క్రైమ్/లీగల్

అర్ధరాత్రి కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కుషాయిగూడ, ఏప్రిల్ 23: మద్యం మత్తులో నలుగురు విద్యార్థినులు అతివేగంగా కారు నడిపి ఓ అమాయక ప్రాణాన్ని బలిగొన్నారు. ఫుట్‌పాత్‌పై ఉన్న వ్యక్తిని వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో అతనిని చికిత్స కోసం తరలించే సరికే మృతి చెందాడు. ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసిన స్ధానికులు విద్యార్థినుల నిర్వాకంపై మండిపడ్డారు. వీరంతా శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థినులు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈసిఐఎల్ క్రాస్ రోడ్ సమీపంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన నలుగురు బీటెక్ విద్యార్థినులు హారికారెడ్డి, ఈశాన్య, సుజన, అమృతలు కుషాయిగూడ ప్రధాన రహదారిపై మద్యం మత్తులో కారును అతివేగంగా నడిపారు. ఆదివారం రాత్రి 12.30గంటల సమయంలో ఈసీఐఎల్ చౌరస్తా మీదుగా మితిమీరిన వేగంతో వెళ్లిన కారు డీఏఈ కాలనీ ప్రధాన గేట్ సమీపంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లడంతో అశోక్ అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడని పోలీసులు తెలిపారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న కుషాయిగూడ పోలీసులు మద్యం మత్తులో కారు నడిపిన విద్యార్థినులను రక్షించే ప్రయత్నం చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం తాగిన విద్యార్థినులకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయకుండా కుషాయిగూడకు చెందిన ఏఎస్‌ఐ అడ్డుకోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. సామాన్యులకు ఒక న్యాయం, పలుకుబడి ఉన్న వాళ్లకు ఒక న్యాయమా అని పోలీసులను నిలదీశారు. మద్యం మత్తులో కారు నడిపిన విద్యార్థిని.. ఓ పోలీసు అధికారి కుమార్తె అని సమాచారం అందడంతో ఆమెను రక్షించే ప్రయత్నం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కారు బీభత్సం సృష్టించడంతో కాప్రాలో అర్ధరాత్రి ప్రజలు భయందోళనకు గురయ్యారు.
ఈ దారుణ సంఘటనకు కారణమైన కారు నెంబర్ ఏపీ 29 ఏవై 5234ను సైతం పోలీసులు తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తునట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతిచెందిన అశోక్ కుటుంబీకులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కారువేగంగా నడిపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు.
చిత్రాలు...ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు.. *మృతి చెందిన అశోక్