డైలీ సీరియల్

చంచలత్వమే కారణహేతువు! (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ నారద మహర్షి ఎంత మాత్రమూ చలించక, వారి నయగారాలకు లొంగక మరింత ఏకాగ్రతతో తన తపస్సు కొనసాగించాడు.
తపోదీక్ష ముగించిన అనంతరం ఒకనాడు నారదులవారికి ఆ ఉదంతమంతా గుర్తుకి వచ్చింది. రంభాది అప్సరసలు తన తపోభంగ మొనరించటానికి ప్రయత్నించిన వైనమూ, తాను ప్రదర్శించిన అకుంఠిత నిగ్రహమూ స్ఫురణకు వచ్చిన ఆయన తన ఇంద్రియ నిగ్రహానికి తానే ఎంతో గర్వించి ఓ విధమైన అహంకారానికి లోనయ్యాడు. తాను మోహాన్ని పూర్తిగా జయించానని కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడికి గర్వంగా తెలిపాడు.
ఈశ్వరుడికి ఆయన పరిస్థితి అర్థం అయింది. అందుకు కారణం తన శక్తి స్వరూపిణి అయిన ‘శివమాయ’ అని గ్రహించిన ఆయన ఆ ఉత్తముడికి ఆ విషయం నచ్చ చెప్పాలని చూసాడు. కానీ అది నారదుని చెవికెక్కలేదు. చేసేది లేక విష్ణువుతో మాత్రం ఆ సంగతి తెలుపవద్దని చెప్పాడు ఈశ్వరుడు.
ఎందుకంటే శివమాయా ప్రభావం వలన కలిగే అహంకారము క్రమంగా అజ్ఞానానికి మరో రూపమైన ‘మోహాని’కి, అనగా ‘విష్ణు మాయకు’ దారి తీస్తుందని ఆ పరమ శివుడికి తెలుసు. కానీ ఈశ్వరుడేది నివారించాలనుకున్నాడో అదే జరిగింది. అహంకారమావహించిన నారదుడు విష్ణువుకి ఆ విషయం గర్వంగా తెలుపుకున్నాడు. విష్ణువుకి నారదుడి స్థితీ, పరమేశ్వరుడు నారదునికి మేలు చేయాలని ఉద్దేశించటమూ అర్థం అయ్యాయి. పరమేశ్వరుడిని తలచుకుని నారదుడి అహంకార నిర్మూలనకై ఆయనొక వ్యూహం రచించాడు.
నారదుని కళ్ళముందొక చక్కని పట్టణమూ, ఆ పట్టణ రాకుమార్తె లక్ష్మీ అంశురాలూ అయిన ‘రమా’దేవీ, ఆమె స్వయంవరానికై సన్నాహాలు చేస్తున్న రాజు సుశీలుడూ గోచరించారు. ఆ చక్కటి కన్యను చూడగానే మోహవశుడయిపోయిన నారదుడు ఆ మాయా ప్రభావం వలన విష్ణువును ఆయన మనోహర ‘హరి’ సౌందర్యాన్ని స్వయంవర సమయాన తనకి ప్రసాదించమని ఆయనని అర్థించాడు. కానీ విష్ణువు ‘హరి’కి పర్యాయ పదమైన కోతి రూపాన్ని అనుగ్రహించటంతో అవమానాల పాలైపోయాడు. పైపెచ్చు రమాదేవి శ్రీహరిని వరించటంతో, క్రోధపూరితుడై విష్ణువంతటివాడిని, మనుజుడై పుట్టి, భార్యా వియోగం పొంది, ఏ వానర రూపం ఇచ్చి తనను పరాభవించాడో ఆ వానరుల సహాయం వలననే తన భార్యను తిరిగి పొందగలడని శపించాడు. అతని శాపం మాయావశాన ఇవ్వబడినదే అయినా విష్ణువు దానిని తన రామావతారంలో అనుభవిస్తానంటూ గ్రహించాడు.
తనని ఆవహించిన మాయ తొలగిపోయాక గానీ నారదుడికి తన తప్పు స్ఫురణకు రాలేదు. తన చంచలత్వానికీ, ఇంద్రియ వికారానికీ ఆయనెంతో సిగ్గు పడ్డాడు. కానీ అప్పటికి ఉపద్రవం జరగనే జరిగిపోయింది. శ్రీహరికి శాపం ఇచ్చిన పాపం ఆయన్ని చుట్టుకుంది. పైగా ఆ ఘటన బ్రహ్మచారి అయినా తాను పొందిన స్ర్తీ లోలత్వము తానింకా పరిపూర్ణత్వాన్నీ, ఇంద్రియ నిగ్రహాన్నీ పొందలేదనే విషయాన్ని ఆయనకి విప్పి చెప్పింది.
పశ్చాత్తాపంతో శ్రీహరి పాదాల మీద పడి ఆయనను శపించిన పాపము నుండి తాను బయట పడటానికి ఉపాయం తెలుపమని అర్థించాడు. కరుణామూర్తి అయిన హరి అతనిని లేవనెత్తి మధుర స్వరంతో ఊరడిస్తూ ఇలా పలికాడు.
‘‘నాయనా నారదా! నీవు గర్వాంధుడివై శివుడు నిన్ను హెచ్చరించినా వినక నీ ఇంద్రియ నిగ్రహాన్ని గురించి అందరి వద్దా ప్రగల్భాలు పలికి చులకన అయ్యావు. నాకు శాపమిచ్చిన పాపమూ పొందావు. ఇప్పటికైనా నీలోని చంచలత్వమూ, స్ర్తీ లోలత్వమూ పూర్తిగా తొలగలేదని తెలుసుకోగలగటం ఎంతో ముదావహం.
నీ అహంకార గర్వాలను దూరం చేసి నిన్ననుగ్రహించే ఉద్దేశ్యంతో సత్వ, రజ స్తమోగుణాలకు అతీతుడైన ఆ పరమేశ్వరుడే తన మాయాశక్తికి నిన్ను వశుడిని చేసాడని అర్థం చేసుకో! పాప పరిహారానికై నీవు భక్త సులభుడూ, కృపాకరుడూ అయిన ఆయన చరణార విందాలను హృదయంలో స్థాపించుకుని అన్ని శివతీర్థములలోనూ సంచరిస్తూ శివ నామ స్మరణ చేస్తూ చివరగా కాశీ నగరానికి చేరుకోవాలి. భక్తితో ఆ విశ్వనాథుడిని దర్శించి, పూజించి నీ పాపాన్ని బాపమని ప్రార్థించాలి.
నారదా! పాప రహితుడివైన అనంతరం నీవు నీ తండ్రి లోకమైన బ్రహ్మపురికి చేరి, శివభక్తులలో శ్రేష్ఠుడైన నీ తండ్రిని ప్రార్థించి శివ మహాత్మ్యమునూ, శివ తత్వ విశేష రూప జ్ఞానమునూ, శివ పూజా విధానమును, ఆయన శంకరుడిగా రూపొంది గడిపిన గృహస్థాశ్రమ జీవన విశేషములనూ తెలుసుకోవాలి. అప్పుడు నీవు మోక్షార్హుడివి కాగలవు.’’ అని ప్రేమతో నారదునికి ఉపదేశించాడు విష్ణు భగవానుడు.
ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె