ఈ వారం స్పెషల్

ప్లాస్టిక్ కరెన్సీ మనకెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్బు లేనిదే రోజు గడవదు..
చేతిలో నగదు లేకపోతే నరకమే..
జేబులో కరెన్సీ ఉంటే మన పోజులే వేరు..
ఇక కట్టలు దాచినవాడి దర్పమే వేరు...

కానీ చేతిలో చిరిగిన నోటు...
చెల్లని కరెన్సీ ఉన్నా.. లేకున్నా ఒక్కటే..
చిత్తుకాగితం పాటి చేయదు మన విలువ.
ఈ తత్వం ఇపుడు అనుభవంలోకి వచ్చింది అందరికీ.

పెద్దనోట్ల రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మామూలు జనం క్యూల్లో హాహాకారాలు పెడితే...నల్లబాబులు తేలుకుట్టిన దొంగల్లా మారిపోయారు. దేశంలో నకిలీ నోట్ల బెడద ఎక్కువైందని, దాయాది పాకిస్తాన్ సహా ఇరుగుపొరుగు దేశాల ద్వారా పెద్దఎత్తున నకిలీ నోట్లు దేశాన్ని ముంచెత్తాయని, ఉగ్రమూకలకు ఊతమిస్తున్నదని, నల్లకుబేరులు కట్టలుకట్టలు పెద్దనోట్లు దాచిపెట్టడంతో కేంద్రం ఇలా వాతపెట్టిందన్నమాట. 500, 1000 రూపాయల అసలు, నకిలీ నోట్లు ఏవో గుర్తించలేని స్థితిలో పరిస్థితులున్నాయన్నది అధికారుల ఉవాచ. సరే, ఆ నిర్ణయం వల్ల కలిగే మంచిచెడులు, ప్రభావం ఇప్పటికే అందరికీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉన్న ఫళంగా తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆలోచనల్లో పడేసింది. కరెన్సీ కటకటతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్య తరగతి జనం పొదుపుమంత్రం పఠిస్తూంటే సంపన్నులు నల్లడబ్బుకు తెల్లముసుగు కప్పేందుకు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. అసలు పేపర్ కరెన్సీకి నకిలీ మకిలి లేకుండా చేయవచ్చుకదా అన్నది మరికొందరి సూచన. నగదు రహిత రాజ్యంగా మార్చలేమా అన్నది మరికొందరి సూచన. అసలు నోట్ల రద్దే తప్పని, క్యాష్‌లెస్ దేశాలేవీ లేవని ఇంకొందరి వాదన. ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో నకిలీ బెడద లేని కరెన్సీ సృష్టించవచ్చని యువతరం భరోసా. డిజిటల్ కాలంలో ఇప్పుడిప్పుడే డెబిట్, క్రెడిట్, స్మార్ట్‌కార్డుల వంటివాటితో ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతున్నవారూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సురక్షితమైన, నకిలీని సులువుగా సృష్టించలేని ‘ప్లాస్టిక్ కరెన్సీ’ని ఉపయోగించాలన్న సూచనకు మద్దతు పెరుగుతోంది. ఎన్నో ప్రయోజనాలను అందించే ప్లాస్టిక్ కరెన్సీ ఇప్పటికే చాలాదేశాల్లో సత్ఫలితాలను ఇస్తోంది. మనదేశం కూడా ఆరేళ్లుగా ప్లాస్టిక్ కరెన్సీ ఉపయోగంలోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఉంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో ఈ ప్రతిపాదనపై విస్తృత చర్చ జరుగుతోంది.
ప్లాస్టిక్ కరెన్సీ అంటే..
ప్రస్తుతం మనం వాడుతున్న నోట్లను పేపర్ కరెన్సీ అంటారు. పత్తి, చెట్ల కలప, కొన్ని రసాయన పదార్థాలను వాడి కరెన్సీని ముద్రిస్తారు. మనదేశంలో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సారథ్యంలో మైసూరులోని ‘ది బ్యాంక్‌నోట్ పేపర్‌మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ దేశ అవసరాలకు తగ్గట్లు పేపర్‌కరెన్సీని ముద్రిస్తోంది. కొన్ని అంచనాల ప్రకారం ఏటా 12వేల టన్నుల పేపర్ కరెన్సీని ఈ సంస్థ ముద్రిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని ‘సెక్యూరిటీ ఫీచర్స్’ జోడించినా పేపర్ కరెన్సీకి నకిలీ బెడద తప్పడం లేదు. కరెన్సీ ముద్రించడానికి వాడే పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించే సంస్థలు, మన ప్రత్యర్థులు నకిలీ కరెన్సీని సృష్టిస్తున్నారు. అయితే, దీనికి చక్కటి పరిష్కారం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్లాస్టిక్ కరెన్సీ లేదా ప్లాస్టిక్ మనీగా పిలిచే ‘పాలిమర్ నోట్స్’ని అందుబాటులోకి తేవాలన్నది ఆ సూచన. ఈ నోట్ల తయారీకి ‘బయాక్సియల్ ఓరియంటెడ్ పొలిపైలీన్ (బిఒపిపి) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. కలప లేదా పత్తి వాడకం ఉండదు. ప్లాస్టిక్‌లో ఒకరకమైన పాలిమర్‌తో తయారు చేస్తారు కనుక ఈ నోట్లను ప్లాస్టిక్ మనీగా పిలుస్తున్నారు.
