూ, ప్రణవ సహిత శివ పంచాక్షరీ మంత్రమూ, ‘‘ఓం నమో భగవతే దక్షిణామూర్తయే’’ అన్న దక్షిణామూర్తి మంత్రమూ, ఇంకా మరెన్నో మంత్రాలతో పాటూ ‘తత్వమసి’ అన్న మహావాక్యమూ, వేదమంత్రాలూ కూడా మాకు వినిపించాయి. మా తనువులు పులకించగా మేమిరువురమూ ఆ అద్భుత తేజోలింగానికి సాగిల పడి దాన్ని పూజించాము. నా తండ్రి తన్మయుడవుతూ తనకా మహేశ్వరుడు మొట్టమొదట ప్రసాదించిన పంచాక్షరీ మంత్రాన్ని భక్తిగా జపించసాగాడు.
‘హేశంభో! భవ నాశకా! పరబ్రహ్మ స్వరూప పరమేశ్వరా! దయ ఉంచి మాకు నీ సాకార దర్శనం కూడా అనుగ్రహించు ప్రభూ!’ అని మేము ప్రార్థించగా మహేశ్వరుడు తన దివ్య మంగళ రూపంతో మాకు దర్శనమిచ్చాడు.
‘‘నారదా! ఆ మహాదేవుడి అద్భుత సాకార రూపాన్ని దర్శించే అదృష్టాన్ని ముందుగా నా తండ్రీ, ఆ పిదప నేనూ పొందాము. ఆ రూపము అయిదు ముఖములతోనూ, పది భుజములతోనూ విలసిల్లుతోంది. ఆ దేహకాంతి కర్పూరం వంటి స్ఫటిక ధవళ వర్ణంతో దేదీప్యమానమై ఉంది. అద్భుతమైన ఆభరణాలు ఆయన వివిధ అంగాలనూ అలంకరించి ఉండగా వాటి నడుమ ఒక్కొక్క దేహ భాగంలోనూ ఒక్కొక్క అక్షరంగా అన్ని వర్ణాలూ, హ్రస్వాలూ ఆయన దేహమంతటా ఇమిడిపోయి శోభిస్తున్నాయి. అ కారం నుండి హ కారం వరకూ గల అన్ని అక్షరాలతోనూ, ఆభరణాల ప్రకాశంతోనూ ఆయన విభూషితుడై పంచవదనుడిగా మాకగుపించాడు.
‘ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత’ నామాలు కల ఆయన ఐదు ముఖాలూ పంచ బ్రహ్మలని వ్యవహరింపబడుతున్నాయి. ఆ ముఖాలనుండి సప్తకోటి మహామంత్రాలూ ఉత్పన్నమవుతూండటం మేము దిగ్భ్రాంతులమై వింటున్నాము.
నారదా! తన నుండి తాను ఆవిర్భవించిన ‘సద్యోజాతుడు ఆ మహేశ్వరుడు. ఈశులకే ఈశుడైన ‘ఈశానుడి’గా ఆయన పురాతనుడు. అంతటి ప్రాచీన, సనాతన దైవమయిన ఆయనే బ్రహ్మ పదార్థమైన ‘తత్పురుషుడు’. ఆయన హృదయము అత్యంత మృదువైనదీ సౌమ్యమయినదీ కనుక ఆయన ‘అఘోరుడు’. ముక్కంటి అయిన ఆయన విరూపాక్షుడూ, వామదేవుడూ అని పిలువబడ్డాడు. నారదా! ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలనబడే పంచ కృత్యాలనూ తన పంచ ముఖాలతో నిర్వహించే పరబ్రహ్మ స్వరూపుడు.
కుమారా నారదా! ఆ మహేశ్వరుడు నా తండ్రితోనూ, నాతోనూ ఇలా పలికాడు.
‘విష్ణుదేవా! సృష్టి స్థితి లయాలనే కార్య బేధములతో నేనే బ్రహ్మ విష్ణు రుద్ర నామాలు ధరిస్తున్నాను. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడివైన శ్రీహరీ! సకల లోకాలకూ నీవు రక్షకుడవై మేలు చేకూరుస్తావు. నీ స్థానం నా హృదయం.

ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె