క్రైమ్/లీగల్

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహేశ్వరీ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 7: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు జస్టిస్ మహేశ్వరితో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత జస్టిస్ మహేశ్వరీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ భారత రాష్టప్రతి జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా మహేశ్వరీకి గవర్నర్ పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని నూతన ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మహేశ్వరిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, హైకోర్టు న్యాయమూర్తి సీహెచ్ ప్రవీణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ప్రొటోకాల్ డైరెక్టర్ జీసీ కిషోర్‌కుమార్, గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, జీఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, రాష్ట్ర స్థాయి అధికారులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రభృతులు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరీ 1961, జూన్ 29న మధ్యప్రదేశ్‌లో జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా నమోదయ్యారు. మధ్యప్రదేశ్
హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005, నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2019, అక్టోబర్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
దుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ప్రమాణ స్వీకారం అనంతరం దుర్గమ్మ దర్శనం నిమిత్తం జస్టిస్ జేకే మహేశ్వరీ కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. ఆయనకు ఆలయ కార్య నిర్వహణాధికారి ఎంవీ సురేష్‌బాబు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో తోడ్కొని వెళ్లారు. అంతరాలయంలో జస్టిస్ జేకే మహేశ్వరీ పేరున అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే జస్టిస్ మహేశ్వరీ దంపతులు కూడా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. దేవస్థానం ఇవో ఎంవీ సురేష్‌బాబు అమ్మవారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని జస్టిస్ జేకే మహేశ్వరీకి బహూకరించారు.
*చిత్రం...ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరీతో
ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్