ప్రయోజనాలు ఎన్నో!
పాలిమర్ కరెన్సీకి ఇటీవలి కాలంలో ఆదరణ బాగా పెరిగింది. ఈ నోట్లలో సెక్యూరిటీ ఫీచర్లు చాలా ఎక్కువ ఉంటాయి. అందువల్ల వాటికి నకళ్లను తయారుచేయడం అంత సులువుకాదు. నకిలీ పేపర్ కరెన్సీ బెడదను తీవ్రంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియా ఆ సమస్య నుండి బయటపడటానికి పాలిమర్ కరెన్సీని సృష్టించింది. మొదట ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ కరెన్సీని అమలు చేసి ఇప్పుడు సంపూర్ణంగా వాటినే వినియోగిస్తోంది. ఇప్పుడు ఆ దేశంలో నకిలీ నోట్ల బెడద లేకపోవడం విశేషం. పేపర్ కరెన్సీ తయారీకి పెద్దఎత్తున చెట్లను నరికి కలపను వాడాల్సి వస్తుంది. దీనివల్ల పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ నోట్ల మన్నిక కాలం తక్కువ. గాలిలోని తేమ, దుమ్ముధూళితో ఈ నోట్లు రూపుమారడం, పాడైపోవడం సాధారణం. చెలామణిలో నలిగిపోయి, చిరిగిపోవడమూ మామూలే. ప్లాస్టిక్ నోట్లకు ఈ బెడద లేదు. ఒకసారి ప్లాస్టిక్ కరెన్సీ ముద్రిస్తే వాటి మన్నిక పేపర్ కరెన్సీతో పోలిస్తే దాదాపు పాతికరెట్లు ఎక్కువ. పేపర్ కరెన్సీ ముద్రణ ఖర్చుతో పోలిస్తే ప్లాస్టిక్ కరెన్సీకి ఎక్కువే వ్యయం అవుతుంది. కానీ చెలామణి, మన్నికలతో పోలిస్తే ఎంతో కలసివస్తుంది. ఇక తేమ, దుమ్ముధూళి, నలిగిపోవడం, చిరిగిపోవడం వంటివేమీ ఉండవు. పేపర్ కరెన్సీలో కన్నా సూక్ష్మమైన, భద్రమైన సెక్యూరిటీ ఫీచర్లు, రంగులు, ఆకర్షణీయ రూపం ప్లాస్టిక్ కరెన్సీలో సాధ్యం. సెక్యూరిటీ త్రెడ్, వాటర్‌మార్క్, ఖాళీ ప్రదేశాలు, నోటు ఉపరితలంపై ఎగుడుదిగుడులున్నట్లు భ్రమకల్పించే ఫీచర్లు వీటిలో సాధ్యం. ప్లాస్టిక్ నోట్లలో సెక్యూరిటీ ఫీచర్లు మూడు రకాలుగా ఉంటాయి. ఇండాగ్లియో ప్రింటింగ్, మెటల్ స్ట్రిప్స్, క్లియర్ ఏరియాస్‌తో ఉండే సెక్యూరిటీ ఫీచర్లను అందరూ గుర్తించే వీలుంటుంది. ఇక వాటర్‌మార్క్, ఉపరితలంపై ఉండే సంకేతాలను మిషన్లు మాత్రమే గుర్తిస్తాయి. ఇక మూడోది, కీలకమైన సెక్యూరిటీ ఫీచర్లు కేవలం ఈ నోట్లను చలామణిలోకి పంపిన రిజర్వుబ్యాంకు, ఇతర బ్యాంకుల్లోని కీలక సిబ్బంది మాత్రమే గుర్తించగలగుతారు. పైగా నాజూకైన రూపంలో ఉండటం వీటి ప్రత్యేకత. ప్రస్తుతం భారతదేశంలో వాడుకలోకి వచ్చిన కొత్త 2వేల రూపాయల నోటు కన్నా నాజూకుగా, పలుచగా పాలిమర్ నోట్లు ఉంటాయని చెప్పొచ్చు. వీటిని లెక్కపెట్టడంలోకాని, తరలించడంలోగానీ సమయం, వ్యయం పేపర్ కరెన్సీతో పోలిస్తే చాలా తక్కువ. దీనిలో ఉండే సమస్యల్లా ఒక్కటే...మడతపెట్టలేకపోవడం. అదేమంత పెద్దకష్టం కాదు. నీటిలో తడిసినా పాడవకపోవడం మరో ప్రత్యేకత. అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా రూపొందించే ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయి కూడా. ఇన్ని లాభాలున్నందువల్లే ప్లాస్టిక్ కరెన్సీకి ఆదరణ పెరుగుతోంది.
