క్రైమ్/లీగల్

అంతర్‌రాష్ట్ర మోసగాడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, అక్టోబర్ 29: డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, కేంద్ర మంత్రి కుమారుడు తదితర అవతారాలతో ప్రజలకు, నిరుద్యోగులకు, రాజకీయ నేతలకు కోట్లలో కుచ్చుటోపీ పెట్టి తప్పించుకు తిరుగుతున్న ఓ నేరస్థుడిని కాకినాడ నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్టుచేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని నిందితుడి మోసాల వివరాలను తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కరప మండలం జి భావారం గ్రామానికి చెందిన సమనాసి వెంకటరమణ అనే వంశీకృష్ణ అలియాస్ ప్రదీప్ (40) అనే వ్యక్తి రకరకాల పేర్లతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, బెంగళూరు, ముంబాయి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 2006వ సంవత్సరం నుండి నేరాలకు పాల్పడుతున్నాడు. ఇంజినీరింగ్ చదివిన ఇతను సుమారు 20 సంవత్సరాల క్రితం ఇంటి నుండి పరారై నేరాలకు పాల్పడుతూ జల్సాలు చేస్తున్నాడు. డాక్టర్‌గా అవతారం ఎత్తి కొంతకాలం పాటు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేశాడు. ఆ ఆసుపత్రి యాజమాన్యానికి అనుమానం వచ్చి వెంకటరమణ సర్ట్ఫికెట్లను పరిశీలించగా అవి నకిలీవని తెలియడంతో డాక్టర్ ఉద్యోగం నుండి తొలగించారు. అనంతరం హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగంలో చేరి రెండునెలల పాటు అక్కడ ఉద్యోగం చేసిన తరువాత వారు సర్ట్ఫికెట్లను తనిఖీ చేయడంతో నకిలీవని తేలడంతో ఉద్యోగం నుండి వెళ్లగొట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ఓ కేంద్ర మంత్రి కుమారుడిని అని చెప్పుకుంటూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహంలోకి చేరి ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేశాడు. తనకు ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు తెలుసునంటూ పేరున్న ప్రజాప్రతినిధులను సైతం బుట్టలో వేసుకుని వారి నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసేవాడు. ఈ సంవత్సరం మల్టీటెక్ సొల్యూషన్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరిట హైదరాబాద్‌లో నకిలీ సాఫ్ట్‌వేర్ సంస్థను ఏర్పాటుచేసి వివిధ రాష్ట్రాలకు చెందిన 124 మంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, వారికి ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి వారి నుండి 3 కోట్ల 85 లక్షల రూపాయలు కాజేశాడు. ఇతనిపై హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ టాస్క్ఫోర్స్ ఆఫ్ నార్త్ జోన్ పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నిందితుడు వెంకటరమణపై కరప పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ నమోదై ఉంది. వివిధ కేసుల్లో రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లలో వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఓ కేసులో 2015లో కాకినాడ పోలీసులు అరెస్టుచేసి కోర్టుకు తరలిస్తున్న సమయంలో ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి పరారయ్యాడు. ఇదే విధంగా ఖమ్మం పోలీస్ ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి గత జూలై 24వ తేదీన దువ్వాడ రైల్వేస్టేషన్ నుండి పరారయ్యాడు. దీంతో విశాఖపట్నం జీఆర్‌పీ పోలీసులు నిందితుడు వెంకటరమణపై కేసు నమోదుచేశారు. గత ఆగస్టు 3వ తేదీన ఏలూరు సిఆర్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల వద్ద నుండి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్ చోరీ చేసి పరారయ్యాడు. అదే రోజున కాకినాడ భానుగుడి సమీపంలోని వంశీ ఫాస్ట్ఫుడ్ వద్ద పార్కుచేసి ఉంచిన యాక్టివా మోటారు సైకిల్‌ను చోరీ చేసి పరారయ్యాడు. అనంతరం జూలై 20వ తేదీన రావులపాలెం శ్రీ మారుతీ కార్ కన్సల్టేషన్ సంస్థ నుండి ఫియెట్ కారును చోరీ చేసి పరారయ్యాడు. వివిధ నేరాలు చేస్తూ పోలీసుల నుండి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న వెంకటరమణపై చాలా కాలంగా నిఘా వేసి ఉంచడంతో నిఘా వర్గాల ద్వారా క్రైమ్ డీఎస్పీ పల్లపురాజుకు వచ్చిన సమాచారంతో నిందితుడిని ఆదివారం కాకినాడ భానుగుడి సెంటర్ బీబా షోరూం వద్ద అరెస్టుచేసినట్టు ఎస్పీ విశాల్ గున్ని చెప్పారు. విచారణ అనంతరం నిందితుడు వెంకటరమణ నుండి 6 లక్షల రూపాయలు విలువ చేసే కారు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు వెంకటరమణపై తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాల్లో 83 ప్రోపర్టీ కేసులు, 8 సైబర్ నేరాలు కేసులు ఉన్నాయన్నారు. మాటకారితనంతో మోసాలకు పాల్పడే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విశాల్ గున్ని హెచ్చరించారు.
ఈ విలేఖరుల సమావేశంలో క్రైమ్ డీఎస్పీ ఎ పల్లపురాజు, ఎస్సైలు కెవి రామారావు, పాపరాజు పాల్గొన్నారు.

చిత్రం..నిందితుడిని మీడియాకు చూపుతున్న క్రైమ్ డీఎస్పీ పల్లపురాజు