క్రైమ్/లీగల్

కొంతమూరులో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 29: రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలోని జంగాలకాలనీలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. 2016లో ఇదే కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సంఘటనలో సుమారు 95 ఇళ్లు దగ్ధమయ్యాయి. అప్పటి నుంచి బాధితులు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు మళ్లీ అదే ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 33 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 132 మంది నిరాశ్రయులయ్యారు. తెల్లవారుజామున విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక పాక నుంచి మంటలు రాజుకుని, పక్కనే ఉన్న మిగిలిన పాకలకు వ్యాపించాయి. దీంతో బాధితులు విలువైన సామాగ్రిని వదిలేసి, ప్రాణభయంతో బయటకు పరుగులుతీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. ఈ సంఘటనలో సుమారు రూ. 25 లక్షల ఆస్తినష్టం సంభవించింది. సంఘటనా స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎస్పీ షిమోషీబాజ్‌పేయి సందర్శించారు. రెవెన్యూ, పోలీసులు బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వైసిపి రూరల్ కో-ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు కూడా బాధితులను పరామర్శించారు. కాగా, 2016లో జరిగిన అగ్నిప్రమాదంలో బాధితులకు ఇళ్లు నిర్మిస్తామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల హామీ ఇచ్చారు. హామీ నెరవేరకపోవడంతో బాధితులు గతంలో నిరసనలు వ్యక్తం చేశారు. తాజా ఘటనతో మరోసారి బాధితుల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయన్న ఉద్దేశంతో గోరంట్ల ఆలస్యంగా హోంమంత్రిని వెంటబెట్టుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈసందర్భంగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
బాధితులను ఆదుకుంటాం: నిమ్మకాయల
అగ్నిప్రమాద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హామీ ఇచ్చారు. సోమవారం ఆయన బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు బాధితులకు భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. బియ్యం పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే బాధితులకు రూ. 2 లక్షల చొప్పున 148 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాలనీకి లేఅవుట్ ఏర్పాటుచేసి, తాగునీరు, డ్రైనేజీ, ఇతర వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఆరా తీశారని, సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారన్నారు. బాధితులకు తాత్కాలిక ఆవాసాలు కల్పించి, విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి, జనవరి నాటికి గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్లే బాధితులకు గృహాలు నిర్మించడంలో జాప్యం జరిగిందని వివరణ ఇచ్చారు. జంగాలకాలనీకి మంచినీటి ట్యాంకును నిర్మించడంతో పాటు, కళ్యాణ్‌నగర్ నుంచి మంచినీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.