ఆస్ట్రేలియా తొలి అడుగు
ప్లాస్టిక్ కరెన్సీని కనుగొన్నది, తొలిసారిగా వాడకంలోకి తీసుకువచ్చినది ఆస్ట్రేలియా. నకిలీ పేపర్ కరెన్సీ బెడద ఎక్కువైపోయి ఆర్థికరంగం కుదేలైపోవడంతో ప్రత్యామ్నాయాలపై పరిశోధనలు చేసిన ఆస్ట్రేలియా ప్లాస్టిక్ కరెన్సీకి ప్రాణం పోసింది. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా, కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్‌ఐఆర్‌ఒ), ద యూనివర్శిటీ ఆఫ్ మెల్‌బోర్న్ సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు చేసి ఈ ప్లాస్టిక్ కరెన్సీ (పాలిమర్ కరెన్సీ)ని సృష్టించాయి. ఆస్ట్రేలియా ద్విశతాబ్ది సందర్భంగా 1988లో తొలిసారి 5 డాలర్ల పాలిమర్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చి ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈ నోట్లను గార్డియన్ అనే ప్రింటింగ్ సంస్థ (జెప్రి బలట్లి అండ్ జాన్స్టన్ యజమానులు) ముద్రించింది. ప్రజల నుంచి అపూర్వమైన ఆదరణ లభించడంతో పది డాలర్ల నోట్లను ముద్రించే అవకాశం ఆ సంస్థకే దక్కింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో అంతా ప్లాస్టిక్ కరెన్సీయే వాడకంలో ఉంది.
సింగపూర్ నుంచి నికరగువా వరకు...
సంపన్నదేశం సింగపూర్ సహా అతి పేద దేశాలైన నికరగువా వంటివి సైతం పాలిమర్ కరెన్సీని పూర్తిస్థాయిలో వాడుతున్నాయి. ప్రస్తుతం 20 దేశాలు పూర్తిస్థాయిలో, మరో పది దేశాలు ప్రయోగాత్మక స్థాయిలో ప్లాస్టిక్ నోట్లను వినియోగిస్తున్నాయి. మరో ఐదారు దేశాలు పాక్షికంగా, కొంతకాలం పాటు ప్లాస్టిక్ కరెన్సీని వినియోగించి మళ్లీ మానుకున్నాయి. మనదేశం కూడా ఈ కరెన్సీని వాడాలన్న ఆలోచనలో ఉంది. బ్రూనే, కెనడా, న్యూజిలాండ్, పపువాన్యూగినియా, రుమేనియా, సింగపూర్, కువైట్, వియత్నాం పూర్థిస్థాయిలో ప్లాస్టిక్ కరెన్సీని వాడకంలోకి తెచ్చాయి. బంగ్లాదేశ్, బ్రెజిల్, కోస్టారిగా, డొమినకల్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, హాంగ్‌కాంగ్ (రెండేళ్లు మాత్రమే), ఇండోనేషియా, మలేసియా, మెక్సికోలలో పాక్షికంగా ప్లాస్టిక్ నోట్లను వినియోగిస్తున్నారు. నేపాల్, సోలమన్ దీవులు ఈ విధానాన్ని అమలుచేసి ఆ తరువాత ఉపసంహరించుకున్నాయి. తాజాగా బ్రిటన్‌లో గత ఏడాది 5 పౌండ్ల ప్లాస్టిక్ నోట్లను వాడకంలోకి ప్రయోగాత్మకంగా తీసుకువచ్చారు. ఈ మధ్యే పది పౌండ్ల నోట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. కెనడాలో 2011లో తొలిసారి 10 డాలర్ల ప్లాస్టిక్ నోట్లను తీసుకువచ్చారు. శ్రీలంక, థాయ్‌లాండ్, జాంబియా కూడా వీటిపై ఆసక్తి చూపి పాక్షికంగా అమలు చేశాయి. ఈ నోట్లను ఫొటోకాపీ, స్కానింగ్ చేసి నకిలీని సృష్టించడం సాధ్యం కాదు. అలాగే ఈ నోట్లలో మామూలుగా కన్పించని కొన్ని ఆల్ట్రావైలట్ రంగులు కొన్ని వెలుగుల్లో మిలమిలా మెరుస్తాయి. వీటిలో ఇదొక సెక్యూరిటీ ఫీచర్. మాగ్నటిక్, ఫ్లోరోసెంట్, మైక్రోప్రింటింగ్ సెక్యూరిటీ ఫీచర్లూ వీటిలో ఉంటాయి. 