క్రైమ్/లీగల్

ఆంక్షల రద్దుకు ఆదేశించలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: జమ్మూకాశ్మీర్‌లో 370 అధికరణ రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఆంక్షల రద్దుకు ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పరిస్థితి అత్యంత సున్నితంగా ఉందని, ఈ పరిస్థితుల్లో అక్కడ విధించిన ఆంక్షలను రద్దు చేసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించలేమని న్యాయమూర్తి అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సుభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం తేల్చిచెప్పింది. జమ్మూకాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని, అక్కడ విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్త తహసీన్ పూనావాలా వేసిన పిటిషన్‌పై సుప్రీం పలు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో, ఆంక్షలను సడలించాలని కేంద్రాన్ని ఆదేశించలేమని పేర్కొంది. జమ్మూకాశ్మీర్‌లో విధించిన ఆంక్షలు, ఇతరత్రా పరిస్థితులపై కేంద్రం తరపున కోర్టుకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదన వినిపిస్తూ, ఆయా ప్రాంతాల్లోని స్థానిక మెజిస్ట్రేట్ల నుంచి అందిన నివేదికల ప్రకారమే ఆంక్షలను సడలిస్తున్నట్టు ధర్మాసనానికి తెలిపారు. అయితే, పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొని, పూర్తిగా ఆంక్షలు ఎప్పుడు ఎత్తివేస్తారనేది ఇప్పుడప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, సంబంధిత ప్రాంతాల న్యాయమూర్తులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే సడలింపు ఉత్తర్వులు జారీ చేస్తున్నామని వేణుగోపాల్ వివరించారు. 2016 జూలైలలో ఉగ్రవాది ముర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కాశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడడానికి మూడు నెలలు పట్టిందని ఆయన ధర్మాసనానికి గుర్తుచేశారు. 1990 దశకం ప్రారంభం నుంచి ఇంత వరకూ సుమారు 44,000 మంది పౌరులను తీవ్రవాదులు హతమార్చారని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనడానికి మరికొన్ని రోజులు పట్టవచ్చని వేణుగోపాల్ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దును గత సోమవారం ప్రకటించిన తర్వాత ఇంత వరకూ ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని, ఎవరూ మృతి చెందలేదని కోర్టుకు తెలిపారు. పరిస్థితులు కుదుటపడుతున్నకొద్దీ ఆంక్షలను సడలిస్తున్నట్టు ఆయన వివరించారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఎవరి వద్దా లేదని స్పష్టం చేసింది. అయితే, ప్రతి రోజూ అందుతున్న నివేదికల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది. జమ్మూకాశ్మీర్‌లో సాధ్యమైనంత త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ ప్రాంతంలో ఏవైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే, అందుకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని, అందుకే, ప్రతి అంశాన్నీ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నామని, సాధారణ పరిస్థితులు రావడానికి మరికొంత సమయం పడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏఏ ప్రాంతాల్లో, లేదా ఏఏ అంశాల్లో సడలింపు అవసరమో తెలపాలని పిటిషనర్ తరఫు లాయర్ మేనకా గురుస్వామికి సూచించింది. ఏవైనా ప్రత్యేక అంశాలను ఉదహరిస్తే, ఆయా పరిస్థితులకు అనుగుణంగా చర్యలకు ఆదేశించే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఎంతకాలంలో ఆంక్షలను ఎత్తివేస్తారని పిటిషనర్ తరఫున న్యాయవాది అడిగిన ప్రశ్నపై వేణుగోపాల్ వివరణనిస్తూ, పరిస్థితులను రోజువారీ విధానంలో సమీక్షిస్తున్నట్టు చెప్పారు. అయితే, సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఆయన వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు ధర్మాసనం, ఇలాంటి అంశాల్లో కాల వ్యవధిని పేర్కోవడం అసాధ్యమవుతుందని స్పష్టం చేసింది. పరిస్థితులకు అనుగుణంగా, దశలవారీగా సడలింపు ప్రక్రియ ఉంటుందని పేర్కొంది.
చిత్రం...జమ్మూలోని విక్రమ్ చౌక్ వద్ద మంగళవారం బందోబస్తు నిర్వహిస్తున్న భద్రతా దళాలు