1967 నుంచి నకిలీకి సాధ్యం కాని, పేపర్ కరెన్సీకి ప్రత్యామ్నాయ నోట్ల కోసం ఆస్ట్రేలియా పరిశోధనలు ప్రారంభించింది. 1986లో రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా పేటెంట్ హక్కులు పొందింది. 1988 నుంచి ఆ నోట్లను వాడటం మొదలెట్టింది. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. చైనా సహా చాలా దేశాలకు ఆస్ట్రేలియా సంస్థలే ప్లాస్టిక్ నోట్లను అందిస్తున్నాయి. భారత్‌లో పెద్దనోట్ల రద్దు తరువాత మనదేశంతో పాటు విదేశాల్లోనూ ప్లాస్టిక్ నోట్లపై చర్చ మొదలైంది. సత్ఫలితాలు సాధించిన ఆస్ట్రేలియా బాటలో మనమూ వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

భారత్‌లో పైలట్ ప్రాజెక్ట్!

ప్లాస్టిక్ నోట్లను వాడుకలోకి తీసుకురావాలన్న ఆలోచన భారత్‌కూ వచ్చింది. 2010లో ఈ ఆలోచనకు ప్రాణం పోశారు. మైసూరు, కొచ్చి, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా నగరాల్లో వీటిని వాడుకలోకి తీసుకురావాలన్న అంశాన్ని ప్రతిపాదనలు రూపంలోకి తీసుకువచ్చారు. ఉన్నతస్థాయిలో విస్తృత చర్చ కూడా జరిగింది. ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ ఉన్నప్పుడు ఈ విషయంలో వేగం కనిపించింది. నిజానికి 2015 నాటికి పది రూపాయల శ్రేణిలో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని రక్షణ, సాంకేతిక అంశాల కారణంగా జాప్యమవుతోంది. ముఖ్యంగా ప్లాస్టిక్ నోట్ల ముద్రణ సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు మనదగ్గర లేవు. వీటిని విదేశాల్లోనే ప్రింట్ చేయించాల్సి ఉంటుంది. ఈ కరెన్సీ ముద్రణలో ఆస్ట్రేలియాది అందెవేసిన చేయి. అయితే చైనాకూ ఆ దేశమే ప్లాస్టిక్ కరెన్సీ అందించేందుకు సిద్ధంగా ఉంది. ఇది ఒక సంశయం. నిజానికి పేపర్ కరెన్సీలో సెక్యూరిటీ ఫీచర్లు (త్రెడ్)కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కొన్ని దేశాలు మనకిచ్చినట్లే పాక్‌కూ ఇవ్వడం వల్ల నకిలీ నోట్ల బెడద ఏర్పడిన విషయాన్ని పరిశీలిస్తున్నారు. వందకోట్ల విలువైన పది రూపాయల ప్లాస్టిక్ నోట్ల సరఫరాకు ఆర్‌బిఐ టెండర్లు ఆహ్వానించింది. ఆరు సంస్థలు బిడ్‌లు వేశాయి. వాటిలో నాలుగు సంస్థలను పరిగణనలోకి తీసుకున్నారు. మొదటి స్థానంలో ఇంగ్లండ్‌కు చెందిన ‘డి ల రీ’ నిలిచింది. అయితే పనామా లీక్స్ వ్యవహారంలో ఈ సంస్థ పేరు బయటకు వచ్చింది. అదీగాక చైనాతో ఆ సంస్థ సంప్రదింపులు జరుపుతోంది. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ‘ఇన్నోవియా’, యూసెక్ అండ్ డెర్రింట్, స్విస్‌కు చెందిన డ్యాండ్‌గర్ట్ సంస్థలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలో ఉన్న పెద్దనోట్లలో దాదాపు 7 శాతం నకిలీవేనని ఆర్‌బిఐ స్పష్టం చేసిన నేపథ్యంలో ప్లాస్టిక్ నోట్లపై ఆసక్తి పెరిగింది. పెద్ద పేపర్‌కరెన్సీ నోట్ల రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చురుకుగా వ్యవహరించే అవకాశం ఉంది.

-ఎస్.కె.రామానుజం